Previous Page Next Page 
కలియుగంలో సీత పేజి 22

 

    "నువు కాసేపు నోరు మూసుకో, అన్నాడు రామచంద్రం.

 

    ఈ ప్రసక్తి యింతటితో ఆగకపోతే, వృధామాటలు చివరికి చిరాకు తప్ప ప్రయోజనం లేదని ముందే గ్రహించిన సీత కుర్చున్నచోటు నుంచి లేచి "కాళ్ళు కడుక్కు రండి నాన్నా! భోజనం వడ్డిస్తాను అంది.

 

    "ఏది తప్పినా టైముకి యిది తప్పదు పదమ్మా" అంటూ లేచాడు రామచంద్రం.

 

    "తప్పదనుకుంటే ఏది తప్పదు" గొణిగింది రూప.

 

    తండ్రి అటు వెళ్ళంగానే "నే మాట్లాడింది బాగా కుదిరింది కదూ చిన్నక్కా!" అడిగాడు రాజు.

 

    "నీ ముఖంలా వుంది" అని రూప రుస రుస లాడుతూ వెళ్ళిపోయింది.

 

    "నా ముఖం లాగానా! అంటే అర్ధం ఏమి తబ్బా!" ఆలోచిస్తూ వుండిపోయాడు రాజు.

 


                                             14

 

    పూలు కడుతూ కూచుంది సీత.

 

    సీతకి కొద్ది దూరంలో కూచున్న జయ వారపత్రికలో చిత్ర సీను బొమ్మలు చూస్తున్నది.

 

    రాజు బజారు కెళ్ళాడు.

 

    రామచంద్రం కాలు కాలిన పిల్లిలా ఇంట్లోకి బైటికి పచార్లు చేస్తున్నాడు.

 

    మాల కడుతున్న సీత దగ్గిర కొచ్చి "ఆరు దాటింది. రూప ఎక్కడికెళ్ళింది నీకు చెప్పలేదుగా" అడిగాడు.

 

    "ఉహూ" అంది సీత.

 

    "ఇంటికి ఆలశ్యంగా వచ్చేరోజు అది ముందే చెపుతుందా?"

 

    "సాధారణంగా ఈ మధ్య చెప్పే వెళుతున్నది. ఇది వరకు కాదు. కాలేజి నుంచి ఆలశ్యంగా వచ్చావేమిటే అంటే ఫ్రెండింటికీ కేల్లననో, షాపింగ్ కనో, చెప్పేది. ఇప్పుడు మటుకు ఏమంత ఆలశ్యం అయింది. ఏ స్నేహితురాలింటికొ వెళ్లుంటుంది. వచ్చేస్తూ వుంటుంది లెండి."

 

    అది కాలేజి కెళ్ళిందని చెప్పబట్టే నా భయం. ఇవాళ ఈ వూరు మొత్తం మీద ఒక్క కాలేజి లేదు. ఏదో స్త్రయికు మూసేశారు. వెంటనే కాకపోయినా కాస్త ఆలశ్యంగా నయినా రావాలి కదా! పూర్తిగా ఈరోజు మొత్తం రాకపోయె"

 

    "అదేం పసిపిల్లా నాన్నా! అంది సీత నవ్వుతూ.

 

    "ఈ రోజుల్లో పసిపిల్లల భయం తప్పి ఎదిగిన ఆడపిల్లల భయం ఎక్కువయింది. ఏమాత్రం అందం వున్నా సరే ఆడపిల్లలని ఎత్తుకెళ్ళటం అమ్మేయటం నాలుగురోజుల క్రితం ఏమయింది? స్కూలు నుంచి వస్తున్న అక్కాచెల్లెళ్ళనిద్దరిని ఎత్తుకెళ్ళలా? ఇంత వరకూ వాళ్ళ అరా తెలియలేదు."

 

    "రుపక్కా అందంగా కూడా ఉంటుంది. ఎవరైనా ఎత్తుకెళ్ళి పోతారు." పత్రికలోంచి తల ఎత్తి అంది జయ.

 

    "పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడకు అనవసరమాటలేక్కువయాయి నీకు. "అంటూ జయని కోప్పడి, " మీరనవసరంగా కంగారు పడుతున్నారు నాన్నా! కాసేపటిలో రూప రాను వస్తూ ఏదో సాకు చెప్పి సారీ అక్కా! అననూ అంటుంది." అని నవ్వింది సీత.

 

    "ఈ దఫా కోప్పడు"

 

    "అలాగే నాన్నా!"

 

    "నీ అలుసు దానికి మరి ఎక్కువయింది"

 

    "పోనిలే నాన్నా చదువుకుంటున్న పిల్ల, బోలెడు మంది స్నేహితురాళ్ళుంటారు. అన్నింటికి ఆంక్షలు పెడితే ఎలా?"

 

    "ఇదిగో యిలానే సమర్ధించవద్దనేది."

 

    సీత నవ్వేసరికి రామచంద్రమూ నవ్వాడు.

 

    "అదిగో చిన్నక్క వచ్చింది." అంటూ రూపని చుసిన జయ అరిచింది.

 

    రామచంద్రం సీత అప్పుడు చూశారు రూపని, రూప వెనుకనే ఉన్న రవిని, ఎత్తుకు తగిన లావుతో హుందాగా ఉన్నాడు. కర్లింగ్ హెయిర్ ముఖం మీద పడుతూ అందంగా ఉంది. ఖరీదైన డ్రస్ వంటి మీద ఉంది. రవి రవి లాగానే వెలిగిపోతున్నాడు.

 

    "వచ్చావా రూపా! ఇంతాలశ్యం చేశావెం?" అని ఆగిపోయాడు రామచంద్రం చూపులు రవి మీదనే ఉండిపోయాయి.

 

    "రవి నా క్లాస్ మేట్" అంది రూప.

 

    "నమస్కారం" అన్నాడు రవి వెంటనే చేతులు జోడించి.

 

    ఇది వరకే రూపతో చుసిన సీత "ఇప్పుడతన్ని గుర్తించటం తేలిక అయింది. ఇప్పటిదాకా రూప అతనితో ఉందన్నమాట.... సరాసరి అతన్ని వెంటబెట్టుకుని ఇంటికే వచ్చింది. అతనితో పెళ్ళి విషయం కదిపి వుంటుంది. అతనోప్పుకున్నడేమో. అందుకే యింటికి కూడా వచ్చాడు." అనుకుంటూ సీత రూప మెడకేసి చూసి ఉలిక్కిపడింది.   

 Previous Page Next Page