'దాని బ్యాంకిలొ దివాకర్ అని కొత్తగా మేనేజర్ వచ్చాడు. మా ఆయనకి బాగా తెల్సిన ఫ్రెండ్. మనిషి బాగుంటాడు. ఈ మధ్య ఇద్దరూ కలిసి ఈయన కజిన్ పెళ్ళికి అదే ఉషారాణి పెళ్ళికి, పార్టీకి వచ్చారు. ఈయనతో అంటున్నా ఎలాగైనా దివాకర్ కి చెప్పి అక్కయ్యకి పెళ్ళి కుదిరేట్టు చూడమని-
ఇన్ డైరెక్ట్ గా ఇప్పటికే సజెస్ట్ చేశాగా, మళ్ళీ ఇంకోసారి అవకాశం చూసి ప్రసక్తి తెచ్చి అడుగుతా, చూద్దాం ఏం అంటాడో' గోపాలకృష్ణ అన్నాడు.
'ఏదో దేముడి దయవల్ల ఈ సంబంధం కుదిరితే అమ్మానాన్నకి నిశ్చింత. వంటరిగా వుంటుందని మనసులో చాలా మధనపడుతున్నారు. చూస్తూ వదిలేయలేరుగా, ఏదో పెళ్ళి చేసుకుంటే వాళ్ళ బాధ్యత తీరుతుంది' వాసంతి.
'అన్నింటికి టైము రావాలి వదినగారూ. ఎవరికెవరు రాసిపెట్టారో అన్నది ఎంత నిజమో-మమ్మల్ని చూశాకన్నా అర్ధం అవ్వాలి- మన చేతుల్లో ఏముంది. దివాకర్ కి సజెస్ట్ చేయడం వరకే నా ప్రయత్నం.... ఆ తర్వాత ఏమవుతుందో చూద్దాం'.
* * *
ఆ రోజు ఆఫీసులో వుండగా జయంతికి ఉషారాణి ఫోను చేసింది. హనీమూన్ నించి వచ్చానని ఎల్లుండి అమెరికా ప్రయాణం అని, ఈ రాత్రి రాహుల్ పెళ్ళికి వస్తున్నావా అని అడిగింది.
'రాహుల్ పెళ్ళా-ఎవరు' అంది జయంతి.
'అదేమిటి ఆ రోజు హోటల్లో కలుసుకోలేదూ, శ్రీధర్ కజిన్ భావిక...'
'ఓ.... గుర్తొచ్చింది... ఇవాళ పెళ్ళా, నాకు తెలియదే.
'అదేమిటి శ్రీధర్ ఇన్విటేషన్స్ దివాకర్ కి నీకు పంపానన్నాడే 'హాలిడే ఇన్'లో పెళ్ళి రిసెప్షన్ సాయంత్రం ఏడున్నరకి-నీవు తప్పకుండా రావాలి మళ్ళీ నేను వెళ్ళిపోతున్నాను. మనం కలపడం కుదరదింక" బలవంతపెడ్తూ అంది.
'నాకే ఇన్విటేషన్ అందలేదు-అయినా ఏదో ఓసారి చూసిన పరిచయంతో పెళ్ళికి వచ్చేస్తే బాగుంటుందా.. నాకందరూ కొత్త అక్కడ' మొహమాటంగా అంది.
'మరేం ఫర్వాలేదు లెద్దూ, నేనూ, శ్రీధర్ వున్నాం, మీ చెల్లెలు కూడా వస్తుందిగా వాళ్లాయనకి కజిన్ కదా-దివాకర్ కి ఫోను చెయ్యమన్నానా-నిన్ను తీసుకు రమ్మని-నీవు ఫోను అతనికియ్యి' అంది ఉషారాణి. కేబిన్ లోకి వెళ్ళి ఉషారాణి లైనులో వుంది అని చెప్పింది జయంతి. ఫోనందుకున్నాడు దివాకర్.
"ఓ ష్యూర్, ష్యూర్ తప్పకుండా వస్తాం, దివాకర్ పంపింది నిన్నే అందింది. ష్యూర్ వుయ్ విల్ మీట్ దేర్" అని ఫోను పెట్టేసి 'సారీ నిన్న ఇన్విటేషన్ వచ్చినట్లు మీకు చెప్పామని చూశాను. అప్పటికే మీరు వెళ్ళిపోయారు. సాయంత్రం వెడదాం' అన్నాడు జయంతి వంక చూసి.
"ఏంటో మరీ అంత పరిచయం ఏం లేదు, మొహమాటంగా అంది. ఏదో ఉషారాణి కోసం వెళ్ళాలి అంతే' కాస్త మొహమాటపడ్తూ అంది.
"అంతే, మళ్ళీ ఫ్రెండ్స్ అందరం ఎప్పటికి మీటవుతామో, రాహుల్ కూడా ఆ రోజు చాలా సరదాగా వున్నాడు. మరీ మరీ చెప్పాడు రమ్మని ఆ రోజు. పదండి వెడదాం. హాలిడే ఇన్ గదా, ఫైవ్ స్టార్ హోటల్ రిసెప్షన్ వదులుకోకూడదు' నవ్వుతూ అన్నాడు. జయంతి నవ్వింది.
* * *
హాలిడే ఇన్ లో ఆ రోజు సాయంత్రం-అందం, డబ్బు, ఆనందం ఒకదానితో ఒకటి పోటీపడి నిల్చినట్టుంది. సింధీల పెళ్ళి, అంటే బిజినెస్ కమ్యూనిటీ, పుష్కలంగా డబ్బున్న వారు. జిగేలు మనిపించే ఆభరణాలు, వజ్రాల నగలు, మెరిసే దుస్తులు, మేకప్పులతో ఆడవారు అందానికి మెరుగులు దిద్దుకుని మెరిసిపోయారు. ఎక్కడ చూసినా డబ్బు వెదజల్లినట్లనిపించే ఏర్పాట్లు, చైనీస్, నార్త్ ఇండియన్ వంటకాలు, ఛాట్ ఓ పక్క పదిరకాల స్వీట్లు, పళ్ళు, రకరకాల ఐస్ క్రీములు ఓ పక్క.....ఏది తినాలో ఏది వదలాలో తెలియని స్థితి-రకరకాల సెంట్లు, ఫెర్ ఫ్యూములు సువాసనలు..అదంతా వేరే లోకంలా, తమకు తెలియని ఏదో లోకం అనిపించింది జయంతికి. జయంతి ఎప్పటికన్నా బాగా అలంకరించుకున్నా వారి అందాలు, అలంకరణల మధ్య తనో వెలిసిపోయిన చీరలా వున్నాననిపించి కుంచించుకుపోయింది. మంచి రంగు, ఫీచర్సు, అలంకారాలతో ఉన్న ఆడవారి మధ్య తనే వంటరిగా ఉన్న ఫీలింగు తనతో వచ్చిన దివాకర్ తన జోలి పట్టించుకోకుండా శ్రీధర్, రాహుల్ వాళ్ళతో కల్సిపోయాడు. ఉషారాణి వచ్చి పలకరించి కాసేపు మాట్లాడి బంధువులు, స్నేహితులని పలకరించడంలో మునిగిపోయింది-వంటరిగా ఓ కుర్చీలో కూల్ డ్రింక్ తాగుతూ కూర్చున్న జయంతికి చాలా మొహమాటంగా వుంది. దమయంతి, గోపాలకృష్ణ ఓసారి కన్పించి మాట్లాడి మాయమయ్యారు. దివాకర్ శ్రీధర్ తో మాట్లాడుతున్నాడు కానీ అతని చూపులు పెళ్ళికూతురు, భావిక పక్కన నిల్చున్న ఓ పొడుగాటి అమ్మాయివైపే ఉండటం జయంతి గమనించింది. బహుశా పెళ్ళి కూతురు చెల్లెలులా వుంది. పోలికలు కనిపిస్తున్నాయి. ఐదడుగుల ఆరంగుళాలు, ముట్టుకుంటే మాసిపోయేటంత మంచిరంగు, ఎంతో నాజూగ్గా అందంగా వున్న ఆ అమ్మాయిని చూసి జయంతికెంతో ఈర్ష్య కలిగింది. ఎంత బాగుందో దేముడు ఆ రంగు, ఆ అందం అందరికి తలా కాస్తా పంచవచ్చుగా అనుకుంది"
"ఏయ్ శ్రీధర్ ఎవరా బ్యూటీ క్వీన్" ఆ అమ్మాయిని చూపించి శ్రీధర్ ని అడిగాడు దివాకర్. శ్రీధర్ అటు చూసి 'ఏయ్ నీ కళ్ళు ఆ అమ్మాయి మీద పడ్డాయా-పెళ్ళికూతురి చెల్లెలు మనీషా' అన్నాడు నవ్వుతూ బాగుంది కదూ' అన్నాడు మళ్ళీ తనే కొంటెగా. "నీ ఛాన్స్ అయిపోయింది. ఇంకేం మాట్లాడే అవకాశం నీకు లేదు ఉషారాణి కి చెప్తా జాగ్రత్త' అన్నాడు బెదిరిస్తున్నట్టు.