"నేను చెబుతానుండంకుల్...." అందామె చేతులు వెనక్కి పెట్టుకుని పచార్లుచేస్తూ.
రమణయ్య ఆమె చెప్పబోయే ఐడియా కోసం ఎదురుచూడసాగాడు.
* * * * *
హాట్ లైన్ కట్ అయింది. డిక్ తిరిగి ప్లే బటన్ నొక్కాడు.
"కాదంటావా? అలాంటి వారసురాల్ని ఎవరైనా కోరుకోరా....?"
"ఎస్ గ్రాండ్ ఫా....తప్పక కోరుకుంటారు..." అంది మౌనిక మార్దవమైన కంఠం.
"భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహానుభావులకు అందులోని కష్టం తెలుసు. కష్టం తెలుసు గనుక దాని విలువ తెలుసు. ఇప్పటి రాజకీయవేత్తలకి ఆ కష్టనష్టాలు తెలియవు గనుక, దాని విలువ తెలీక దేశాన్ని బాగుచేసుకునే బదులు దేశాన్ని తింటూ అధికారాన్ని దక్కించుకునేందుకు, దక్కించుకున్న అధికారాన్ని నిలబెట్టుకునేందుకు పరమదారుణమైన పనులకైనా సిద్దపడుతున్నారు. సో ఐ హేట్ ఇన్ ఎఫీషియంట్ హెరిడిటీ....అసమర్ధపు వారసత్వం అనర్ధాల్ని తెచ్చి పెడుతుంది...." మాటలాగిపోయాయి.
డిక్ శ్రద్దగా వింటున్నాడు.
"నీ సామర్ధ్యమేమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను....అందుకు ఆరునెలలు చాలని భావిస్తున్నాను. ఈ ఆరునెలల్లో నువ్వు నీ సామర్ధ్యాన్ని రుజువు చేసుకోవాలి..."
"తప్పక రుజువు చేసుకుంటాను గ్రాండ్ ఫా. అదీ మీరు సంపాదించిన సంపదల్ని దక్కించుకునేందుకు కాదు- మీకు తగ్గ మనుమరాల్ని అని అనిపించేందుకు- హెన్రీఫోర్డ్-1కి దక్కిన ఆనందం, సంతృప్తి మీకు దక్కడం కోసం... ది గ్రేట్ ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ ఎంపరర్ గర్వించేలా నా సామర్ధ్యాన్ని రుజువు చేసుకుంటాను...." మౌనిక కంఠంలో తొంగిచూసిన సంకల్ప బలాన్ని పసిగట్టిన డిక్ "మీకు తగ్గ మనుమరాలే మాస్టా...." అన్నాడు తిరిగి రికార్డర్ వేపు చూస్తూ.
"నేను స్థాపించిన ప్రతి ఇండస్ట్రీ అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకున్నదే. నా ఫ్యాక్టరీల్లో తయారయ్యే ప్రతి వస్తువు నాణ్యతకు మారుపేరు. నేను వినియోగదారుల్ని మోసం చేయలేదు ఎప్పుడూ. ఒక వస్తువు మీద జె.జె. అనే రెండక్షరాల లేబిల్ వుంటే చాలు వినియోగదారులకు కొండంత తృప్తి... లాంగ్ డ్యూరబిలిటీ. నా ప్రతి వస్తువుకు ఐ.ఎస్.ఐ. మాండెలా, ఇంకా వివిధ దేశాల అత్యున్నత నాణ్యతా అవార్డుల గుర్తింపులు వచ్చాయి. నిరంతరం వస్తుంటాయి. అయినా ఓటమి సంభవించింది. ఓటమి నాణ్యత లేకకాదు- పోటీ పెరిగి. సరిగ్గా ఇక్కడే నీకు చాలెంజ్ ఎదురు కాబోతోంది. బేబీ.....నాణ్యమైన వస్తువుల్ని ఉత్పత్తి చేయడం ఎంత ముఖ్యమో- వాటిని హాట్ కేక్స్ లా అమ్ముకోగలగడం కూడా అంతే ముఖ్యం.
లేటెస్ట్ టెక్నాలజీ పొందడం ఇప్పుడంత కష్టమేం కాదు. మంచి రాయల్టీ ఇస్తే ఏ దేశంలోని, ఏ కంపెనీ అయినా టెక్నాలాజికల్ కొలాబరేషన్ అందించడానికి ముందుకొస్తుంది. కొత్త వస్తువు తయారు చేయాలన్నా పెద్ద వర్రీ కానవసరంలేదు. ఏ ఇన్ వెంటరయినా, పేటెంట్ రైట్స్ వున్న ఏ కంపెనీ అయినా డబ్బిస్తే క్షణాల్లో వాటిని తయారుచేసే విధానాన్ని ఫార్ములాని అందిస్తుంది.
నా వ్యాపారం కొత్త వస్తువుల్ని కనిపెట్టి, వాటిని ఉత్పత్తి చేసి అమ్ముకోవడం కాదు. ఆల్ రెడీ వున్న వస్తువులనే నాణ్యతకు మారుపేరుగా తయారుచేసి చిత్రవిచిత్రమైన మార్కెటింగ్, ఎడ్వర్టెయిజింగ్ టెక్నిక్స్ ద్వారా అమ్ముకోవడం.
Advertising only can consumer to buy a product once.
ప్రచారమొక్కటే వినియోగదారున్ని ప్రలోభపెట్టి వస్తువును కొనిపించగలదు.
పారిశ్రామిక వస్తువులకు పబ్లిసిటీ ప్రాణం. వాటికే కాదు వేటికైనా అఫ్ కోర్స్ ఆ ప్రొడక్ట్ మంచిది కానప్పుడు, దానిలో నాణ్యత లేనప్పుడు రిపీటెడ్ కన్స్యూమర్స్ వుండకపోవచ్చు.
పబ్లిసిటీ ఆర్ ఎడ్వర్టెయిజింగ్... ఏదైనా అదో గొప్ప సైన్స్- ఏ క్రియేటివ్ జాబ్.
ఫలానావాడు ఎక్కువ పబ్లిసిటీ చేసుకుంటున్నాడనో- ఫలానా వస్తువుకి ఎక్కువ పబ్లిసిటీ జరుగుతుందనో ఎవరైనా వాపోయారనుకో- వాళ్ళ తెలివితక్కువతనానికి జాలిపడాలి. వాళ్ళు ఏమీ తెలీని మూర్ఖులన్నా అవ్వాలి- తెలిసి చేస్తే అది వారిలోని అసూయ ప్రభావమైన అయివుండాలి.
వస్తువు బాగా లేనప్పుడు ఏ టెక్నిక్ ఏమీ చేయలేదు. అది అందరికీ తెలుసు.
"నేను పబ్లిసిటీ మాంగర్ నని నాకుగాని న వస్తువులకుగాని పిచ్చి పబ్లిసిటీ చేసుకుంటానని ఎడ్వర్టెయిజింగ్ గురించి ఎబిసిడీలు తెలీని అర్భకులు అప్పుడప్పుడు వారి కాలాన్ని వృధా చేసుకుంటూ వాగుతుంటారు.
నేను చేసుకునే పబ్లిసిటీగాని, నా వస్తువులకు చేసుకునే పబ్లిసిటీగాని నా సహ పారిశ్రామికవేత్తలకి ఏ విధంగా నష్టం కలిగిస్తుందో నాకర్ధం కాదు.
నష్టం కలిగించనప్పుడు ఎందుకు ఆ అమాయకులు వాపోవడం!
పోనీ అలా వాపోయినా నా మార్కెట్ ని ఏమన్నా చేయగలిగారా? లేదు.
సో... ఇప్పుడా సెల్లింగ్ క్రియేటివిటీ మనకు కావాలి.... ఎలా అన్నదానికి సమాధానం నేను చెప్పను.
సరిగ్గా ఆరునెలల్లో... మన కంపెనీల గోడౌన్స్ లో వున్న వస్తువులన్నీ అమ్ముడయి పోవాలి. అందుకు నువ్వు ఏం చేసినా నాకభ్యంతరం లేదు. చాలెంజ్ కి నిలబడతావా బేబీ....?"
"నిలబడుతున్నాను గ్రాండ్ ఫా..." మౌనిక మాటల్లో పౌరుషం, ఆత్మవిశ్వాసం తొంగిచూశాయి.
"పాలించలేనివాడికి పదవిని.....నిర్వహించలేనివాడికి ఒక సంస్థను, గ్రోత్ ని చూపించలేనివాడికి పొజిషన్ ను ఇవ్వడం నా దృష్టిలో అవివేకం అసమర్ధత. ఒక వ్యక్తిని ఒక మేనేజ్ మెంట్ మంచి పొజిషన్ లో కూర్చోబెట్టినప్పుడు గతంలో కంటే నాలుగు యూనిట్లయినా ఎక్కువ అమ్మలేనప్పుడు ఒక్క శాతమైనా సంస్థ ఇమేజ్ ని పెంచలేనప్పుడు, అతనా పొజిషన్ కి అలంకారప్రాయమే తప్ప, అర్హమైనవాడు కాదు. అలాంటి అలంకార ప్రాయులు ఎక్కువగా ప్రభుత్వ సంస్థలో వున్నారు. అఫ్ కోర్స్ శాతం తక్కువాయినా ప్రయివేట్ ఆర్గనైజేషన్స్ లో కూడా వున్నారు. ఐ నెవ్వర్ ఎక్స్యూజ్ దెమ్. వాడ్నెప్పుడూ నేను క్షమించను.
బై....బేబీ.... మరలా ఆరునెలల తర్వాత కలుద్దాం.
విష్ యూ బెస్టాఫ్ లక్..... అండ్ ఇట్ షుడ్ బీ ఏ రీజనబుల్ లక్ నాట్ ఎ బ్లైండ్ లక్ ఆర్ ఫార్ట్యూన్.... బై...." క్యాసెట్ పూర్తయింది.
ఆటో స్టాఫ్ కావడంతో రికార్డర్ ఆటోమేటిగ్గా ఆఫ్ అయింది.
డిక్ రికార్డర్ ని యధాస్థానంలో వుంచాడు.
"డిక్...."
"మాస్టా..."
"నేనేదన్నా నా స్వీట్ మౌనికపట్ల కఠినంగా వ్యవహరించానా?"
జె.జె. ఎప్పుడూ, ఎవర్నీ సలహా అడగడు- అదీ తన పర్సనల్ అయితే అసలే అడగడు. కాని కొన్ని విషయాల్లో అప్పుడప్పుడు డిక్ ని అడగడం అతనికిష్టం.
"లేదు మాస్టా... మీరు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. అన్ని రిచ్ ఫ్యామిలీస్ లోని పెద్దలు ఇలాగే నిర్ణయాలు తీసుకుంటే ప్రతి ఒక్కరూ కష్టాల్లోంచి నిగ్గుతేలి నిలబడతారు. నాకు మౌనికమీద కూడా నమ్మకం వుంది మాస్టా....తను తప్పక ఈ పందెంలో నెగ్గుతుంది."
"నిజంగా నెగ్గుతుందా డిక్?" జె.జె. గొంతులో లీలగా నిరాశ తొంగిచూసింది.
"మీ కూతురి కూతురు మౌనిక... మీ రక్తకణాలు ఆమెలోనూ ప్రవహిస్తున్నాయి మాస్టా... మీ పట్టుదల, పౌరుషం ఆమెకి వచ్చాయి....డెఫినెట్లీ షీ విల్ విన్."
"అదే నా ఆశాభావం డిక్... ఈ వృద్ద శరీరం అలసిపోయింది. ఆట ఆడే ఓపిక ఇప్పుడు ఈ శరీరానికి లేదు. ఈ చివరి కాలంలో గత జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటూ, మనుమరాలు ఈ జెయింట్ మెగాలితోని సమర్ధవంతంగా మేనేజ్ చేస్తుంటే చూస్తూ సేదతీరాలని కోరుకుంటున్నాను. నా మనుమరాలు తల్లయితే?" ఆయనో క్షణం ఆగాడు.
ఆయన కళ్ళపై హేలోజెన్ లాంప్స్ కాంతి పడి అవి మరింత కాంతివంతంగా వెలుగుతున్నాయి. ఆ క్షణాన ఆ భావం రావడం ఆయనకి ఆశ్చర్యమేసింది.
"తల్లయితే నేను ఆ నలుసుకి ముత్తాతనవుతాను కదూ...? ఓ వాటే గ్రేట్ ఫీలింగ్.... మీ దేశాల్లో తిరిగినా, మీతో సహవాసంచేసినా, యంత్రంలా మారినా ముత్తాతను కావాలని సెంటిమెంటల్ గా ఫీలవుతున్నాను. నీకాశ్చర్యంగా లేదు డిక్?"
డిక్ ఆశ్చర్యపోలేదు.
"లేదు మాస్టా... మీ మెదడుకున్న కంపార్టుమెంటలిజం నేను బాగా ఎరిగున్నదే! అందుకే మాస్టా... మీరన్నా మీ భారతీయులన్నా, మీ దేశమన్నా నేను ఇష్టపడతాను. జీవితం కృత్రిమం కాకూడదని, ఆ విలువల వెంటే పరిగెత్తకూడదని మీ భారతీయులు భావించటం అపూర్వం! మనిషిని పచ్చి మెటీరియలిస్ట్ కాకుండా ఆపే మీదేశ ఆచార, వ్యవహారాలన్నా సాంస్క్రుతిక సాంప్రదాయాలన్నా నాకు చాలా ఇష్టం."