Previous Page Next Page 
యమదూత పేజి 22


    
    ఏమీ దొరకలేదు.
    
    గంట తర్వాత సిటీవైపు తిరుగు ప్రయాణం మొదలెట్టింది ఆమె కాదు.
    
    తాను ఎర్ర ఆర్టీసీ బస్సులో ఎక్కుతున్నట్లు ఇన్ స్పెక్టర్ జలీల్ కి భ్రమకలిగించి రోడ్డు పక్కనే ఉన్న ఒక పెద్దమర్రిచెట్టు వెనుక నక్కి దాక్కున్న దినకర్, జలీల్ మహాజన్ కారు ఎక్కి బస్సుని తరుముకుంటూ వెళ్ళాక చెట్టు చాటునుంచి బయటికి వచ్చాడు.
    
    దాదాపు మనస్థిమితం లేని స్థితిలో ఉండి కూడా తను ఇంత సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు అపాయంలో నుంచి ఉపాయంగా తప్పించుకుంటూ వుండడం అతనికే అబ్బురం కలిగించింది.
    
    మళ్ళీ అదే ప్రశ్న!        
    
    ఈ రిఫ్లెక్సెస్ తనకి సహజంగానే వచ్చాయా? ప్రాక్టీసు వల్లా?
    
    ప్రాక్టీసు వల్ల అయితే ఏం ప్రాక్టీసు?
    
    ఎవరు తను? హంతకుడా? మంచివాడా?
    
    ఆ ఆలోచన ఎంతకీ తెగక, నిట్టూర్చి ఇక ముందు ఏం చెయ్యాలో ఆలోచించడం మొదలెట్టాడు దినకర్.
    
    తనని చూసి భయపడి ప్రాణభయంతో పారిపోయిన ఆ వ్యక్తి తను దొంగిలించిన మోటార సైకిల్ మీద ఎక్కి వెళ్ళిపోబోతూ పేలిపోయాడు.
    
    ఆ మోటార్ సైకిల్ లో వున్న బాంబు ఎవరోగాని తనని చంపడానికే పెట్టి వుంటారు. అది తెలుస్తూనే వుంది.
    
    బాంబు పెట్టింది ఎవరైనా కావచ్చు. కానీ దాన్ని మోటార్ సైకిల్ బాక్సులో పెట్టి ఉండడం మాత్రం తాను టీ తాగిన ఆ హోటల్ దగ్గరే అయి వుండాలి.
    
    తనని చూసి పారిపోయిన ఆ వ్యక్తి కూడా మొదట్లో తనకు తారసపడింది అక్కడే.
    
    కాబట్టి అక్కడికి వెళితే తన గతం గురించిన ఆధారాలేమన్నా దొరకవచ్చు తనకి.
    
    అక్కడికి వెళ్ళడం వల్ల చాలా ప్రమాదహం జరగొచ్చు. హంతకులు వాళ్ళెంతమందో తెలియదు. తన ప్రాణాలు తియ్యడానికి సిద్దంగా కాచుకుని వుండవచ్చు అక్కడ.
    
    కానీ వెళ్ళకపోవడంవల్ల జరిగే ప్రమాదం కూడా చాలా వుంది.
    
    వెళ్ళకపోతే తనెవరో తనకి తెలియదు.
    
    కొద్ది క్షణాలు ఆలోచించి విజయమో వీరస్వర్గమో తేల్చుకోవడానికి నిర్ణయించుకున్నవాడిలా  వచ్చిన దారిలోనే వెనక్కి మళ్ళీ ఆ హోటల్ వైపు వెళ్ళే మార్గంలో నడవడం మొదలుపెట్టాడు దినకర్.    
    
    తన వంట్లోని ప్రతి కండరం, ప్రతి ఎముకా, ప్రతి నరం తిరుగుబాటు చేస్తున్నట్టు అనిపిస్తున్నా కూడా లెక్కచెయ్యకుండా లేని ఓపిక తెచ్చుకుని నడుస్తూ చివరికి ఆ హోటల్ నీ, ఆ పరిసరాల్నీ క్షుణ్ణంగా పరిశీలించాడు.
    
    చాలా చిన్న హోటలు అది. కింద రెస్టారెంటు వుంది. పై అంతస్థులో పీతబొక్కలాంటి రూములు కొన్ని కనబడుతున్నాయి బహుశా అది లాడ్జింగ్ అయి వుండవచ్చు.
    
    లోపలికి వెళ్ళాడు దినకర్. లోపలికి వెళ్ళగానే అతనికి కనబడింది కౌంటర్ దగ్గర ఒక ముసలాయన నిలబడి ఓనర్ తో ఏదో ఘర్షణ పడుతూ వుండడం, పొట్టిగా వున్నాడాయన. ఐదడుగుల ఎత్తు కూడా వుండకపోవచ్చు. చాలా పీలగా వుండడంవల్ల వెనకనుంచి చూస్తే చిన్న పిల్లాడని భ్రమపడినాపడచ్చు ఎవరైనా. పన్నెండేళ్ళ పిల్లాడికి సరిపోయే సైజు చొక్కా ప్యాంటు వేసుకుని వున్నాడు. బాగా వయసు మళ్ళినా జుట్టు మాత్రం ఒక్క వెంట్రుక కూడా నెరవలేదు.
    
    "అయితే ఇంతకీ ఏమిటంటావ్?" అంటున్నాడు హోటల్ యజమాని చిరాగ్గా.
    
    "మీ సర్వరు నా బిల్లులో ఇరవైపైసలు ఎక్కువ వేసాడు? అన్నాడు ఆ ముసలాయన.
    
    "ఎట్లా"
    
    "నేనుమూడు నమ్ కిన్ బిస్కెట్లు తిని చాయ్ తాగాను.  మూడు ఇరవైలు అరవై, చాయ్ ఒక్క రూపాయి. మొత్తం రూపాయ్ అరవై పైసలు కావాలి. కానీ సర్వరు రూపాయ్ ఎనభైపైసలు వేసాడు."
    
    ఓనరు బెల్లు కొట్టి సర్వర్ ని పిలిచి "ఏమిటీగోల?" అన్నట్లు చూశాడు.
    
    సర్వర్ చులకనగా ముసలాడివైపు చూస్తూ అన్నాడు "గీన నాల్గు బిస్కెట్లు తిని చాయ్ తాగిండు! ఒక్క రూపాయి ఎన్భయ్ పైసలు అయ్యింది బిల్లు!"
    
    "నాలుగు బిస్కెట్లు తినలేదు. మూడే తిన్నాను. ఇవాళేకాదు. ఎప్పుడు బిస్కెట్లు తిన్నా మూడే తింటాను. ఒకటి తక్కువా తినను. ఒకటి ఎక్కువా తినను. చాలా కరెక్టు మనిషిని నేను. లెక్కంటే లెక్కే!" అన్నాడు ముసలాయన.
    
    అతనికీ సర్వర్ కీ మధ్య కాసేపు వాగ్వివాదం జరిగింది. తర్వాత ఓనరు ముసలయాన్ని పురుగుని చూసినట్లు చూసి, "సర్లే ఒక్క బిస్కెట్ పైసలతో నువ్వు ఏం బాగుపడతావో చూద్దాంగానీ మూడు బిస్కెట్లకే ఇవ్వు పైసలు!" అన్నాడు విసురుగా.
    
    ఓనరు అలా తిరస్కారంగా మాట్లాడినందుకు ఆ వృద్దుడు పెద్దగా నొచ్చుకుంటున్నట్లు కనబడలేదు. పాత తోలుపర్సు ఒకటి తీసి అందులోనుంచి జాగ్రత్తగా నాణాలు లెక్కపెట్టి ఓనరుకి ఇచ్చాడు.
    
    "ఇంకేమిటి?" అన్నాడు ఓనరు ఇంకా కదలకుండా అక్కడే నిలబడివున్న వృద్దుడిని చూస్తూ.
    
    వృద్దుడు తోలు పర్సులోంచి ఒక పాత అయిదు పైసల నాణెం తీసి ఓనరుముందు పెట్టాడు. అది ఓ మూల ఎవరో కొరికేసినట్లు విరిగి వుంది.
    
    "ఇదేమిటి?" అన్నాడు ఓనరు.
    
    "ఈ అయిదుపైసల బిళ్ళ నిన్న మీరే ఇచ్చారు. అది ఎక్కడా చెల్లడం లేదు."
    
    ఒనరుకి తిక్కరేగింది.
    
    "ఏం నకరాలు చేస్తున్నావా? ఇది మేమే ఇచ్చినదని ఎట్లా గుర్తు?"
    
    ప్రశాంతంగా కానీ స్థిరంగా అన్నాడు వృద్దుడు "నిన్న కూడా నేను ఈ హోటల్లోనే బిస్కెట్లు తిని చాయ్ తాగాను.
    
    ఓనర్ ఆ పాతనాణాన్ని రోడ్డుమీద పడేటట్లు గిరవాటు వేశాడు. "ఎక్కడ అడుక్కుని తెచ్చావో ఈ బిల్ల. మేమిచ్చింది కాదు యిది! ఎల్లు ఎల్లు! అన్నాడు మొరటుగా.
    
    వృద్దుడు నెమ్మదిగా నడిచి రోడ్డుమీద పడిన అయిదుపైసల నాణాన్ని వంగి అందుకుని మళ్ళీ వెనక్కి వచ్చి కౌంటర్ మీద పెట్టాడు.
    
    "ఈ నాణెం మీరు ఇచ్చిందే. ఇది తీసుకుని మరొకటి ఇవ్వండి!"
    
    ఓనరు అశ్లీలపదం ఒకటి ఉచ్చరించి వృద్దుడి మీదకి చెయ్యి లేపాడు.
    
    దినకర్ ఒక్క అంగలో ముందుకువెళ్ళి ఓనర్ చేతిని అందుకుని వృద్దుడికి దెబ్బ తగలకుండా ఆపేసాడు.
    
    ఓనర్ దినకర్ వైపు రౌద్రంగా చూశాడు. తొణక్కుండా నిదానంగా అన్నాడు దినకర్ "నోటితో చెప్పడానికి నీకు హక్కు వుందిగానీ చేత్తో కొట్టడానికి హక్కు లేదు. ఆయనపట్ల అమర్యాదగా ప్రవర్తించి నందుకుగాను బిల్లు డబ్బులు మొత్తం తిరిగి ఇచ్చెయ్!"
    
    దినకర్ తో కలబడటానికి ఓనర్ కుర్చీలోంచి లేవబోయాడు.
    
    అతని చేతిని గట్టిగా మెలిపెట్టాడు దినకర్. ఓనర్ కి ఎంత బాధ కలుగుతుందో అతనికి తెలియదు. కానీ అంతకు రెట్టింపు బాధ తనకి కలుగుతోంది. అయినా అతను దాన్ని బయటకు కనిపించనివ్వడం లేదు.
    
    బాధతో ఓనర్ మొహం వంకరపోయింది. విధిలేక కాష్ బాక్స్ లోనుంచి డబ్బులు బయటకు తియ్యబోయాడు.
    
    "అయిదుపైసలు చాలు" అన్నాడు వృద్దుడు.
    
    మంచి అయిదుపైసల నాణెం ఒకటి వృద్దుడికిచ్చాడు ఓనర్. అప్పుడు ఓనర్ చెయ్యి వదిలేశాడు దినకర్.
    
    "నీ సంగతి చూస్తాను" అన్నాడు ఓనర్ నెమ్మదిగా.
    
    అది పట్టించుకోనట్లు "నాకో సింగిల్ రూం కావాలి" అన్నాడు దినకర్.
    
    "రూములు ఖాళీగాలేవు!" అన్నాడు ఓనర్ తక్షణం.
    
    "నాకు సింగిల్ రూం కావాలి" అన్నాడు దినకర్ మళ్ళీ.
    
    ఓనర్ ఒక్కక్షణం అతనివైపు కోపంగా చూసితగ్గిపోయి రిజిస్టర్ దినకర్ ముందుకు నెట్టాడు. "నువ్వే చూస్కో ఒక్క గది కూడా ఖాళీలేదు."
    
    దినకర్ కి ఎప్పుడెప్పుడెళ్ళి పక్కమీద వాలిపోదామా అని వుంది. చెప్పలేనంత అలసట!
    
    గొంతు సవరించుకున్నాడు వృద్దుడు. "మీకు అభ్యంతరం లేకపోతే మీరు నా ఇంట్లో వుండవచ్చు. ఇక్కడికి దగ్గరే నా ఇల్లు!" అన్నాడు.
    
    రిలీఫ్ గా ఆయనవైపు చూశాడు దినకర్. గొడ్లసావిట్లో గడ్డిమీదనైనా సరే పడుకోవడానికి అభ్యంతరం లేనట్లు వుంది అతని శారీరక పరిస్థితి.

 Previous Page Next Page