పెళ్ళికొడుకు పేరు విశ్వం. అతని తల్లి తండ్రి భూమికి నాలుగడుగులేత్తునే వున్నారు. సీతని చూడటానికి వాళ్లు ముగ్గురూ వచ్చారు. తల్లి తండ్రి కొడుకుతో మాట్లాడాలంటే పూర్తి తల పైకెత్తల్సిందే. ఆ కొడుకు పూర్తి తలదించి వీళ్ళకి జవబివ్వాల్సిందే. ఒక్కడే కొడుకేమో ప్రతి మాటకి అరిగిపోతాడేమో అన్నట్లు అడ్డుతగలటమే. అది ముద్దుగా "విస్సూ!" అంటూ వాళ్ల రూపాలే గాక మాటలు తమాషాగా వుండటం రాజుని ఆకర్షించాయి.
"మొదలు పెడుతున్నాను. నిశ్శబ్దం నిశ్శబ్దం ప్రేక్షకులు మౌనంగా బిగిసిపోయి, నీలుక్కుపొయి కుర్చోవలెను. మీరు పైకి నవ్విన మా విద్యకు అంతరాయం కలుగును. అలా కలిగినచో ఇది ఇప్పుడే అంతమౌను" అన్నాడు రాజు.
రాజు అటూ యిటూ పచార్లు చేస్తూ చేతులుపుతూ గొంతు బిగబెట్టి చెపుతుంటే అందరికి నవ్వొచ్చింది.
"పెళ్ళికుమారుడు విశ్వానికి అక్కని మాట్లాడించాలని కోరిక. అందుకే ఏదో ఆమాట మాట్లాడంగానే కొడుకెక్కడ అరిగిపోతాడో అని అ తల్లి తండ్రి కంగారుపడి అడ్డు తగిలేవాళ్ళు. అతనెలా ప్రశ్నలేశాడు. తల్లి తండ్రి ఎలా అడ్డు తగిలారన్నది. నా ప్రదర్శనలో మొదటి భాగం" అని రాజు గొంతు సవరించుకున్నాడు.
"మీ పేరు సీతదేవా! సీతామాలక్ష్మా?" పెళ్ళికొడుకు ప్రశ్న.
"నేనడుగుతాలే నాన్నా విస్సూ" తల్లి ప్రేమ.
"ముందే అడగాలని తెలిదటే!" తండ్రి చిరుకోపంతో మందలింపు.
"పి.యు.సి.తో చదువాపారేమిటి చదువంటే యిష్టంలేకనా పరిస్థితులకి తలయోగ్గా?" పెళ్ళికొడుకుగారి మరో ప్రశ్న.
"నాన్నా విస్సూ! నే అడుగుతాలేమ్మా" తల్లి ప్రేమ.
"అబ్బాయి అడిగేలోగా అడగాలని తెలిదుటే" అ తండ్రికి చిరుకోపంతోనే మందలించటం వచ్చు. అలాగే మందలించాడు.
ఆ విస్సూ ఉస్సురంటూ మాటలాపేశాడు.
ఇందాక అతడాడిగిన ప్రశ్నలే సీతని అడిగి ఆపై "నాన్నా విస్సూ! నువ్వేమయినా అమ్మాయి నడగాలంటే అడుగు" అంది ఆ తల్లి.
మళ్ళి మాములే రెడ్డొచ్చె మొదలాడు కథలా.
"సినిమాలంటే బాగా యిష్టమేనా? తెలుగువా? ఇతర భాషలవి కూడా చూస్తుంటారా? పెళ్ళికొడుకు ప్రశ్న.
"నాన్నా విస్సూ! నే అడుగుతాలేమ్మా!" తల్లి ప్రేమ.
"ముందుగా నీవే అడగక్కరలా?" తండ్రి మందలింపు.
రాజు వాళ్ళలా అనుకరిస్తూ గొంతు మార్చి మాట్లాడుతుంటే రామచంద్రంకి నవ్వొచ్చింది. సీత వేపు చూశాడు. సీత మూతికి చీర కొంగు అడ్డు పెట్టుకుని నవ్వుతున్నది. రూప జయ సరేసరి పైకే నవ్వుతున్నారు.
రాజు కాసేపు నిన్నటి పెళ్ళి వాళ్ళ ఫార్సు ప్రదర్శించి ముగించాడు. తండ్రేమి కోపగించుకోలేదని గ్రహించి "ఎలా వుంది నాన్నా!" అడిగాడు.
"అబ్బాయి కాస్త పొడుగు తప్ప మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఒక్కడే కొడుకని నిన్నటిదాకా కాస్త మురిసిపోయాను. వాళ్ళ మాటలు నిన్న వినంగానే నాకేమిటోగా అనిపించింది. ఈరోజు నీ అనుకరణ విద్యతో తేటతెల్లమయింది అబ్బాయికి ప్రశ్నలేయటంతప్ప అ ప్రశ్నలో బలము, విలువలేదు. ఆ తల్లితండ్రికి మాట్లాడితే కొడుకెక్కడ అరిగిపోతాడోననే బెంగ తప్ప మరొకటి తెలియదు. రికార్డు అరిగిపోయి ఒకే మాటదగ్గర గిగీ అంటుంటుందిలే అలా ఒకేమాట గీ పెట్టటం" అన్నాడు రామచంద్రం.
"కరెక్ట్ నాన్నా! నే గ్రహించింది ఇదే. వాళ్ళలో వున్న ఆ ప్రత్యేకతే నా విద్యకి సరిపోయింది" రాజు ఉత్సాహంగా అన్నాడు.
"ఈ సంబంధం కొన్ని విధాల మంచిదయినా నాకెందుకో నచ్చలేదు. కారణం యిప్పుడు బాగా తెలిసింది లిస్టులోంచి దిన్ని కొట్టేయాల్సిందే.
"ఏదో ఓ వంకన అన్ని సంబంధాలు ఇలా వదులుకుంటే ఎలా? అంది రూప.
పెద్ద అరిందలా రూప అలా అనటం రామచంద్రంకి నచ్చలేదు.
"నీ బదేమిటి మధ్యలో" అన్నాడు కాస్త విసుగ్గా"
రూప గతుక్కుమంది. "అక్క పెళ్ళి అలస్యమవుతున్నదని .....అంటూ ఆగింది.
"అలశ్యమయితే కొంపలేమీ అంటుకు పోవు. అడ్డమైన వెధవలకి యిచ్చి చేయటానికి నా బంగారు తల్లికి కలోంకరా! కన్నోంకరా! సీత ముఖంలో కళకి ఎవరూ సాటిరారు. ఏ అదృష్టవంతుడో యింకా బైట పడలేదు." గర్వంగా అన్నాడు రామచంద్రం.
"అక్క తెల్లని తెలుపు కాకపోయినా చూడంగానే అందంగా ఆకర్షనణియంగా వుంటుంది. కాళ్ళల్లో భలే కళ వుంది" అన్నాడు రాజు.
"పెద్దక్క బాగుంటుంది గాని రుపక్క యింకా బాగుంటుంది అంది జయ. తనూ ఏదోఒకటి మాట్లాడకపోతే బాగుండదన్నట్లు.