అందరూ చాపలమీద కూర్చున్నారు. ఆపై అందరూ గదంతా పరికించి చూశారు. ఆంజనేయస్వామి సంజీవపర్వతం ఎత్తుకొస్తున్న క్యాలెండరు తప్ప మిగతావన్ని రామదూత ఫోటోలు గోడలని అలంకరించివున్నాయి. ఓ చేతిలో పొడుగాటి ఖడ్గం వుంది. ఆ ఖడ్గం మొన రామదూత కుడికాలు చచ్చినపులి పొట్టమీద నొక్కివున్నవి. రామదూత ఆకాశంవైపు చూస్తున్నాడు. అదొక ఫోటో. నిలువెత్తు దండతో కలర్ ఫోటో. క్రైమ్ చిత్రాల్లో డిటెక్టివ్ లా చేతిలో రివాల్వర్ తో ఫోజిచ్చిన ఫోటో రకరకాల మేకప్ తో నూరువేషాలతో కొన్ని ఫోటోలు వున్నాయి.
"ప్రస్తుతం నన్నుగురించి మీ అందరికి చెప్పాలనే సదుద్దేశ్యంతో ఈ సభ ఏర్పాటుచేశాను. గది అంటే బాగుండదని దీనిని సభ అనటమే సరియిన న్యాయమని ఈ సరికి మీరు గ్రహించేవుంటారు..." అని ఆగాడు రామదూత.
"గ్రహించితిమి. డిటెక్టివ్ మహాశయా!" అన్నాడు చక్రవర్తి.
"సంతోషము. సంతోషము" అన్నాడు రామదూత.
రామదూత వయసు నాలుగుపదులు దాటేసింది. తల మీద జుట్టు పల్చబడింది. ఉన్న క్రాపునే పైకి ఎగదువ్వాడు సన్నగా పొట్టిగా ఉఫ్ అని ఊదితే గాలిలో కెగిరేటట్లున్నాయి. ఆయన రంగే అంతోలేక వంట్లో రక్తం లేదోగాని కొత్తగోడ కొత్తగా సున్నం కొట్టించిన రంగులా తెల్లగా తెసుకారుతూ వున్నాడు. మల్లెపువ్వులాంటి తెల్లపైజమా తెల్లలాల్చీతో పిండిబొమ్మలా వున్నాడు. కళ్ళకి భూతద్దాల జోడుంచి అద్దాలమందం అరంగుళం వుంది. మొత్తానికి చూడంగానే విచిత్రం రామదూత రూపం. కంఠస్వరంకూడా చిత్రమే కీచుగా వుంది.
రామదూత నుంచున్నవాడు నుంచున్నట్లే వెనక్కు జరిగి గోడ దగ్గరకు వెళ్ళి స్టడీగా నిలబడ్డాడు. గొంతు సవరించు కున్నాడు.
రామదూత ముందు మైక్ లేదుగాని స్టేజీయెక్కి మైకు ముందు మాట్లాడుతున్నట్లే ఫోజుపెట్టి నిలబడ్డాడు. ఇది అక్కడున్న అందరు గమనించారు.
"సోదర సోదరీమణులారా! గౌరవనీయులయిన పెద్దలారా!" అంటూ కాస్త ఆగి అందరి ముఖాలు చూశాడు రామదూత.
అక్కడ కూర్చున్న అందరూ ఒకరిముఖం ఒకరు చూసుకున్నారు.
"నా గురించి నేను చెప్పుకోటం బాగుండదు. అయినా నాగురించి మీకు తెలియాలి కాబట్టి చెప్పటానికి నా తరపున ఎవరూ లేరుకాబట్టి. ప్రాక్టీసు పెరగనందున ఇంకా అసిస్టెంటుని పెట్టుకోలేదు కాబట్టి నేనే చెపుతున్నాను. మా ఇంటిపేరు తిక్కవరపువారు. అనగాటి అన్నమాట. నాపేరు రామదూత. నా వృత్తి ప్రైవేటు డిటెక్టిఉ. మీకే అవసరంవచ్చినా ఆపద కలిగినా అపరాత్రి అర్దరాత్రి అయినాసరే మీరొచ్చి నన్ను లేపండి. నా మేధస్సు ఉపయోగించి నా తెలివి ప్రయోగించి ధైర్యంగా పోరాడి మీకొచ్చిన ఆపదని ఎదురుకుంటాను. ముందే చెపుతున్నాను. తోచినవాళ్ళు ఏదయినా ఇవ్వొచ్చు. ఇవ్వకపోయినా ఫరవాలేదు. ప్రజాసేవ చేయటమే నాలక్ష్యం. ఆపదలో ఆదుకోవటమే నా నైజం. నా గురించి ఇంతకన్నా ఎక్కువ చెప్పి మిమ్మల్ని విసిగించదల్చుకోలేదు. మీకేమైనా అనుమానాలుంటే అడిగితీర్చుకోండి" అంటూ ప్రఖ్యాత ప్రైవేటు డిటెక్టివ్ రామదూత [T] తన ఉపన్యాసం ముగించాడు.
రామదూత ఎప్పుడయితే తన ఇంటిపేరు తిక్కవరపు వారని చెప్పాడో అప్పుడే బామ్మగారి కళ్ళముందు దొండపాడు సుబ్బయ్యగారి వియ్యంకుడు తిక్కవరపు తిమ్మరాజుగారు గుర్తొచ్చారు.
"నాయనా! రామదూతా!" అంది బామ్మగారు.
"గౌరవనీయులయిన బామ్మగారా! ఏమిటి? ఏమిటి?" అన్నాడు రామదూత.