"ఫాల్టు యిక్కళ్ళేదు. పక్కగదిలో కూడా టెస్ట్ చెయ్యాలి" అన్నాడు.
రాంపండు ముందు నడవబోయాడు. "నువ్విక్కడే వుండు" అన్నాడు అతను.
ఎందుకంటే.....
అతను అర్జెంటుగా సితారతో మాట్లాడెయ్యాలి.
రాంపండు పక్కనుంటే అది కుదరదు, అందుకని.
రాంపండు గుడ్లగూబలా చూస్తూ అక్కడే ఆగిపోయాడు. తనొక్కడే పక్కగదిలోకి నడిచాడు జెయ్ చంద్ర.
అక్కడున్న సితార అతన్ని మింగేసేటట్లు చూసింది. ఆమె తప్పించుకుని దూరంగా వెళ్ళిపోవడానికి యింక రూముల్లేవు.
"నీకు అక్కాచెల్లెళ్ళు లేరూ?" అంది మంటగా.
"లేరు! కనీసం లవర్ కూడా లేదు యిప్పటిదాకా" అన్నాడు ఫ్రాంక్ గా.
"నిన్ను ఏ ఆడపిల్లా లవ్ చేయదు!" అంది సితార అసహ్యంగా చూస్తూ.
"అందుకే నువ్వు కాస్త సాయం పట్టాలి!"
"అంటే నేను ఆడపిల్లను కానా?"
"కాదు!"
"ఏమిటి నీ వుద్దేశ్యం?"
"నువు సాదాసీదా ఆడపిల్లవుకాదు! భూమ్మీద నడిచే దేవతవి."
"దీన్నే సెంటు కొట్టడమంటారు."
"ఒట్టు! నేను సెంటు కొట్టట్లేదు. నేను నమ్మిన మహత్తరసత్యాన్ని చెబుతున్నాను."
"నువ్వంటే నాకెలర్జీ!"
"కానీ.....నువ్వంటే నాకిష్టం."
'నువ్వు పరమ డబ్బు పిశాచానివి."
"నువ్వు కిన్నెరవి."
"నువ్వు కింపురుషుడివి"
"నువ్వు యక్షిణివి"
"నువు గంధర్వుడివి" అని ఠక్కున ఆగి-
"ఏదో వాగేస్తున్నాం! నువ్వంటే నాకు అలర్జీ" అంది మళ్ళీ.
"ఎందుకని?" అన్నాడు జెయ్ చంద్ర.
"మీ డబ్బున్న వాళ్ళందరూ నరరూప రాక్షసులు."
"అని నీవనుకుంటున్నావు!"
"మీ అమ్మ డబ్బు దాహం వల్లే మా అమ్మ చచ్చిపోయింది."
"అయామ్ వెరీ వెరీ సారీ! శేషు నాకంతా చెప్పాడు. నేను నిజంగానే ఆ విషయంలో చెప్పలేనంత బాధపడుతున్నాను. సిగ్గుపడుతున్నాను. కానీ నేనేం చేయను? అది నా తప్పు కాదుగదా!" అన్నాడు జెయ్ చంద్ర అపాలజెటిక్ గా.
"అయినాసరే! నువ్వు ఆ డబ్బు పిశాచానికి పుట్టిన బ్రహ్మరాక్షసుడివి" అంది సితార.
"పిశాచాలకు రాక్షసులు ఎలా పుడతారు?" అని పాయింట్ లాగాడు అతను.
"నువు ఎలాగోలా పుట్టేవుంటావు"
"ఐస్సరబజ్జా! దొరికింది ఇంకో పాయింటు"
"ఏం పాయింటు?" అంది సితార.
"పిశాచాలకు పిశాచప్పిల్లలు కాకుండా బ్రాహ్మరాక్షసులు కూడా పుట్టొచ్చని నువ్వే అన్నావుగా?"
"అయితే?" అంది సితార అనుమానంగా.
"పిశాచాలకి బ్రహ్మరాక్షసులే పుట్టినప్పుడు మంచి మనుషులు కూడా పుట్టొచ్చుగా? మా అమ్మ నీ దృష్టిలో పిశాచం కావచ్చు. కానీ నేను ఆమె కడుపున పుట్టినంత మాత్రాన పిశాచాన్నీ, రాక్షసుడినీ కాను. మామూలు మనిషిని నేను."
"నీది వితండవాదం. నేన్నమ్మను"
"పోనీ ఇంకోలా చెప్తా" అన్నాడు అతను.
"వద్దు" అంది సితార.
అది వినకుండా అన్నాడతను -
"ముందిది చెప్పు. మీ అమ్మా నాన్నా మనుషులా? దెయ్యాలా?"
"మనుషులే! దెయ్యాలెందుకవుతారు?"
"మరి వాళ్ళ కడుపునా దేవతలాంటి నువ్వు పుట్టలేదూ....? అలాగే నేనూను."
ఈ అర్గ్యుమెంట్ కి ఇంక తిరుగులేకపోయింది. సితార పెదవులు దొండపండ్లలా వుంటాయి. ఆ పెదవుల ఆగ్నేయమూలన ఓ సిరినవ్వు మెరిసింది.
ఈ లోపలే రాంపండు అక్కడికి వచ్చేసి తన అలవాటు ప్రకారం చూస్తూ నిలబడ్డాడు.
"ఏమిటి?" అన్నాడు జెయ్ ఒళ్ళుమండి.
"మా బావ పోలీసు" అన్నాడు రాంపండు బద్దకంగా.
"ఐతే?" అన్నాడు జెయ్ చంద్ర.
"ఏమ్లే! పోలీసని చెప్పా! అంతే" అని అక్కన్నుంచి అదృశ్యమైపోయాడు రాంపండు.
సితార కూడా డిటో అయిపోయింది.
మూడ్ పాడయిపోయి సైలెంట్ గా కిందికి వచ్చేశాడతను.
అలా అనడంలో రాంపండు ఉద్దేశ్యం ఏమిటి?
ఎందుకలా అన్నాడువాడు? వాళ్ళ బావ పొలీసయితే తనకేం, వాళ్ళ బాబు ఇన్స్ పెక్టర్ జెనరల్ అయితే తనకేం?
తను సితారని మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, పంచభూతాలసాక్షిగా, భూతాలెందుకుగానీ, దేవుడి సాక్షిగా ప్రేమించేస్తున్నాడు.
దీనికి ఎవరన్నా అడ్డం వస్తే వాళ్ళని అడ్డంగా నరికేస్తాడు.
ఇదే తన ఫైన్లా!
ఈ లోగా సమాధానంలాగా శేషుకి పైనుంచి కబురువచ్చింది.
"అతగాడంటే నాకు ఎలర్జీ! ఆ సంగతి అతడికి అర్ధమైనట్లు లేదు. అర్ధమయ్యేలా చెప్పు" అంది అప్పటికి అరవై ఆరోసారి.
వింటున్న శేషు మొహం రావుగారి మొహంలా గంభీరంగా అయిపోయింది.
"హ్హు" అని నిట్టూర్చాడు శేషు.
"ఏమిటి?" అంది సితార.
"నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడు సీతారామలక్ష్మీ! ఆ దేవుడు కూడా క్షమించడు" అన్నాడు శేషు మరింత గంభీరంగా గొంతుపెట్టి.