"మాధవ్! మాట్లాడు మాధవ్. నీవెందుకిలా అయిపోతున్నావు... కారణం చెప్పు మాధవ్..." విలపిస్తూ అడిగింది.
మాధవ్ ఒక్కక్షణం తడబడ్డాడు. నవ్వడానికి ప్రయత్నిస్తూ "ఎలా అయిపోయాను? అంత గండం గడిచి బయటపడ్డాను... నీరసం అది యింక తగ్గలేదు..." అన్నాడు కుంటి సంజాయిషీ యిస్తూ.
"ఉహు... అదికాదు. నిజం చెప్పు... ఆ మాత్రం గ్రహించలేని వెర్రిదాన్ని కాదు. ఎవరో చేసిందానికి నన్ను దోషిని చేసి యిలా దూరంగా వుంచుతావా. నీ ప్రేమ, అనురాగం అంతా ఏమయిపోయింది... చెప్పు మాధవ్... నన్నెందుకిలా చిత్రహింస పెడ్తున్నావు...?
మాధవ్ ఆమె చూపులని ఎదుర్కోలేనివాడిలా కళ్ళు వాల్చుకున్నాడు. "ప్లీజ్ రాధా... ఆ షాక్ నుంచి నేనింకా తేరుకోలేదు. నన్నిలా కొన్నాళ్ళు వదిలేయ్ రాధ... కళ్ళు మూసినా, తెరిచినా ఆ దృశ్యమే కనపడుతూంటే... నన్నేం చెయ్యమంటావు చెప్పు... నన్నర్థం చేసుకో రాధా..."
రాధ అతని గుండెలమీదనించి చివ్వున తలెత్తింది. "మాధవ్, అయితే నా శరీరంమీద మాత్రమే నీ ప్రేమన్నమాట- మా మనసు నీకక్కరలేదన్న మాట... నా మనసులోని పవిత్రత, నా ప్రేమ, నా అనురాగం వాటన్నిటికంటే నా దేహమే నీకు ముఖ్యం అన్నమాట. దేహం మలినపడింది కనక నన్ను దూరం చేస్తున్నావన్నమాట. మాధవ్! మనసా, వాచా నిన్నే ప్రేమించి నా మనసు, తనువు అర్పించాను. ప్రేమిస్తున్నాను. ఆరాధిస్తున్నాను. నీవే దేముడివి అనుకున్నాను. నిన్ను తప్ప నా మనసులోని మరొకరిని రానీయలేదు. నా ప్రమేయం లేకుండా నా శరీరం అపవిత్రం అయితే దానికిలా శిక్షిస్తావా-" గాయపడిన మనసుతో రోషంగా అంది.
"నీ తప్పుందని అనడంలేదు రాధా... ప్లీజ్... నేను చెప్పలేను... నన్నర్థం చేసుకోవడానికి ప్రయత్నించి నాకు టైమియ్యి... అంతకంటే నేనేం చెప్పలేను..." మాధవ్ మొహం తిప్పుకుంటూ అన్నాడు.
రాధ దెబ్బతిన్న పక్షిలా గిలగిలలాడుతూ... "మాధవ్... నీవూ ఈ పుణ్యదేశంలో పుట్టిన పురుషుడివే కదూ- మర్చిపోయాను ఆ మాట. ఆడడానికి ప్రాణంకంటే శీలం ముఖ్యం అనే వాళ్ళల్లో నీవూ ఒకడివే కదూ! ఆ శీలం పోయిన ఆడది అపవిత్రురాలు, కుక్కముట్టిన కుండ అవుతుంది కదూ? నా ప్రాణం, నా ప్రేమకంటే నా శీలం నీకు ముఖ్యం. ఆ శీలం పోయిన నన్ను ముట్టుకోవాలన్నా కంపరంగా వుందికదూ? అవును నా భర్తవి... పాపం శీలంపోయిన భార్యతో కాపురం ఎలా చేస్తావు? ఆమెని అంటితే నీవూ అపవిత్రం అయిపోతావు. వద్దు... వద్దు... నన్ను ముట్టుకోవద్దు... ఈ కుక్కముట్టిన కుండని ముట్టుకుని మైలపడి నీ జాతి పోగొట్టుకోకు... మీ మగాళ్ళు పదిమందితో తిరిగితే అంటని అపవిత్రత... ఎవరో యిష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా అన్యాయం చేసినా ఆ స్త్రీ అపవిత్రురాలేగా..." రాధ పిచ్చిదానిలా రుద్ధమైన కంఠంతో ఆవేశంతో వణికిపోతూ అంటూ ఏడ్చింది.
"రాధా..." మాధవ్ ఆరాటంగా ఏదో అనబోయాడు.
"వద్దు. నాకింకేం చెప్పకు. నాకర్థం అయింది నీ సంగతి. అయిపోయింది. నా అదృష్టానికి ఆఖరిరోజు ఆ రోజే అయింది. నా అంత అదృష్టవంతురలు ఎవరూ లేరని గర్వపడ్డాను. ఆ గర్వం భగవంతుడిలా అణిచాడు. అయిపోయింది. నా అందమైన కల చెదిరిపోయింది. ఈ రాధ నీకింక అవసరం లేదు. కాని మాధవ్ లేని రాధ పిచ్చిదవుతుంది." నిజంగా పిచ్చిదానిలా ఏడుస్తూ పక్కగదిలోకి పరిగెత్తి తలుపులు వేసుకుని పక్కమీద పడుకుని తనివితీరా ఏడ్చింది.
మాధవ్ దోషిలా తల వాల్చుకుని ఆవేదనగా కళ్ళు మూసుకున్నాడు.
11
ఆ రోజు నుంచి రాధ చాలా ముభావంగా... తన పనులు తను చేసుకుంటూ మాటలు మర్చిపోయినదానిలా- మతిపోయినదానిలా తిరగసాగింది యింట్లో. మాధవ్ కి ఏ ఏ వేళలకి అవి అన్నీ అమర్చేది- వంటచేసేది. వడ్డన చేసేది. ఖాళీటైముంటే అలా ఏ పుస్తకమో చదవడానికి ప్రయత్నించేది. లేదంటే అలా శూన్యంలోకి చూస్తూ పడుకునేది.
ఆ యింట్లో వినిపించేది శారద గొంతే. "అక్కయ్యా, ఏమిటలా పడుకుంటావు... మాట్లాడక్కయ్యా... పేకాడుదాం రా అక్కయ్యా, సినిమాకి వెళదాం" అంటూ వేధిస్తూ వెంట తిరిగేది.
ఆ శ్మశాన నిశ్శబ్దం ఆవరించిన ఇంట్లో శారద కూడా లేకపోతే నిజంగా రాధకి పిచ్చి ఎక్కేదే! మనసులో ఏ కల్మషం లేకుండా తనవాడు అనుకున్న మాధవ్ తనని వెలేసినా, ఎవరో అయిన శారద తోడబుట్టినదానిలా తనకోసం ఆరాటపడుతూంటే రాధ ఆమె అభిమానానికి చలించింది. రాధ, మాధవ్ ఆస్పత్రినుంచి యింటికి వచ్చాక... రాధని చూస్తూనే శారద పరిగెత్తినట్టే వచ్చి రాధని చుట్టేసి అమాయకంగా "అక్కయ్యా నీకు 'మానభంగం' జరిగిందట కదా- పేపర్లో కూడా పడిందక్కయ్యా... ఆస్పత్రికి వెళ్తానంటే అమ్మ వద్దందక్కయ్యా..." అంది.
రాధ మొహం నల్లబడింది. మాధవ్ తలతిప్పుకుని లోపలికి వెళ్ళాడు.
పార్వతమ్మ "ఇదో పిచ్చిమొహందమ్మా... ఆస్పత్రికెళతానని ఒకటే గోల... అక్కడికెందుకు, దీని నోరు తిన్ననయింది కాదుగదా... పిచ్చిమొహం మానభంగం అంటే ఏమిటో కూడా తెలియదు. ఏమనుకోకమ్మా దాని మాటలకి" అందావిడ రాధని జాలిగా చూస్తూ.
ఆ మాత్రం సానుభూతి ఆవిడ చూపగానే "పిన్నిగారూ... చూశారా, ఎంతపని జరిగిందో" అంది ఆవిడ భుజంమీద తల ఆన్చి కన్నీరు కారుస్తూ.
"అయ్యో పిచ్చిపిల్లా... ఇప్పుడేం జరిగింది? ఛా... ఏడవకు. అయిందేదో అయింది. మాధవ్ మంచివాడు- నీకు వచ్చే లోటు ఏం వుండదు. ఎవరో వెధవలు ఏదో చేస్తే ఏడుస్తారా..." అంటూ ఓదార్చింది.