Previous Page Next Page 
అగ్నిసాక్షి పేజి 23

 

    "నాకు ఇష్టం లేదు" అంది సౌమ్య దృడంగా.

 

    "బయటకు వెళ్ళడం ఇష్టం లేకపోతే - పోనీ ఇక్కడే - ' అని తేల్చేశాడు శశికాంత్.

 

    "ఇంట్లో అమ్మ వుంది."

 

    'మనిద్దరం ఇక్కడ వున్నామని తెలిస్తే ఇటు రాదులే. రా!" అని ఆమె చేతిని పట్టుకుని బలంగా లాక్కున్నాడు శశికాంత్.

 

    వదిలించుకోబోయింది సౌమ్య.

 

    అతను మరింత దగ్గరికి లాక్కున్నాడు.

 

    ఒక్కసారి అతన్ని విదిలించి కొట్టింది సౌమ్య.

 

    "మీరు మనిషా? మశువా? నేను ఇంత బాధలో వుంటే మీరు- " అని గొంతు స్వాధీనం తప్పుతుండగా కొంగు నోటికి అడ్డం పెట్టుకుంది.

 

    వెంటనే జేవురుమంది శశికాంత్ మొహం.

 

    నేను పశువునంటావా? నా కోపం నీకు తెలియదు. ఎవరన్నా చిన్న మాట అన్నా సహించలేను నేను. నన్ను పట్టుకుని అంతమాట అంటావా? సౌమ్యా! ఇది చాలా దూరం వెళ్ళి పోతుంది. నౌ దిస్ హజ్ బి కమ్ ఏ ప్రిస్టేజ్ ఇష్యూ. చెప్పు! నా తోటి వస్తావా రావా? ఐ కెన్ నెవర్ టెక్ నో ఫర్ యన్ అన్సర్!"

 

    ఆమె తల అడ్డంగా తిప్పుతుంటే , నీళ్ళు నిండిన ఆమె కళ్ళలో అటూ ఇటూ ఈదుతున్న చేపల్లా కదిలాయి కనుపాపలు.

 

    అంతేనా?

 

    తల వంచుకుంది సౌమ్య! ఒక పెద్ద కన్నీటి బొట్టు అతని పాదం మీద పడింది. బయటకు వచ్చి కారు స్టార్ట్ చేశాడు.

    
    ముందుకు ఉరికిన కారు కొద్ది నిమిషాల తరువాత హొటల్ ముందు ఆగింది. విసురుగా రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు శశికాంత్. తను శోభనం కోసం బుక్ చేసిన రూం రిజర్వేషన్ కేన్సిల్ చెయ్యాలని అతని ఉద్దేశం.

 

    "రూం నెంబర్ సిక్స్ టీ నైన్ ప్లీజ్ ......." అని ఇంకా ఏదో చెప్పబోయాడు శశికాంత్. మనసు ఉడికిపోతుండడం వల్ల అతని మాట సరిగా రావడం ;లేదు.

 

    అతని మాట పూర్తి కాకుండానే కీస్ తీసి అందించింది రిసేప్షనిస్ట్ "విష్ యూ ఎ హేపీ స్టే సర్! " అని చిరునవ్వుతో చెబుతూ.

 

    "నో! ఐ వాంట్ టు కేన్సిల్ ద రిజర్వేషన్" అంటున్నాడు శశికాంత్.

 

    ఇంతలో అతని భుజం చుట్టూ పులదండలా ఉన్న మృదువైన చెయ్యి పడింది.

 

    హలో శశీ!

 

    ఉజ్వల నిలబడి ఉంది అక్కడ.

 

    "వాట్ ఏ ప్లెజెంట్ సర్ ప్రైజ్! ఇక్కడ అనుకోకుండా నిన్ను మీటవుతానని అనుకోలేదు" అంది ఉజ్వల.

 

    అప్పుడు మొదటిసారిగా గమనించాడు శశికాంత్. చాలా సెక్సీగా ఉంటుందని ఉజ్వల గొంతు. నిజం!

 

    ఉజ్వలని చూడగానే చిరాకుని అణచుకుని మొహంలోకి చిరునవ్వు తెచ్చుకున్నాడు శశికాంత్.

 

    ఒక్కదానివే వచ్చావా ఉజ్వలా?" అన్నాడు పలకరింపుగా.

 

    "అవును, కాన్ఫరెన్స్ ఒకటి జరుగుతోంది ఈ హొటల్లో. నన్ను ఇన్వయిట్ చెయ్యలేదు. అయినా వచ్చాను. గ్రేట్ క్రాషింగ్ కేసు" అంది ఉజ్వల నవ్వుతూ.

 

    శశికాంత్ కూడా నవ్వాడు.

 

    "గ్రేట్ క్రాషింగా? ఏమిటంత అవసరం?"

 

    "ఈ కాన్ఫరెన్స్ నా లైన్ కి సంబంధించింది కనుక! ఇప్పుడు ఇది నీ లైన్ కూడా అనుకో? ఫార్మాన్యూటికల్స్ గురించి."

 

    "ఓహ్! ఐ.సీ" అన్నాడు శశికాంత్ సాలోచనగా.

 

    అప్పుడు అతని దృష్టిని  ఆకర్షించింది  మేడ మెట్ల దగ్గర వున్న ఒక నల్లటి నోటిస్ బోర్డు. దాని మీద తెల్లటి ప్లాస్టిక్ అక్షరాలు.

 

    "వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా! కాన్ఫరెన్స్ హాల్ ఫోర్త్ ఫ్లోర్.

 

    "ఈ కాన్ఫరెన్స్ లో చాలా యాక్టివ్ పార్ట్ తీసుకుంటుంది ఎవరో తెలుసా?" అంది ఉజ్వల మిస్టిరియస్ గా.

 

    "ఎవరు?"

 

    "కమ్ అండ్ సీ అంటూ అక్కడినుంచి కదిలింది ఉజ్వల. ఆమెతో పాటు నడిచాడు శశికాంత్.

 

    లిప్టులో పైకి వెళ్ళారు. కాన్ఫరెన్స్ హాలు వెనుక వైపు ఉన్న తలుపు నెమ్మదిగా తెరచి మెల్లిగా లోపలికి వెళ్ళి చివరి సీట్లో కూర్చున్నారు.

 

    అపుడు గమనించాడు శశికాంత్. డయాస్ మీద నిలబడి ఉద్వేగంగా వుపన్యసిస్తున్న తేజస్విని.

 

    వెంటనే ఉజ్వల వైపు తిరిగాడు శశికాంత్.

 

    వాట్ దిస్ బగర్ ఈజ్ డూయింగ్ హియర్? అన్నాడు చులకనగా యేరోగెంట్ గా.

 

    భుజాలు ఎగరేసి నవ్వింది ఉజ్వల. "నీకు తెలియదా? హీ ఈజ్ ద మూవింగ్ స్పిరిట్ బి హైండ్ దిస్ మూవ్ మెంట్. ప్రజల ఆరోగ్యమే తమ భాగ్యమని వీళ్ళు చేస్తున్న హంగామాలో ఇతను ముఖ్య పాత్రదారిట!"

 

    వాళ్ళ గొంతులు విని ముందు వరసలో కూర్చున్న నలుగరైదుగురు వెనక్కి తిరిగి 'నిశ్శబ్దం' అన్నట్లు హెచ్చరించారు.

 

    వెంటనే మాటలు మానేసి తేజస్వి చెబుతున్నది జాగ్రత్తగా వినడం మొదలెట్టారు శశికాంత్, ఉజ్వలా.

 

    "ఫ్రెండ్స్! అన్నాడు తేజస్వి. అతని గొంతులో కర్తవ్యదీక్ష ధ్వనిస్తోంది. ఫ్రెండ్స్! స్వాతంత్ర్యం వచ్చి నలభై రెండు సంవత్సరాలు దాటుతున్నా అయిదు పంచవర్ష ప్రణాళికలు పూర్తి అయినా- ఎన్నెన్నో కమిటీలు, కమిషన్ లూ, నియమించబడినా, మందులు తయారు చేసే కంపెనీలు మూడు వందల అరవై నుంచి ఎనిమిది వేలకు పైగా పెరిగినా, మందుల తయారీ మీద పెట్టుబడి పదికోట్ల రూపాయాల నుంచి ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పయ్ కోట్ల రుపాయిలకి పెరిగినా- దురదృష్టవశాత్తూ ఇదియాలో ఇప్పటిదాకా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన  సమగ్రమైన డ్రగ్ పాలసి మనకి లేదు.

 

    "మందుల తయారి ప్రజల ఆరోగ్యం కోసం అన్న ఆలోచన ఎప్పుడో పాతబడిపోయింది. మందుల తయారి అన్నదొక బిగ్ బిజినెస్ గా మారింది - తొండ ముదిరి ఉసరవెల్లి అయినట్టు. ఫ్రెండ్స్, ఫార్మాన్యూట్రికల్స్ ఇండస్ట్రి ఇప్పుడు వ్యాపారంగా కూడా కాదు, దారిదోపిడిగా మారుతోందని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. లేకపోతే ఇంటర్నేషనల్ మార్కెట్ లో కేజీ మూడొందల పన్నెండు రూపాయలకి దొరికే డ్రగ్ ఇండియాలో కేజీ ఐదువేల ఐదొందల యాభై అయిదు రూపాయలకి అమ్మడమేమిటి? అంటే నూటికి ఒక వెయ్యి ఆరొందల ఎనభై రూపాయల లాభమా?"

 

    "ఫ్రెండ్స్! ఐ రిపీట్ దిసీజ్ నాట్ బిజినెస్. దిసీజ్ హైవే రాబరి."

 

    "ఏం డ్రగ్గు అది!" అన్నాడు శశికాంత్ ఉజ్వలతో. దాదాపు ఆమె చెవి దగ్గర తన నోరు పెట్టి.

 

    "లిబ్రియమ్. డిటెయిల్స్ తర్వాత చెబుతాను" అంది ఉజ్వల.

 

    ఇంకా చెబుతున్నాడు తేజస్వి.

 Previous Page Next Page