"ఏమిటి? ఏమయింది?" అన్నాడు శ్రీరాం కలవరపడుతూ.
"ప్రతిమ...పద....వెళుతూ చెబుతాను!"
రెండు అంగల్లో వచ్చి కార్లో కూర్చున్నాడు శ్రీరాం.
"వో మై గాడ్! ఎలాంటి తండ్రులు ఉంటారీ లోకంలో!" అంది శృతి పమిట కొంగుతో మొహానికి పట్టిన స్వేదం తుడుచుకుంటూ.
"శృతీ! ప్రతిమ...కులాసానేనా?" అన్నాడు శ్రీరాం అతని గొంతు బొంగురు పోయింది.
"చావలేదు బతికే ఉంది బతికి ఉండగానే శ్రాద్ధం పెట్టేస్తున్నాడు వాళ్ళ నాన్న."
"ఏమిటీ?" అన్నాడు శ్రీరాం తెల్లబోతూ.
"అది ఇంక తన కూతురు కాదుట. తను రిజిస్ట్రార్ ఆఫీసులో ఎప్పుడు సంతకాలు పెట్టిందో అప్పుడే చచ్చిపోయినట్లు లెక్కట! అందుకని పురోహితులని పిలిచి శాస్త్రోక్తంగా..."
శ్రీరాం పిడికిళ్ళు బిగుసుకున్నాయి. వాటి ప్రైజర్ కి స్టీరింగ్ వీల్ విరిగి పోతుందేమోనని భయం వేసింది శృతికి.
"అటు కాదు మా ఇంటికి పోనియ్ కారు. ప్రతిమని మా ఇంట్లో ఉంచి వచ్చాను." అంది.
విసురుగా టర్న్ చేశాడు శ్రీరాం. కారు రొదపెడుతూ దాదాపు రెండు చక్రాల మీదే లేచి మలుపు తిరిగింది.
అతని వాలకం చూసి భయపడింది శృతి. ఆవేశం తగ్గకపోతే ఆముడ్ లో అతను ఏం చేసేస్తాడో అని బెదిరిపోయింది.
"శ్రీరాం! కంట్రోల్ యువర్ సెల్ఫ్! ప్రతిమకి ఏమీ కాలేదు కదా! కూల్ గా ఏం చేయాలో ఆలోచిద్దాం! తొందర పడిపోకు! ప్లీజ్!" అంది.
శ్రీరాం సమాధానంగా ఆక్సిలేటర్ ని మరింత బలంగా నొక్కేశాడు. వెర్రెత్తినట్లు పరిగెడుతూంది కారు.
నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది శృతి.
శృతి వాళ్ళ ఇంటి ముందుదాకా ఒకే వేగంతో స్లో చెయ్యకుండా వచ్చి, అక్కడ సడెన్ బ్రేకుతో కారాపాడు శ్రీరాం.
"శృతీ! క్విక్! ప్రతిమని తీసుకురా! వెళ్ళిపోదాం!"
"ఎక్కడికి?"
"ఫర్ హెవెన్స్ సేక్!" అన్నాడతను అసహనంగా.
ఇంక మారు చెప్పడానికి భయపడి, త్వరత్వరగా ఇంట్లోకి వెళ్ళిపోయి, కొద్ది నిమిషాల తరవాత ప్రతిమతో తిరిగి వచ్చింది శృతి.
ప్రతిమ మొహం వాడిపోయి ఉంది. నలిగిపోయిన చీరె కట్టుకుని ఉంది. పొద్దున లేచి స్నానం చేసినట్లు లేదు. జడ వదులై, జుట్టు మొహం మీద పడుతూంది.
అయినా చెప్పలేనంత అందంగానే ఉంది ప్రతిమ.
"ప్రతిమా!" అన్నాడు శ్రీరాం ఆర్ద్రంగా. "కమాన్! కారెక్కు! నో ఫియర్ బేబీ! నో ఫియర్!"
బాక్ సీట్లో శృతి పక్కన కూర్చుంది ప్రతిమ. కారు స్టార్టు చేశాడు శ్రీరాం.
"ఎక్కడికి?" అంది శృతి అనుమానంగా.
"హోటల్ బంజారాలో రూం బుక్ చేద్దాం. అక్కడే ఉంటుంది ప్రతిమ కొన్నాళ్ళు." అన్నాడు శ్రీరాం. డబ్బుతో ఏదైనా చేసెయ్యగలననే ధైర్యం ఉంది అతనికి.
"నా మొహమేం కాదూ? హోటల్లేదూ, గీటల్లేదూ! నేరుగా మీ ఇంటికి పోనియ్ కారు!"
ఒక్క క్షణం ఆలోచించాడు శ్రీరాం. "అలా చేద్దామంటావా? సరే! కానీ ఇంటికెళ్ళే ముందు ఒక్కసారి" అంటూ కారుని ఒక సందులోకి టర్న్ చేశాడు.
అది ప్రతిమా వాళ్ళ వీధి.
చలనం లేకుండా స్థంభించి పోయినట్లు కూర్చుని ఉంది ప్రతిమ.
"ఇటెందుకు? వద్దు, శ్రీరాం! ఇంటి కెళ్ళిపోదాం పద!" అంటూంది శృతి.
ప్రతిమ వాళ్ళ ఇంటికి కొద్ది దూరంలో కారు స్లో చేశాడు శ్రీరాం.
అక్కడ చాలా హడావిడిగా ఉంది. ఇంటిముందు పెద్ద గుంపు పోగయి ఉంది. ఆ చుట్టు పక్కల ఉండే జనమంతా చేరి, పైసా ఖర్చు లేని ఈ వినోదం చూస్తున్నారు. మంత్రాల ఘోష వినబడుతూంది. కానీ ఈ పట్టుదలలూ, పంతాల మధ్య నలిగిపోతూ, తమ జీవితాల మీద తమకే అధికారం లేకుండా బతుకుతున్న ప్రతిమలాంటి ఆడకూతుళ్ళ ఘోష మాత్రం ఎవరికీ వినబడటం లేదు.
నిజంగానే ప్రతిమ చనిపోయినంత ఇదిగా, శాస్త్రానికి ఏ మాత్రం ఢోకా లేకుండా కర్మకాండ జరిపిస్తున్నాడు కేశవరావు.
ప్రతిమ నిశ్చలంగా చూస్తూంది.
శృతి జీవం లేకుండా నవ్వింది.
"ప్రతిమ అదృష్టవంతురాలు! కార్లో కూర్చుని తన అంత్యక్రియలు తనే చూసుకునే భాగ్యం ఎంతమందికి కలుగుతుంది!" అంది.
మాట్లాడకుండా గేరు మార్చి, కారు వేగంగా ముందుకు పోనిచ్చాడు శ్రీరాం.
శ్రీరాం వాళ్ళ ఇల్లు సమీపించగానే, గేటు ముందరే కారు ఆపెయ్యమంది శృతి.
"ప్రతిమ మీ ఇంట్లో అడుగు పెట్టడం ఇదే మొదటిసారి. పెద్దవాళ్ళకేమన్నా పట్టింపులుంటాయేమో వర్జ్యం గిర్జ్యం అని. ఒక్కసారి పిన్నితో చెప్పి వస్తాను."
"ఏదో చెయ్!" అన్నాడు శ్రీరాం.
శృతి లోనికి వెళ్ళింది.
పూజ చేసుకుంటున్న సరస్వతి శృతి కంగారు చూసి వెంటనే లేచి వచ్చి, తను చెప్పినదంతా శ్రద్దగా విన్నది.
"ప్రతిమ పరిస్థితి చాలా దుర్భరంగా అయిపోయింది, పిన్నీ! ఇంక ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేక, చెప్పులు కూడా వేసుకోకుండా బయటికి వచ్చేసింది. మా ఇంట్లో కొన్నాళ్ళు ఉంచుకుందామా అంటే నీకు తెలుసుగా అన్నయ్యకి అసలే నేనంటే కోపం. శ్రీరాం ప్రతిమ కోసం హోటల్ రూం బుక్ చేస్తానన్నాడు. అది మర్యాద కాదని చెప్పి ఇలా తీసుకొచ్చేశాను. ఇందులో ఏదన్నా తప్పు ఉంటే అదంతా నాదే, పిన్నీ!" అంది, క్షమాపణ చెబుతున్నట్లు.
"హోటల్లో ఉంచుతానన్నాడా ఆ అమ్మాయిని? వాడి మొహం! ఏళ్ళొచ్చాయి కానీ మంచీ మర్యాదా తెలియదు శ్రీరాంకి. మంచి కాలం! నువ్వు పక్కన ఉండబట్టి సరిపోయింది." అంది సరస్వతి.
శృతి మనసు తేలికయింది. పిన్ని ఏం కోప్పడుతుందో అని ఇందాకటి నుంచీ భయపడుతూంది తను...