"ఏదయినా అడగవలసి వస్తే అడుగు కాని, ఇలా దౌర్జన్యానికి దిగితే అది నీకూ మంచిది కాదు" హెచ్చరించాడు చంద్రశేఖర్.
"ఎందుకులే నా గురించి చెప్పి నిన్ను భయపెట్టడం. అసలు విషయంలోకి వస్తున్నాను." అని చంద్రశేఖర్ చేతిలో వున్న మంచినీళ్ళ గ్లాసందుకొని తాగేడు అలెక్స్.
పక్కనేవున్న కుర్చీని జరుపుకు కూర్చున్నాడు చంద్రశేఖర్. అతనిప్పుడు కూల్ గా వున్నాడు.
"బలరాజ్ ఎక్కడ...?" గద్దించాడు అలెక్స్.
"నాకు తెలియదు..." అంతే విసురుగా సమాధానం చెప్పాడు. చంద్రశేఖర్ కుర్చిలోంచి లేవకుండానే.
అలెక్స్ చేయి వేగంగా వచ్చి చంద్రశేఖర్ చంపని తాకింది. వెంటనే మీదకు రాబోయి వూరుకున్నాడు చంద్రశేఖర్.
"మిస్టర్. వీలయినంత తొందరగా ఇన్ఫర్ మేషన్ చెపితే మంచిది. తరువాత బాధపడి ప్రయోజనముండదు." చేతిలో వున్న రివాల్వర్ ని చంద్రశేఖర్ మొహం దగ్గరగా పెట్టి ఒక కాలు అతను కూర్చున్న కుర్చి మీదవుంచి ప్రశ్నించాడు.
"బలరాజెవరో నాకు తెలియదు. అసలింత వరకు ఆపేరు కూడా వినలేదు. ఐయామ్ సారి..." కాస్త నెమ్మదిగా సమాధానం చెప్పాడు చంద్రశేఖర్.
అలెక్స్ కీ అర్ధమయింది. మామూలుగా అడిగితే సమాధానం చెప్పడని. అసలు అతనికే ఆశ్చర్యంగా వుంది, ఈ వ్యవహారాలన్ని తనింత కూల్ గా డీల్ చేయటం.
అలెక్స్ కి చంద్రశేఖర్ నుంచి వివరాలు రాబట్టడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. దాదాపు ఇరవై నిముషాలు నానా రకాలుగా హింసించిన తరువాత చంద్రశేఖర్ నుంచి వివరాలు రాబట్ట గలిగాడు.
"నిజం చెప్పనా..."
నిజానికి బలరాజు నాకేమి అవ్వడు. ఇంతవరకు అతన్ని నేనెప్పుడూ చూడలేదు. మా కజిన్ సౌందర్యరేఖ చెబుతుండేది. బలరాజ్ నాకు కావలసిన వ్యక్తి అవుతాడని. ఆమె నన్ను చదివిస్తుంది. ప్రస్తుతం ఆమె ఇక్కడే కృష్ణవేణి అపార్ట్ మెంట్స్ లో వుంటుందని. ఈ రోజు సరిగ్గా రెండు గంటలకి ఒక నిర్ణీత ప్రదేశంలో బలరాజ్ ని మొట్టమొదటి సారిగా కలవవలసి వుంది. కాని చివరి నిముషంలో ఈ రోజు కలవటం కుదరలేదు."
మధ్యలో అలెక్స్ అడ్డుతగిలి ప్రశ్నించాడు.
"ప్రస్తుతం బలరాజ్ ఎక్కడుంటున్నాడు. మీ కజిన్ దగ్గరా..."
"అదే చెబుతున్నాను. నన్నోసారి అతను చూడాలను కుంటున్నాడట. కానీ, నాకెందుకో అతన్ని కలవాలనిపించలేదు. అయినా తప్పదనుకుంటాను. బహుశ హోటల్ ఆల్ఫాలో దిగినట్టున్నాడు. ఈ నైట్ సరిగ్గా తొమ్మిదిన్నరకి అక్కడ హోటల్ లో డిన్నర్ చేయిద్దాం కలవమన్నారు. ఈ వివరాలు చాలనుకుంటాను. నన్నిక వదిలేస్తే బావుంటుంది." ప్రాధేయపడినట్లు అడిగాడు చంద్రశేఖర్. అతని చేతులు విచిత్రంగా టేబుల్ మీద కడులుతున్నాయ్. మొహమంతా చెమటలు పట్టేశాయి.
"సరే" అని వెనక్కు తిరిగాడు అలెక్స్.
క్షణంలో మెరుపు వేగంతో కదిలాయి చంద్రశేఖర్ చేతులు. కొంచెంగా తెరిచివున్న టేబుల్ సొరుగుని లాగి రివాల్వర్ ని బయటకు తీశాడు.
అప్పటికే ఆలస్యం జరిగింది. అలెక్స్ ని తక్కువగా అంచనా వేశాడు అతను. సూటిగా చంద్రశేఖర్ కణతల దగ్గర తగిలింది అలెక్స్ కాల్చిన బుల్లెట్. మొట్టమొదటి సారిగా గురితప్పాడు అలెక్స్. ఆ వేగంలో చేతి మణికట్టు దగ్గర కాల్చవలసింది.
రివాల్వర్ అతని ప్రాణాల్ని నిశ్శబ్దంగా సైలెన్సర్ అమర్చి వున్న అనంత వాయువులో కలిపేసింది.
చంద్రశేఖర్ నిర్జీవంగా మారిన మరుక్షణం అలెక్స్ రూమ్ బయటున్నాడు. అలెక్స్ కి అనవసరంగా తొందరపడ్డానేమో అనిపించింది. అదీ ఒక్క క్షణం మాత్రమే.
* * *
తనకళ్ళతో ఆ దారుణ హత్యని మంచంక్రింద నుంచి చూసిన అభిమిత్రకి అదోక పీడకలగా అనిపించసాగింది.
స్వతహాగా అంత ధైర్యస్థుడు కాడు. మహా అయితే కాలేజీల్లో జరిగే చిన్నపాటి కొట్లాటల్ని చూశాడతను.
అటువంటిది ఒకే రోజు దాదాపు కొంచెం వ్యవధిలో రెండు హత్యల్ని చూశాడు మిత్రా. అది తట్టుకోలేక పోతున్నాడు.
అతనిలో ఒక విధమైన స్తబ్ధత చోటుచేసుకుంది. ఒక వ్యక్తి రూమ్ లోకి రావడం, అతను దౌర్జన్యంగా తలుపులు మూసి బెదిరించటం, అతను చంద్రశేఖర్ ని పెట్టిన హింస ఇంకా కళ్ళకు కట్టినట్లు అనిపించసాగింది.
తరువాత నిర్దాక్షిణ్యంగా హత్య చేయటం. మిత్రా తేరుకోడానికి పదినిముషాలు పైగా పట్టింది.