"ఏం? ఎందుకని?" అంది.
"జెయ్ చంద్ర అనగానెవరు? అతడు మంచి బాలుడు. రామూలాంటివాడు. రామూ మంచి బాలుడు. సోమూ చెడ్డ బాలుడు. నీకు తెలియదా......? మంచి బాలుడు రామూ, చాలా మంచి బాలుడు. చెడ్డబాలుడు సోమూ.....చాలా చెడ్డ బాలుడు.
మంచి బాలుడు రామూ పెందలకడనే నిద్రలేచి చద్దిఅన్నము తినును.
చెడ్డబాలుడు సోమూ పదింటికి లేచును.
మంచిబాలుడు రామూ తలనున్నగా దువ్వుకొనును.
చెడ్డబాలుడు సోమూ తల చింపిరిగా వుంచుకొనును.
మంచి బాలుడు రామూ పాఠశాలకు బుద్దిగా వెళ్ళి పాఠములు చదువుకొనును.
చెడ్డ బాలుడు సోమూ పాఠశాలకి తిరునామముబెట్టి రోడ్లెంబడి తిరుగును."
"ఆపు! ఏమిటీ బోరు?" అంది సితార విసుగ్గా.
"అవును సీతారామలక్ష్మీ! నిన్నా మొన్నటిదాకా ఆ జెయ్ చంద్రచెడ్డబాలుడు - సోమూలాగా ఆకతాయిగా తిరిగాడనుకో! ఇవాళ సడెన్ గా మారిపోయి, మంచి బాలుడు రామూ అయిపోయాడు."
"ఐతే?"
"అతను ఏకలవ్యుడు"
"అంటే?"
"ఏక 'లవ్' యుడు అంటే కేవలం ఒకే ఒక్క ఆడపిల్లను లవ్వాడేవాడని అర్ధం."
"కానీ......అతని చుట్టూ ఈగల్లాముసురుతుంటారు అమ్మాయిలు" వ్యంగ్యంగా అంది సితార.
"అది అతని తప్పు కాదు"
"ఈ సోదంతా ఎప్పుడెందుకు?" అందామె.
"పాపం! అతను నీ కోసం ఆస్తిపాస్తులు త్యాగం చేసేశాడు. సిగరెట్లకి స్వస్తి చెప్పేశాడు. చివరికి మందు కొట్టడం కూడా మానేశాడు."
"ఐతే?"
"సుందరీ! నువ్వా బాలకుడి ప్రేమను తిరస్కరించిన, అతగాడు మళ్ళీ మందుకొట్టుట మొదలెట్టి, జీబురు గెడ్డము పెంచి దేవదాసు అయిపోవును."
అది విని షాకయిపోయింది సితార. అయినా బయటపడిపోకుండా ఆ ఎఫెక్టునంతా శేషుమీద చూపిస్తూ 'ఎందుకంత అధ్వాన్నపు తెలుగు మాట్లాడతావు?" అంది జాలీ, కోపం కలబోస్తూ.
"ఎంతయినా పండిత పుత్రున్నికదా!" అన్నాడు శేషు.
"అంటే పరమ శుంఠవనేగా శాస్త్రం" అంది సితార నవ్వేస్తూ.
"ఈ నవ్వొక్కసారి వాడికి కనబడేటట్లు చెయ్యకూడదూ? ఎండాకాలంలో వట్టివేళ్ళ తడికలు కట్టినట్లు చల్లగా, హాయిగా వుంటుంది....." అన్నాడు శేషు.
"సరెసర్లే" అందామె.
"అయితే నువ్వు వాణ్ణి ప్రేమిస్తున్నావని నేను వాడితో చెప్పెయ్యవచ్చా?"
"రాయబారం వరకే నీ డ్యూటీ! ఆ తర్వాత అంతా సీక్రెట్.....! చేసింది చాల్లేగానీ, ఇంక నువ్వు యీ వ్యవహారంలో కలగజేసుకోబోకు" అంది సితార శేషుకి వార్నింగిస్తూ.
"అయితే నే వెళ్ళొస్తా" అని ఎగిరెళ్ళిపోయాడు శేషు.
డాబా మీదనుంచి చూసింది సితార.
శేషు కాలేజీకి వెళ్ళే ప్రయత్నాలు చేసేస్తున్నాడు.
జెయ్ చంద్రమాత్రం-
"పాడు జీవితమూ యవ్వనం
మూడునాళ్ళ ముచ్చటనోయీ....."
అని పాడుతున్న ఫోజులో కూర్చుని శూన్యంలోకి దిక్కులు సారిస్తున్నాడు.
కాస్త చెవి ఒగ్గి వింటే నిజంగానే ఆ పాట వినబడుతోంది కూడా.
కాసెట్ కాబోలు అనుకుంటారు.
అతను తన వైపు చూస్తాడేమో, చిరునవ్వు చిందిద్దాం అని అరగంటసేపు అక్కడే నిలబడిపోయింది సితార.
కానీ అతను మాత్రం పైకీ, కిందికీ, పక్కకీ, ఎటువైపుకీ చూట్టంలేదు.
శేషు కూడా నిర్లిప్తంగా తన పన్లు తను చేసేసుకుపోతున్నాడు.
తన మూడ్ మారిందని శేషు యింకా గ్రహించలేదా? గ్రహించీ జెయ్ కి చెప్పలేదా?
అసలు ఏం జరిగిందీ?
తను తన భావాలు యింకా క్లియర్ గా శేషుకి చెప్పివుండవలసిందా?
ఛ ఛ! శేషుకి చెప్పడమేమిటీ నా మొహం! చెప్తే జెయ్ చంద్రకి చెప్పాలి గానీ.
ఇంతలో వాళ్ళ గోడ గడియారం ఎనిమిది గంటలు కొట్టింది.
అంతలోనే పక్కింటి వాళ్ళ గడియారం పది గంటలు కొట్టేసింది.
అంటే టైం కరెక్టుగా తొమ్మిదవుతోందన్నమాటేగా!
అంటే కాలేజ్ టైం దాటిపోయిందన్న మాటేగా!
ఎప్పుడెళ్ళిపోయాడోగానీ శేషు కాలేజీకి వెళ్ళిపోయాడు.
జెయ్ చంద్ర కాలేజ్ కి వెళ్ళే సూచనలు ఏ మాత్రం కనబడటం లేదు.
"పాడు జీవితమూ, యవ్వనమూ" పాట అయిపోయింది.
"ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడూ, అయ్యో పాపం పసివాడూ" పాట వినబడుతోంది ఇప్పుడు.
ఇలాంటి పాటలన్నీ ఏకధాటిన ఒకే కాసెట్లో రికార్డు చేయించి పెట్టుకున్నాడా ఏం?
ఇప్పుడు తను అక్కడికి వెళ్ళిపోయి, ఆ కాసెట్ తీసేసి "నీ కోసం.....నీ కోసం......నా ప్రాణం..... నా గానం..... నీ కోసం" అనే పాట పెట్టేస్తుంది.
అప్పుడేం జరుగుతుంది?
* * *
ఎలాగోలా ఒక్కసారి జెయ్ చంద్రని కలుసుకుని, తనలో వచ్చేసిన మహత్తరమైన మార్పును గురించి అతన్తో చెప్పేసి, అతన్ని ఆనంద సుధాంబుధిలో ముంచెయ్యాలన్న తీవ్రమైన కోరిక కలిగింది సితారకి.
తనుగనక అతన్ని ప్రేమించకపోతే అతను తప్పని సరిగా దేవదాసైపోతాడని శేషు భరోసా ఇచ్చాడు.
అతను గనక దేవదాసైపోతే నాగేశ్వరర్రావులా వుంటాడా, లేక దిలీప్ కుమార్ లా వుంటాడా, అదీ కాకపోతే కొత్త దేవదాసులో కృష్ణలా వుంటాడా చూసి తేల్చుకోవాలని సితారకి మహ ముచ్చటగానే వున్నా మళ్ళీ అంతలోనే 'అయ్యో పాపం' అనిపిస్తోంది జెయ్ చంద్రని తలుచుకుంటే.