Previous Page Next Page 
మంత్రముగ్ధ పేజి 23

    నీ బతుకు కిన్నెరసానిపాట కావాలంటే నా నీడ వుండాలే గువ్వ! అర్ధమయిందా?" అంటూ చెప్పటం ముగించింది.

    దాసరాణి ఈ మాటలు అన్న తరువాత కన్నులువిప్పి చూసింది.

    "అంతా కన్నీరు పెడతారెందుకు? పొర్లు మాటలు దొర్లాయా?" ఆమెలోంచి భవిష్యవాణి పలికించిన పెద్దాపురం పేరంటాల దేవీ ఆవేశం అదృశ్యమయిపోయింది. దాసరాలు మామూలు స్త్రీలా కనిపించింది వారందరికీ.

    అందరికీ కనిపించిన అమ్మవారు అదృశ్యమయిన భావన కలిగింది.

    "నిన్ను నమ్ముకోవాలంటే ఏం చేయాలి తల్లీ!" అని వివరం అడిగింది వృద్దురాలు.

    "అమ్మ వచ్చింది. వెళ్ళిపోయింది. ఇంకెవర్ని అడుగుతావు. నాకేం తెలుసు" అంది దాసరాలు.

    లక్కతో చేసిన పేరంటాలు విగ్రహం ముందు మ్రొక్కి లేచింది తులసి!

    క్రిందపడి దొర్లి రోదిస్తున్న తల్లిని తీసుకువచ్చి సోఫాలో కూర్చోపెట్టింది. ఫ్రిజ్ లోంచి వాటర్ బాటిల్ అందించి ఆమె కళ్ళు తుడిచింది.

    కన్నతల్లి దుఃఖోపశమనానికి చాతనయినంత ప్రయత్నాలు చేసింది.

    పేరంటాలు ఆవేశించినపుడు దాసరాలు చెప్పిన మాటలన్నింటిని తిరిగి ఆమె ముందు వల్లించి వివరాలు అడగటం ప్రారంభించారు స్త్రీలు.

    "అమ్మాయికి నాగదోషం తగిలింది. నాగదేవతల చూపు నరులమీద పడరాదు. పడిన తరువాత ఫలితాలను అనుభవించక తప్పదు.

    అమ్మను నమ్ముకుంటే అశుభాలన్నీ తొలగిపోతాయి. అంటూ తంబురా వంటి సొరకాయ డొల్లని ప్రక్కనుంచేసి చదరు మీది లక్కబొమ్మని బుట్టలో పెట్టుకుంది.

    "నాగదోషం ఎందుకు తగుల్తుంది? ఆ దోషం ఎలాపోతుంది?" అని అడిగింది వృద్దురాలు.

    "నరుడి మీద నాగదృష్టి పడటానికి కారణాలు చాల ఉంటాయమ్మ! కుబుసం విడుస్తున్న వేళ, గ్రుడ్లు పెడుతున్న వేళ నాగులను దాటి నడిచివెళ్ళరాదు. జంటనాగుల్ని విడదీయరాదు.

    ఆశ్లేష అనేది నాగ నక్షత్రం! ఆ నక్షత్రం ఆకాశంలో పొడుస్తున్న వేళ నాగులన్నీ నమస్కరించుకునేందుకు బయట తారాడుతుంటాయి. ఆ సమయంలో వాటికి అపచారం చేయకూడదు.

    భూమిలోపల, వెలుపల, ఆకాశంలో నాగావీదులు ఉంటాయి! ఆ ఆ వీధులలో నాగులు సంచారం చేస్తున్నప్పుడే వాటి ఏకాగ్రతకి భంగం కలిగించినా నాగదోషం అంటుకుంటుంది.

    వారి ప్రియులు కాని, ప్రియురాళ్ళు కాని, బిడ్డలు కాని నరుల అధీనంలో పెట్టుకున్నప్పుడు వాటి దృష్టి నరుల మీదికి వస్తుంది. అది కూడ నాగదోషమే!"

    అంటూ నాగదోషం వివరాలను చెప్పింది దాసరాలు.

    ఆమె చెప్పిన చివరి మాటలు తులసి దృష్టిని బాగా ఆకర్షించాయి.

    "నాగుల జంటల్ని విడదీయటం జరగొచ్చు! కాని వాటి ప్రియులు మన దగ్గరెందుకుంటారు?" అని దాసరాలుని ప్రశ్నించిందామె!

    "రేఖ వక్రిస్తే పూల రేకులు కత్తులు అవుతాయే దొరసాని! నాగులు నరులవుతారు. నరులు మాత్రం నాగులు కాలేరు. పౌరుషాన్ని స్వార్ధానికి, విశ్వాసాన్ని స్వలాభాలనే వదిలి పెట్టుకున్న జాతికదా నరజాతి.

    నాగదోషమే నీకు భర్త రూపంలో ఎదురు అయింది. కారణాలు నాకు తెలుసా? అమ్మ ఆవేశించినప్పుడే అడుగు. అమ్మ అనుగ్రహం కలిగితే చెప్తాది! నివారణకి ఉపాయం కూడ చెప్పొచ్చు!" అని చెప్పి వెళ్ళిపోయేందుకు లేచి నిలబడింది. బయట కారులో కూర్చున్నంతవరకూ సాగనంపారు.

    తల్లి చాల నీరసంతో శక్తి హీనురాలుగా కన్పిస్తోంది.

    "జీవితంలో జరగబోయే వాటిని గూర్చి తెలుసుకోవాలనుకోవటం దురాశ. ఆ ప్రయత్నంలోనే ఇలాంటి బాధలన్నీ వస్తాయి. మన బాధలేవో మనకున్నాయి. మన శక్తిమేరకు వాటిని పరిష్కరించుకుంటాం.

    సమస్య ఎదురు అయినప్పుడు ఎదుర్కొవడంలో మానవత్వం ఉంది.

    కాని ముందుగానే తెలుసుకోవాలని ప్రయత్నించితట్టుకోలేక దిగులుపడి కూర్చోవటంలో లేదు. ఇప్పుడామె నామీద నాగదోషం ఉందని చెప్తోంది.

    నిజం అనుకోవాలా? అబద్దం అనుకోవాలా?

    నిజం అయితే మనం ఏం చేయాలిప్పుడు? అన్నీ సమస్యలే కదా! మనమే సృష్టించుకున్నాం." అంటూ నిష్టూర మాడింది తులసి! తల్లి తలను ఒడిలోకి తీసుకుని.

    "నీకు తెలియదు తులసీ! ఆమె చెప్పే మాటలలో ఒక అక్షరం పొల్లుపోకుండ ఆమె చెప్పిన మాటలు ఆమెవి కాదు. ఆమె పెద్దాపురం పేరంటాల దీక్షతో ఉంటుందెప్పుడు. పేరంటాలే ఆమె శరీరం మీదికి ఆవహించి భవిష్య వాణిని వినిపిస్తుంది. నీకు నాగదోషం ఉందమ్మా.

    ద్రవిడ మాహేశ్వరుడు ఎదురు వచ్చి హనీమూన్ ణి ఆటంక పరచటం, ఆ తరువాత కేసు గొడవలు అన్నీ నాగదోషం కారణంగానే జరిగాయి.

    ఇంకేం జరుగనున్నాయో!

    "తులసీ నీకేదన్నా అయితే నేనెలా బ్రతుకుతాను" అంటూ కుమిలి కుమిలి దుఃఖించటం ప్రారంభించింది తల్లి.

    సరిగ్గా ఆ సమయంలోనే ఉమ, కల్యాణి లోపలకు వచ్చారు.

    ఎప్పుడు ఆ ఇంటికి వచ్చినా ఆలస్యం చేశారంటూ గయిమని విరుచుకుపడే తులసి వారిని చూచికూడా మౌనంగానే ఉండిపోయింది.

    "ఏమయిందే! ఎందుకు మీరంతా అలా ఉన్నారు?" అని అదిగింది ఉమ.

    "దాసరాణి సింగమ్మ వచ్చింది. భవిష్యవాణి చెప్పి వెళ్ళింది" అంది ప్రక్కింటావిడ!
   

 Previous Page Next Page