Previous Page Next Page 
మధుమాసవేళలో ... పేజి 23

 

    "మీ ఆశీస్సు నాకు నూరుటన్నుల బలంచేకూర్చుతుంది. మహాసంతోషం" అన్నాడు రామదూత.
    
    అందరూ శలవు పుచ్చుకుని గదిలోంచి బైటికొచ్చారు.
    
    "ఈమధ్య నామనసెవరో దొంగిలించారు. ఫస్టుకేసుగా రామదూతగారికి నే అప్పగిస్తాను కేసుని" గట్టిగా అన్నాడు చక్రవర్తి.
    
    "నీ మనసెవరూ దొంగిలించలేదు. అది నా సూట్ కేసులో భద్రంగా వుంది. ఇహ నోరుమూసుకో" అన్నాడు మదన్ గోపాల్.

    

    కావాలని వీళ్ళ కినపడేటట్లు కిసుక్కున నవ్వి వెంటనే సీరియస్ గా మారి "పిచ్చిమాటలు పిచ్చిగోల కాసేపు నోరు కట్టేసుకొని వుండవ్ కదా?" అంటూ త్రిలోకసుందరిని గదమాయించింది వైజయంతి.
    
    "ఇప్పుడు నేనే మన్నానే?" తెల్లబోయింది త్రిలోక సుందరి.
    
    వైజయంతి వాలకంచూసి చక్రవర్తిని తన భాగంలోకి లాక్కెళ్ళాడు మదన్ గోపాల్.
    
    వాళ్లటు వెళ్ళంగానే "నిన్ను కాదే వాళ్ళనన్నాను. మనం కంటపడితే చాలు. వళ్ళూపై తెలియదు. సంధి ప్రేలాపన మొదలెడతారు" అంది వైజయంతి.
    
    "వాళ్ళు అనకామానరు, నీవు వినకా మానవు. మధ్యలో చివాట్లునాకు."
    
    "నిన్ను కాదుగా నేనంది, బాధపడకు. వాళ్ళపని చెపుతాగా?" అంది వైజయంతి ముక్కుపుటాలెగరేసి.
    
    "వాళ్ళపని చెప్పటమేమోగాని, ముందు నాపని పడుతున్నావ్!" అంది త్రిలోకసుందరి.
    
                                               9
    
    మదన్ గోపాల్ కి బామ్మ వడిలో పడుకుని గారాలు పోతూ కబుర్లు చెప్పటం అలవాటే. ఈరోజు ఎవడో చస్తే చచ్చినాడి గౌరవార్ధం బ్యాంక్ లు ఆఫీసులు మూసేసి ఇంటిపట్టున హాయిగా వుండమని చాలామందికి శలవిచ్చారు. ఆ చాలామందిలో మదన్ గోపాల్ ఒకడు. అందుకే హాయిగా బామ్మవడిలో పడుకుని తీరుబడిగా గారాలు పోతున్నాడు. బామ్మగారు మనుమడి తల నిమురుతూ మాట్లాడుతున్నది. గుమ్మంలో నుంచున్న వైజయంతిని ఇరువురూ చూడలేదు.
    
    "నేనిప్పుడే పెళ్ళిచేసుకోను నాన్నమ్మా!" గట్టిగా చెప్పేశాడు మదన్ గోపాల్.
    
    "వెర్రినాగన్నవిరా మదనా, ఏ యీడు ముచ్చట ఆ యీడుది. నీ యీడువాళ్ళంతా ఈ సరికి పెళ్ళి చేసుకుని బిడ్డల తండ్రులయి ముద్దు ముచ్చటతో..."
    
    "రోగాలు రొచ్చులు! అప్పు సొప్పులు హాయిగా నన్నిట్లా వుండనియ్యవే నాన్నమ్మా! నాకేం లోటు చదువయిపోంగానే హాయిగా మాంచి ఉద్యోగం వచ్చింది. కమ్మగా వంట చేసి పెట్టటానికి నువ్వున్నావ్. నువ్వు పప్పుచారు పెట్టినట్లు ఆ వచ్చే పిల్లను పెట్టమను చూద్దాం! అసలీకాలం పిల్లలకి పప్పుచారు కాయటం వచ్చా అంటా?"
    
    బామ్మగారు చిద్విలాసంగా నవ్వి మురిసిపోతూ మనవడి బుగ్గ మృదువుగా తట్టి "పెళ్ళి చేసుకోటం కమ్మని తిండి తినటానికేటరా అబ్బీ! ఆడతోడు కోసం. మీ భార్యాభర్తలకి నేనే వంటచేసి పెడతాను సరా?" అంది. అభయహస్తం యిచ్చింది.
    
    "నాకు తోడూవద్దు, తోకావద్దు."
    
    "నీమాటే నీది. బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా లాభంలేదంటారు పెద్దలు."
    
    "కన్యముదిరినా కాకరకాయ ముదిరినా అని పెద్దలనలేదా! మేమేం పాపం చేశాం బెండకాయట బెండకాయ దొండకాయ!" అంటూ గుమ్మంకేసి కోపంగా చూశాడు మదన్ గోపాల్, అంతే కంగారుపడి బామ్మ వడిలోంచి టకీమని లేచాడు.    

    వైజయంతి నోటికి కొంగడ్డం పెట్టుకుని నవ్వాపు కుంటున్నది.
    
    బామ్మగారు వైజయంతిని చూసింది. మదన్ గోపాల్ కంగారు అర్ధమైంది. చిద్విలాసంగా ఓ నవ్వు నవ్వి "నువ్వుటే పిల్లా! వీడు నా వడిలోంచి ఎగిరిపడ్డప్పుడే మెరుపులా నువ్వొచ్చావు సుమీ అనిపించింది, రా. అక్కడే అతుక్కుండిపొయ్యావ్" అంది.

 Previous Page Next Page