"థాంక్స్ పిన్నీ! యూ ఆర్ గ్రేట్! నీలాంటి అత్తగారు దొరుకుతున్నందుకు ప్రతిమని చూస్తే జెలసీగా ఉంది నాకు" అంది.
చిన్నగా నవ్వింది సరస్వతి.
"సారీ పిన్నీ! నిన్ను పూజలో నుంచి లేపేసి డిస్టర్బ్ చేశానా?"
లేదన్నట్లు తల అడ్డంగా ఆడించింది.
"కష్టంలో వున్నవాడికి ఆసరా అందించమని ఈ చేతులు మనకిచ్చాడు దేముడు. అంతేగానీ, తన విగ్రహానికి ఎదురుగా కూర్చుని హారతి ఇవ్వడానికీ, గంట గణగణలాడించడానికీ మాత్రమే చేతులని ఉపయోగిస్తే ఆయన సంతోషిస్తాడనుకోను" అని, "నాకేం డిస్టర్బెన్స్ లేదు, పద. ఆ అమ్మాయిని లోపలికి తీసుకొద్దాం" అంది.
మెట్లు దిగి వస్తున్న సరస్వతి మొదటిసారిగా చూసింది ప్రతిమ. నలభై అయిదేళ్ళుంటాయి ఆమెకి. ఒడ్డూ, పొడుగూ ఉన్న మనిషి. జుట్టు ఎక్కువ నెరవలేదు. కణతల దగ్గర మాత్రం తెల్ల వెంట్రుకలు వెండితీగెల్లా మెరుస్తున్నాయి. గోధుమరంగు పట్టుచీరె కట్టుకుని ఉందామె.
ఆమె కళ్ళలో కనబడే తిరస్కార భావాన్ని సహించడానికి మానసికంగా సిద్దమవుతోంది ప్రతిమ.
కానీ సరస్వతి కళ్ళలో తిరస్కారం కనబడలేదు. శాంతంగా, ఆదరంగా చూసింది ప్రతిమ వైపు. ఆమె కూడా అదే మొదటిసారి తన కాబోయే కోడలిని చూడటం.
మామూలు పరిస్థితుల్లో అయితే మొదటిసారిగా పెళ్ళిచూపుల్లో చూసి ఉండేది ఆ అమ్మాయిని. బహుశా, ఉన్న నగలన్నీ అలంకరించి, తల నిండా పూలుపెట్టి, పట్టుచీరె కట్టి కూర్చోబెట్టి ఉండేవాళ్ళేమో!
కానీ ఎలాంటి ముస్తాబులో చూస్తోంది ఈ అమ్మాయిని తను! ప్రతిమ జడ రేగిపోయి వుంది. రాత్రి కట్టుకుని నిద్రపోయిన చీరె ఇంకా మార్చనట్లు తెలిసిపోతూనే ఉంది. మొహాన బొట్టులేదు. కాటుక కొద్దిగా చెరిగి ముక్కుకి అంటింది.
వానలో తడిసి వణుకుతున్న పంచవన్నెల రామచిలకలా వుంది ఈ అమ్మాయి!
అయినా ఎంతో అందంగా ఉంది! శృతి వైనవైనాలుగా వర్ణించినా ఇంత అందాన్ని వూహించలేకపోయింది తను!
"పొద్దున్న లేచి కాఫీ అయినా తాగినట్లులేదు పిచ్చిపిల్ల!" అంది, నీరసంగా వున్న ప్రతిమ మొహం చూస్తూ.
అవీ ఆమె ప్రతిమతో మాట్లాడిన మొదటి మాటలు!
నెమ్మదిగా తలెత్తి చూసింది ప్రతిమ. తను కాఫీ తాగిందో లేదో, తను భోజనం చేసిందో లేదో అంత అభిమానంగా విచారించిన వాళ్ళెవరూ లేరు ఇంతవరకూ!
"రామ్మా! దిగు!" అంది సరస్వతి, ఆదరంగా చెయ్యి అందిస్తూ.
మొహమాటంగా ఆ చెయ్యి అందుకుంది ప్రతిమ.
అది జన్మజన్మల బంధంగా మారబోతోందని ఆ క్షణంలో వాళ్ళిద్దరికీ కూడా తెలియదు.
అందరూ లోపలికి నడిచారు.
"ఆ! ఆ! ఆగమ్మాయ్! కుడికాలు ముందు పెట్టి లోపలికి రా!" అంది శృతి నవ్వుతూ.
అప్పటికే ఎడమ పాదం పెట్టేసి గడప దాటింది ప్రతిమ.
"ఏ కాలైనా ఫర్వాలేదు! తప్పటడుగు వెయ్యకపోతే చాలు!" అంది సరస్వతి, అప్పుడే కోడల్ని వెనకేసుకొచ్చేస్తూ ఆమెకి శ్రీరాం ఒక్కడే కొడుకు. ఒక కూతురు కూడా పుడితే బాగుండునని చాలా ఆశగా ఉండేది ఆమెకి. తనకి ఆడపిల్లలంటే స్వతహాగా ముద్దు ఇన్నాళ్ళనుంచీ ఆ ఇష్టం అంతా శృతి మీద చూపించింది.
ఇప్పుడు ఈ ఇంట్లోనే వుండిపోవడానికి వస్తున్న ప్రతిమను చూస్తే ఆమెకి మురిపెంగా ఉంది.
ప్రతిమని కాళ్ళు కడుక్కోమని చెప్పి, తర్వాత పూజ గదిలోకి తీసుకెళ్ళింది సరస్వతి, "దేముడికి నమస్కారం చేసుకుని రామ్మా!" అంటూ.
దేవుడి మందిరం ముందు నిలబడింది ప్రతిమ. మనసు శూన్యంగా ఉంది. ఏమని ప్రార్దించాలో అర్ధం కాలేదు. కళ్ళు మూసుకుని నమస్కారం పెట్టి, "నాకేం కావాలో నాకే తెలియదు. నాకు ఏది మంచో నీకే తెలుసు. నాకు అంతా మంచే జరిగేటట్లూ, నేను మంచిగా బ్రతకగలిగేటట్లూ అనుగ్రహించు స్వామీ!" అని ప్రార్ధించింది మౌనంగానే.
బయటికి రాగానే వెచ్చటి సువాసనలు వెదజల్లుతున్న కాఫీ కప్పు అందించింది సరస్వతి.
ఒక్క గుక్క తాగి చూసింది ప్రతిమ. అందులో చక్కర వెయ్యడం మరిచిపోయినట్లున్నారు. చేదుగా ఉంది. అయినా ఆ సంగతి చెబితే నొచ్చుకుంటారేమో అని సంకోచించి, అలాగే తాగేస్తోంది.
శృతి కూడా ఒక్క గుటక వేసి చూసి, మొహం వికారంగా పెట్టింది. "ఏం పాపం చేశానని నాకీ శిక్ష, పిన్నీ! ఈ కాలకూట విషం నా చేత తాగిస్తున్నావ్?" అంది నిలదీస్తూ.
సరస్వతి వెంటనే ప్రతిమ వైపు తిరిగి "చెప్పమ్మా, కాఫీలో చక్కర లేకపోతే?" అంది.
ప్రతిమ మొహమాటంగా నవ్వింది.
"అయ్యో పిన్నీ! నీకు చెప్పడం మరిచిపోయాను? ఈవిడ అసలు పేరు మౌని! మారుపేరు ప్రతిమ! మాట్లాడకుండా అలా విగ్రహంలా ఉండిపోవడం ఈవిడకి హాబీ! పోను పోను నీకే తెలుస్తుందిలే!" అంది శృతి.
కాఫీలు తాగాక బాత్ రూం చూపించింది శృతి.
ప్రతిమ మామూలు మధ్యతరగతి కుటుంబంలో పెరిగింది. ఎప్పుడూ దేనికీ తడుముకోవలసిన అవసరం రాకపోయినా విలాసాలూ, లగ్జరీలూ మాత్రం తను ఎరగదు.
ఆ బాత్ రూంలో ప్రవేశించగానే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి.
తన ఇంట్లో బాత్ రూం అంటే కేవలం నాలుగు గోడలూ ఒక తలుపూ, సోప్ బాక్సులు పెట్టుకునే కొయ్య షెల్ఫూ అంతే!
కానీ ఇది బాత్ రూంలాగా లేదు, ఇంద్రభవనంలా ఉంది. మేగజైన్ స్ లో చూసే అందమైన ఖరీదైన బాత్ రూం నమూనాలా ఉంది. గోడలకి గ్లేజ్ డ్ టైల్సూ, నేలంతా మొజాయిక్, ఒక వైపు నిలువెత్తు అద్దం, గోడకి గీజర్, ఉన్న మూడు కొళాయిల్లో ఒక దాంట్లో వేడినీళ్ళు, ఒకదానిలో చన్నీళ్ళు, మూడోది బహుశా వోవర్ హెడ్ టాంకు తాలూకుదయి ఉంటుంది. మరోవైపు లేత గులాబీరంగు బాత్ టబ్, షవరూ ఉన్నాయి.
షెల్ఫులో లగ్జరీ సోపూ, రెండు రకాల షాంపూ బాటిల్సూ ఉన్నాయి.
ఆ బాత్ రూం ఒక్కటీ రీమోడల్ చేయించడానికి శ్రీరాం పాతికవేలు ఖర్చుపెట్టాడని ప్రతిమకి తెలియదు.
శ్రీరాంలో ఒక గుణం ఉంది. డబ్బు సంపాదించడంతో తృప్తిపడడు అతను. సంపాదించినది అందరికీ ప్రదర్శించి, అందరూ తనని కొంచెం మెప్పుదలగా, కొంచెం అసూయగా చూస్తే కానీ అతనికి తృప్తి ఉండదు. అందుకని అతను ఫ్రిజ్ ని లివింగ్ రూంలో కాకుండా డ్రాయింగ్ రూంలో పెట్టించాడు. ఇంటి కెవరన్నా రాగానే సగర్వంగా దానిలోనుంచీ కూల్ డ్రింక్స్ తీసి అందిస్తాడు.
అందరూ చూసి మెచ్చుకోవాలనే డ్రాయింగ్ రూంలోకి ఖరీదైన చిప్పన్ డేల్ ఫర్నిచర్ కొన్నాడు. అందరూ జెలసీ ఫీలవ్వాలనే అడుగువేస్తే కూరుకుపోయేటంత మెత్తటి పర్షియన్ తివాచీ కొన్నాడు.