ఒక్కసారి కొన్ని వందల కంఠాలు నాగ్ కి వంత పలికాయి__
ఒకటికి నాలుగుసార్లు ఇలా స్లోగన్స్ ఇస్తుండగానే అప్పటి వరకూ మెట్లమీద వున్న వ్యక్తి ఒక్కో అడుగూ దిగుతూ విద్యార్థి సమూహానికి చేరువవుతున్నాడు.
ఈ వ్యక్తిని కొద్ది క్షణాలక్రితమే పసిగట్టిన నాగ్ అతని కదలికల్ని చూపులతోనే వెంటాడుతున్నాడు.
అతను సమూహానికి మరింత చేరువయ్యాడు- అతని చేయి తన భుజానికి వేలాడే సంచిలోంచి ఓ వస్తువు బయటకు వచ్చింది.
నాగ్ శివంగిలా ఆ వ్యక్తివైపు దూకాడు- దూకుతూనే ముంచుకురానున్న ప్రమాదాన్ని హెచ్చరిస్తూ కేకవేశాడు.
* * *
"నువ్వు చెప్పేది నిజమేనా?" భూపతిరావు సాలోచనగా అడిగాడు.
"అవును నాన్నగారు" అన్నాడు దినేష్ ఒకచోట స్థిరంగా నిలబడి.
తెల్లవారుజాము మూడు కావటానికి మరొక్క ఐదు నిముషాలే ఉందనగా తండ్రికొడుకుల మధ్య ఈ చర్చ జరుగుతోంది.
భూపతిరావు తీవ్రంగా ఆలోచిస్తూనే ఉన్నాడు......
ఎలాంటి ప్రమాదం ముంచుకురాబోతున్నా చిరునవ్వుతో, చిటికెన వేలు సైగతో చిటికలొ పరిష్కరించగలిగే తన తండ్రి ఈ రోజు ఇలా ఏ నిర్ణయమూ తీసుకోకుండా సీరియస్ గా ఆలోచిస్తూ ఉండిపోవటం దినేష్ కి అవమానంగా ఉంది.
చిన్నప్పటినుండి భూపతిరావుతో దినేష్ కి గాఢమైనా సంబంధం వెళ్ళానుతూ వచ్చింది. తండ్రిలో ఓ గురువును, దైవాన్ని చూసాడు. తండ్రంటే భయమూ, గౌరవమూ ఉన్నాయి. తండ్రిమీద ప్రేమ, అభిమానం ఎంతున్నాయో ఆయన్ని ఎవరన్నా బాధపెట్టినా అవమానించినా వార్ని చావుదెబ్బ తీసే వరకూ నిద్రపోనీ ఆవేశమూ అంతే ఉంది.
దినేష్ ధైర్యంగా నోరెత్తి మాట్లాడలేనిది ఒకేఒక వ్యక్తి ముందు అతనే నాగబాబు- దినేష్కి అన్న- భూపతిరావుకు పెద్దకొడుకు.
ఐదు నిముషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. ఎంతకి తండ్రి నోరు మెదలకపోవటం చూసి 'సత్తెయ్యను డిస్ మిస్ చేద్దాం నాన్నగారు' అన్నాడు దినేష్.
కొడుకు మాటలకు ఓ క్షణం ఆగాడు భూపతిరావు.
"సమస్య పరిష్కరింపబడుతుందా......" కొడుకు వైపు చూస్తూ అడిగాడు.
"సత్యరాజ్ అనుచరుడు దీపక్ రాజ ని నా గుప్పిట్లోకి తీసుకొని మరోసారి తలెత్తకుండా వాడి పొగరును కత్తిరిస్తాను" ఆవేశంగా అన్నాడు దినేష్.
"రాయబారిని నొక్కితే ప్రత్యర్థి మరింత రెచ్చిపోతాడు....."
"పోనీ సత్యరాజ్ ని?"
భూపతిరావు ఓసారి ఆశ్చర్యంగా చూసాడు-" సత్యరాజ్ ని తక్కువ అంచనా వేస్తే మనల్ని మనమే నాశనం చేసుకున్నట్లు......"
"మరెలా......." దినేష్ కి తండ్రి నిర్ణయం వెంటనే తెలిసిపోవాలి-
"ఇప్పుడు రెండు సమస్యలు మన ముందున్నాయి......ఒకటి సత్యరాజ్ అనుచరుడు దీపక్ రాజ్ చాలా ప్రమాదకరమైన వ్యక్తి......వాడు సత్తెయ్యను తరచూ ఎందుకు కలుసుకుంటున్నాడు.....? వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? సత్తెయ్య డైయింగ్ యూనిట్ ఇంజనీర్ ని ఎందుకు కలుస్తున్నాడు? దీనికి నా దగ్గరకు వచ్చి దీపక్ రాజ్' సత్యరాజ్ తరపున బెదిరించబోవరానికి ఏదైనా సంబంధం ఉందా?
రెండు-అన్నిటికన్నా అతిప్రమాదకరమైనది-టెక్స్ టైల్ పరిశ్రమలోకే పెనుతుఫానులా జొరబడనున్న పారిశ్రామిక అశాంతి-భయంకరమైనా సమ్మె-మొత్తం ఇండస్ట్రినే తల్లక్రిందులుచేయగల ఉపద్రవం అని భూపతిరావు ఓ నిముషం మౌనంగాఉండి మరలా ప్రారంభించాడు.
"మొదటి ప్రమాదాన్ని మనం ఆపాలి- ఎందుకంటె రెండోప్రమాదం ముందు మొదటిది చిన్నది గనుక....." భూపతిరావు వివరంగా చర్చిస్తున్నాడు.
ఇంకొకరిముందయితే వెంటనే ఏం చేయాలి? ఎలా చేయాలి? అనే విషయాల్ని మనసులోనే సుదీర్ఘంగా చర్చించుకొని, దాని ఆనుపానులు పసిగట్టి నిర్ణయం తీసుకుంటాడు.....కొడుకు ముందుకు వచ్చే సరికి పధకాన్ని సవివరంగా పైకే చర్చిస్తూ దినేష్ ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నంలొ ఉంటాడు.
ఇంత మాట్లాడుతున్న భూపతిరావు మనస్సు దేనికోసమో కొట్టుకులాడుతోంది.....ఉండుండి అతని ఆలోచనలు సుదూరంగా వెళ్ళి ఓ వ్యక్తి చుట్టూ లిప్తపాటు పరిభ్రమించి తిరిగి వెనక్కు వస్తున్నాయి- వాటి తాలూకూ బాధా వీచిక ఆయన మోములో అస్పష్టంగా కదలాడుతున్నా వాటిని పట్టించుకునే స్థితిలోలేడు దేనేష్.
"ముందున్న చిన్న ప్రమాదాన్ని ఆపాలంటే సత్యరాజ్ ని సంతృప్తి పరచాలి. అయినా సత్యరాజ్, దీపక్ రాజ్, సత్తెయ్యలకు మన ఇండస్ట్రియల్.....వరల్డ్ లో అశాంతిని క్రియేట్ చేయగల సామర్థ్యం లేదనే నా భావన....." దినేష్ తన అనాలసిస్ వివరిస్తున్నాడు.
భూపతిరావు ఓసారి కొడుకువేపు పరిశీలనగా చూసాడు. చిన్న కొడుకున్నా తనకు వారసుడవుతాడనుకున్నాడు- కాని ఇప్పటికీ దినేష్ ఆలోచనలు కొంతవరకే పయనించి అక్కడే ఓ కేంద్ర బిందువు దగ్గర ఆవేశంతో ముడిపడి పోతున్నాయి. అనుకున్నవి సాధించటంలో ఆవేశం కన్నా ఆలోచన, డిప్లమసీ ముఖ్యం అని భూపతిరావు కాన్పెస్ట్.
"మిస్టర్ ఎల్ సేకరించిన రిపోర్ట్ లో ఇంకా ఏమన్నా వివరాలున్నాయా?" మరికాస్త లోతుగా వెళ్తున్నాడు భూపతిరావు.
దినేష్ ఓ క్షణం గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నంలో ఉండి పోయాడు
* * *