Previous Page Next Page 
యమదూత పేజి 23

 

    తల పంకించి వృద్దునితోబాటు బయటికి నడిచాడు.
    
    "ఇంకో విషయం! నా ఇంట్లో వున్నందుకు మీరు అద్దె చెల్లించవలసి వుంటుంది" అన్నాడు వృద్దుడు.
    
    "ఎంత?"
    
    "రోజుకి అయిదు రూపాయలు"
    
    "సరే!" అన్నాడు దినకర్.
    
    "అద్దె డబ్బులు అడ్వాన్సుగా ఇవ్వాలి" అన్నాడు ముసలాయన.
    
    "నువ్వు మనిషివా కాల్క్యులేటర్ వా?" అని అడగాలన్నంత చికాకు కలిగింది దినకర్ కి. కానీ అతికష్టంమీద నిగ్రహించుకున్నాడు.
    
    అయిదు నిముషాల నడక తర్వాత ఆగాడు వృద్దుడు.
    
    "ఇదే నా ఇల్లు" అన్నాడు.
    
    "ఎక్కడ?" అన్నాడు దినకర్ అటూ ఇటూ చూస్తూ.
    
    "ఇదిగో! ఇక్కడ!" అన్నాడు వృద్దుడు.
    
    దినకర్ దిమ్మెరపోయాడు. అక్కడ రోడ్డుకి ఒకవైపు వున్న ఇళ్ళన్నీ పడగొట్టేసి వున్నాయి. పడగొట్టబడిన ఇళ్ళ తాలూకు రాళ్ళు రప్పల మధ్య వుంది ఆ వృద్దుడి ఇల్లు. దాన్ని ఇల్లు అనడం కంటే శిథిలగృహం అనడం బాగుంటుంది. ఆ ఇల్లు ముప్పాతిక మూడొంతులు పడిపోయి వుంది. ఒక్క గదిమీద మాత్రం ఇంకా కప్పు నిలిచివుంది.
    
    "ఈ చుట్టుప్రక్కల ఇళ్ళన్నీ ఒక సేటు కొనేసాడు. ఇక్కడ పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ ఒకటి కడతాడట. అందరూ అమ్మారుగానీ నేను మాత్రం అమ్మలేదు" అన్నాడా ముసలాయన.
    
    "ఎంతకాలం ఆగితే అంతగా రేటు పెంచుకోవచ్చని ఆలోచన అయి వుంటుంది!" అనుకున్నాడు దినకర్. అతనికి ఆ వృద్దుడి తత్వం అర్ధమవుతున్నట్లు అనిపిస్తోంది.
    
    "లోపలికి రా!" అన్నాడు వృద్దుడు, రాజభవనంలోకి అతిథిని ఆహ్వానిస్తున్నంత ఇదిగా.
    
    సంకోచంగా లోపలికి అడుగు పెట్టాడు దినకర్. అతను ఊహించినట్లు ఒకే ఒక్క గది ఇంకా కూలిపోకుండా నిలబడి ఉంది. కవర్లు చిరిగిపోయి, స్ప్రింగులు బయటికి వచ్చేసిన సోఫా ఒకటి వుంది ఆ గదిలో! మూడుకాళ్ళ మీద నిలబడ్డ కుర్చీ ఒకటీ, పాతకాలపు రైటింగ్ టేబుల్ ఒకటీ కూడా వున్నాయి.
    
    "నువ్వా సోఫాలో పడుకోవచ్చు" అన్నాడు వృద్దుడు.
    
    పాముపిల్లల్లా బయటికి వచ్చిన సోఫా స్ప్రింగులవైపు సందిగ్ధంగా చూశాడు దినకర్.
    
    హఠాత్తుగా అన్నాడు వృద్దుడు. "నేను నిన్నెక్కడో చూసినట్లనిపిస్తోంది."
    
    ఊపిరి బిగబట్టి ఆయనవైపే తదేకంగా కాసేపుచూసి "ఊహు! గుర్తురావడం లేదు! వృద్దాప్యంవల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోవడం మొదలయిందనుకుంటా! కానీ నీ పర్సనాలిటీ ఎందుకోగానీ చిరపరిచితమైనట్లే అనిపిస్తోంది!" అన్నాడు బుర్ర గోక్కుంటూ.
    
    ఒక్కసారిగా నిరాశ ఆవరించింది దినకర్ ని.

    "నీ పేరేవిటి?" అన్నాడు వృద్దుడు.
    
    "దినకర్!" అన్నాడు నిస్తేజంగా.
    
    "నా పేరు వామనరావు" అన్నాడు వృద్దుడు.
    
    "సార్ధక నామధేయం" అనుకున్నాడు దినకర్ నిజంగా వామనావతారంలాగే వున్నాడు ఈయన! పొట్టిగా, పీలగా! మళ్ళీ అన్నాడు వామనరావు.
    
    "నీకు ఆకలిగా వుంటే హోటల్లో ఏమన్నా తిని రావచ్చు. లేకపోతే డబ్బులు యిస్తే నేను నీ కోసం భోజనం ఏర్పాటు చెయ్యగలను" అని గుణించి, "మూడు రూపాయలవుతుంది" అన్నాడు.
    
    "నాకు ఆకలిగా లేదు. నిద్రపోవాలని వుంది" అన్నాడు దినకర్.
    
    తను కూడా భోజనం మానేసి డబ్బులు మిగుల్చుకోవడానికి ఇదేమంచి సందర్భంలా తోచినట్లుంది వామనరావుకి. "నాకూ ఆకలిగా లేదు. పడుకుందాం! లైటు ఆర్పెయ్యనా?" అన్నాడు తొందరగా.
    
    "ఎలక్ట్రిసిటీ ఆదా!" అనుకుని నవ్వుకున్నాడు దినకర్.
    
    నవ్వు రావద్మతో బాటే జాలి కూడా కలిగింది అతనికి. బతకలేక బతుకుతూ, ప్రతి రూపాయినీ వీలయినంత సాగదీయడానికి ప్రయత్నిస్తున్న బడుగుజీవి ఈ వామనరావు! పాపం!
    
    పడుకున్న రెండు నిమిషాల్లోనే గాఢనిద్ర పట్టేసింది దినకర్ కి. నిద్రలో కల. కలలో నిశాంత. ఆమె ఎలుగెత్తి పిలుస్తోంది తనని!
    
    రా రమ్మని!
    
    చటుక్కున మెలకువ వచ్చింది దినకర్ కి.
    
    ఎవరో తలుపు దబదబ బాదుతున్నారు.
    
    దినకర్ లేచేసరికి వామనరావు మెలకువగానే వున్నాడు.
    
    "ఎవరది?" అన్నాడు దినకర్ ఆదుర్దాగా.
    
    "పోలీసులయివుంటారు!" అన్నాడు వామనరావు కూల్ గా.
    
    "పోలీసులా? ఎందుకు?" అన్నాడు దినకర్ అదిరిపడి.
    
    "చెప్పానుగా! ఈచుట్టుపక్కల ఇళ్ళన్నీ ఒక సేఠ్ కొని పడగొట్టేసి కాంప్లెక్స్ కడుతున్నాడు. అమ్మనివాణ్ని నేనొక్కన్నే ఆ కచ్చ మనసులో పెట్టుకుని, సేటు ఇంకేదో వంకతో కోర్టుకెళ్ళి నన్ను ఖాళీ చేయించడానికి ఆర్డర్స్ తెచ్చుకున్నాడు. ఖాళీ చేయించడానికి మునిసిపాలిటీ వాళ్ళు, పోలీసులు కలిసి వచ్చి వుంటారు. వస్తారని నాకు తెలుసు. ఎదురు చూస్తున్నాను" అన్నాడు వామనరావు.
    
    "మరి నాకాసంగతి ముందే ఎందుకు చెప్పలేదు" అన్నాడు దినకర్ గట్టిగా.
    
    దినకర్ వైపు అనుమానంగా చూస్తూ అన్నాడు వామనరావు "అంటే ఏమిటి అర్ధం. నీకు పోలీసులంటే భయమా ఏమిటి?" అతని మాట పూర్తికాకుండానే మళ్ళీ తలుపు దబదబ కొట్టిన శబ్దం వినపడింది.
    
                                                               * * *
    
    తన ఎయిర్ కండిషన్డ్ హోండా అకార్డ్ కారులో బేగంపేట ఎయిర్ పోర్టు వైపు వెళుతున్నాడు మెకానిక్. పారడైజ్ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ కి మారడంతో అక్కడ స్లోచేసి ఆపాడు కారుని! కారు పక్కగా ఆగింది ఒక మోటార్ సైకిల్. దానిమీద యిద్దరు రైడర్స్ వున్నారు. వాళ్ళలో చేతిలో సుత్తిపట్టుకున్న ఒకతను కరుమీదికి లంఘించి గ్లాస్ విండోని బద్దలు కొట్టాడు. అతని వెనక కూర్చున్నవాడు మోటార్ సైకిల్ మీదనుంచే 9 యం యం బెల్జియన్ మేడ్ రివాల్వర్ తో ఆరుసార్లు మెకానిక్ వైపు గురిపెట్టి కాల్చాడు. కొన్ని బుల్లెట్లు కారు తలుపుకి తాకాయి. కొన్ని బుల్లెట్లు మెకానిక్ పక్కనుంచి దూసుకుపోయాయి. ఒక్క బుల్లెట్ మాత్రం మెకానిక్ గుండెకి తగిలింది.
    
    వెంటనే దుండగులిద్దరూ మోటార్ సైకిల్ ఎక్కి ట్రాఫిక్ సిగ్నల్ ని లెక్కచేయకుండా వేగంగా ముందుకి వెళ్ళిపోయారు.
    
    వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళేలోపలే కారు గేర్లు మార్చి, ముందుకు ఉరికించాడు మెకానిక్. ఒక బుల్లెట్ అతని గుండెకు తగిలినా అతను కోటు లోపల బులెట్ ప్రూఫ్ వెస్ట్ వేసుకుని ఉండటంవల్ల గాయంకాలేదు. కారుని ముందుకి పోనిస్తూనే కారులో ఎప్పుడూ రెడీగా వుండే స్టెన్ గన్ తాలూకు నలుగు విడిభాగాల్ని బయటకు తీసాడు మెకానిక్. అతని దగ్గర యాభైవేల రూపాయల ఖరీదుచేసే ఇంపోర్టెడ్ రివాల్వర్ వుంది కానీ ఇలాంటి సందర్భాలలో రివాల్వర్ ఉపయోగం చాలా పరిమితమేనని అతనికి తెలుసు లక్షా యాభైవేలు ఖరీదు చేసే స్టెన్ గన్ నిమిషానికి మూడొందలనుంచి నాలుగొందల రౌండ్స్ పేల్చగలదు. రెండొందల గజాల దూరంలో వున్న టార్గెట్ ని కూడా నాశనం చేయగలదు. గ్యాంగ్ స్టర్స్ లో స్టెన్ గన్ కలిగి ఉండడం అనేది ఒక స్టేటస్ సింబల్. కారుని పోనిస్తూనే స్టెన్ గన్ పార్ట్స్ ఒకదానికొకటి అమర్చాడు మెకానిక్. కారు మోటార్ సైకిల్ కి దగ్గరవగానే ఆ దుండగుల మీదికి నిప్పుల వర్షం కురిపిస్తున్నట్లు వంద గుళ్ళు పేల్చాడు స్టెన్ గన్ తో.
    
    తూటాల తాకిడికి తూట్లు పడిపోయిన శరీరాలతో మోటారు సైకిల్ తోసహా కింద పడిపోయారు దుండగులు.
    
    తర్వాత కారు రోడ్డు పక్కన ఆపాడు మెకానిక్.
    
    జరుగుతున్నదంతా దిగ్భ్రాంతిపొంది చూస్తున్న ఓ కానిస్టేబుల్ పరిగెత్తి కారు దగ్గరికి వచ్చాడు.
    
    ఆ కానిస్టేబుల్ వైపు నిర్లక్ష్యంగా చూసి, కారులోంచి కిందికి దిగాడు మెకానిక్. ఖరీదైన తెల్లటి సూట్ వేసుకుని వున్నాడతను. ఇంపోర్టెడ్ గాగుల్స్, ఇంపోర్టెడ్ షూస్, ఇంపోర్టెడ్ పెర్ ఫ్యూమ్.
    
    గంభీరంగా అడుగులు వేస్తూ పక్కనే ఉన్న షాపులోకెళ్ళి అక్కడున్న ఫోన్ ని తనవైపుకి తిప్పుకున్నాడు మెకానిక్. ఒక నెంబర్ రింగ్ చేసి ఫలాని వాళ్ళు కావాలని అడిగాడు.
    
    మెకానిక్ వెనకే వచ్చి వింటున్న కానిస్టేబుల్ కి ఆ పేరు వినగానే భయభక్తులతో అటెన్షన్ లో నిలుచోవాలనిపించింది. పోలీస్ డిపార్టుమెంటులో చాలా పెద్ద ఆఫీసరుతో మాట్లాడుతున్నాడు మెకానిక్.    

 

    జరిగిందంతా ఆ పోలీస్ ఆఫీసర్ కి టూకీగా చెప్పాడు మెకానిక్. తర్వాత అన్నాడు "మిస్టర్ రావ్! యిదంతా ఆత్మరక్షణ కోసమే చెయ్యవలసి వచ్చింది. నాకు గన్ లైసెన్సు ఉన్న సంగతి నీకు తెలిసే ఉంటుందనుకుంటాను" అన్నాడు ముక్తసరిగా.   

 Previous Page Next Page