"రిపేరెక్కడన్నావ్" గట్టిగా అడిగాడు గాలిబాబు కారు కిందనుంచే.
"ఎన్నిసార్లు అడుగుతావయ్యా బాబూ! కారు స్టార్టుచేస్తే అయిదు నిమిషాలసేపు నడిచి ఆగిపోతోంది."
"చెప్పవేం....కారు నడిచి, ఆగిపోతోందంటే ప్రాబ్లమ్ యేక్కడో అర్ధమయిందా?"
"నాకేం తెలుసు- నువ్వు చెప్పు" చిరాగ్గా అన్నాడు ఆ కారు ఆసామి.
"ప్రాబ్లం..చక్రాల్లో" గుడ్లగూబ నవ్వినట్టుగానవ్వాడు గాలిబాబు.
"తెలివైనోడివి- వెంటనే కనిపెట్టేసావ్- కొంచెం అర్జంటుగా రిపేరు చేసీనాయనా. మా ఆవిడతో ఇంగ్లీషు సినిమాకెళ్ళాలి" బ్రతిమాలాడు ఆ ముసలాయన.
"కంగారుపడకండి - అర్జంటుగా చేసేసి ఇచ్చేవాడ్ని కానీ, కారు కింద పడుకొని రిపేరు చేయడం కష్టం. మీరిలావచ్చి, కారుని బోర్లా పడుకోబెట్టండి. వెంటనే మరమ్మత్తు చేసేస్తాను" సీరియస్ గా అన్నాడు గాలిబాబు.
"కారుని బోర్లా పడుకోబెట్టాలా? నేనెక్కడా వినలేదే. అసలే పాతకాలం కారు- విరిగిపోతుందయ్యా బాబూ! అదికాదు గాలీ...ఇక్కడ చాకులాంటి ఇంకో కుర్రాడుండాలే- అతను లేడా? ఆ ముసలాయన అడిగాడు.
ఆ మాటకి కారుకిందనుంచి పాక్కుంటూ బయటకొచ్చి__
"అది నా తలరాతండీ బాబూ! తలరాత. సుబ్బరంగా సైకిల్ షాపు పెట్టుకుని దర్జాగా కాలుమీద కాలు వేసుకుని, బతుకుతున్నవాడ్ని తీసుకొచ్చి కారుషెడ్లో పడేసాడు. సైకిల్ రిపేరు చేసినట్టే. కారు రిపేరు చేసేయొచ్చన్నాడు. నిజమే అనుకొని మోసపోయాను. చూడు- నువ్వు మరీ మరీ బతిమాలుతున్నావని. నీ కారు చక్రాలకి సైకిల్ చైన్లు బిగించానా లేదా! కారు నడవకపోతే నాదా తప్పు.
మా బాసేమో టిప్పుటాప్ గా, సరిగ్గా ఆడకార్లొచ్చినప్పుడే వస్తాడు. మిగతా రోజంతా ఈ అడ్డమయిన అలగా కార్లతో నేను చస్తున్నాను." వంటికి పట్టిన గ్రీజును తుడుచుకుంటూ అన్నాడు గాలిబాబు.
"నీ బాస్ పేరు ఏం పేరన్నావు?"
"రాజు"
"పోనీ అతడ్ని అర్జంటుగా తీసుకురాగూడదూ!"
"మనం తీసుకొస్తే వస్తాడా- రాడు__ మావాడికి ఎప్పటికయినా మైకేల్ జాక్సన్ అంత అయిపోవాలని ఆశ. ర్యాప్ అట__ప్యాప్_నా శ్రాద్ధం__నా పిండాకూడు. వాడక్కడ తీగలు వాయించుకుంటూ గెంతుతుంటాడు. మీరిక్కడ నా పేగుల్తో గిటారు వాయించేస్తున్నారు" అన్నాడు బాధగా.
"బాబ్బాయి! ఫైవ్ థర్టీ అయిపోయింది- ఎలాగోలా నడిపించేద్దూ" బ్రతిమిలాడుతున్నాడు ముసలాయన.
'ఎంతయింది- ఫైవ్ థర్టీనా! అయ్యబాబోయ్- అయిపోయింది__నాపని సఫా. నేనర్జంటుగా ఇక్కడ్నుంచి వెళ్ళిపోవాలి- చూడు ముసలాయనా నువ్విక్కడ ఒన్ అవర్ కూర్చుంటావా- రిపేర్ ఖర్చుల్లోకన్ సెషనిస్తాను" ఎదురు బతిమిలాడుతూ అన్నాడు.
"నేనా! ఇక్కడా? ఎందుకు? నువ్వెటేళతావు?"
"నేనా...మూసీనదిలో స్విమ్మింగ్ ట్రైనింగ్ కెళతాగానీ అవసరమయిన ప్రశ్నలు వెయ్యక, అయిదున్నరయితే- అసలే నా మైండ్ కరాబైపోతుంది. చచ్చి నీ కడుపున పుడతాను. ఉండు డాడీ- ఇదిగో కావలిస్తే ఎడ్వాన్స్ రెండ్రూపాయలు" నిక్కరు జేబులోంచి రెండ్రూపాయలు తీసి, ఆ ముసలాయన్చేతిలో పెట్టబోతూ__
దడ్, దడ్, దడ్, దడ్, దడ్, మని రేకుల డబ్బాలు ఒకదానిమీద ఒకటి పడుతున్న సౌండు వినిపించేసరికి-
"అదిగో వచ్చేసింది- ఇక నాపని సఫా....సఫా... ఓర్నా దేవుడోయ్- నన్నింక రక్షించేవాడు ఎక్కడున్నాడు నాయనోయ్" అంటూ షెడ్డు లోపలి రూమ్ లోకి వెళ్ళబోయాడు గాలిబాబు.
"గాలీ- హలో గాలీ!" ఆ పిలుపు చాలా మందంగా, సున్నితంగా వీణ మీటినట్టుగా వుంది.
సరిగ్గా అదే సమయంలో షెడ్డు ముందుకి పడవలాంటి కారొచ్చి ఆగింది. స్టీరింగు ముందుకూర్చున్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలాంటి అమ్మాయిని చూసి లొట్టలు వేస్తున్నాడు ముసలాయన.
ధన్ మని కారులోంచి దిగి, గాలిబాబు చొక్కా పుచ్చుకుంది ఆ అమ్మడు.
ఆ అమ్మదిపేరు హిమకుంద. అయిదడుగుల పదంగుళాల పొడవు వుంటుంది. శలాకలావుండే అమ్మాయి ఎప్పుడూ చలాకీగా తుళ్ళుతూ జోకులేస్తూ, నవ్విస్తూ వుంటుంది. జె.ఎన్.టి.యు.లో డిప్లమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ ఫైనలియర్ చేస్తున్న హిమకుంద పెయింటింగ్స్ తో పాటు ఫోటోగ్రఫీ కూడా హాబీ.
"మెన్ ఎట్ వర్క్" అనే సబ్జెక్టు మీద న్యూయార్క్ క్రియేటివ్ ఫోటో గ్రాఫర్స్ క్లబ్ వారు ఒక పోటీ పెట్టారు. ఆ పోటీలో పాల్గొని, ఫస్ట్ ఫ్రైజ్ కొట్టెయ్యాలని రకరకాల వృత్తుల్లో వున్న మగవాళ్ళని ఫోటో తీస్తోంది హిమకుంద.
ఒకసారి తనకారు రిపేరుకోసం షెడ్డుకొచ్చిన హిమకుంద రాజుని చూసింది. వివిధ యాంగిల్స్ లో రాజు ఫోటోలు తీసుకోవాలని ఆమెకోరిక. అందుకోసమే అతనితో పరిచయం చేసుకుంది.
ఎప్పుడోతప్ప షెడ్డులో కనిపించడంలేదు. కనిపించినపుడు ఏవో మాయమాటలు చెప్పి, తప్పించుకుంటున్నాడు తప్ప, ఫోటోలకు ఫోజివ్వడములేదు. ఎలాగయినా అతన్ని తన దారిలోకి తెచ్చుకోవాలని హిమకుంద ఆశ!
అందుకోసం గాలిని కాకాకొట్టి, తనవేపు మలుచుకున్నా, పూర్తిగా గాలి తనకెందుకు కోపరేట్ చెయ్యడంలేదొ అర్ధం కావడంలేదు హిమకుందకు.