Previous Page Next Page 
యమదూత పేజి 21


    
    నిశీధి అంతమయిన తర్వాత వచ్చే ఉషస్సు - ఉదయభానుడు అనేగా తను పేర్లకు అర్ధం అలా అనిపించిన తర్వాత అతన్ని మరో దృష్టితో చూడ్డం మొదలెట్టిందా తను?
    
    కాకపోతే -
    
    తనమీద పూర్తిగా ఆధారపడిపోయి, తను లేకుండా బతకలేనిస్థితిలో ఉన్న దినకర్ ని చూసి జాలిపడి అతనికి మానసికంగా దగ్గరయిందా?
    
    ఎక్కడో చదివింది తను "తాము ఎవరిచేతనయినా ప్రేమించబడటాన్ని ప్రేమిస్తారు స్త్రీలు. తాము ఒకరిచేత ఆరాధింపబడటాన్ని ఆరాధిస్తారు. వీటన్నిటికంటే ముఖ్యం! తాము ఇంకొకరికి అవసరం అన్న భావన స్త్రీకి అత్యవసరం!
    
    తనూ, తన వైద్యం, తన రక్షణా, తన సాహచర్యం ఇవన్నీ అవసరమయ్యాయి దినకర్ కి. అతను మామూలు పేషెంట్ కాదు.
    
    దాదాపు మళ్ళీ మనిషిగా చేసే ప్రయత్నంలో -
    
    అతనితోనే ఎక్కువ సమయం గడపటంలో -
    
    అతని అవసరాలు కనిపెట్టి ఉండటంలో -
    
    అతని సైకాలజీని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించడంలో -
    
    అతని గతాన్ని కనుగొనే ప్రయత్నం చేయడంలో -
    
    ఎప్పుడు జరిగిందో తెలియదు గానీ, అతను పేషెంటు అన్న భావన కరిగిపోయి అతను మగవాడు అన్న భావన కలిగింది తనకి.
    
    దానితోబాటే...
    
    తను డాక్టరే కాదు...ఓ అందమయిన అమ్మాయి అనే స్పృహ  కూడా కలిగింది.
    
    పాలల్లో తోడుచుక్క పడిన తర్వాత అవి పెరుగుగా మారినంత నిశ్శబ్దంగానే ఆ పేషెంట్ తన ప్రియుడయ్యాడు.
    
    ఈ డాక్టరు అతని ప్రేయసి అయింది.
    
    ఇది అందరి విషయంలోనూ, అన్ని కేసుల్లోనూ జరగకపోవచ్చు! జరగదు కూడా!
    
    అలా జరిగేటట్లుంటే ఏ డాక్టరూ ప్రాక్టీసు చేయలేదు! చేయలేదు! ఎక్కడో నూటికో.....కోటికో.....ఒకసారి ఒకరి విషయంలో అంతే!
    
    అది తన విషయంలో జరిగింది.
    
    హఠాత్తుగా ఊహా దృశ్యం మారిపోయింది.
    
    ఒకరోజున...
    
    అర్దరాత్రి...
    
    ఇద్దరు దొంగలు చల్లగా నర్సింగ్ హోం లోపలకి వచ్చారు.
    
    తను ఆ సమయంలో దినకర్ కి సెడేటివ్ ఏదో ఇస్తుంది.
    
    దొంగలు సమీపిస్తున్న సవ్వడి తను కూడా గ్రహించనే లేదు కానీ సగం మత్తులో ఉన్న దినకర్ మాత్రం ఉన్నట్లుండి అలర్ట్ గా అయిపోయాడు!
    
    అతని మొహంలో కాన్ సన్ ట్రేషన్ కనబడింది. చెవులు రిక్కించి విన్నాడు.
    
    తర్వాత చటుక్కున లేచి అటూ ఇటూ చూసి అక్కడే వున్న స్పిరిట్ బాటిల్ అందుకుని తలుపు పక్కన నిలబడ్డాడు.
    
    దొంగలు నక్కి నక్కి లోపలికి వచ్చాడు.
    
    "ఇటు తిరగండి" అన్నాడు దినకర్ మెల్లిగా.
    
    ఉలిక్కిపడి వెనక్కి చూశారు ఇద్దరూ వెంటనే వాళ్ళ ముఖాల మీద స్పిరిట్ పోసేశాడు దినకర్. స్పిరిట్ కళ్ళలో పడగానే కళ్ళు భగ్గున మండి వాళ్ళిద్దరూ పెద్దగా కేకలు వేయడం మొదలెట్టారు. వెంటనే చెరో చేత్తో వాళ్ళని ఒడిసి పట్టుకున్నాడు దినకర్.
    
    ఈలోగా స్టాఫ్ అంతా పరిగెత్తుకుని అక్కడికి వచ్చారు. దొంగలు దినకర్ పట్టు వదిలించుకుని కళ్ళు నులుముకుంటూ అతి కష్టంమీద కిటికీలోనుంచి బయటికి దూకేశారు. వాళ్ళని ఆపబోయాడు దినకర్. కానీ అతని శారీరక పరిస్థితి అలా వీలుపడనివ్వలేదు.
    
    బల్లుల్లా కాంపౌండ్ వాల్ మీదకు ఎగబాకి అటువైపు దూకేశారు దొంగలు. తక్షణం ఒక కారు కదిలిన శబ్దం వినబడింది.
    
    ఇదంతా నిర్ఘాంతపోయి చూస్తున్న నిశాంత ఆశ్చర్యంలోనుంచి తేరుకున్న తర్వాత అంది.
    
    ఈ నర్సింగ్ హోమ్ లో దొంగలు పడటం ఇదే మొదటిసారి!"
    
    "వాళ్ళు నేరుగా నేనున్న చోటికే రావడం ఇంకా ఆశ్చర్యంగా లేదూ?" అన్నాడు దినకర్ సాలోచనగా.
    
    అసందిగ్ధంగా తలపంకించింది నిశాంత.
    
    అది గుర్తొస్తే ఇప్పుడనిపిస్తోంది వాళ్ళు అసలు దొంగలేనా!?
    
    లేకపోతే దినకర్ ని చంపడానికి వచ్చిన హంతకులా వాళ్ళు?
    
    అప్పుడు హాస్పిటల్లో దినకర్ మీద హత్యా ప్రయత్నం!
    
    ఇందాక రైలు స్టేషన్ లో దినకర్ ని ఎవరో రైలు కిందకి తోసెయ్యడం.
    
    ఇదంతా చూస్తుంటే దినకర్ ని చంపాలనే ప్రయత్నాలు చాలా ఆర్గనైజ్ డ్ గా జరుగుతున్నట్లుగా లేదూ!
    
    అలా అయితే ఎవరు చేస్తున్నారు ఆ ప్రయత్నాలు! ఎందుకు? అసలు దినకర్ ఎవరు?
    
    ఆమె అలా అలజడిగా ఆలోచిస్తూ వుండగానే ఆ స్పాట్ ని సమీపించింది కారు.
    
    కారు ఆపి కిందకి దిగింది డాక్టర్ నిశాంత.
    
    ఇక్కడే వళ్ళంతా గాయాలతో వంటిమీద స్పృహలేని స్థితిలో కనబడ్డాడు దినకర్ తనకి.
    
    అక్కడ...
    
    ఒకవైపు చిన్న ఏరు.
    
    ఆఏటిగట్టునంతా ముళ్ళపొదలు.
    
    నెమ్మదిగా అడుగులు వేస్తూ పరిశీలనగా ఆ ప్రాంతమంతా చూడడం మొదలుపెట్టింది డాక్టర్ నిశాంత.
    
    తను ఈ స్పాట్ కు ఇంతకు ముందు కూడా రెండుసార్లు వచ్చింది. దినకర్ గతాన్ని బయటపెట్టే ఇంకేమైనా గుర్తులు దొరుకుతాయేమోనన్న ఆశతో అప్పట్లో ఏమీ దొరకలేదు.
    
    కానీ ఇంకోసారి ప్రయత్నిస్తే దొరకవనీ దొరకకూడదని ఎక్కడుంది? ఇంతకుముందు మిస్సయిపోయిన పాయింట్లు ఇప్పుడు తోచవచ్చు కదా?
    
    చటుక్కున ఆగిపోయింది డాక్టర్ నిశాంత.
    
    ఆమెకు అయిదారు అడుగుల దూరంలో.....నేలమీద ఎండపొడ పడి మిలమిల మెరుస్తూ కనబడింది ఏదో?
    
    ఏమిటది?
    
    దగ్గరికెళ్ళి ఒంగి దాన్ని చేతిలోకి తీసుకుంది నిశాంత.
    
    అది ఒక రూపాయి నాణెం!
    
    రూపాయి కాదు.
    
    రూపాయిలో సగం!
    
    రూపాయి నాణాన్ని విరక్కొట్టిరెండుముక్కలు చేస్తే వాటిలో ఒక ముక్కలాగా వుంది అది.
    
    ఆ రూపాయి ముక్కకి రెండువైపులా రెండు కన్నాలున్నాయి.
    
    సో దిసీజ్ సమ్ థింగ్!
    
    సగానికి కత్తిరించిన, లేక విరగ్గొట్టిన రూపాయి నాణెం!
    
    దానికి రెండు కన్నాలు!!
    
    ఏమిటిది? ఎవరిది??
    
    ఇది దినకర్ దేనా? అయితే దీనికర్ధం ఏమిటి?
    
    ఒకవేళ ఇది దినకర్ దే అయితే దీనిద్వారా అతని గతం, భవిష్యత్తూ, రెండూ తెలిసే అవకాశం ఉందా?
    
    సాలోచనగా ఆ సగం నాణాన్ని తన పర్సులో వేసుకుంది డాక్టర్ నిశాంత. ఇంకాసేపు ఆ చుట్టుపక్కల వెదికింది ఇంకేమన్నా దొరుకుతాయేమోనని!

 Previous Page Next Page