Previous Page Next Page 
సంకల్పం పేజి 22

 

      "బ్యాంక్ లోనంతే కుదురుతుందా.... ఎంత తిప్పట.... ఒక పట్టాన కుదరదు. వాళ్ళ చుట్టూ బెగ్గర్ లా తిరగాలి. మనం మన డబ్బుని బ్యాంక్స్ లో డిపాజిట్ చేస్తామంటే కూల్ డ్రింక్స్ తెప్పిస్తారు. అప్పడిగితే దొంగల్లా చూస్తారు. అందుకే ఇండియన్ బ్యాంక్స్ ఎదగవు. అన్ గ్రేట్ స్టుపిడ్.... ఇండియన్ బ్యాంక్స్ అధ్వాన్నంగా తయారయ్యాయి...." చెప్పడం ఆపి "నిలబడే వుననావ్ కూచో" అన్నాడు శివమూర్తి.
   
    "చాలాకాలం హిందూస్తాన్ మోటార్స్ లో పనిచేశాను. ఎన్నాళ్ళు అక్కడా ఇక్కడా పనిచేస్తామని చెప్పి, ఇది ప్రారంభించాను. ఇద్దరు కూర్చుని కారులో హాయిగా వెళ్ళడానికి వీలుగా 'ట్రైసైకిల్' నేనే చేశాను 1885 లో వెస్ట్ జర్మనీలో 'BENZ TRYCYCLE' అని ఒకటొచ్చిందిలే, దాన్నే నేను కొంచెం మోడర్నైజ్ చేశాను. అంతా బాగానే వుంది. పార్ట్ నర్స్ ని నమ్మి మోసపోయాను. ప్రొడక్షన్ స్టార్ట్ చేసే టైమ్ లో పార్టనర్స్ మధ్యలో గొడవలొచ్చాయి. చెప్పా చెయ్యకుండా నన్నొదిలేసి ముగ్గురూ వెళ్ళిపోయారు. నేనొక్కన్నే అయిపోయాను. ఏం చెయ్యడం? అలాగే ఫస్ట్ బ్యాచీని మార్కెట్లోకి విడుదల చేశాను. టాక్ బాగానే వచ్చింది. కానీ సేల్సే పెరగలేదు. దానిక్కారణం నెట్ వర్క్ లేకపోవడం. ముగ్గురు పార్ట్ నర్స్ దగ్గరకెళ్ళి కాళ్ళావేళ్ళా పడ్డాను. ఎవ్వడూ రాలేదు. డీలర్స్ దగ్గర తీసుకున్న ఎడ్వాన్స్ లు, ఎంప్లాయీస్ జీతాలు, ఎస్.ఎఫ్.సీకి కట్టాల్సిన సొమ్ము...అంతా నా నెత్తిన పడింది. పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయాను. ఫ్యాక్టరీ క్లోజ్ చెయ్యడం తప్ప మరో మార్గం లేదు. అదే జరిగింది...." చెప్పడం ఆపి-
   
    "మిగతా ముగ్గుర్తో మాట్లాడితే తప్ప ముందుకు సాగడానికి వీల్లేదు" అన్నాడాయన.
   
    "ఆ ముగ్గురుతో మీరే ఒక్కసారి మాట్లాడితే..."
   
    "నో... నో.... సారీ యంగ్మాన్. నీకు హెల్ప్ చెయ్యాలని నాకుంది... ఇంటరెస్ట్ తో ఇంత దూరం వచ్చావు కాబట్టి. కానీ మా పార్ట్ నర్స్ దగ్గర కెళ్ళడం అనేది జరగదు. ఒక్కొక్కడూ ఒక్కో స్కౌండ్రల్..... అజ్ఞానం, తెలివితక్కువతనం, అహంభావంతో నన్ను ముంచేశారు. వాళ్ళ అడ్రసులిస్తాను వెళ్ళి మాట్లాడుకో. వాళ్ళు ఓ.కె. అన్నారనుకో మిగతాది ఆలోచిద్దాం" ఖరాకండిగా చెప్పాడు శివమూర్తి.
   
    "మరి సైటు విషయం...." నెమ్మదిగా గొణిగాడు వికాస్.
   
    "ముందు ఇది తేలనీ... తర్వాత దాని గురించి ఆలోచిద్దాం" అని లోనికెళ్ళి ఏదో పాత కాగితాలు తీసుకొచ్చాడాయన.
   
    "మా పార్టనర్స్ డీడ్ ఇది. ఈ ముగ్గురెడ్రెస్సులూ రాసుకో. వాళ్ళు అదే స్థానాల్లో వుంటున్నారో లేదో నాకు తెలీదు."
   
    ఆ ఎడ్రస్సులు రాసుకున్నాడు వికాస్.
   
    "థాంక్సండి.... మళ్ళీ కలుస్తాను" గేటు దగ్గర నిలబడి చెప్తూ అటూ ఇటూ చూశాడు కుక్క కనిపిస్తుందేమోనని. కన్పించలేదు.
   
    అదే విషయం శివమూర్తిని అడిగేశాడు.
   
    ఆయన నవ్వాడు.
   
    "కుక్క చచ్చిపోయి రెండు నెలలైంది. బోర్డు మాత్రం అలాగే వుంది. ఇటుపక్కల దొంగల భయంలే.... బోర్డు చూసైనా భయపడతారు కదా!"
   
                                 *    *    *    *    *

   
    మర్నాటి కార్యక్రమం- ఆ ముగ్గురు వ్యక్తుల్నీ కలవడం!
   
    ఉదయం ఏడుగంటలకు రూంలోంచి బైటకొచ్చాడు. బస్సెక్కాడు.
   
    ముగ్గుర్లో మొదటి వ్యక్తి నందరాజ్... మువ్వలవానిపాలెం. సరిగ్గా ప్రహ్లాదపురం నుంచి మువ్వలవానిపాలేనికి గంట ప్రయాణం.
   
    ఎమ్.వి.పి. కాలనీ జంక్షన్లో బస్సు దిగి కాలనీలో కెళ్ళాడు.
   
    ఓ అరగంట తర్వాత ఆ ఇల్లు గుర్తుపట్టాడు.
   
    అప్పటికి తొమ్మిదిన్నరైంది.
   
    ఇంటికి కాలింగ్ బెల్లూ అలాంటివేం లేవు. ఎవ్వరూ ఉన్నట్టు లేరు.
   
    తలుపులు మాత్రం తీసున్నాయి. వెళ్ళి వరండాలో వున్న కుర్చీల్లో కూర్చున్నాడు.
   
    పది నిమిషాలు.... పదిహేను నిమిషాలు..... ఇరవై.... ముఫ్ఫై.... అరగంట.... లోన్నిమ్చి ఒక మహిళ వచ్చింది.
   
    "ఎవరు కావాలండి?" దీర్ఘం తీస్తూ అడిగింది.
   
    "నందరాజ్ గారు"
   
    "నందరాజ్ గారా....అలాంటివాళ్ళు ఇక్కడెవరూ లేరండీ" మళ్ళీ దీర్ఘాలు తీస్తూ చెప్పిందావిడ.
   
    "ఇదే ఎడ్రస్..."
   
    "అయితే ఇంతకుముందు ఈ ఇంట్లో వున్నవాళ్ళై వుంటారు" అని ఈ హౌస్ ఓనర్స్ ఆ చివరుంటారు.. అడగండి"
   
    ఆ మాటతో అక్కడ నుంచి బయటపడ్డాడు వికాస్.
   
    హౌస్ ఓనర్ ఇంటిదగ్గర వాకబు చేశాడు.
   
    "ఆ ఇంట్లో నందరాజా.... వుండేవాడు.... ఏం జైల్లో పెట్టారా?" జోకేసినట్లుగా నవ్వి...
   
    "పక్కిల్లే...." అని చెప్పేసి వెళ్ళిపోయాడతను. భలే వ్యక్తిలే అనుకుని నందరాజ్ గుమ్మం మెట్లెక్కాడు వికాస్.
   
    చెప్పిందంతా విన్నాడు నందరాజ్. విన్నాక-
   
    "ఆ ముసిలినక్క కొత్త ప్లాను కాదు కదా ఇది.... ఆడు చచ్చాడా, వున్నాడా?" అని శివమూర్తి గురించి ఉక్రోషంగా అని-
   
    "నువ్వు దాన్ని తీసుకుని నడుపుతానంటావ్.... మరి నేను డబ్బు లేవీ పెట్టక్కర్లేదు కదా" అని స్పష్టంగా హామీ తీసుకున్నాక-
   
    "ఓ.కె. అలాగే చేద్దాం.... లే.... సంతకం కావాల్సి వచ్చినప్పుడు రా...." అన్నాడు.
   
    తను అనుకున్నది సాధించగలడు.
   
    శివానీ కంపెనీని తీసుకున్నాక తనేం చెయ్యదల్చుకున్నాడో ఆలోచిస్తూ బస్టాఫ్ కొచ్చాడు.
   
    కలవాల్సిన రెండో వ్యక్తి పేరు మల్లిఖార్జున్ డాబాగార్డెన్స్.
   
    జింఖానా కంపెనీ షోరూం ప్రక్కనుంచే వెళ్ళాడు వికాస్. అక్కడో గుడి వుంది. ఆ గుడి ప్రక్కన మల్లిఖార్చున్ ఇల్లు.
   
    "లేరండి...."
   
    "షాపులో వుంటారు."
   
    "షాపెక్కడ?"
   
    జగదాంబా జంక్షన్ దగ్గర విజయా క్లాత్ స్టోర్స్....
   
    మరో పావుగంటలో క్లాత్ స్టోర్స్ లో వున్నాడు వికాస్.
   
    "చెప్పండి."
   
    మల్లిఖార్జున్ డీసెంట్ గా బట్టల షాపులాగే వున్నాడు.
   
    చెప్పాడు వికాస్.
   
    మల్లిఖార్జున్ హాయిగా ఒప్పుకున్నాడు.
   
    మంచి కారుని ప్రొడ్యూస్ చెయ్యండి. మొట్టమొదట నేనే కొంటాను."
   
    అతనన్న మాటకు చాలా సంతోషం అనిపించింది వికాస్ కు.
   
    కంపెనీ పేరు ఏం పెడితే బాగుంటుంది? కారు పేరు.... అమ్మ పేరు పెడితే.... నాన్న.... పెద్దక్క పేరు పెడితే?
   
    మూడో వ్యక్తి పూర్ణా మార్కెట్ దగ్గరుంటున్నాడు. నడుచుకుంటూ అక్కడ కెళ్ళాడు. సందుల్లో ఒక పెద్ద బిల్డింగ్.
   
    ఎస్. సభాపతి. కాంట్రాక్టర్.
   
    గేటు దగ్గర ఎవరో కనిపించారు.
   
    "సభాపతిగారున్నారా?" ఆ మనిషి వికాస్ వేపు ఎగాదిగా చూశాడు.
   
    "లేరని తెలీదా?" ఎదురు ప్రశ్న వేశాడు.
   
    "తెలిస్తే ఎందుకడుగుతాను...." జవాబిచ్చాడు వికాస్.
   
    "గట్టిగా అనకు.... బాగోదు.... నెల్రోజుల్నుంచీ హాస్పిటల్లో వుంటే....నువ్వు భలే మనిషివయ్య..."
   
    "హాస్పిటల్లో వున్నార్రా.... నాకసలు తెలీదు. అర్జంట్ గా ఆయన్ని కలవాలి... ఎలా?" ప్రశ్నించాడు వికాస్.
   
    "హైదరాబాద్.... అపోలోలో వున్నాడాయన."
   
    "ఇప్పట్లో ఇక్కడకొచ్చే అవకాశం లేదా..." ఆత్రుతగా అడిగాడు వికాస్.
   
    "ప్రక్కింట్లో వున్నవాణ్ని.....ఇలా ప్రశ్నలతో చంపేస్తే ఎలాగయ్యా బాబూ. అసలొచ్చే అవకాశమే లేదనుకుంటుంటే..." ఆ వ్యక్తి చికాగ్గా ముఖంపెట్టి చూస్తూ వెళ్ళిపోయాడు.
   
    అంతా బాగానే జరిగింది- ఇక్కడ చిన్న చిక్కు- ఆయన్ని ఎలాగైనా కలవాలి తప్పదు- ఆయన హాస్పిటల్ నుంచి 'డిస్ చార్జి' అయివచ్చే వరకూ తను ఎదురుచూడలేదు.
   
    అయితే హైద్రాబాద్ వెళ్ళక తప్పదా! తప్పదు.
   
    మర్నాడు హైద్రాబాద్ వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు వికాస్.
   
    ఆ విషయం లిఖితకు చెప్పాలనుకున్నాడు. ఫోన్ చేశాడు.
   
    లిఖిత హైద్రాబాద్ వెళ్ళిందట.
   
    హైద్రాబాద్ లిఖిత ఎందుకెళ్ళిందో....?
   
    మర్నాడు గోదావరి ఎక్స్ ప్రెస్ ఎక్కాడు వికాస్.
   
                                      *    *    *    *    *

 Previous Page Next Page