Previous Page Next Page 
మానవత పేజి 21

 

    "నేననుకున్నా, అది నిన్ను బుట్టలో వేసుకుందని"
    ఆ మాట చైర్మన్ లో అగ్గి రగిల్చింది. "ఏమన్నావ్" అని లాగి చెంప మీద వేశాడు. శకుంతల చెంప పట్టుకుంది. లోకం గిర్రున తిరిగినట్లయింది. వెళ్ళిపోతున్న చైర్మన్ మసక మసగా కనిపించాడు.
    

                                                        *    *    *

    చైర్మన్ నేరుగా ముకుందంగారింటికి వెళ్ళాడు. జానకి కనిపించింది. ఎక్కడ లేని మార్పు కనిపించింది జానకిలో.
    ముఖంలో ఉండాల్సిన కళా , కాంతీ మాయమైనాయి. ముఖం ఉదాసీనంగా ఉంది. పాలిపోయి తెల్లగా ఉంది. కళ్ళు లోతుకు పోయి నిర్జీవంగా ఉన్నాయి. కళ్ళ కింద నల్లని చార లేర్పడ్డాయి. జానకి అని గుర్తుపట్టేట్టు లేదు. జానకి చేతులు జోడించింది.
    "ఏమిటి మార్పు?" అన్నా డాశ్చర్యంగా  చైర్మన్ ముకుందరావుగారితో.
    "ఒంట్లో బాగోటం లేదు " అన్నారాయన.
    "వైద్యం చేయించడం లేదా?"
    "ఎందుకు లేదు. తేరుకోలేకపోతోంది. గాలి దోషమేమోనని అనుమానంగా వుంది."
    "గాలి దోషమేమిటండీ మీ పిచ్చి గాని. అవసరం అయితే పట్నం తీసికెళ్ళండి . మనవాళ్ళున్నారక్కడ " అని ముకుందంగారితో చెప్పి జానకితో "శకుంతల మిమ్మల్నేమన్నా అన్నదా?" అని అడిగాడు. జానకి తల వంచుకుంది. మాట్లాడలేదు. ఆమె ముఖం మీద చీకట్లు కమ్ముకోవటం గమనించాడు చైర్మన్.
    "అర్ధం అయింది ! ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాను."
    జానకి తలెత్తింది. కంగారుగా చైర్మన్ ముఖంలోని చూచింది.
    "ఆమె నన్నేమీ అనలేదు. ఆమెను తొలగించకండి" అంది.
    "అందరూ మీలాంటి వాళ్ళుంటే....."
    "నన్ను పొగడకండి. మంచితనం మనిషికి పనికిరాదు. కుర్చోలేను. వస్తాను. మన్నించండి."
    జానకి వెళ్ళిపోయింది. చూస్తుంటే ఏదో కంకాళం నడిచినట్లనిపించింది. చైర్మన్ గొంతులో తడి చేరింది.
    "ముకుందంగారూ! నాకేదో భయంగా ఉంది. రత్నం లాంటి అమ్మాయి, ఇలా తయారయింది శ్రద్ధ చేయండి. నా చేతనయినంత సహాయం చేస్తాను. వస్తామరి."
    చైర్మన్ వెళ్ళిపోతుంటే చూస్తూ నుంచున్నారు ముకుందంగారు. "ఎందుకిలా పోగుడుతున్నాడు తన కూతుర్ని?  ఆ కిరస్తానీ వాడు పంపలేదు కదా!" అనుకున్నారు ముకుందంగారు.
    పాల్ బ్రతికి ఉన్నాడు. అంతే అది అతని కదలిక వల్ల తెలియాలి. పాల్ చిక్కిపోయాడు. గడ్డం మాసిపోయినది. ఎముకలు కనిపించడం లేదు. కళ్ళు పీక్కుపోయి ఎండిపోయిన బావుల్లా వున్నాయి.
    పాల్ ఇంటి నుంచి కదలడు. సాయంత్రం దాకా గది నుంచి బయటికి రాడు- సాయంత్రం బయల్దెరతాడు. స్కూలు వైపు సాగుతాడు. స్కూలు బయట నిలుస్తాడు. జానకి వస్తుందని ఆశ. రాదని తెలుసు. అదోల ఆలాపన. అందులో ఏదో ఒదార్పుంది. స్కూలు వదుల్తారు. అందరినీ చూస్తాడు. అంతే జానకి రాదు . పాల్ అక్కణ్ణించి బయల్దేరతాడు. మర్రి కింద కూర్చుంటాడు. మర్రిని చూస్తాడు. జానకి కనిపిస్తుంది. చెరువును చూస్తాడు. జానకి కనిపిస్తుంది. చెట్లను చూస్తాడు . జానకి కనిపిస్తుంది. జానకి పూర్వంలా లేదు. ఆమె నవ్వదు. మాట్లాడడు. మౌనంగా కూర్చుంటుంది. చీకట్లు వస్తాయి . లేస్తాడు పాల్. యంత్రంలా నడుస్తాడు. ఆస్పత్రికి చేర్తాడు.
    

                                                        *    *    *

    ఆ రోజు చైర్మన్ వచ్చాడు.
    డాక్టర్ అభివందనం చేశాడు. ఇద్దరూ కూర్చున్నారు.
    "ఏమిటలా అయిపోయారు?"
    చిరునవ్వు లాంటిది నవ్వాడు పాల్. ఆ నవ్వులో జీవం లేదు.
    "డాక్టర్! జానకీ, మీరూ , ప్రేమించుకున్నారనీ విన్నాను. మీ మధ్య నిలిచిన అడ్డుగోడలేమిటో నాకు తెలుసు. ఇలా దూరంగా ఉంటూ ఒకరి కోసం ఒకరు క్షీణించి పోవటంలో అర్ధం లేదు. ఏదోటి చేయాలి. దాని కోసం నన్నే సహాయం చేయమన్నా చేస్తాను. నా సహాయం ఏ రకంగా కావాలో చెప్పండి" అన్నాడు.
    మళ్ళీ చిరునవ్వులాంటిది నవ్వాడు పాల్. అది నవ్వులా లేదు.
    "చైర్మన్ గారూ! ఒక ఉపకారం చేయండి. మేమిద్దరం చచ్చిపోతే మా ఇద్దర్ని ఒకేచోట సమాధి చేయండి."
    "డాక్టర్!" చైర్మన్ కలవరపడుతూ "అలా అనకండి డాక్టర్! మీరిద్దరూ మానవతా మూర్తులు. మీరు ఓడిపోతే -- మానవత ఓడినట్లు. మీరు చనిపోతే - ప్రేమ ఇగిరిపోయినట్లు. మీరు చదువుకున్నవారు . ఇలా నిరాశ చెందితే ఎలా?"
    "అంతే, చైర్మన్ గారూ! ఇంకా లోకంలో మానవత ఉందంటారా? ప్రేమ నిలుస్తుందంటారా? కల్ల హు! అంతే. మీరు అమృత మూర్తులు. మీ పేరుతొ నాలో విషం చిలకాలని చూశారు. ఈ లోకం ఏం చేయలేదు? లోకంలో చావుకు సామాగ్రి చాలా ఉంది. బతకడానికే నీడ లేదు."
    "డాక్టర్! మీరు అనుమానిస్తున్నారా? దైవ సాక్షిగా చెపుతున్నాను. జానకిగారూ నాకు సోదరి. ఆమె దేవత. మానవతామూర్తి."
    "నాకు తెలుసు చైర్మన్ గారూ! జానకిని గురించి నాకంటే తెల్సినవారు లేరు. లోకం తీరు చెప్పాను. అది మీకూ మసి పూయగలదు! నా కోరిక మన్నించండి అంతే. మా ఇద్దరినీ ఒకేచోట కాల్చండి. చాలు, బతికి కలుసుకోలేక పోయాం మరో జన్మ ఉంటే....."
    "కాదు మీరు ఈ జన్మలోనే కలుసుకుంటారు. భగవంతుడు ప్రేమమయుడు కరుణామయుడు, దయామూర్తి."
    చైర్మన్ పాల్ కు ఏదేదో ధైర్యం చెప్పి వెళ్ళాడు.


                                                         *    *    *

    జానకికి పెళ్ళి చేయాలని ముకుందంగారి పట్టు. వరుని కోసం వెదకసాగారు. అప్పుడు తెలిశాయి కొన్ని నిజాలు. సంప్రదాయాలూ, ఆచారాలు డబ్బు కింద కొరగానివని తెలిసి వచ్చింది . ఎవర్ని చూచినా కట్నాల మీదనే కూర్చున్నారు.
    ఒకనాడు శాస్త్రులు వచ్చాడు. ఒక సంబంధం కుదిరించినట్లే చెప్పాడు. వరునికి అట్టే వయసు లేదు. నలభై, నలబై అయిదు లోపే. ఈ మధ్యనే భార్య పోయింది. ఆస్తి బాగానే ఉంది. కాస్త అవిటి. ఎడం చేయి చచ్చు. పిల్లలున్నారు ముగ్గురు. వారిని చూచుకోడానికి తల్లి కావాలి. జానకి పటం చూశాడు వరుడు వప్పుకున్నాడు. పిల్లను చూడ పని లేదన్నాడు. కట్నం కొద్దిలోనే వప్పుకున్నాడు. పెళ్ళి అట్టహాసంగా చేయనవసరం లేదన్నాడు.
    బాగానే వుందనుకున్నారు ముకుందంగారు. కాని పితృహృదయం గోషించింది. బంగారం లాంటి పిల్లను రెండో పెళ్ళి వాడికి కట్టబెట్టడమా? ఆశలు అందరికీ ఉంటాయి. అవి నెరవేరడానికి డబ్బు కావాలి. ఉన్నంతలో ఇంతకన్నా మంచి వరుడ్ని కొనలేరు. సమాధాన పరచుకున్నారు. షావుకారి దగ్గరికి వెళ్ళారు. ఇల్లు తాకట్టు పెట్టారు. డబ్బు సమకూర్చుకున్నారు. అడ్వాన్సు కూడా చెల్లించారు వరునికి.
    జానకి కీ పెళ్ళి విషయం తెల్పలేదు. తెల్పడం వల్ల ప్రయోజనం లేదు. ఆమె వప్పుకోదు. అది తెలుసు ముకుందంగారికి. పెళ్ళి రెండు రోజులుందనగా తెల్పాలనుకున్నారు.

 Previous Page Next Page