Previous Page Next Page 
ఎర్ర సముద్రం పేజి 22

రాత్రి తొమ్మిదిగంటలు కొట్టింది నేషనల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ క్లాక్ టవర్.
    ఆ చిన్న కాకా  హొటల్ లో ఐదుగురు కార్మికులున్నారు.
     ఓ మూలగా ఉన్నా టేబుల్  ముందు సామంత్ కొద్దికొద్దిగా టీ  తాగుతున్నాడు......ఎదురుగా ఉన్న సత్తెయ్య సిగరెట్ మీద సిగరెట పీలుస్తూ సామంత్  ముఖంలోకే పరిశీలనగా  చూస్తున్నాడు.
    "మరోసారి ఆలోచించు.....నీలాంటి నిస్వార్థపరుడు ఈ ఉద్యమాన్ని చేపడితే మాలాంటి పేద కార్మికులు మూడు పూటలా కడుపు నిండా తింటారు.......కంటినిండా  నిద్రపోతారు....." సత్తెయ్య ఓ క్షణం ఆగి సామంత్  ముఖంలోకి చూసాడు. అతనిలో ఏ మార్పు కనిపించలేదు.
    అప్పుడప్పుడూ ఓ వెహికల్ వెళుతోంది....రోడ్డు పక్కగా ఉన్న  ఆ కాకా హొటల్ పెద్ద హడావుడి లేకుండా  మామూలుగా ఉంది.
    "మేనేజ్ మెంట్ తీర్చవలసిన డిమాండ్స్  ఐదారున్నాయి. "మెల్లగా  అన్నాడు సామంత్__
    ఆ మాటల్లో ఉన్న ప్రశాంతతను చెడగొట్టుకోవడం  ఎందుకన్న భావం స్పష్టమయింది సత్తెయ్యకు.
    "మరి వాటిని మనమేం చేయకుండానే మన మేనేజ్ మెంట్  పరిష్కరిస్తుందనా నీ ఉద్దేశ్యం?"
    "కావచ్చు.....అందుకే మెమొరాండం సమర్పింద్దాం."
    "మోమొరాండం మన డిమాండ్స్ ని పరిష్కరిస్తుందా____మిగతా మేనేజ్ మెంట్స్ లాగా కాదుగా  మనది. భూపతిరావు కార్మికుల్ని దోచుకునికడుపు నింపుకొనే మనిషికాదు-"
    సత్తెయ్యకి ఎలా మాట్లాడాలో తోచటంలేదు. జేబులో ఉన్న కరెన్సీ నోట్లు సత్తెయ్యను పిచ్చివాణ్ణి చేస్తున్నాయి. అలాంటివి మరికొన్ని కట్టల్ని సత్యరాజ్ నుంచి దీపక్ రాజ్ ద్వారా ఆశిస్తున్నాడు సత్తెయ్య.
    "నీకు జీతం ఎంత?" అడిగాడు సత్తెయ్య సామంత్ వైపుచూస్తూ.
    "ఎనిమిదివందలు......." అన్నాడు సామంత్ అస్పష్టంగా.
    "నీ వయస్సెంత....."
    "25"-తనవయస్సెందుకు అడిగాడో సామంత్ కి అర్థం కాలేదు.
    "జాబ్ లో చేరి ఎన్నాళ్ళయింది......?" సామంత్ కి తెలియకుండానే ఎటో తీసుకెళుతున్నాడు సత్తెయ్య.
    "ఐదేండ్లు."
    "ఈ ఐదేండ్లలో ఏం సాధించావ్?"
    "ఏమిటి సాధించేది?"
    "సారీ సాధించటంకాదు......ఏం సంపాదించావ్......?" సత్తెయ్య మెల్లగా తనవేపు నుంచి నరుక్కు పోతున్నాడు.
    "ఏంలేదు....."
    "కదా?"
    "అయితే?"
    "రేపు నీకు  పెళ్ళవుతుంది. పిల్లలు పుడతారు. వారికి మంచి భవిష్యత్ చూపించాల్సిన బాధ్యత నీది."
    "కావచ్చు."
    "కావచ్చా-ఎలా? ఈ ఎనిమిది వందలలో నెగ్గుకు రాగలరా? ఇది జపాన్ ఇండస్ట్రీయల్ వరల్డ్ కాదు-నీకు పెళ్ళయితే జీతం పెంచడానికి, పిల్లలు పుట్టగానే మరికొంత పెంచి సౌకర్యాలు కల్పించటానికి."
    సామంత్ మౌనంగా ఉన్నాడు.
    "ఇప్పుడే మౌనంగా ఉన్నాడు.
    "ఇప్పుడే నాల్గురాళ్ళు సంపాదించుకొకపోతే సెటిల్ కాగలవా?"
    సత్తెయ్య ఉద్దేశాన్ని సామంత్ కనిపెట్టేశాడు. సీరియస్ గా లేచాడు- భవిష్యత్ కోసం నాలుగురాళ్ళు సంపాదించుకొనే ప్రయత్నంలోపదిరాళ్లు పరిశ్రమ పై విసరాలి - ఇదేగా టోటల్ గా నీ ఉద్దేశం?" కాస్తంత తీవ్రంగానే ప్రశ్నించాడు.
    సత్తెయ్య కంగారుపడ్డా క్షణాల్లోనే సర్దుకొని "రాళ్ళు వేయటం ఏమిటి? నీవు, ఏ ఉద్దేశంతో తీసుకున్నావో నాకర్థంకాలేదు. మేనేజ్ మెంట్ తో భేదాలకు దిగమంటున్నాను" అంటూ మాట మార్చేసాడు.
    సామంత్ ఇక మాట్లాడవలసింది ఏమీలేదన్నట్లు బయటకు నడిచాడు.
    వెళ్తున్న సామంత్ వైపు చూస్తూ సత్తెయ్య మనస్సులో అనుకుంటున్నాడు__ఇప్పుడు ఏ అవసరం, సెంటిమెంట్ నిన్ను కదిలించకపోవచ్చు___వాటిని నీ నెత్తిమీదకు తీసుకువస్తాను- అప్పుడు ఎంత మంచి వాడైనా, ఎంతటి గొప్పవాడైనా దిగజారక  తప్పదు మైడియర్ సామంత్ దిగ్రేట్ అని అనుకుంటున్న సమయంలో హొటల్ ముందు జీబ్ ఆగింది. అందులోంచి దీపక్ రాజ్ దిగి ఒక్కో అడుగే హొటల్ కి వస్తున్నాడు.
    సత్తెయ్య కాస్తంత కంగారుపడ్డా, దాన్ని పైకి కనిపించనీయకుండా, చిరునవ్వు మొఖాన పులుముకొని ఎదురెళ్ళాడు.
    "ఏమైంది......?" తగ్గుస్వరాన అడిగాడు దీపక్ రాజ్.
    "లొంగేలా లేడు" అన్నాడు కాస్త జంకుతూనే.
    సడన్ గా దీపక్ రాజ్ జేబులోంచి ఓ కవర్  తీసి టేబుల్ మీద  పెడుతూ "మరిప్పుడేం చేయాలనుకుంటున్నావ్__?" అంటూ ఓ చేత్తో కవర్ ని టేబుల్ మీద తమాషాగా కదిలిస్తున్నాడు.
    దానివైపు ఆశగా చూస్తూ, అంతలోనే దీపక్ రాజ్ వైపు చూపుమరల్చి ఏం చేయమంటావన్నట్లు చూసాడు.
    "మామూలే- ఆయువుపట్టుమీద చావుదెబ్బ వేయటమే_"
    "అంటే.....?" అర్థంకాలేదు సత్తెయ్యకు.
    "అంటే ఏముంది? రక్తసంబంధాలు-సెంటిమెంట్స్ బాధ్యతల్లోకి దూరిపోవటమే."
    అర్థమయినట్లుగా తలూపాడు సత్తెయ్య.
    "మరో విషయం_డైయింగ్ సెక్షన్ ఇంజనీర్ అవసరాన్ని వెంటనే తీసుకో....." అంటూ  లేచాడు దీపక్ రాజ్.
    వెళ్తూ వెళ్తూ దీపక్ రాజ్  చూసిన  చూపులో తొంగిచూసిన కర్కశత్వం ఓ క్షణం సత్తెయ్యను ఒణికించింది.


                                                               *    *    *

 Previous Page Next Page