Previous Page Next Page 
మంత్రముగ్ధ పేజి 21

    "ఏ సంభాషణ ప్రారంభించినా అక్కడికే తీసుకుపోతారు. ఛీ ఛీ! మిమ్మల్ని అసలు కదిలించకూడదు. వెళ్ళిరండి మహానుభావా! ఒకవేళ ఆ సర్పసుందరి ఆహ్వానిస్తే ఆమెతో కలసి వెళ్ళిపోకండేం?"

    "భర్తని నమ్మలేకపోవటం అది ఆడవాళ్ళ బలహీనత!"

    ఎ.ఎస్.పి హడావుడిగా స్టిక్ ఊగించుకుంటూ వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోగానే మేడమీదికి వచ్చింది తల్లి!

    దిండులో తల దూర్చిన తులసిని తట్టిలేపింది.

    "ఎందుకేడుస్తున్నావు?" వాచిపోయి ఎర్రపడిన కళ్ళలోకి చూస్తూ అడిగింది.

    "ఏమీ లేదమ్మా! ఎప్పుడేడ్చాను?"

    "ఏమీ లేకపోవటం ఏమిటి! కళ్ళు అలా వాచిపోయి ఉంటేనూ!"

    "ఎందుకమ్మా గొడవచేస్తావు. ఏమీ లేదన్నానుకదా!"

    "కన్నతల్లివయినా కనుమరుగు ఉండాలనేది ఈ విషయంలో కాదు, అసలు జరిగిందేమిటో నాకు చెప్పమ్మా!" అని గడ్డం పుచ్చుకుని బ్రతిమాలింది.

    రాత్రి వచ్చిన కల భర్తతో జరిగినా సంభాషణ వివరించింది తులసి!

    "దేవుడులాంటి భర్త దొరికాడమ్మా నీకు కాని మీ హనీమూన్ కి అంతరాయం కలిగిస్తూ ఆ యోగి రావటం విడ్డూరంగా అనిపిస్తోంది. ఈ గ్రంధం ఇంతటితో అయిపోయిందా ఇంకా ఉందా అనే విషయమే బాధిస్తోంది.

    నీ భవిష్యత్తేమిటో ఈ పూట తేలిపోతుందిలే భయపడకు క్రిందికి వెడదాంపద! చెప్తాను. అంది తల్లి.

    "ఏం చేయబోతున్నావేమిటి?" అని అడిగింది తులసి.

    "సోదిచెప్పే దాసరాణి సింగమ్మకి కబురుపెట్టాను."

    "ఆమె ఎవరు? అలాంటి వాళ్ళు ఏవో లేనిపోని కల్లబొల్లి కబుర్లు చెప్పి ఆడవాళ్ళని భయపెట్టేస్తుంటారు. నాకిలాంటివి యిష్టం ఉండదు."

    "తప్పమ్మా! అలా అనకూడదు. దాసరాణి సింగమ్మ చేయి చూచి చెప్తే తిరుగుండదు. ఆమె పెద్దాపురం పేరంటాలుకి నమ్మిన భక్తురాలు.

    వాక్సుద్ధి కలిగిన సాదెమ్మ అని అందరూ చెప్పుకుంటారు. క్రొత్తగా పెళ్ళయిన వాళ్ళందరూ ఆమె దగ్గరే చేయి చూపించుకుంటారు.

    మూడు పిడికెళ్ళు బియ్యం చిటికెడు నువ్వులు, పసుపు, కుంకుమ, గాజులు ఇస్తే చాలమ్మా ఉన్నది ఉన్నట్టుగా చెబుతుంది!

    గతంలో ఆమె చేయి చూచి మాటలు అక్షరాల జరిగాయి. వాళ్ళంతా ఆమెను పెద్దాపురం పేరంటాలుకి అపరావతారంగానే  కొలుచుకుంటున్నారమ్మా! నీకు ఆసక్తిలేకపోయినా నా తృప్తికోసం చేయి చూపించుకో!

    కారు పంపించాను. ఆమె మరి కాస్సేపటికి వస్తుంది.

    ముఖం తుడుచుకో! ముఖం కందిపోయి కన్పిస్తోంది. స్నానంచేసి బొట్టు పెట్టుకుని చీరమార్చుకుని క్రిందికిరా త్వరగా!" అంటూ బాత్ రూం లోకి నడిపించి మరీ క్రిందికిదిగి వెళ్ళిపోయింది తల్లి!

    అలంకరణ ముగించి మెట్లు దిగుతూ ఉండగా యింటిముందు కారు ఆగింది. తల్లి తనకయితే చెప్పింది ఇప్పుడే కాని ఇరుగు పొరుగు వారందరికి ముందుగానే చెప్పి ఉండాలి! వారంతా ఈ విడ్డూరం చూడటానికి అమితాసక్తితో అలంకరణలు చేసుకుని మరీ వచ్చారు.

    కొంతమంది అతివలు కారుదిగుతున్న దాసరాణి సింగమ్మకి హారతి ఇచ్చి మరీ స్వాగతం పలుకుతున్నారు. ఆమె గురించి వారి మధ్య ఇంతకు మునుపే చాల ప్రచారం జరిగింది కాబోలు ఎంతో భక్తి ప్రపత్తులు ప్రదర్శిస్తున్నారు ఆమెపట్ల!

    వారిలో ఆమెపట్ల ఆసక్తి మాత్రమే కాదు ఏదో ఆవేశం ఉద్విగ్నతలాంటివి కనిపిస్తున్నాయి. సోదిచెప్పే వారంటే పల్లెసీమల్లో భిక్షకుల స్థాయిలో ఉంటారని ఊహించుకుంది తులసి!

    వారిలో ఇంత ఘనమయిన వారుంటారని ఇప్పుడే తెలుసుకుంది చూస్తోంది.

    తల్లి తాను కట్టుకునే చీరల్ని ఖరీదయిన వాటిని క్రొత్తవాటిని కార్పెట్ మీద పరచి దాసరాణి సింగమ్మని వాటిమీద నడిపించింది.

    ఆమె కట్టూబొట్టూ చిత్రంగా ఉండటాన్ని గమనిస్తోంది తులసి.

    కాసె బిగించిన గోచి పోసి చీరకట్టుకుంది సింగమ్మ!

    ధోవతి కట్టుకుంటే కుచ్చిళ్ళు ముందు ప్రక్క వ్రేలాడినట్లు ఆమె చీరకుచ్చిళ్ళు ముందు ప్రక్క వ్రేలాడుతున్నాయి. ఎడకాలి చుట్టూ అంచులు కనిపించేలా బిగువుగా తిరిగివచ్చిన చీర నడుం దగ్గర దోపుకుంది. పిరుదులు ఉన్నంతగా కనిపిస్తున్నాయి.

    మ్రుక్కున వెడల్పాటి ముక్కెర చివరి తాపిన ముత్యం గుల్ గుల్ మంటూ తల త్రిప్పినప్పుడల్లా కదలాడుతోంది. ఒక చంకలో ఈత చివుళ్ళు ఎండించి అల్లిన బుట్ట పట్టుకుంది.

    మరో చేతిలో తంబురా లాంటి సొరకాయడొక్కు! బుట్టలో పసుపు కుంకుమల మధ్య లక్కతో తయారు చేసిన అమ్మవారి బొమ్మ ఒకటుంది. అదే పెద్దాపురం పేరంటాలు కాబోలు!

    మోచేతులు ముంజేతులకు వెండి కడియాలున్నాయి.

    కాళ్ళు అనాచ్చాదితంగా మొరటుగా ఉన్నాయి. చీలమండల దగ్గర నాగపట్టాలున్నాయి. కాలి వ్రేళ్ళకు మెట్టెలు కాని ఒంటిచుట్టు చిటికెలు కానిలేనేలేవు.

    దాసరాణి సింగమ్మ నేరుగా వచ్చి సోఫాలు కుర్చీలు అన్ని విడిచిపెట్టి కటిక నేలమీద చతికిలపడింది. అమ్మ వారున్న బుట్టణి ముందుంచుకుని తంబురాలాంటి తీగలు బిగించిన సొరకాయ డొల్ల వాయిద్య  విశేషాన్ని చేతులలోకి తీసుకుంది.

    "టింగ్....టింగ్...టింగ్...."మని మీటటం అప్పుడే ప్రారంభించింది.

    ఆమె అలా నేలమీద కూర్చోవటం ఆడవారందరికి నొప్పి కలిగించింది. ఎంతో శ్రద్దాభక్తులతో ఆమె చుట్టూ కూర్చున్నారు.

    ఈత చివుళ్ళ బుట్టలోంచి ఒక తాటియాకు చదరు తీసి దానిమీద లక్కతో తయారు చేసిన అమ్మవారి బొమ్మ నుంచింది దాసరాలు.

 Previous Page Next Page