Previous Page Next Page 
మధుమాసవేళలో ... పేజి 22

 

    "తిక్కవరపు తిమ్మరాజుగారు....." బామ్మగారు మాట పూర్తిచేయకముందే "ఓ....ఆయనా! మా పెదనాన్నగారు, మీకు తెలుసా బామ్మగారూ?" అన్నాడు రామదూత.
    
    "అవురా! తిమ్మరాజుగారు మీ పెదనాన్నా! ఈ మాటముందే చెప్పావు కాదేంబాబూ! ఆయన నాకెలా తెలుసు అడుగు. మా వూళ్ళో గుండు భీమన్నగారి మూడో అమ్మాయి జలజాక్షిని చూడటానికి మంత్రి ప్రగడ మాధవరావు గారొచ్చినప్పుడు ఆయనతో మీ పెదనాన్నగారు అదే తిమ్మరాజుగారు వచ్చారు. ఆపూట భోజనాలు మా ఇంట్లోనే జరిగాయి" అంది బామ్మగారు.
    
    బామ్మగారి జ్ఞాపకశక్తికి జోహారులర్పించాడు రామదూత.
    
    జలజాక్షి కెన్ని సంబంధాలొచ్చింది, ఎన్నేళ్ళదాకా పెళ్ళికాంది బామ్మగారు చెపుతుంటే సౌభాగ్యమ్మ,శారదాంబ బుగ్గన వేలేసుకుని వింటూ కూర్చున్నారు. తాత్కాలికంగా రామదూతని మర్చిపోయారు.
    
    "మీకు మ్యారేజీ కాలేదా?" అడిగాడు చక్రవర్తి.
    
    ఈ ప్రశ్న వినంగానే నిఠారుగా నిలబడి కర్రలా బిగుసుకుపోయాడు రామదూత. రోమాలు నిక్కబొడుచుకున్నాయి కళ్ళు తడి తడి అయ్యాయి. కంఠం బొంగురు పోయింది" అడిగారు కాబట్టి చెప్పక తప్పదు. నాదో విషాద ప్రణయగాధ, నే కాలేజీలో చదువుకునేరోజుల్లో..."
    
    "పిల్లికూతలు గాడిద అరుపులు ప్రారంభిద్దామా?" చక్రవర్తి గుసగుస లాడుతూ అడిగాడు.
    
    "పిచ్చివేషాలు మొదలుపెట్టకు చక్రీ! ఇది కాలేజీ కాదు పబ్లిక్ గార్డెను కాదు. పైగా సూర్యపుత్రి ఇక్కడే వుంది. కొంప ఖాళీ చెయ్యమంటుంది." మదన్ గోపాల్ భయం భయంగా వైజయంతిని చూస్తూ అన్నాడు.
    
    "ఈ కొంప గోలొకటి" నిమ్మదిగా విసుక్కున్నాడు చక్రవర్తి.
    
    "వాళ్ళిద్దరూ తెగ గుసగుస లాడుకుంటున్నారు. మన గురించి కాదుకదా?" మోచేత్తో త్రిలోకసుందరి డొక్కలో పొడిచి చెవిలో ఊదింది వైజయంతి.
    
    "మన గురించి కాదులే" అంది త్రిలోకసుందరి.
    
    "గ్యారంటీ ఏమిటి?
    
    "రామదూతగారి ప్రణయగాధ గురించి."
    
    "అంతేనంటావా?" నీరుగారిపోతూ అంది వైజయంతి.
    
    "అంతేగాక!" అంది త్రిలోకసుందరి.
    
    "అంతే అప్పటినుంచీ నేను ప్రేమ పెళ్ళిగురించి ఆలోచించటం మానేశాను. సంసారసాగరంలో దూకదల్చుకోలేదు. బ్రహ్మచారిగా వుండి ప్రజాసేవచేద్దామని ఓ స్థిర నిర్ణయానికొచ్చాను. నాకు వివాహం కాకపోవటానికి సో సారీ! నే పెళ్ళి చేసుకోకపోవటానికి ఇదీ కారణం" అంటూ ముగించాడు రామదూత.
    
    "ఆయన ప్రణయగాధ నువ్విన్నావా?" చక్రవర్తి అడిగాడు.
    
    "నువ్విననిస్తేగా! గాడిదా ఓండ్రపెట్టిన కుక్కలా భే....భే.... మననా అంటువ్యాధిలోగోల." విసుక్కున్నాడు మదన్ గోపాల్.
    
    "సారీరా బ్రదర్!" అన్నాడు చక్రవర్తి.
    
    "రామదూతగారి కాలేజీ చదువులవరకూ యిన్నాను. ఆపై ఆయన చెప్పింది నువ్విన్నావా?" వైజయంతి అడిగింది.
    
    "నువ్విననిస్తేగా? మగపురుగులు మన గురించి వాగుతున్నాయని పనికిమాలిన ప్రసంగం చేస్తివి. మన మాటల మధ్యలో ఆయన ప్రణయగాధ అయిపోయింది. ఇప్పుడు అఘోరించి ఏంలాభం?" మెత్తమెత్తగా చివాట్లు పెట్టింది త్రిలోకసుందరి.
    
    పొరపాటయిపోయిందన్నట్లు నాలుక్కొరుక్కుంది వైజయంతి.
    
    రామదూత అందరికీ కాఫీలిచ్చి తలో త్రివేణి వక్కపొడి అందించాడు.
    
    "నేను మీవాడిని. మీరంతా నా ఆప్తులు శ్రేయోభిలాషులు. ఇహపై మనసంతా ఒకటి. నామాట మన్నించి అందరూ వచ్చినందుకు ముకుళిత హస్తాలతో ధన్యవాదాలు తెలుపుతున్నాను. సభ ఇంతటితో సమాప్తం" అన్నాడు రామదూత.
    
    పొలోమంటూ లేచారు అందరూ.
    
    "పేరు ప్రఖ్యాతులతో నూరేళ్ళు జీవించు నాయనా?" అంది బామ్మగారు.

 Previous Page Next Page