పాకెట్ బుక్ సైజులో వుండే వీడియో క్యాసెట్స్ లో ఫీచర్ ఫిలిమ్స్ ని రికార్డ్ చేసే ప్రక్రియ అప్పట్లో ఇంకా ఇండియాలోకి ప్రవేశించలేదు. పోటీ లేని అలాంటి కొత్త వ్యాపారాన్ని ఇండియాకి తిరిగి రాగానే ఆరంభించాడు.
వీడియో టేపింగ్ ఫెసిలిటీ- ఫీచర్ ఫిలిమ్స్ లో ఆడియో విజువల్ ఇంప్రెషన్స్ ను సయితం రికార్డు చేయగల వీడియో టేపింగ్ యంత్రాన్ని దిగుమతి చేసుకుని ఆ సరికొత్త వ్యాపారాన్ని ఆరంభించి అతి త్వరలోనే అంచలంచెలుగా ఎదిగిపోయాడాయన.
ఆ వ్యాపారానికి ఇండియాలో మంచి భవిష్యత్ వుందని అతను పసిగట్టగలగడమే అతని మేధస్సుకు ఒక గొప్ప నిదర్శనం. అయితే హీరా ఆ వ్యాపారాన్ని ఆరంభించేముందు భారత ప్రభుత్వం అతనికి పర్మిషన్, లైసెన్స్ ఇవ్వకుండా తొమ్మిది నెలలు గడిపింది.
హీరా వ్యాపారాన్ని ఆరంభించిన తొలి దశలోనే మూడుకోట్లు రూపాయల ఖరీదుచేసే క్యాసెట్స్ ని అమ్మి సరికొత్త రికార్డును సృష్టించాడు. ఆ తరువాత తన రెండవ దశలో అతను 50 కోట్లు రూపాయలు ఖరీదు చేసే క్యాసెట్స్ కి ఆర్డర్స్ సంపాదించగలిగాడు..." త్రినాధ్ చెప్పడం ఆపి, కుడిచేతిని గాల్లోకి వూపాడు.
శ్రీధర్ వెంటనే టేప్ రికార్డర్ ని ఆఫ్ చేశాడు. కొద్దిక్షణాల మౌనం తరువాత "జాగ్రత్తగా వ్రాస్తున్నావా? నిరుద్యోగ యువతలో ఈ నా పుస్తకం సరికొత్త ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని పురికొల్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే- భారతదేశపు పారిశ్రామిక పరిధుల్లో విస్తరించుకుపోగల నవ చైతన్యానికి నాందీ వాచకం కావాలి. భారతదేశపు యువత ఆలోచనల్ని దేశ పారిశ్రామికాభివృద్ది వైపు మరలించి, వారిచేతుల్ని పరిపుష్టం చేయాలి. వారి ఆర్ధికాభివృద్ధి పరిఢవిల్లేలా చేయగలగాలి. యూరోపియన్ ప్రపంచంలో నిరాశా, నిస్పృహలతో ఆత్మహత్యకు సిద్ధపడే యువకుడికి మహనీయురాలైన అయాన్ రాండ్ విరచితమైన 'అట్లాస్ ష్రగ్డ్', 'ఫింటెన్ హెడ్' పుస్తకాలు ఇస్తే అతను తన బ్రతుకుపై ఆశను పెంచుకుని ఆత్మహత్యను అసహ్యించుకుంటాడట. అలాంటి ఆత్మవిశ్వాసోద్వేగాన్ని నా పుస్తకం కలిగించాలి- నా జీవితం కలిగించాలి. నీ రచనా చమత్కృతికి ఇదో సవాల్ మైడియర్ శ్రీధర్. ఇక నువ్వు వెళ్ళి రావచ్చు" అన్నాడు త్రినాధ్ ఉద్వేగంగా.
అతను అలా వెళ్ళిపోతుండగానే మరో వ్యక్తి లోపలకు వచ్చి త్రినాధ్ కి నమస్కరించాడు.
"హిందూ... ఇతను ఓ వర్ధమాన చిత్రకారుడు. పేరు నవీన్. ఈమె హిందూ, నా ఆప్తురాలు" అంటూ ఆ యువకుడ్ని, హిందూని ఒకరికొకర్ని పరిచయం చేసాడు.
"సార్! వారం క్రితం మీరు చెప్పిన భావాన్ని చిత్రీకరించాను. దాన్ని ఫోటో తీయించి తెచ్చాను. చూడండి" అంటూ తన భుజానికి వేలాడుతున్న సంచిలోంచి ఒక బ్రొమైండ్ తీసి త్రినాధ్ కి అందించాడు.
త్రినాధ్ కొద్దిక్షణాలసేపు దానివేపు చూస్తుండిపోయాడు.
"ఎలా వుంది సార్...?" నవీన్ ప్రశ్నించాడు. తనలో పెల్లుబుకుతున్న ఆతృతను అణుచుకుంటూ-
"అంతా బానే వుంది కాని..." త్రినాధ్ క్షణకాలం ఆగి మరలా అన్నాడు "తిమ్మడి కళ్ళలో అప్పుడు ఆనందమే వుంది. ఆలోచనలు లేవు, అవమానం లేదు. అదికాస్తా సరిచేస్తే సరిపోతుంది" అని, ఆ ఫోటోను హిందూకి అందించాడు.
ఆమె దాన్ని చూస్తూనే ఉద్వేగానికి గురయింది. ఆ ఫోటోలో చిన్న కాకా హోటల్... ఆ హోటల్ లో నలుగురైదుగురు కస్టమర్స్, అందులో తనూ వుంది. త్రినాధ్ బల్లల్ని క్లీన్ చేస్తూ తన కుక్కపిల్లవేపు చూస్తున్నాడు. సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన యథాతథంగా అచ్చం ఫోటోలాగే చిత్రీకరించాడా వర్ధమాన చిత్రకారుడు. ఆ చిత్రం అద్భుతంగా తోచిందామెకు. ఆ సంఘటన ద్వారానే కదా త్రినాధ్ తిమ్మడిలా మారింది! తనను చూడకుండానే ఆ చిత్రకారుడు తన బొమ్మనెలా అచ్చం తనలాగే గీయగలిగాడు!
హిందూ కళ్ళలో తడి.
భాష, భావానికి అందని అనిర్వచనీయమైన ఆనందం ఆమెను క్షణకాలంలో వశపర్చుకుంది. ఆమె కళ్ళ లోతుల్లో త్రినాధ్ పట్ల కృతజ్ఞతా భావం.
ఆమె ఏమీ మాట్లాడలేకపోతోంది. ఆనాటి జ్ఞాపకాలు వరద ప్రవాహంలా వచ్చి ఆమె మాటలకు అడ్డుకట్ట వేశాయి.
నిరాశా, నిస్పృహల అంచుల్లో నిలబడి నిర్లిప్తత వేపుకు చూస్తూ నీరసించిపోతున్న యువతలో ఉత్తేజాన్ని రేకెత్తించేందుకు బయోగ్రహీ రాస్తున్నాడు ఓ ప్రక్క.
తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను ఇంతకాలం మనస్సులో పదిలంగా నిర్లిప్తంగా చేసుకుని ఇప్పుడు వాటికి ప్రతిరూపాల్ని జ్ఞాపికా చిహ్నాన్ని చెక్కిస్తున్నాడు.
"ఓహ్... నువ్వొక అద్భుతమైన వ్యక్తివి త్రినాధ్. నిన్ను అంచనా వేయడం, అర్ధం చేసుకోగలగడం, అందుకోగలగడం అనితరసాధ్యం.
ఎన్నెన్ని ఆలోచనలు... ఎన్నెన్ని పథకాలు... ఎన్నెన్ని ప్రయోగాలు... ఎన్నెన్ని సాహసాలు... అన్నిటిని వీటన్నిటిని ఒకే ఒక మెదడుతో కంపార్ట్ మెంటలైజ్ చేసుకుని ఎకకాలంలో ఏదీ ఆగకుండా క్రమం తప్పకుండా ఎలా నిర్వహించుకు రాగలగుతున్నావు త్రినాధ్? ఎంతగా నిన్నర్ధం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నా అర్ధం కాకుండా పోతున్నావ్... అందుకోలేనంత ఎత్తులకు ఎదిగిపోతున్నావ్... నీ స్నేహ సాహచర్యం నాకో గొప్పవరం."
హిందూ తన చేతిలోని ఫోటోని త్రినాధ్ కి అందించింది మూగగా చూస్తూ.
దాన్ని నవీన్ కి అందించి "లైఫ్ సైజులో చేస్తున్నావ్ జాగ్రత్త. చిన్న పొరపాటు కూడా దొర్లరాదు" అన్నాడు త్రినాధ్ ఇక వెళ్ళిరావచ్చన్న భావాన్ని వ్యక్తీకరిస్తూ.
నవీన్ అలా వెళ్లడం, డిపార్ట్ మెంట్స్ హెడ్స్ పదిహేనుమంది ఇలా రావడం ఒకేసారి జరిగింది.
ఎందుకో హిందూకి త్రినాధ్ ముందునుంచి వెళ్ళాలనిపించడం లేదు. అతని ముందున్న ప్రతిక్షణం ఎంతో విలువైనది, ఎన్నో నేర్పుతుంది.
హెడ్స్ పదిహేనుమంది త్రినాధ్ కి వినయంగా నమస్కరించి కూర్చున్నారు. గుప్తా త్రినాధ్ పక్కకు వెళ్ళి కూర్చున్నాడు.
"మేధావులైన మీ అందరికీ వసుంధరా ఇండస్ట్రీస్ చైర్మెన్ అభినందనలు అందజేస్తున్నాడు" త్రినాధ్ ముందుగా అన్న మాటలివి.
అప్పటివరకూ చిరునవ్వును చిలికిస్తున్న అతని కళ్ళు క్షణాల్లోనే ఒకింత సీరియస్ నెస్ ను సంతరించుకున్నాయి. "మీరందరూ నిజాయితీపరులు, కష్టించి పనిచేసే శ్రమజీవులు. బాధ్యతెరిగిన పెద్దలు. అయినా ఉత్పత్తి ఆశించినంతగా పెరగడం లేదు. కారణం?" ఇప్పుడతను చైర్మన్ హోదాలోకి వెళ్ళి కఠినంగా ప్రశ్నించాడు.
ఎవరికి వారే వాళ్ళ డిపార్టుమెంట్స్ లో పెరిగిన ఉత్పత్తిని తెలియజేసే రికార్డ్స్ ని సమర్పించారు. "అందరూ గరిష్టస్థాయిలోనే ఉత్పాదక శక్తిని వినియోగించుకుంటున్నారు. విడివిడిగా పరిశీలిస్తే ఎవరి తప్పూ కనిపించడం లేదు. అందరూ మాగ్జిమమ్ యూనిట్స్ ని ఉత్పత్తి చేయిస్తున్నారు. మీ పదిహేను డిపార్ట్ మెంట్స్ లో ఉత్పత్తి అయిన పరికరాల్ని అసెంబుల్ చేసి ఫైనల్ ప్రోడక్ట్ ని రూపొందించే సెక్షన్ లోనే ఉత్పత్తి పెరగడంలేదు. చాలా చిత్రంగా లేదు?"
త్రినాధ్ మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు.
"ఎలా జరుగుతోంది పొరపాటు? ఎక్కడ జరుగుతోంది?" త్రినాధ్ అందరివైపూ చూస్తూ ప్రశ్నించాడు.
"అయితే మా తప్పేం లేదు సార్. తప్పంతా అసెంబ్లింగ్ యూనిట్ లోనే జరుగుతోంది" అన్నాడొక సెక్షన్ హెడ్ కొద్దిగా ధైర్యం చేసి.
"నిజమే- మీ ఎవ్వరిలోనూ తప్పులేదు. విడివిడిగానూ తప్పు లేదు సమిష్టిగా వుంది" నిశ్శబ్దంగా వున్న ఆ హాలు గోడలు కూడా త్రినాధ్ చెప్పబోయే అనాలసిస్ ను వింటున్నట్టుగా వుందక్కడ వాతావరణం.
విడివిడిగా తమ తప్పు లేదంటున్నారు.
అసెంబ్లింగ్ యూనిట్ తప్పు అంతకంటే లేదంటున్నారు. ఏమిటి చైర్మన్ గారి మాటల వెనుక దాగిన మర్మం?
అక్కడున్న పదిహేనుమందితోపాటు గుప్తా, హిందూలు కూడా విషయం అర్ధం కాక జుట్టు పీక్కునే స్థితికి వెళ్ళారు.
"ఇప్పుడు మీకో చిన్న కథ చెబుతాను. తప్పు ఎక్కడుందో మీకే అర్ధమయిపోతుంది" అని లేచి పచార్లు చేస్తూ చెప్పడం ప్రారంభించాడు త్రినాధ్.
"ఒక కుటుంబంలో ఒక తల్లి వుంది. ఆమెకు నలుగురు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు వున్నారు. కొడుకు అతికష్టంమీద డిగ్రీ పూర్తిచేశాడు. యధావిధిగా ఉద్యోగాలకు అప్లై చేయడం ప్రారంభించాడు. రొటీన్ ప్రొసీజర్ లోనే ఓ పెద్ద కంపెనీ నుంచి ఇంటర్వ్యూకి వెళ్తే బావుండదని అతికష్టంమీద జత బట్టలు కొనుక్కుని, ఇంట్లోనే మెషిన్ పెట్టుకుని కుట్టుకుని చేస్తున్న అక్కకు ఇచ్చి షర్ట్, పాంట్ కుట్టించుకున్నాడు. తీరా పడుకునేముందు అవెలా వున్నాయో అని వేసుకు చూసుకున్నాడు. చొక్కా అయితే బానే వుంది. కాని, పాంట్ నాలుగంగుళాలు పొడవైంది. అప్పుడతను అక్కను తిరిగి దాన్ని సరిచేయమని బ్రతిమిలాడాడు. ఆమె పగలంతా పని చేస్తుండడంతో విసుక్కుంది. అలాగే మిగతా ముగ్గురు అక్కల్ని బ్రతిమిలాడాడు. వాళ్ళూ అలాగే విసుక్కున్నారు. అతను చేసేదిలేక పాంట్ ని పైకి మడుచుకుని వెళితే సరిపోతుందని సరిపెట్టుకుని నిద్రలోకి జారాడు.
సరీగ్గా అర్దరాత్రి పన్నెండు గంటలకు పెద్దక్క లేచింది. పాపం! పిచ్చి తమ్ముడు, ఉద్యోగం కోసం ఎన్ని బాధలు పడుతున్నాడో గదా... వాడు చెప్పిన చిన్న పని చేస్తే సరిపోతుందని అప్పటికప్పుడు మెషిన్ ముందు కూర్చుని పాంట్ ని నాలుగంగుళాలు తగ్గించి వెళ్ళి పడుకుంది.
సరీగ్గా ఒంటిగంటకు రెండో అక్క లేచి పెద్దక్కలాగే ఆలోచించి ఆమె మరో నాలుగంగుళాలు తగ్గించి వెళ్ళి పడుకుంది. సరీగ్గా రెండు గంటలకు మూడో అక్క లేచి మొదటి ఇద్దరిలాగే ఆలోచించి ఆమె మరో నాలుగంగుళాలు తగ్గించి వెళ్ళి పడుకుంది.
సరీగ్గా మూడు గంటలకు ఆఖరి అక్క లేచి మిగతా ముగురిలాగే ఆలోచించి మెషిన్ ముందు కూర్చుని పాంట్ ని సరిచేసేందుకు మడత విప్పగా అది అప్పటికే పొట్టిదై కనిపించింది. అప్పుడామె సరిచేయవలసింది పాంట్ కాదేమో, షర్ట్ నేమో అనుకుని దానికి నాలుగు అంగుళాలు తగ్గించి వాటిని తమ్ముడి తల దగ్గర పెట్టి వెళ్ళి పడుకుంది.
పొద్దుటే అతను లేచి వాటి మడతల్ని విప్పి షాక్ తిన్నాడు.
వాటిని వేసేకునే వయస్సు తనకెప్పుడో దాటిపోయిందని అతడు నిస్పృహతో ఆ ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోయాడు.
ఇప్పుడు చెప్పండి...
ఇందులో ఎవరిది తప్పు...
ఎవరిదీ లేదు.
విడివిడిగా ఎవరి తప్పూ లేదు.
అందరూ తమ్ముడికి సహాయమే చేశామనుకున్నారు. కాని వారి మధ్య సమన్వయం లేకపోయింది. సహకారం లేకపోయింది.
అదే ఇప్పుడు మీమధ్య కొరవడింది. మోపెడ్ కి ఆఖరులో బిగించవలసిన స్పేర్ పార్ట్స్ ముందుగా అందిస్తుంది సదరు డిపార్ట్ మెంట్. ముందుగా స్పేర్ పార్ట్స్ అందించవలసిన మరో డిపార్టుమెంట్ ఆఖరుకి అందిస్తుంది. మీలో మీకు సమన్వయం లేక, అవగాహన లేక అసెంబ్లింగ్ యూనిట్ షెడ్యూల్స్ ని చిన్నాభిన్నం చేశారు. ఫలితంగా ప్రొడక్షన్ దెబ్బ తింటోంది. సో... ఇక మీరెళ్ళిరావచ్చు..." అన్నాడు త్రినాధ్ ఫైల్స్ లో తిరిగి తల దూరుస్తూ.
గుప్తాకి, హిందూకి మతులెప్పుడో పోయాయి త్రినాధ్ విశ్లేషణకి.
డిపార్టుమెంట్స్ హెడ్స్ త్రినాధ్ తెలివితేటలకు బిత్తరపోయి, క్షణాలలో తమ తప్పును తెలుసుకోగలిగారు. వాళ్ళంతా వెళ్ళిపోయారు... సిగ్గుతో తలలు వంచుకుని.
త్రినాధ్ కిప్పుడు కొద్దిక్షణాల క్రితం జరిగిన సమావేశపు విశ్లేషణ గుర్తు లేదు.
ఇప్పుడతను ఆలోచిస్తున్నది- సరీగ్గా 24 గంటలలో సుదర్శన్ రావు ఇంటికి వున్న ఎలక్ట్రికల్ కనెక్షన్ ని కట్ చేయించే పథకం గురించి.