ఆ మాట విని "సరోజా! మాటల్తో దెబ్బతియ్యటం బాగా నేర్చుకున్నవే" అనుకున్నాడు మాధవ్.
రిక్షా బాగా దూరమయ్యాక అన్నాడు శ్రీదేవితో "కనీసం అప్పుడప్పుడు వస్తూ వుండమని అయినా అనలేదు. పాపం ఎంత నొచ్చుకుందో!"
నిరసనగా అంది "కాగలకార్యం గంధర్యులు తిర్చారని సంతోషిస్తూవుంటే పైగా తద్దినాన్ని కొని తెచ్చు కొమంటారా? ఎవరెంత నొచ్చుకున్నానాకేం ఫరవాలేదు. మరదలు నొచ్చుకుంటుందేమోనని మీరు బాధపడకుంటే చాలు, అయినా నా చెల్లెలు ఏమనుకున్నా నాకు ఫరవాలేదు. ఫోని ఏది ఎలాగైనా మన యిద్దరం హాయిగా వుంటే అంటే చాలు. అదే నాకు కావలసింది"
నిట్టూర్చి యింట్లోకి వచ్చేసి పేపరు చూస్తూ కూర్చున్నాడు. బాబు లేచిన సవ్వడి యింట్లోకి వెళుతున్న శ్రీదేవిని చూసి "నీ మనస్సే నా కర్ధం కాదు" అనుకున్నాడు భారంగా.
11
వాతావరణం చాలా ఆహ్లాదకరంగా వుంది. చిరు చిరు మేఘాలు తారట్లాడుతూ పిల్లగాలికి పారిపోతున్నాయ్. మలయానిలము కన్నా మనోహరంగా వుంది.
ఆరు బయట పడక కుర్చీలో పడుకుని శాంతంగా పేపరు చూస్తూ కూర్చున్నాడు మాధవ్. ఇంకా ఎక్కడా ఆంధ్ర దేశంలో వరుణుడు చినికినట్లు కనిపించలేదు వార్తల్లో ఎక్కడ చూచినా సహస్రఘటాభిషేకాలూ విరాట పర పఠానలు.......
ప్రపంచం ఎంతో నాగరికంగా పెరిగి పోయినా యింకా భారతదేశంలో యీ నమ్మకాలు వమ్ము కావటం లేదు. అందుకేనేమో దేశం యీ మాత్రంగా నయినా వుండేది.
సశాస్త్రీయంగా అన్ని వాదించినా యిలాటి గడ్డు స్థితిలో మానవుడికి దేవుడు గుర్తురాక తప్పదల్లె వుంది. శరీరం కాస్త వెచ్చనయితే విభూతి పట్టించుకోవటం మానని వాళ్ళు మెడలోనో, చేతిలోనో నొప్పి వస్తే ఇరుకు మంత్రమ మంత్రించుకునేవాళ్ళు యింకా అధిక సంఖ్యాకంగానే వున్నారు. వారికీ ఏదో రుజువు కనిపించందే యిలా ఎందుకు జరుగుతూ వుంటుంది?
"యాద్రుశి భావనా యత్రసిద్దిర్భవతి తాదృశీ"
"బాబుగారూ!"
ఉలిక్కిపడ్డట్టు నిటారుగా కూర్చున్నాడు.
పనిమనిషి రాజమ్మా.
ఒక్క నిమిషం ఆగి మళ్ళీ పిలిచింది.
"బాబుగారూ!"
"ఊ ఏం రాజమ్మా! ఏమిటి?"
చేతులు నులుము కుంటూ చెప్పలేక పోతున్నట్టుగా నిలబడింది. ముఖంలో ఆందోళన కనిపిస్తుంది.
"కూర్చో! కూర్చుని తీరిగ్గా శాంతంగా చెప్పు, ఏమిటి? ఏం సంగతి?"
మొరుసు నెలలో కూలబడుతూ మళ్ళీ పిలిచింది "బాబుగారూ!"
"చెప్పు రాజమ్మా! ఎందుకు సందేహం?"
"అదికాదు బాబుగారూ......."
"ప్చ్.....యిలా నాన్చితే ఏం లాభం? నీ మనసులోని మాట చెపితే కధ తెలిసేది"
"అదికాదు బాబూగారు! అమ్మగారు....." మళ్ళీ వాక్యం పూర్తి చేయలేక పోయింది.
"ఏం? ఏమైనా అన్నారా? పనిలోకి రావద్దాన్నారా?" ఆతృతగా ప్రశ్నించాడు. శ్రీదేవికి అలావాటే. తిక్క రేగినపుడు వద్దు పోమ్మనటం. మళ్ళీ పని చేసుకోలేక ఎవర్నో ఒకర్ని బ్రతిమాలి రాజమ్మని పిలిపించుకోవటం ఒక్కోసారి మాధవ్ కి తప్పేదికాదా డ్యూటీ. ఏమాట కామాటే చెప్పుకోవాలి. అమ్మగారి, అయ్యగారి గుణాలు తెలిసిందానివల్ల రాజమ్మ కూడా యిది అలవాటైపోయింది.
"కాదు బాబుగారూ.....అమ్మగారు యింట్లో........"
"ఓహ్.....అదా.....యింట్లో లేదులే. గుడికి వెళ్ళింది. క్యాంపు నించి యిప్పుడిప్పుడే రాదులే. ఏమిటో చెప్పేయ్"
కొంచెం సేపు సంకోచిస్తున్నట్టుగా అంది "నన్ను మన్నించండి బాబుగారూ!
"ఏమయింది రాజమ్మ- సంకోచించవద్దు- చెప్పు"
"అది కాదు బాబూగారు! మా చిన్నోడికి నిన్నటి నుంచి ఆటలమ్మ సోకింది. స్పృతిలో లేకుండా వున్నాడు. వాళ్ళ అయ్య అళ్ళయ్యగారి వెంట వెళ్ళిపొయినాడు. డాక్టరుగారు సూదిమందు యివాలంటున్నారు" ఆగింది చెప్పాల్సింది అయినట్టు.
"అరెరే! ఎంత చిక్కొచ్చింది! అలాగే యిప్పించలేక పోయావా? మంచి యింజక్షన్ యిప్పించు. లేకపోతే తర్వాత ఎంతో బాధ పడాల్సోస్తుంది."
"అదే బాబు -కానీ......"
"ఏమిటి రాజమ్మా- ఏమిటి నీ సందేహం"
"కొంచెం డబ్బు కావాలి బాబూ"
"ఓహ్! నాకు మతేలేదు. రా రాజమ్మ.....తిసికేళ్ళు.......ఎంత కావాలేమిటి?" కుర్చీలోంచి లేస్తూ అడిగాడు.
"ఓ పది యిప్పించండి బాబూ. చాలు. ఏదో మీ దయవల్ల యీ గండం గడిస్తే చాలు అదే పదివేలు."
ఇంట్లోకి వెళ్ళి జేబులు చూశాడు. కనిపించలేదు. అల్మారాలో వెదికాడు. కనిపించలేదు. సూట్ కేస్ లో చూచాడు. కనిపించలేదు. నిరాశగా నిట్టూర్చి శ్రీదేవి సూట్ కేస్ తెరిచాడు. పర్స్ కనిపించింది.
సంతోషంతో ఓ నోటు తీసుకుని మళ్ళీ పర్స్ అక్కడే వుంచేసి సూట్ కేస్ మూసేసి పిలిచాడు.
"రాజమ్మా"
"వస్తున్నా బాబూ"
గది గడపలో నుంచుంది.
పది రూపాయలు యిస్తూ అన్నాడు "జాగ్రత్త- మంచి మందు యివమని చెప్పు"
"అలాగే బాబూ!" నోటు అందుకుని కళ్ళకి అద్దుకుని వెళ్ళి పోబోయి ఓ క్షణం ఆగి అంది.
లైటు వెలిగించి అన్నాడు "ఇంకా ఏమిటి రాజమ్మా?"
"ఓ విషయం బాబుగారూ! ఈ విషయం అమ్మ గారికి చెప్పకుండా దాచండి. జీతం డబ్బులు కాక పైగా తీసికేళుతున్నానని కోప్పడతారు."