Previous Page Next Page 
ఆరోరుద్రుడు పేజి 22

   

       దీన్ని అవకాశంగా తీసుకుని కల్లు వ్యాపారస్తులు ఆంద్ర ప్రాంతం నుంచి అక్రమంగా కల్లును తెచ్చి తెలంగాణలో అమ్ముకునేవారు.
    
    దొంగచాటుగా బట్టీలు పెట్టి గుడంబా తయారుచేయడం కల్తీ కల్లు విక్రయించడం అధికం అయ్యాయి. ఫారిన్ సీసాల్లో నాటుసారా నింపుతూ ఆయుర్వేదం మందు పేరుతో ఇప్పసారా అమ్ముతూ సారా వ్యాపారస్తులు అనేక అక్రమాలకు పాల్పడేవారు.
    
    ఈ విధంగా అనేక న్యూసెన్స్ కేసులు ప్రతిరోజూ పోలీస్ స్టేషన్ లలో నమోదయ్యేవి. నిందితులను ఏ చట్ట ప్రకారం శిక్షించాలో తెలీక సమగ్రమైన ఎక్సైజ్ చట్టం లేక పోలీసులు తమ నిస్సహాయతను వ్యక్తం చేసేవారు. దానితో పోలీసుల భారాన్ని తగ్గించడానికి అప్పటి ప్రభుత్వం ప్రత్యేకంగా ఎక్సైజ్ చట్టాన్ని రూపొందించవలసిందిగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
    
    హైకోర్టు ఆదేశం, ప్రజల ఆందోళనలు, ప్రతిపక్షాల విమర్శలు అధికం కావ్దమతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1968 జూలై 15వ తేదీన, శాసనసభలో ఆంద్రప్రదేశ్ ఎక్సైజ్ బిల్ ను ఆమోదించింది. దీంతో అప్పటివరకూ అమలులో వున్న మద్యపాన నిషేధం ఎత్తివేసినట్లయింది.
    
    1968 సంవత్సరంలో రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పాలిస్తోంది. అప్పుడు ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మానందరెడ్డి, ఎక్సైజ్ మంత్రిగా వి. సత్యనారాయణ రావు ఉన్నారు ప్రతిపక్ష నాయకులుగా వావిలాల గోపాలకృష్ణయ్య, గౌతు లచ్చన్న, నర్రా రాఘవరెడ్డి, సి,జంగారెడ్డి, శ్రీమతి జె. ఈశ్వరీబాయి తదితరులున్నారు. శాసనసభలో మూడురోజులు ఈ ఎక్సైజ్ బిల్ గురించి చర్చ జరిగింది. 27 మంది సభ్యులు చర్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకోడానికి గీత కార్మికులను పన్నుల భారంతో బాధించడానికి ఈ బిల్ ను ప్రవేశపెట్టిందని అయిదుగురు సభ్యులు విమర్శించారు. అవినీతి ఎక్సయిజ్ అధికారుల ఆదాయాన్ని పెంచడానికే ఈ బిల్ ఉపయోగపడుతుందని 13 మంది సభ్యులు దుయ్యబట్టారు.
    
    ఈ బిల్ అసమగ్రంగా అవకతవకలతో కూడుకుందని తెలంగాణా రీజనల్ కమిటీకి సెలక్టు కమిటీకి లేదా ప్రజాభిప్రాయ సేకరణకు పంపించాలని 9 మంది సభ్యులు డిమాండ్ చేశారు. మద్యపాన నిషేధ చట్టాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఎత్తివేయాలని 12 మంది సభ్యులు కోరారు. ప్రస్తుతం అమల్లో వున్న చట్టాన్నే పకడ్బందీగా అమలు చేయాలని ముగ్గురు, కల్తీని నివారించాలని మరొకరు కోరారు. మద్యపాన నిషేధాన్ని ఆంధ్రాలో ఉంచి, తెలంగాణలో తొలగించాలని ఇద్దరు సభ్యులు, బిల్లును పూర్తిగా తాను వ్యతిరెకిస్తున్నట్లు మరో సభ్యుడు సభలో పేర్కొన్నారు.
    
    1. ఆంద్రప్రదేశ్ అబ్కారీ ఏక్ట్, 2. తెలంగాణా డ్రగ్ ఆక్టు, 3. ఆంధ్ర ప్రదేశ్ అబ్కారీ యాక్టు 1886 అనే మూడు చట్టాలను కలిపి కొత్తగా ఆంద్రప్రదేశ్ ఎక్సయిజ్ బిల్ 1968ని సభలో ప్రవేశపెట్టినట్లు అప్పటి ఎక్సయిజ్ శాఖామంత్రి వి. సత్యనారాయణరావు తెలిపారు. హైకోర్టు సూచన మేరకు మంత్రివర్గ ఉపసంఘం సలహా ప్రకారం పాత చట్టాల్లోని లోపాలను సరిదిద్దామనీ, అక్రమ వ్యాపారస్తులను శిక్షించడానికి నిబంధనలను కఠినం చేశామని మంత్రి వివరించారు.
    
    బిల్ సంగరంగానే ఉన్నందున తిరిగి సెలక్టు కమిటీకి పంపించాల్సిన పనిలేదని మంత్రి సత్యనారాయణరావు సమాధానం ఇచ్చారు. ఏ విధమయిన సవరణలు లేకుండా ఈ బిల్ ను సభ ఆమోదించవలసిందిగా మంత్రి కోరారు. ఈ బిల్ ను సెలక్టు కమిటీకి పంపాలా? వద్దా? అన్న విషయం ప్రతిపక్ష సభ్యుల డిమాండ్ మేరకు స్పీకర్ ఓటింగ్ కు పెట్టారు. ఈ బిల్ ను సెలక్టు కమిటీకి పంపాలని 30 మంది, పంపవద్దని 86 మంది తమ ఓట్లను వేశారు దీంతో ఆంద్రప్రదేశ్ ఎక్సయిజ్ బిల్లు- 1968 సభ ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు..." మొత్తం చదివి ఫైల్ ని పక్కన పెడుతూ-
    
    "ఆయుర్వేదం మందు పేరుతో ఇప్పసారా అమ్మేవారట అప్పుడు తెల్సా....మీకు..." నవ్వుతూ వాళ్ళిద్దరివేపు చూసింది త్రిభువనేశ్వరీదేవి.
    
    "ముఫ్ఫై ఏళ్ల క్రితమే... అక్రమ వ్యాపారస్తులు కొత్త కొత్త విధానాలు కనిపెట్టారంటే.."
    
    "అందుకే మన ప్రొమిబిషన్ సెల్ పటిష్టంగా ఉండాలని అనేది. ఏవాలోచించారు? కేండిడేట్ దొరికాడా?"
    
    "ఉయార్ సెర్చింగ్ మేడమ్..." ఫైల్ లోని లిస్ట్ ను మరోసారి చూస్తూ కొన్ని పేర్లను, డిటైల్స్ ను చెపుతున్నాడు వరదరాజన్.
    
    ఆ పేర్లను సి.ఎం యాక్సెప్టు చేయడం లేదు.
    
    "సెంటర్ ని రిక్వెస్టు చేస్తే" సలహా ఇచ్చాడు హేమాద్రిశర్మ.
    
    "మనకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అక్కరలేదు. ఒక యంగ్ ఐ పి ఎస్ ఆఫీసర్ కావాలి" జోక్ వేసింది సి.ఎం.
    
    అదే సమయంలో డఫేదారు రెండు కప్పుల్తో కాఫీని తీసుకొని టేబిల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు.
    
    "ప్లీజ్....టేకిట్..." తనో కప్పుని తీసుకొంటూ అంది త్రిభువనేశ్వరీదేవి.
    
    త్రిభువనేశ్వరీదేవి ఎడం పక్కన కొన్ని ఫైల్స్, వాటి పక్కన కొన్ని మేగజైన్ లు ఉన్నాయి.
    
    పైన ఎర్రటి రేపర్ తో కన్పిస్తున్న ఇండియా టుడేని అందుకుని ముఖచిత్రమ్మీద కన్పిస్తున్న ఓ వ్యక్తి ఫోటో ఆ పైన కాప్షన్ ని చదువుతూ ఉండిపోయింది సి.ఎమ్. త్రిభువనేశ్వరీదేవి.
    
    'A Real Andhra Hero Against Coal Maphiya'
    
    కాఫీ కప్పుని పక్కనపెట్టి ఆ హెడ్డింగ్ ను మళ్ళీ చదివింది. ఆ ఫోటో వేపు ఆసక్తిగా చూసింది...
    
    గబగబా పేజీలని తిప్పింది త్రిభువనేశ్వరీదేవి.
    
    123వ పేజీలో-
    
    కలర్ ఫోటోలతో ఉందా న్యూస్ ఐటమ్.
    
    ఎ రియల్ హీరో ఎగినెస్ట్ కోల్ మాఫియా....డి.సి.పి. శత్రుఘ్న...
    
    శత్రుఘ్న...
    
    ఎప్పుడో ఆ పేరు విన్నట్టుగా ఉంది త్రిభువనేశ్వరీదేవికి.
    
    అది బీహార్ కు చెందిన కవర్ స్టోరీ.... బీహార్ లోని బొగ్గు గనుల మీద ప్రభుత్వంలోని కొంతమంది అవినీతిపరుల అండదండల్తో గుత్తాధిపత్యం చెలాయిస్తూ కోట్లాది ప్రభుత్వ సొమ్ముకు మంగళ హారతి పాడుతున్నబడా కాంట్రాక్టర్ల పాలిట సింహస్వప్నంగా తయారైన ఒక ఆంధ్రా ఐ పి ఎస్ ఆఫీసర్..శత్రుఘ్న!
    
    ఇటీవల సాధించిన ఒక ఘన విజయానికి చెందిన కవర్ స్టోరీ.
    
    శత్రుఘ్న...
    
    శత్రుఘ్న ఫోటో వేపు చూసింది....పొడవుగా, దృఢంగా ఉన్నాడు....
    
    రింగు రింగుల జుత్తు విశాలమైన నుదురు, కోర మీసాలు, తీర్చిదిద్దిన పెదాలు...
    
    కోపాన్ని నిజాయితీని వర్షిస్తున్న కళ్ళు.
    
    అక్కడున్న ఇంకో ఫోటోవేపు తేరిపార జూసింది త్రిభువనేశ్వరి.
    
    ఆ ఫోటోలో ఒక రాజకీయ నాయకుడ్ని....ప్రజల మధ్యలోంచి సంకెళ్ళు వేసి-
    
    కోర్టువేపు ఈడ్చుకొస్తున్న శత్రుఘ్న.
    
    ఆసక్తిగా ఆ వార్తను చదవడం ప్రారంభించింది...
    
    "దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ బీహార్లో బొగ్గుగనుల్లో పని చేస్తున్న పేద జనాలకు ఇప్పటికీ స్వాతంత్ర్యం రాలేదు. గనుల్ని ప్రభుత్వం నుంచి కాంట్రాక్టు తీసుకున్న బడా కాంట్రాక్టర్లు అధికారులతో కుమ్మక్కయి....కొన్నేళ్ళుగా సాగిస్తున్న దారుణ మారణకాండపై గత రెండేళ్ళుగా పోరాటం సాగిస్తున్న ఆంద్రప్రదేశ్ కు చెందిన ఐపిఎస్ ఆఫీసర్ శత్రుఘ్న సాధించిన విజయం ఇది.

 Previous Page Next Page