Previous Page Next Page 
లవ్ మర్డర్స్ పేజి 21

    "వగలాడివి."

    "ఇదో కొత్త బిరుదన్న మాట!"

    కృష్ణ మాట్లాడలేదు. మాటలతో కాలయాపన అవుతున్నది. తొందర పడాలి అనుకున్నాడు.

    అమలకి మరో ఆలోచన వచ్చింది.

    తనకి పిచ్చిలేదని చాలా చక్కగా మాట్లాడగలనని మోసగత్తెనని సాక్ష్యం సంపాదించటానికి ఈ కృష్ణ చూస్తున్నాడేమో. తనెంత తెలివితక్కువది! పిచ్చిగా వాగింది ఇంక జాగ్రత్తపడాలి.

    "ఏమిటా ఆలోచన మాట్లాడు." కృష్ణ గద్దించాడు.

    "మాటా పలుకు పలుకు మాట. కంటిలో నలుసు కాలిలో ముల్లు. ఇహ్హిహ్హీ." పిచ్చివాలకం తెచ్చుకుని అమల అంది.

    "వేషం వేయకు."

    "వేషమేసి మేసి బోసి మేసి మేసి ఇహ్హిహ్హీ.

    కృష్ణ కోపం పట్టలేక బూటుకాలితో బలంగా అమల కాలు నొక్కాడు.

    అమల "అబ్బా" అని అరిచి అక్కడితో ఊరుకోక గబుక్కున లేచి అరుపులు మొదలుపెట్టబోయింది.

    అమలని ఆపాలి ఆమె అరిచే అరుపులని ఆపాలి. అనుకున్న కృష్ణ అమలని గట్టిగా పుచ్చుకుని కుర్చీలో కూలేశాడు. ఆమె కుర్చీలోంచి మళ్ళి పైకి లేవకుండా బుజాలమీద చేతులు వేసి అదిమి పట్టాడు. ఇంక అరవకుండా ఆమె నోరు మూయాలి. అంతే. ఆ నిమిషాన అతను తానేం చేస్తున్నాడో మర్చిపోయాడు. అమల ముఖం మీదికి చటుక్కున వంగి తన పెదవులతో ఆమె పెదవులని మూశాడు బలంగ.

    అమల గిలగిల లాడింది.

    కృష్ణ వదలలేదు.

    అమల కుర్చీలో కూర్చుని వుండిపోవటం వల్ల అతని చేతులు భుజాలమీద బలంగా నొక్కి వుంచటం వల్ల పైకి లేవటం అసాధ్యం అయింది. అమల కేకలు వేస్తుందేమోనని కృష్ణ అలాగే వుండిపోయాడు. బలవంతాన పెట్టుకుంటున్న ముద్దు నుంచి ఏదో తెలియని మత్తు ఆక్రమించుకోంది.

    అరవటానికి ఎంతో ప్రయత్నం చేసిన అమల తన ప్రయత్నం ఫలించక పోవటంతో నిస్సత్తువ అణువణువునా ఆక్రమించుకోగా "ప్లీజ్!" అంటూ గొణిగింది.

    అతనికి పిచ్చిపట్టినట్లు కసి కసిగా అమల ముఖం మీద ముద్దుల వర్షం కురిపించాడు.

    కుర్చీలో కుదేసుకుపోయి తోటకూరలాగా వాలిపోయింది అమల.

    "ఎవరో పంపినట్లు నర్సమ్మ గగిలోకి వచ్చింది. "బాబూ!" అంది కంగారుగా జరుగుతున్నది చూసి.

    అతనికి వినిపించలేదు.

    "బాబూ! కృష్ణబాబుగారూ!" అరిచింది నర్సమ్మ.

    కృష్ణ తెలివి తెచ్చుకుని చటుక్కున వదిలేశాడు.

    "అమ్మాయిగారు పిచ్చిది బాబూ! పిచ్చిదనేనా ఇంత ధైర్యం చేశారు. అమ్మాయిగారి స్థితి చూస్తుంటే జాలి వెయ్యటం లేదా?" అంది నర్సమ్మ అమల దగ్గరగా వస్తూ.

    కృష్ణ ముద్దులతో అమల లేత తమలపాకు లాంటి పెదవులు భగ్గున మండిపోతున్నాయి. దోసిట్లో ముఖం దాచుకుని భోరుమంది.

    అతను సిగ్గుతో తల వంచుకుని చరచర నడిచి గదిలోంచి బయటికి వెళ్ళిపోయాడు.

    నర్సమ్మ ఓ నిట్టూర్పు విడిచి "ఊరుకోమ్మా!" అంది అమల భుజం మీద చేయి వేసి.

    "నా ప్రభ! నా ప్రభ ఏడి? తీసుకురాలేకపోతే యింకా ఏడుస్తా!" పిచ్చిదానిలా పైకి అని జరిగినదానికి మళ్ళి దుఃఖం తన్నుకురాగా మరోసారి దోసిట్లో ముఖం దాచుకుని ఎక్కిళ్ళు పెట్టింది.

    "బ్రహ్మకైన పుట్టు రిమ్మ తెగులు అన్నారు." నర్సమ్మ గొణిగింది. యింకేం చేయాలో తెలియక.

 Previous Page Next Page