Previous Page Next Page 
మంత్రముగ్ధ పేజి 22

      "దయచేయవే దొరసానీ. అమ్మ ముందు నిక్కి కూచోరాదు. కట్టెదుట నేలమీద వేంచేసి అమ్మవారి బొమ్మని కళ్ళకద్దుకో! పేరంటాలు ప్రసన్నురాలయితే సౌభాగ్యం కలిగేను. కడుపు పండేను. కనికరించేను మా తల్లి మంగళ గౌరవమ్మ అపరావతారమే!

    కనకదుర్గమ్మ కరుణావతారమే. రారా!!" అంటూ తులసిని ఆహ్వానించింది దాసరాణి సింగమ్మ! అప్పటికే దాసరాలు ముఖంలోకి తెచ్చుకాబోతున్న దేవీ ఆవేశం తాలూకు ఛాయలు ప్రసన్నమయినాయి.

    మంత్ర ముగ్ధలా మవునంగాలేచి వచ్చి ఆమె ముందు బాసికంపట్టు వేసుకుని బుద్దిమంతురాల్లా కూర్చుంది తులసి!

    "బుద్దిమంతురాలివే బిడ్డా! జాతకంలో వక్రగతులుండాయే కాని చల్లని తల్లివై వర్దిల్లుతావు సౌభాగ్యవత్య్గా వెళ్ళిపోతావు.

    అమ్మమీద మనసెట్టు! తల్లి పాదాలమీద చెయ్యెట్టు! దృష్టి ఈ ముక్కుముక్కెరమీద నిలబెట్టుకో!
ధన్యురాలవుతావు, దయగల తల్లి మా పేరంటాలు ఆశీస్సులు పొందుతావు. హిమ్ మ్...." అంటూ సవరించిన సొరకాయ డొల్ల వాయిద్యంలోని శృతికి అనుగుణంగా రాగంతీయడం ప్రారంభించింది దాసరాలు.

    ఎవరికీ వారే ముగ్ధులైపోయి చూస్తున్నారు.

    "కంచి కామాక్షి పలకవే!!

    మధుర మీనాక్షి పలకవే!!

    కొండవీటి కోటీశ్వరుడా పలుకు.

    బెజవాడ కనక దుర్గమ్మ పలకవే!" అంటూ రాగానికి అనుశ్రుతిగా ఆవాహనలు ప్రార్దనలు ప్రారంభించింది.

    అమ్మవారి పాదాలమీద చేతులుంచి, ముక్కు ముక్కెరమీదదృష్టి నిలిపి ఏకాగ్రహమయిన మనసుతో వింటోంది తులసి.

    "అమ్మవారి ముందు మూడు పిడికిళ్ళు బియ్యం పెట్టుకో ఒడి నిండుతాది.

    చిటికెడు నువ్వులిచ్చుకో నీ యింట చిరునవ్వులు పండుతాయి!

    ముత్యమంత పసుపు ముద్ద ఎట్టవే కట్టుకున్నాడు మురిపాలు కురుస్తాడు.

    పట్టెడు కుంకుమ అమ్మకియ్యవే పుట్టెడు సౌభాగ్యమై నీ బతుకు పండుతాది!

    పట్టెడు గాజులిచ్చుకో బతుకంతా బారసాలౌది నా తల్లి" అంటూ కట్నాలు అడిగింది దాసరాలు! తల్లి అప్పటికే అన్ని సిద్దంగా ఉంచిన వెండి పళ్ళెం తెచ్చి ఆమె ముందుంచింది.

    ఉద్వేగంతో వూగిపోతూ పూనకం వచ్చినదానిలా అయింది సింగమ్మ. తానే పెద్దాపురం పేరంటాలు దైవ స్వరూపురాలు అయిపోయినట్లు గీతాలాపనగా మాట్లాడటం లాంటి పాట ప్రారంభించింది.

    ఆమె ముక్కున తాపిన ముంగిర వంక జూస్తూ ఒక్కొక్క వస్తువునూ అమ్మవారి ముందు చదరుమీద అమర్చుతోంది తులసి.

    పూర్తిగా ఆవేశం నించి అమ్మవారి అపరావతారమయింది దాసరాణి సింగమ్మ!

    ఆమె కంఠం నించి ఉరుములు కురుస్తున్నట్లు వాణి పలుకుతోంది.

    హుం....హుమ్...హుమ్మా....హుమ్మా....?! ఓయమ్మ! చిన్న తనమంతా నా తల్లి చిరు నవ్వు కురిపించి, చదువులతల్లి కన్న వాళ్ళని మురిపించి ఇంతకాలం ఎదిగి వచ్చావే నా తల్లి!

    ఓ నా తల్లి! జరిగింది మహబాగు!

    తల్లి నీడలో ఎదిగావు! ఆ తల్లి దయవల్లనే ఇందాక సల్లగున్నావు" అంటూ గ్రుక్క త్రిప్పుకోకుండా చెప్పింది దాసరాలు!

    "జరిగిపోయిన దాన్ని చెప్పటం కాదే తల్లి! జరగాల్సిన నాటకం నువ్వు నడిపించేదేకదా! ఎలా జరిపిస్తావో అది చెప్పు!" అనగలిగింది.

    "ముందు చూపు కలిగిందా ముసలిదానా! అయితే చెప్తా విను!"

    "మనుష్యమాత్రులం కదా తల్లీ! ముందు సంగతి మాకేం తెలుస్తుంది! చెప్పు వింటాం"

    "చిన్నారి వినవే చెబుతాను భవిష్యవాణి!

    నన్ను గుర్తించినావా వచ్చాను వచ్చాను!! ఆకాశ మార్గాన దూరమంతా తరలించుకొచ్చాను! నన్ను గుర్తించవే! ఆది శక్తి అవతారాన్ని పేరంటాలుని పిలవగా వచ్చాను! నీ బ్రతుకు ఏమవుద్దో చెబుతాను విను! చెవ్వెట్టి యినుకో! మనసెట్టి తెలుసుకో!
    సలసల కాగుతున్న సమురు బాయే నీ బండారం! నేను దయతలచి చెబుతున్నా ఏ దేవతా నిన్ను దయతలచదు కాదలచదు" అంటూ ముందుంచిన తులసి చేయిని దూరంగా విసిరికొట్టింది దాసరాలు!

    ఈ మాట విని తులసి తల్లిలో దుఃఖావేశం కట్టలు త్రెంచుకుంది. నోటికి అడ్డుగా వుంచిన చీర కొంగు తొలగించి అతగోడు బాలగోడుగా రోదనం ప్రారంభించింది. కర్పూరకదండాన్ని వెలిగించి హారతి ఇచ్చింది వృద్దురాలు! తల్లి సాగిలపడి ఆమె ముందు మ్రొక్కింది.

    "జరుగనున్న కష్టాలు వల్లించావు. అసలు కథేమిటో కారణమేమిటో చెప్పలేదు. ఆ కష్టాలు ఎలా తొలగిపోతాయో కూడా నువ్వే చెప్పు" అంటూ సోది వినటంతో అలవాటయిన సమయస్పూర్తితో అడిగింది వృద్దురాలు!

    దాసరాలిమీద అమ్మవారి ఆవేశం ఇంకా తగ్గలేదు.

    "చెప్పేందుకే వచ్చాను. చెవులెట్టి యినుకోండి! నా మాటలకు నరదోషం లేదని తెలుసుకోండి!

    ఈ చిన్నారికి సర్పదోషం తగిలింది తల్లులారో.... నా తల్లు లారో!!

    అట్టిట్టు చేస్తాది! సర్పదోషం ఆరళ్ళు పెడతాది తల్లులారో....నా తల్లులారో!!

    బతుకంత నిప్పులు చెరుగుతాదే!నాగదోషం నా బిడ్డలారా!!

    నా కళ్ళు గట్టిగా పట్టుకో! నా శక్తినమ్ముకో! నా రూపాన్ని మనసులో మలచుకో! నన్నే నమ్ముకుంటే తోడుగా వుంటాను. నీడగా ఉంటాను.

    కాలువలయే కన్నీటికి చెలియలికట్టలు కట్టిస్తాను.

 Previous Page Next Page