ఈ పాటికి అంతా ముగిసిపోయి వుంటుంది.
ఇన్నాళ్ళు జీవితం అయన మనసుని మసి అయిపోయేలా కాల్చేసింది.
ఇవాళ మృత్యువు అయన దేవాన్ని దహించివేస్తుంది.
కష్టాలకు, కన్నీళ్ళకు వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయారు నాన్నగారు. పోయిన వాళ్ళెప్పుడు అదృష్టవంతులే.
పొతే, ఇక మిగిలింది అమ్మా. తనూ . నాన్న తప్ప మరో లోకం ఎరగని అమ్మ.
తను ధైర్యం తెచ్చుకుని ధైర్యం చెప్పకపోతే తలక్రిందులయిపోతుంది అమ్మ. అందుకని తను గుండె చిక్కబట్టుకుని పరిస్టితులు చక్కబెట్టాలి.
తప్పదు!
చివరిసారిగా కళ్ళు తుడుచుకుని, లేచి నిలబడింది సౌమ్య.
10
మూడు రోజులు గడిచాయి.
మొదట్లో అనుకున్న దాని ప్రకారం అయితే ఈరోజు సౌమ్యకి, శశికాంత్ కి శోభనం జరగాలి. కానీ సుబ్రహ్మణ్యం గారి ఆకస్మిక మరణం వల్ల ఆటోమేటిక్ గా ఆ కార్యక్రమం రద్దయిపోయింది.
అని అందరూ అనుకున్నారు , ఒక్క శశికాంత్ తప్ప.
అతను అ సమయానికి యధావిధిగా వచ్చేశాడు సుబ్రహ్మణ్యం గారింటికి. రాగానే, "పద పోదాం" అన్నాడు సౌమ్యతో. అతని దగ్గర ఓల్డ్ స్పైస్ పరిమళం వస్తోంది.
"ఎక్కడికి?" అంది సౌమ్య అనుమానంగా అతనివైపు చూస్తూ.
"బంజారాలో రూమ్ బుక్ చేశాను."
"దేనికి?"
"దేనికంటా వేమిటి? దానికే!"
"నాకు అర్ధం కావడం లేదు" అంది సౌమ్య.
"ఇవాళ మనకి శోభనమని మరచిపోయావా ఏమిటి?"
ఇది విన్న తరువాత కొద్ది క్షణాల పాటు సౌమ్య నోట వెంబడి మాట రాలేదు.
"శోభనమా?ఇవాలా?" అంది ఆయిం,అయోమయంగా.
"అవును! మీ వాళ్ళే పెట్టారుగా ముహూర్తం!"
"అది నాన్నగారు పోకముందు. ఇప్పుడది ఆటోమేటిక్ గా కేన్సిల్ అయినట్లే కదా?"
"ఆ సంగతి నాకు ఎందుకు చెప్పలేదు?" అన్నాడు శశికాంత్ చిరాగ్గా-
"మీకు అర్ధమయే వుంటుందనుకున్నాను."
"అర్ధం లేని మాటలివి సౌమ్య! నేను సక్సెస్ ఫుల్ బిజినెస్ మాన్ ని . అపాయింట్ మెంట్స్ అన్ని తు.చ తప్పకుండా పాటిస్తాను. ప్రోగ్రాం కేన్సిల్ చేయదలచుకుంటే మాటమాత్రం చెప్పి ఉండవచ్చు కదా మీ వాళ్ళు?"
"అది కూడా చెప్పాలా? నానగారు పోయాక ఇక ఇలాంటివన్ని ఎలా వుంటాయి?"
"అంటే ఇక ఎప్పుడూ ఉండదా ఏమిటి? దిసీజ్ అల్ స్టుపిడ్ నాన్సెన్స్! పోయినవాళ్ళతో బాటు మనమూ పోతామా? అంత్యక్రియలు అయిపోయాయి. అండ్ దటీజ్ ద ఎండ్! అనవసరమైన ఫార్మాలిటిస్ నాకు నచ్చవు. ఈ శోభనం కోసం పబ్లిసిటి కూడా. ఫలాని రోజున వీళ్ళిద్దరికి శోభనం అని అడ్వర్ టయిజ్ చెయ్యడమే అసలు నాకు ఇష్టం లేదు. సరే చేశారు. జరిగిందేదో జరిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు అది కేన్సిలయిపోయినట్లు అందరికి చెప్పి , మళ్ళీ ఫలాని రోజున అని మళ్ళీ ప్రకటించి- చ! ఉహించుకోవడనికే వల్గర్ గా వుంటుంది సౌమ్య! మనకి ఫార్మాలిటీస్ వద్దు. ఇన్ ఫార్మల్ గా ఇవాళే ఒకటైపోదాం?"
అతను మాట్లాడుతున్నది వినబడుతూనే ఉన్నా తన చెవులని తనే నమ్మలేకపోతున్నది సౌమ్య.
చాలా అసహజంగా చాలా అసహ్యంగా వుంది అతని చెబుతోంది.
ఈజ్ దిస్ మాన్ క్రేజీ?
"నువ్వంటే నాకు ఈ కొద్ది రోజుల్లోనే ఎంత క్రేజ్ ఏర్పడి పోయిందో తెలుసా?"అన్నాడు శశికాంత్ తమకంగా. "ఎప్పుడెప్పుడా అని ఉంది నాకు! క్షణమొక యుగంగా గడుపుతున్నాను!"
ఈ సారి స్థిరంగా అంది సౌమ్య.
కానీ నాకు ఆ మూడ్ లేదు.
రోషంగా చూశాడు శశికాంత్. "ఎందుకని?" నేను బాగుండనా?"
అది కాదు. మా నానగారు పోయారు. దుఃఖంతో తల్లడిల్లిపోతుంది నా మనసు అందుకని."
"సరే దుఃఖంతో మనసు తల్లడిల్లిపోతుంటే ఏం చెయ్యాలి? అదే తలచుకుంటూ, కుమిలిపోవాలా? దుఃఖం కలిగినప్పుడు దాన్ని మరచిపోవడానికి సుఖాన్ని వెదుక్కోవాలి. నువ్వూ నేను కలిసిపోవడం కంటే వేరే సుఖం ఏముంటుంది సౌమ్య?"
ఒకసారి అతనివైపు చూసి విసురుగా తల పక్కకి తిప్పుకుంది సౌమ్య.
"కమ్' అన్నాడు శశికాంత్.
"నేను రాలేను. బాగుండదు."
అతను నవ్వాడు, "నేను నీ భర్తని. నాకు బాగుంటే చాలు. ఈ లోకాన్ని మనం లక్ష్యపెట్టనక్కరలేదు."