"చొక్కా పట్టుకోకండి బాగోదు-ఎవరైనా చూస్తే నేను మిమ్మల్ని ఏదో చేయగా, మీరు నన్ను నిలేసి, కడిగేస్తున్నారనుకొంటారు. ప్లీజ్ మాడమ్-" పొడవాటి, తీర్చిదిద్దిన ఆమె కళ్ళవేపు చూస్తూ అన్నాడు గాలి.
"నువ్వు, నన్ను ఏదో చేస్తావా- ఏం చేస్తావ్. చెప్పు-" గడగడా డైరెక్టుగా అడిగేసరికి__
ఈ ఓల్డ్ మానువల్లే ఈవిడకి దొరికిపోయాను ఒరేయ్ ముసిలీ- చూడు నా పాట్లు- అని మనసులో అనుకొని-
"అది చెప్పడం బావోదు- సెన్సారు కట్-" ఇహిహి అని పళ్ళికిలించాడు గాలి.
"బోడి సెన్సారని- చిట్టి ఎయిరుఫోర్సూ- మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా- ఇలాంటి వర్ద్సు ఉన్నాయి చూశావూ, సెన్సారు కట్ చేసేవి ఇలాంటి వర్ద్సుని-నీయక్క, నీయమ్మ_ లాంటి వర్ద్సుని కాదు, అంచేత చెప్పెయ్_ ఆ వర్ద్సు చెప్పెయ్."
"తల్లోయ్...నన్నొదిలేస్తావా- నీకు నమస్కారం- నీ కారుకో నమస్కారం-" పరిగెత్తబోయాడు. ఆవిడ కాళ్ళలో కాలు పెట్టేసరికి దబ్ మని పక్కనే ఉన్న బురదలో పడిపోగా, ఆ ముసలాయన నవ్వాడు.
దానికి గాలి అంతెత్తున లేచాడు.
"అలా అడ్డదిడ్డంగా, మంచీ మర్యాద లేకుండా, నవ్వేవంటే నీ కారు పెట్రోలుపోసి తగలెట్టేస్తానంతే-"
"ఆ గొడవ తర్వాత గానీ, ముందు రాజు ఎక్కడున్నాడో చెప్పు- వదిలేస్తాను-"
"ఎక్కడుంటాడో తెలిస్తే- చెప్పనా- మహాతల్లీ- అబిడ్స్ పబ్ లోనో, లంబాథియేటర్ సందులోనో- హూ- ఆఁ- అని గెంతుతూ పాడుతుంటాడు-"
"పోనీ నాకో ఇన్ ఫర్ మేషన్ చెప్తావా-?" కూల్ గా అతని భుజమ్మీద చెయ్యివేసి అడిగింది హిమకుంద.
ఆమె బాగీఫ్యాంటు, లూజులూజు షర్టుకి రాసుకున్న పాయిజన్ సెంట్ వాసన గాలి ముక్కుకు తగిలింది మత్తుగా.
"మరీ ఇంత డైరెక్టుగానా?" ఉక్కిరిబిక్కిరై పోతూ అడిగాడు.
"ఏమిటి?"
"అదే- లవ్- సీను- చెయ్- తీసేయండి- బావోదు- ఆ ముసిలాడు చూడండి- మీ సీన్లు చూడలేక ఆడి నరాలు తెగిపోతున్నాయండి బాబోయ్-"
"ఇన్ ఫర్ మేషన్ చెప్పు- చెయ్యి తీసేస్తాను-"
"అ....డ...గం...డి...."
"నామీద ఒపీనియన్ ఏంటి-?" ఆ ప్రశ్నకు గాలి మెదడుబుర్రలో గ్లోబులా తిరుగుతున్నట్టనిపించింది.
హీరో చిరంజీవిలా చిన్న కట్ ఇవ్వబోయి ఒపీనియన్ చెప్పబోగా-
"నీ ఒపీనియన్ గాదెహే- నీ బాస్ ది- అదే ఆ మజిల్ హీరోది_"
"అంటే- తమరు మా హీరోని లవ్వాడుతున్నారా-?" అడిగాడు గాలి.
"నేనా- మీ హీరోనా- ఉత్తినే అడిగా-" టక్ మని టాపిక్ మార్చేసింది హిమకుంద.
సరిగ్గా అదే ఆ ముసలాయన-
"బాబూ నా కారు-" అని అన్నాడు.
"తీసికెళ్ళి నీ కారుని, పాత ఇనపసామాన్ల వాడికిచ్చెయ్__ఇచ్చేసి వచ్చి నాతో చెప్పు- అడుక్కునైనా, నీకో కొత్త కారు కొనిపెడతా- వెళ్ళూ-" అని కసురుకున్నాడు గాలిబాబు.
"చూడు ఎయిర్ ఫోర్స్- నేను వెళ్తున్నా- మీ బాస్ కి చెప్పు- రేపు సరిగ్గా ఇదే సూర్యాస్తమయ సమయానికి టంచన్ గా వస్తా- ఉండకపోతే, రాత్రి సరిగ్గా పదిగంటలకి రూమ్ మీద దాడి చేసేస్తానని చెప్పు- సీయూ" అంటూ కారెక్కి కూర్చుని, స్టార్ట్ చేసింది హిమకుంద.
హిమకుంద వెళ్ళిపోయిన పది నిమిషాల తర్వాత ఒక చేత్తో గిటారుతో హీరోహోండామీద వచ్చాడు రాజు.
రాజుకి పాతికేళ్ళుంటాయి రింగు, రింగుల జుత్తు, కోలముఖం, నునుపుదేలి, ఎవరినైనా క్షణాల్లో నుగ్గు చేసెయ్యగల దృఢత్వం, వత్తు మీసాలు.
"గాలీ- అర్జంటు గిరాకీ ఏదైనా ఉందా-" అడిగాడతను.
"వచ్చావా నాయనా- చూడూ ఇదిగో ఈ కారు... రన్నింగ్ ప్రాబ్లమ్- ఆ మార్వాడీ ముసలాయన, నానెత్తిమీద పెట్టి వెళ్ళిపోయాడు-" చెప్పాడు గాలి.
"అదేనా ప్రోబ్లమ్-" అంటూ కిందకి దిగి, కారువేపు నడిచాడు.డోర్ తెరచి స్టీరింగ్ ముందు కూర్చుని, ఇగ్నీషన్ కీ తిప్పి, స్టార్ట్ చేసి, ముందుకు పోనిచ్చాడు.
కారు షెడ్ లోంచి బయటకు వెళ్ళిపోయింది.
పావుగంటతర్వాత మళ్ళి లోనికొచ్చిందా కారు.
"ఇంజనుకు ఆయిల్ వెయ్యి. ఎవరో కిరసనాయిల్ వేశారు. అందుకే ట్రబులిచ్చింది."
"ప్రాబ్లమ్ సాల్వ్ డా?" రాజుని విచిత్రంగా చూస్తూ అడిగాడు గాలి.
"అంతే-"
"బాసూ, నీ లక్కేంటో నాకు తెలీదుగానీ- నువ్వు చెయ్యేస్తే రైలు ఇంజన్లయినా కదలిపోతాయి. నేను చెయ్యేస్తే, బ్రేకుల్లేని సైకిళ్ళయినా ఆగిపోతాయి.
"మెకానిక్ ముందు తెల్సుకోవాల్సింది ఏంటో తెల్సా- బళ్ళ హేండిలింగ్. స్టీరింగ్ పట్టుకోగానే ప్రాబ్లమ్ తెల్సిపోవాలి."
"ఏం హేండిలింగో- చూడూ, నీ పొడవు బండి సన్ సెట్ టైమ్ కి వచ్చేసింది. నన్ను కరకరా వేపుకుని, వెళ్ళిపోయింది. రాత్రి పదిగంటలకి నీ రూమ్ మీదకు దాడి చేస్తానని వార్నింగిచ్చింది కూడా- అసలేంటి గురూ, ఈ సెటప్పూ-"
"సెటప్పా- పాడా- నా మజిల్స్ బాగుంటాయట, ఒక్కసారి నేను వర్క్ లో ఉన్నప్పుడు ఫోటోలు తీసుకుంటుందట, అంతే.
"న్నేనమ్మను. ఆ పిల్ల నిన్ను లవ్వాడుతోందని నా అనుమానం."
"లవ్వా-నన్నా? ఏడిశావ్. అదేమో ఇటలీ తాటిచెట్టులా ఉంటుంది. దాని దగ్గర నేను- జయబాదురిలా ఉంటాను. దాన్ని నేను ఒకవేళ ముద్దు పెట్టుకోవాలనుకున్నాననుకో, నిచ్చెన వేసుకోవాలి. అంచేత దాన్నుంచి తప్పించుకోడానికే ఆ టైంకి బయటికి వెల్లిపోతున్నావు.