కృష్ణకి ఆ మధ్యాహ్నం అర్జంట్ ఫోను వచ్చింది. రాత్రి పది గంటలకి ట్రైన్ కి ఊరికి వెళుతున్నాడు.
ఇప్పుడు సమయం మధ్యాహ్నం మూడు.
ఇంక కొద్ది గంటలు మాత్రమే కృష్ణ ఈ యింట్లో వుండేది.
కృష్ణ భుజంగరావుతో మాట్లాడుతూ బైటవరండాలో నుంచున్నాడు.
సమయం సద్వినియోగం చేసుకోవాలనుకుంది ఆమె. గబ గబ కృష్ణ సామాను వున్న గదివేపు వెళ్ళింది. అతను ఊరికి తీసుకువెళ్ళే వి.ఐ.పి. సగం బట్టలతో సర్డాడు. ఇంకా సర్దాలి కాబోలు. పెట్టె తెరిచే వుంది. కొద్ది బట్టలు మంచంమీద వున్నాయి.
ఆమె తలుపు వేసి లోపల గడియ పెట్టింది. వేగంగా పెట్టె దగ్గరికి నడిచింది. సర్దుకున్న బట్టల్లో తన లెటర్ పెట్టటం మంచిది అని చాలా ముందు ఆలోచన చేసింది. పెట్టెలో పెట్టిన షర్టు జేబులో వెట్టింది లెటర్ ని భద్రంగ. అంతే ఆ పై దేముడి మీద భారం వేసి నిశ్చింతగా బయటికి నడిచింది.
ఇప్పుడు ఆమె ప్రాణం హాయిగా వుంది.
కృష్ణ తరుచు బట్టలు మారుస్తుంటాడు. ఈ వారంలోనే ఏదో ఒకరోజు ఆ షర్ట్ ధరిస్తాడు. అప్పుడు తాను రాసిన లెటర్ చూడక మానడు. లెటర్ పదివి ముందు నిర్ఘాంతపోతాడు. ఆపై తక్షణం రంగంలోకి దిగుతాడు. అందాకా తనకి విముక్తి లేదు. వేచి చూడాల్సిందే అనుకుంది అమల.
గదిలోంచి బయటికి వచ్చిన అమల నెమ్మదిగా వరండాలోకి వచ్చి భుజంగరావు కృష్ణ మాట్లాడుకునే మాటలు వింటూ ఓ స్తంభం చాటున ఆగిపోయింది.
"వెళ్లక తప్పదా!" భుజంగరావు అడిగాడు.
"ప్రాణ మిత్రుడు ఆపదలో వుండి, ఫోన్ చేస్తే అర్జెంట్ గా వెళ్ళకపోతే ఏం బాగుంటుంది మామయ్య! నాలుగు రోజుల్లో తిరిగి వస్తాను. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా వుండాలి." కృష్ణ అన్నాడు.
"ఏంటిరా కృష్ణా! మాటకు ముందు నాకు జాగ్రత్త చెపుతున్నావ్! నా గుండె మరీ అంత ఓటిదేమీ కాదులేరా!"
"అది కాదు మామయ్యా!"
"మరి ఏదిరా రోజా విషయమా? డోంట్ వర్రీ. నీవు వచ్చావు. యింక దాని భారం నీది. నాకు ఎంతో నమ్మకంరా కృష్ణా! రోజాని నీవే బాగు చేస్తావని,"
ఇంక కృష్ణ ఏమీ మాట్లాడలేకపోయాడు.
ఆ తర్వాత వాళ్ళ ప్రసంగం మరో వైపుకి మళ్లింది.
అమల అక్కడ నుంచి ఇవతలకి వచ్చేసింది.
కృష్ణ మామయ్యతో మాట్లాడటం అయిపోయిం తర్వాత తన గదిలోకి వచ్చాడు.
అతను ఎంత కష్టమైన పనైనా చేస్తాడు గాని చిన్న చిన్న పనులంటే మాత్రం మహా వళ్ళు మంట. అందుట్లో తన పెట్టె సర్దుకోవటం మొదటిది.
ఆడవాళ్ళు చీరలు, జాకెట్లు, లంగాలు బ్రాసరీలు. టాయ్ లెట్ సామాను సవాలక్ష సర్దుకుంటారు ఒక్కరోజు జర్నీకి కూడ. కాబట్టి సామాను సర్దటం లాంటి చిన్న పని ఆడవాళ్లే చేసై అందంగా వుంటుందని అతని అభిప్రాయం. ఇప్పుడు అతని అభిప్రాయం మన్నించి ఆచరణలో పెట్టటానికి అతని తాలూకా ఆడపిల్ల అందుబాటులో ఎసరూ లేరు.