దూరంగా- ఎవరో ఎవరికో చెబుతున్న ధైర్య వచనాలు వినబడుతున్నాయి .
ఏమయింది?
దడదడలాడే గుండెలతో మంచం దిగింది సౌమ్య.
ముందు గదిలోకి వచ్చిన సౌమ్య అక్కడి దృశ్యం చూడగానే గుండె లయ తప్పింది.
గదినిండా చెల్లా చెదురుగా పడి వున్నాయి లెఖ్ఖలేనన్ని లాటరీ టిక్కెట్లు- చెదిరిపోయిన కలల్లాగా! టేబుల్ డ్రాయర్ తెరచి ఉంది.
దానిలో కనబడుతున్నాయి కొన్ని టిక్కెట్లు. టేబుల్ మీద కూడా నాలుగైదు టిక్కెట్లు ఉన్నాయి. కుర్చీలో కూర్చుని టేబుల్ మీదికి ఒరిగిపోయి వున్నారు సుబ్రహ్మణ్యంగారు. అయన కూర్చుని వున్న భంగిమ చూసి చూడగానే సౌమ్యకి అర్ధం అయిపొయింది.
అక్కడ వున్నది కేవలం ఆయన భౌతిక కాయం మాత్రమేనని-
అందులోని హంస ఎప్పుడో ఎగిరిపొయిందనీను.
'నాన్నా' అని దిగంతాలకు వినబడేటట్లు దిక్కులు పిక్కటిల్లెటట్లు ఆమె మనసు పెట్టింది ఒక పెనుకేక.
కానీ ఆ కేక గజగజ వణుకుతున్న ఆమె పెదిమలను దాటి బయటకు రాలేదు. తడబడుతున్న అడుగులతో తండ్రి కూర్చుని వున్న తావు చేరింది సౌమ్య. తల్లి అక్కడే కూలబడి అలవికాకుండా రోదిస్తుంది.
టేబుల్ మీద ఒక ఉటకలం ఉండడం గమనించింది సౌమ్య. దాని క్యాప్ తెరచి ఉంది. పక్కనే ఒక తెల్ల కాగితం . దానిమీద అక్షరాలు.
నీళ్ళు నిండిన ఆమె కళ్ళకు అస్పష్టంగా కనబడుతున్నాయి ఆ అక్షరాలూ. పది జన్మల అనుభవాలను పదే పది అక్షరాలలో ఇమిడ్చినట్లు వయొలెట్ కలర్ సిరాతో రాసి వున్నాయి.
'ఈ జీవితం ఒక లాటరీ!"
వయొలెట్ కలర్ సిరా.
అది చూడగానే చటుక్కున స్పురణకు వచ్చింది సౌమ్యకి.
తను శశికాంత్ దనుకుని భ్రమపడి అతనికిచ్చిన లాటరీ టిక్కెట్టు మీద కూడా వయొలెట్ సిరామరక వుంది.
అంటే? ఈ టిక్కెట్టు..........
ఒక్కసారిగా మనసు క్రుంగిపోయినట్లయింది సౌమ్యకి.
అంటే ఈ టిక్కెట్టు నాన్నగారు కొన్నదా? అయన పారేసుకుంటే తనకు దొరికిందా అది? దాన్ని తను శశికాంత్ కి ఇచ్చిందా?
ఆ సంగతి తెలిసి కూడా చెప్పకుండా ఉరుకున్నారా నాన్నగారు?
వెంటనే తనకు తాళి కట్టేముందు శశికాంత్ అన్న మాటలు గుర్తు వచ్చాయి.
'నేను పుట్టిన తరువాత పెద్దమనిషి అన్నవాడిని చూడలేదు సౌమ్య!"
నాన్నగారూ పెద్దమనిషి కాదా?
నాన్నగారికంటే పెద్దమనిషి ఎవరుంటారు ఈ లోకంలో?
జరిగిందేమిటో లీలగా అర్ధమయింది సౌమ్యకి.
తనకు ఎలా పెళ్ళి చెయ్యాలా అన్న సమస్య నాన్నగారిని భూతంలా పీడించడం మొదలెట్టింది. లాటరిలో లక్షలు వస్తే కూతురి పెళ్ళి చేయవచ్చునన్న భ్రమలో అయన లాటరీ టిక్కెట్లు కట్టలు కట్టలు కొనడం మొదలెట్టారు.
ఒక టిక్కెట్టుకి లక్షలు వచ్చాయి. కానీ ఆ టిక్కెట్టు పోగొట్టుకున్నారు అయన. అది తనకు దొరికింది. తను శశికాంత్ కి ఇచ్చింది. ఆ సంగతి తెలిసి కూడా ఆ టిక్కెట్టు తనదని చెప్పలేకపోయారు నాన్నగారు.
కానీ అయన మనసులో చెలరేగిన తుఫాను ని అంచనా వెయ్యగలదు తను.
ఆ టిక్కెట్టు గనక పోకుండా ఉంటె అయన బీదరికం తాలూకు బిగి కౌగిలి నుండి బయటపడేవారు. ఒకటికి పది సంబంధాలు చూసి, వాటిలో మంచి సంబంధం సెటిల్ చేసి తనకు పెళ్ళి చేసి వుండేవారు.
డబ్బు లేకపోవడం వల్లనే అయన తొందరపడి, వచ్చిన మొదటి సంబంధాన్నే పైనలైజ్ చేశారు.
ఆ తరువాత తెలిసింది తమకు, శశికాంత్ ఎలాంటివాడో.
అగ్నిపర్వతం రాజుకుని ఉంటుంది నాన్నగారి మనసులో. కానీ పెళ్ళయేదాకా దాన్ని అణిచిపెట్టుకోగాలిగారు.
కానీ పెళ్ళి తంతు పూర్తయ్యాక ఇక ఆక్రోశాన్ని ఆపుకోలేకపోయి వుంటారు అయన. కొలాప్స్ అయిపోయి ఉంటారు.
నిశ్చేష్టులరాలయి అలాగే నిలబడి పోయింది సౌమ్య. ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి.
"నా మహారాజు నన్నొదిలి వెళ్ళిపోయాడు దేవుడో!" అని ఏడుస్తోంది శారదమ్మ.
అప్పటికే అక్కడికి వచ్చిన ఇరుగు పొరుగు వారు ఆమెని ఒడారుస్తున్నారు .
నిస్సత్తువుగా తల్లి పక్కన కూలబడిపోయింది సౌమ్య. మరుక్షణంలో తల్లి కూతుళ్ళు ఇద్దరూ ఒక్కళ్ళ నొకళ్ళు కౌగలించుకొని విలపించడం మొదలెట్టారు.
ఎవరో శశికాంత్ కి కబురు పెట్టారు.
అతను హడావుడిగా వచ్చాడు. అంతలోనే తెల్లారిపోయింది. అంత్యక్రియలకు ఏర్పాట్లు మొదలయ్యాయి.
పీడకలని కంటున్నా దానిలాగా ఇదంతా చూస్తోంది సౌమ్య.
ఆ రోజు అపర్ణాహం అవుతుండగా అనిపించింది ఆమెకి.