ఆ రోజు ఇంటినిండా పాలు - పాయసం!
తిరువారాధన సమయంలో వైష్ణవులు - ఎందరో - పాశురాలు చదువుతుంటే - అడ్డం అయినా కాకున్నా కర్ణపేయంగా ఉండేది. తరువాత వందల స్వాముల సాపాట్లు, తరువాత చందన గోష్టి - తిరునామాలు - మంగళ హారతుల గానం! అదొక హృదయంగత - కళాపూర్ణమయిన సత్సంప్రదాయం.
తిరునామాలు - శ్రీ వైష్ణవులు మాత్రమే కనుగొన్న - రచించిన ; గానం చేసిన - ఒక సాహితీ ప్రక్రియ. ఇది సుమారు జానపదం! ఈ పదాల్లో వైష్ణవ తత్త్వం సులభ, సరళ శైలిలో పాడడం జరుగుతుంది. వీటిలో చక్కని సాహిత్యం ఉంది. ఈ మధ్య తిరునామాల మీద డాక్టరేటు చేసిన వారున్నారు.
మా నాయన గారికి శిష్యులు అనేకులు. మరొక శ్రీవైష్ణవ సంప్రదాయం "శేషం". మా నాయనగారు మజ్జిగ సాదం కలిపినపుడు శిష్యుల వరస ఏర్పడేది. అంతా వైష్ణవులు మాత్రమే. ఒక్కొక్కరు చేయి చాచితే వారి శేషం అంటే ఉచ్ఛిష్ట మజ్జిగ ప్రసాదం ఇసుమంత వారికి ఇచ్చేవారు. అది వారు మహాప్రసాదంగా భావించేవారు.
ధనుర్మాసంలో ప్రతిరోజూ సాయంకాలాల్లో తిరుప్పావై శ్రీసూక్తి సాయించేవారు మా తండ్రిగారు. వేదాలు - ఉపనిషత్తులు - రామాయణ, భారత, భాగవతాలనుంచి ఉదాహరణలు ఇస్తూ గంటల తరబడి అమృతప్రాయంగా ఉపన్యసించేవారు. శ్రోతలు తన్మయులై - అచేతనులవలె వినేవారు. తరువాత హారతి - పంచకజ్జాయ వినియోగం.
ఈ సంప్రదాయం సాంతం శ్రీమద్రామానుజ యతి ఏర్పరచింది. కులాల వ్యత్యాసాలను తొలగించడానికి యత్నించిన ఆద్యులు శ్రీమద్రామానుజులు. అయితే వారి తరువాత కొత్త కులాలు పుట్టాయి. అలాంటిదే శ్రీవైష్ణవ కులం! బసవేశ్వరుని తరువాత కూడా "ఆరాధ్యులు" అనే బ్రాహ్మణకులం - జంగములు అవతరించారు.
మేము బ్రాహ్మణ శ్రీ వైష్ణవులం. మేము శాత్తిన వైష్ణవులం - అంటే శిఖాయజ్ఞోప వీతములు దాల్చినవారం. శాత్తాదవైష్ణవులు ఉన్నారు. వారు శిఖాయజ్ఞోపవీతములను వదిలారు. వారు బ్రాహ్మణులుకారు. సంస్కృతం జోలికి పోరు. వారిది ద్రావిడ ప్రబంధం!
మాకు దృష్టి దోషం ఉండేది. అంటే ఇతరులు చూస్తుంటే భోజనం చేయం. అలాంటప్పుడు ఇతరుల దగ్గర తినడం అనే ప్రసక్తి లేనేలేదు. మంచి తీర్థం సహితం మరొకళ్ళ చేత తాగేవాళ్లం కాదు. ఎంగిలి చేసి నీళ్లు తాగడం నిషిద్ధం. ఎత్తిపోసుకోవాలి. మేము ఇతరుల నీళ్ళు తాగడం సరే, ఇతరులుకూడా మాకు ఇచ్చేవారు కారు. అత్యవసరం అవుతే, మజ్జిగ - అది లేకుంటే మజ్జిగ చుక్క వేసిన నీరు ఇచ్చేవారు! ఇది ఆచారంలో సర్దుబాటు!!
ఇప్పుడు ఎవరి నీళ్ళు వారు వెంట తీసికెళ్తున్నారు.
బహుశః ఇది ఆ సదాచారపు కొనసాగింపేమో!
నీరు రోగవాహిక అని పాశ్యాత్యులు కొత్తగా చెప్పారని అనుకుంటున్నాం. మన వాళ్ళు ఎటుపోయినా నీళ్లు వెంటతీసుకుని పోయేవారు. తాబేలు బుర్రలు - సొర బుర్రలు అందుకు ఉపయోగించేవారు.
ఒకే పరమాత్ముడు శ్రీమన్నారాయణుని నమ్ముకునేది వైష్ణవం. శ్రీమన్నారాయణుడు ఒక్కడే భగవానుడు. అన్యులు దేవతలు కారు. ప్రపత్తి మార్గాన శ్రీమన్నారాయణుని మాత్రమే ఆశ్రయించాలి. అన్యదేవతలను ఆశ్రయించడం పాపహేతువు.
ఒక్క శివుణ్ణి మాత్రం నమ్ముకున్నది శైవం. శివాత్పర తరం నాస్తి. శివుని మించిన దేవత లేడు. శివుని వీర భక్తి పూర్వకంగా ఆరాధించిన వారికి మోక్షం లభిస్తుంది. అన్యదేవతలను ఆరాధించడం పాపహేతువు.
భారత సంప్రదాయంలో - ఇతిహాసంలో - చరిత్రలో మనకు ఏకదేవ ఉపాసన లేదు. మనం బహుదేవతా ఉపాసకులం. మనకు ప్రకృతి శక్తులు - వాటి అధిష్టాన దేవతలు అందరు పూజనీయులే. చెట్టు, పుట్ట సహితంగా అనేక స్త్రీ పురుష దేవతలున్నారు. "ఏప్యన్య దేవతా భక్తాః" అని గీతలో ఉపదేశించిన శ్రీకృష్ణ పరమాత్మ అన్య దేవతలను ఉపాసించవచ్చును అన్నాడు.
నాగరకతలు - సిద్ధాంతాలు - ధర్మాలు - కళలు - సాహిత్యం అన్నీ ప్రాగ్దేశాలు -అంటే, తూర్పు దేశాల్లోనే పుట్టాయి. పశ్చిమ దేశాల్లో మర పుట్టింది. మనిషిని మరను చేసింది. తూర్పు దేశాలు అన్నింటిలో ప్రకృతి శక్తులను - అనేక దేవతలను ఉపాసించారు.
ఒకే ఒక భగవంతుని గురించిన సిద్ధాంతం మొట్ట మొదట జీసస్ క్రైస్తు ప్రతిపాదించాడని నా ఉద్దేశం. అయితే 500 సంవత్సరాల తరువాత మహమ్మదు ప్రవక్త అవతరించేవరకు, తరువాతకూడా జెరూసలెం చుట్టుపక్కల అరబ్బుల మీద క్రైస్తవ ప్రభావం కనిపించదు. మహమ్మదుకు ముందు అరబ్బు దేశాలలో బహుళ దేవతారాధన - విగ్రహారాధన విచ్చలవిడిగా ఉండేవి. "అల్లా తప్ప అన్యదేవత లేడు. మహమ్మదు అల్లా యొక్క చివరి దూత" అనే సిద్ధాంతాన్ని మహమ్మదు ప్రవక్త ప్రవచించినాడు. స్థిరపరచినాడు.
ఏకేశ్వర ఉపాసనను గట్టిగా విశ్వసించింది, ప్రచారం చేసింది, ఇస్లాం మాత్రమేనని నా అభిప్రాయం. ఇస్లాం ఎంతో వేగంగా వ్యాపించింది. మహమ్మదు ప్రవక్త తరువాత రెండు మూడు శతాబ్దాలకే ఇస్లాం భారతదేశంమీద దండయాత్ర చేసింది.
ముస్లిముల దండయాత్ర - యుక్తాయుక్తత గురించి చెప్పడానికి నేను చరిత్ర చెప్పడం లేదు. ఏకేశ్వరోపాసనను గురించి అవ్యక్తంగా ఆదిశంకరుని - వ్యక్తంగా రామానుజుని, బసవేశ్వరాదులను ప్రభావం చేసింది ఇస్లాం ఆలోచనావిధానం అని నా నమ్మకం. దీనిని గురించి విజ్ఞులు పరిశోధించాలి.
శ్రీ వైష్ణవులకు శ్రీమన్నారాయణుడు తప్ప అన్యదేవతలు లేరు అని మనవి చేశాను. ఇతర దేవతల - ముఖ్యంగా శివుని పేరు మేం ఉచ్చరించం. సత్యం - శివం - సుందరం అనం. సత్యం - శుభం - సుందరం అంటాం. శివుని పేరు ఉచ్చరించడం మహాపాపం.
మేము గుంటిమల్లన్న బజారులో ఉన్నాం. మా ఇంటికి కొద్ది దూరంలోనే శివాలయం. చుట్టుఅయినా మా నాయనగారు శివాలయం వెనుకనుంచి వెళ్ళేవారు తప్ప, ముందునుంచి వెళ్ళేవారు కారు. మల్లేశ్వర స్వామి సేవవస్తే తలుపులన్నీ బిగించి దొడ్లొ కూర్చునేవారు.
అయితే జీవితం ఉందే - అది చిత్రాతిచిత్రమైన త్రాసదం. తన చిరునామా వ్రాయవలసి వచ్చినపుడు మా నాయనకు 'గుంటి మల్లన్న బజారు' అనక తప్పేది కాదు. కాలక్రమంలో కుటుంబ కలహాల వలన గుంటి మల్లన్న బజారు వదలాల్సి వచ్చింది. మా నాయనగారు మారినది "శివాలయం వీధి!"
మేము అతివైష్ణవ వాతావరణంలో పెరిగాం. నేను మూడో తరగతిలో ఉన్నాను. ఉర్దూ వాచకం చదివించే పీరియడు ఉండేది. నేను చదువుతున్నాను. "శివాయ్" అనే పదం వచ్చింది ఉర్దూలో శివాయ్ అంటే "తప్ప" అని అర్థం. నేను వీర వైష్ణవుణ్ణి "శివ" అంటావా! అక్కడ ఆగిపోయాను. టీచర్ షేఖ్ మీరాఁ చదవమన్నాడు. నేను మౌనం వహించాను. అతడు పేము బెత్తంతో బాదుతున్నాడు అయినా నేను పలకను.
సర్వయ్యగారని మా నాయన శిష్యుడు - ఆ బడిలో ముద్రిస్, అంటే టీచరు. వారికి నేనంటే ఎంతో ప్రేమ. వాళ్ళకు పిల్లలు లేరు. నేను వాళ్ల ఇంట్లోనే ఉండేవాణ్ణి. వాళ్లు అపక్త్వాహారులు. అందువల్ల మా నాయన అనుమతించారు.
షేఖ్ మీరాఁ నన్ను బాదుతుండడం చూచారాయన. పరిగెత్తుకు వచ్చారు. వారించారు. విషయం అడిగారు. 'బచ్చా హుషార్ హై. ఆగే పడ్తానహీ' పిల్లవాడు తెలివైనవాడే. తరువాతిది చదవడు అన్నాడు. నన్ను అడిగారు. "శివాయ్" వేలుతో చూపించి "ఇది చదవమ" అన్నాను. నర్సయ్యగారు చేతితో తలబాదుకున్నాడు. "ఆప్ దూర్ డాలియే యహ్ వహీ కహేగా" -'మీరు చంపండి. ఈ మాటలవడు అని' కారణం వివరించారు. అప్పుడు క్లాసులో పిల్లలు, టీచరు అంతా గొల్లున నవ్వారు.
సర్వయ్యగారు నన్ను మా ఇంటికి తీసుకెళ్లి మా నాయనకు వివరించారు. నేను వీరవైష్ణవుణ్ణి అయినందుకు నన్ను మెచ్చుకున్నారు. కాని అంటుకోలేదు. "బడి బట్టలు విడిచి స్నానం చేసిరా" అన్నారు.
అలాంటి విన్యాసాలు గలవాళ్ళం మేము. అప్పటికి మా వాళ్లలో ఎవరూ తమ పిల్లలకు మ్లేచ్ఛ విద్య చెప్పించి మైల పడేయదలచలేదు. సంప్రదాయ విద్య - శిష్య సంచారం - ఇసుమంత వ్యవసాయం. అంతటితోనే సరిపుచ్చుకున్నారు.
మా అన్నయ్యకు మ్లేచ్ఛ చెప్పించడానికి మా నాయనగారి నిర్ణయం ఎంతో ముందడుగు అని చెప్పాలి. వారు మొత్తం కులాన్ని ఎదిరించారు. మా మాతామహి, పితామహులను ఎదిరించారు. మా నాయనగారి అఖండ పాండిత్యపు అండలేకుంటే మేము కుల బహిష్కారానికి గురి కావలసివచ్చేది.
మా నాయనగారి ఆ సంస్కారం మద్రాసు నివాసంవల్లకావచ్చు. వారికి గాంధీజీ అంటే ఎంతో ప్రీతి. రాముడు, కృష్ణుడు గురించినట్లువలె మహాత్ముని గురించి చెప్పేవారు. గూడూరులో కూడా వారానికి రెండుసార్లు వచ్చే "గోలకొండ పత్రిక" తెప్పించేవారు.
జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎంతో ప్రభావం వేస్తాయి! మా నాయనగారు ఆనాడు ఆ నిర్ణయం తీసుకుని ఖమ్మం మారకుంటే మేమూ శిష్య సంచారాలు చేస్తూ కాలక్షేపాలు చెప్పుకునేవాళ్ళం.