Previous Page Next Page 
జీవనయానం పేజి 21


    ఉస్మానియాలో నామమాత్రంగా తెలుగు శాఖను ఏర్పాటు చేశారు. దానికి తొలి ఆచార్యులు 'ఏ దేశమేగినా ఎందుకాలిడినా' గేయ రచయిత, ప్రఖ్యాత భావ కవి రాయప్రోలు సుబ్బారావుగారు. నిజాం కొలువులో రాయప్రోలు వారు షేర్వానీ ధరించి కొలువుకు వెళ్ళేవారు. తెలుగును ధ్వంసం చేయ పూనుకున్న నిజాం కొలువులో దేశభక్తి గేయ కవి రాయప్రోలు! ఇది వింతయే కాని ఇది - వాస్తవం.

 

    రాయప్రోలువారు నిజాంను ప్రశంసిస్తూ రచించిన జాడలు లేవు.

 

    బ్రిటిషాంధ్రం నుంచి నిజాం కొలువులో చేరిన కురుగంటి సీతారామయ్య "ఆదర్శ ప్రభువు" అనే గ్రంథం రచించి, ప్రభువు వారి మన్ననలు పొందారు. ఈ పుస్తకానికి రాయప్రోలువారు పీఠిక వ్రాశారు. ఇటువంటి గ్రంథాల ప్రచురణకు ఆంధ్ర సాహిత్య పరిషత్తును స్థాపించారు. ఈ పుస్తకం తెనాలిలో అచ్చయింది.

 

    ఆ రోజుల్లో తెలుగువారి తరపున నిజామును పొగడడానికి రప్పించిన ముగ్గురికి రా.కా.సి అని పేరు పెట్టారు స్థానిక తెలుగులు. రాయప్రోలు - కాసింఖాను - సీతారామ భట్టాచార్య, శ్రీరంగం శ్రీనివాసవారుగారు కూడ కొంతకాలం నిజాం కొలువు చేశారని చెప్పుకుంటారు.

 

    ఉస్మానియాలో తెలుగు శాఖ ఉన్నమాట నిజం. ఆ శాఖ నిజాం ప్రశంసలకే కాని తెలుగు ప్రోత్సహించడానికి కాదని ప్రజలకు తెలుసు. అదీకాక తెలుగు శాఖలో చేరేవారిపై ప్రభుత్వదృష్టి ఉండేది.

 

    "తెలంగీ - బేఢంగీ" - 'తెలుగు వికారభాష' అనే నినాదం ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రచారంలోకి వచ్చింది. అందువల్ల విద్యార్థులు తెలుగులో చేరడానికి జంకేవారు. అది కాక బి.ఏ. వరకు ఉర్దూలో మాత్రం చదివినవారికి తెలుగు ఎలా వంట పడుతుంది? 'తెలుగు' ప్రభుత్వం గుర్తించని భాష. అందులో డిగ్రీ పొంది ప్రయోజనం శూన్యం.

 

    ఇన్ని అవరోధాలను అధిగమించి వరంగల్లు ఇండ్లామడికొండకు చెందిన పల్లా దుర్గయ్య ప్రథమ విద్యార్థిగాను - ఏకైక విద్యార్థిగాను ఉస్మానియాలోని తెలుగు శాఖలో చేరారు.

 

    పల్లా దుర్గయ్యగారు సాత్వికులు. విద్వత్కవి. మనుచరిత్రను పరిశోధించి డాక్టరేట్ పొందారు. "గంగిరెద్దు" వంటి ఖండ కావ్యాలు రచించారు. ఉస్మానియా నుంచి తెలుగు ప్రొఫెసరుగా పదవీవిరమణ చేసి దివంగతులైనారు.

 

    నిజాంలో రాజభాష ఉర్దూ. ఇక్కడి శాసనాలు ఉర్దూ - ఆఫీసుల్లో వ్యవహార భాష ఉర్దూ - కోర్టు భాష ఉర్దూ - జరీదా అణగ గెజిటు భాష ఉర్దూ - నాణేల మీద భాష ఉర్దూ - దుకాణాలు వగైరాల బోర్డులన్నీ ఉర్దూ. నిజాం సాంతం ఉర్దూ మయం. ఎవరయినా తెలుగు మాట్లాడినట్లు వినిపిస్తే -

 

    "తెలంగీ బేఢంగీ  అని వెక్కిరింపు!

 

    నాటి స్థితికి దవళా శ్రీనివాసరావు గారి ఆవేదన -

 

    'హాలీ' యందువు 'గాలిబం'దువు సదా 'యిక్బాలె'పో షారియన్
    చాలా చాల నఫీసులుట్టిపడ మాషల్లా రచించెన్ యటం
    చాలాపించుచు జిందగీ గడచెనయ్యా! నీదు భాషాసతీ
    లీలా మాధురులొల్క వ్రాసిన కవుల్లేరే స్మరింపన్ మదిన్!

 

    హాలీ, గాలిబు, ఇక్బాల్ ఉర్దూ కవులు. నఫీసు అంటే అందం. మాషల్లా మెచ్చుకునే పదం.

 

    'ఉర్దూ కవులను మెచ్చుకుంటూనే జీవితం గడుపుతావా? మధురమైన తెలుగులో రచించిన కవులే లేరా? అని పై పద్యపు తాత్పర్యం.

 

    ఏ కాలంలోనయినా విద్యను పాలకులు నిరసించారు. నిరసిస్తున్నారు. నిరసిస్తారు. పాలకులు అనుమతించిన విద్యనే సహిస్తారు. తమకు వ్యతిరేకం అయిన విద్యను పాలకులు నిరసిస్తారు. నిర్బంధిస్తారు. నిషేధిస్తారు.

 

    కాని వెలుగును చూచిన గూడ్లగూబవలె చదువును చూచి బెదిరినవాడు ఉస్మాన్! తాను స్వయంగా కవినని చెప్పుకుంటాడు. కవితలు జరీదా - గెజెటులో ప్రకటించుకుంటారు. మరొకడు చదువుకోరాదనే మూర్ఖుడు! అతడు విద్యా విధానాన్ని అలా తయారుచేశాడు.

 

    నిజాం పాఠశాల విద్యలో ఉర్దూను బోధనా భాష చేశాడు. ఉర్దూ మాతృభాష అయిన ఒక మతస్తులను ప్రోత్సహిస్తున్నట్లు నటించాడు. వాస్తవానికి తన ప్రజల మీద అతనికి విశ్వాసం లేదు. పెద్ద ఉద్యోగాలలోకి బయటినుంచి ఉర్దూవారిని నియమించేవాడు. తనను గద్దె నెక్కించిన కిషన్ పెర్షాద్ తరువాత ఉస్మాన్ నియమించిన ప్రధానులు అందరూ బయటివారే.

 

    ఇందుకు వ్యతిరేకంగా రాజ్యంలో ముసల్మానులు ఆందోళన లేవదీశారు. తత్ఫలితంగా నిజాం నవాబు 'ముల్కీ' నిబంధనలు ప్రవేశపెట్టాడు. రాజ్యంలోని ముసల్మానులకు ఉద్యోగం లభింపచేయడం అతని ఉద్దేశం.

 

    ముల్కీ నిబంధనలు పుట్టడానికి కారణం అది.

 

    ఉన్నత విద్యలో ఉర్దూ ప్రధాన భాష చేశాడు. తెలుగు మూడవ తరగతిలో మొదలవుతుంది. ఏడవ తరగతి వరకు సాగుతుంది. ఎనిమిదవ తరగతినుంచి తెలుగు ఆప్షనల్ - ఐచ్ఛికం. చాల తక్కువ మంది తెలుగు తీసుకునేవారు. ఎందుకంటే మెట్రిక్ తరువాత తెలుగు ఉండదు. 

 

    ఉర్దూ భయానికి తెలుగువారు తమ పిల్లలను స్కూళ్ళలో చదివించేవారు కారు. తెలుగు వారికి ఉద్యోగం దొరుకుతుందని నమ్మకం లేదు. పల్లెల్లో కులవృత్తులు అడుగంట లేదు. వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉండేది.

 

    నిజాం రాజ్యంలో చదువు వచ్చినవారి సంఖ్య వేయికి 82. అందులో ముసల్మానుల్లో 59. హిందువుల్లో 23.

 

    నిజాంలోని విద్యావిధానమే విద్యకు వ్యతిరేకం.

 

    పాఠశాలలూ, కళాశాలలూ అన్నీ సర్కారువే. అవి ఏర్పరచడానికి ప్రమాణాలు -  

 

    ప్రతి సుబాకు ఒక ఇంటర్ మీడియట్ కాలేజి. నిజాం రాజ్యంలో నాలుగు. అంటే - రాజ్యం మొత్తంలో నాలుగే ఇంటర్ కాలేజీలు.

 

    ప్రతి జిల్లాకు ఒక ఫౌఖాన్యా - అంటే హైస్కూలు.

 

    ప్రతి తాలూకాకు వస్తాన్యా - అంటే మిడిల్ స్కూల్.

 

    గ్రామ ప్రాముఖ్యతనుబట్టి తహతాన్య - అంటే ప్రైమరీ స్కూలు.

 

    నిజాం నవాబు ఖాన్గీబడులు - అంటే వీధి బడులను ఫర్మాను ద్వారా నిషేదించాడు. అందువల్ల పంతుళ్లు తమ ఇళ్లలోనే తెలుగు చదువు చెప్పేవారు.

 

    ఆ రోజుల్లో ఖమ్మం తాలుకా కేంద్రం మాత్రమే. ఒక దువ్వమ్ తాలూకాడ్డారు, డిప్యూటీ కలెక్టర్ - ఉండేవారు. అయినా, పట్టణ ప్రాధాన్యతను గుర్తించి, ఖమ్మంలో ఫౌకాన్యా -అంటే హైస్కూలు ఏర్పరచారు. రెండు తహతాన్యాలు - అంటే ప్రైమరీ స్కూళ్లు ఉండేవి. ఒకటి దికాబజార్ తహతాన్యా - రెండోది ఖస్బా బజారు తహతాన్యా.

 

    ఇది విద్యావిషయకంగా రాజకీయ పరిస్థితి.

 

    సామాజిక పరిస్థితులు ఇందుకు భిన్నంగా లేవు. ఊళ్లలో దొరల పెత్తనం. కులమతాలా ప్రభావం. బ్రిటిషిండియాలో వలె సంస్కరణ ఉద్యమాలు శూన్యం. ఉద్యమం అంటే సర్కారుకు మంట. కనీసం అభివృద్ధిని సహించలేని దుష్ట ప్రభుత్వం! ప్రజల్లో విద్యా విహీనత!! చైతన్య రాహిత్యం!!!

 

    మాది సనాతన సంప్రదాయ వంశం - కుటుంబం. ఇతరుల నీడ పడితే మైల పడిపోతాం అన్నంత ఛాందసం. మా ఇంట్లో మడి కట్టుకుంటే ద్రావిడ, సంస్కృతాలు మాట్లాడాలి. మడి విడిచిన తరువాత తెలుగు. తెలుగు - మదికి పనికి రాని భాష అని వారి ఉద్దేశం. రెండు పూతల తిరువారాధన.

 

    మా నాయనగారు పుట్టింతరువాత భద్రాచలం వెళ్లలేదు. అక్కడికి వెళ్తే ఏదో అనర్థం జరుగుతుందని మా నాయనమ్మ ఆవేదన. మా నాయనమ్మ గారు అచ్చం భద్రాద్రి రాముని వంటి "వామాంక స్థిత జానకి" విగ్రహాలు సంపాదించారు. వివిధ సాలిగ్రామాలు. సాలిగ్రామాలకు శాస్త్రం వుంది. అది మా నాయనగారికి బాగా తెలుసు. సాలిగ్రామాలకు నేపాలు గండకీనదిలో ఉంటాయట! నేపాళ మహారాజు సంవత్సరానికి ఒకసారి బంగారు వలవేసి వెలికి తీస్తారట. అప్పుడు అక్కడ ఉన్న మహాత్ములకు, విరాగులకు అందిస్తారట. వారివద్ద మనం సాధించాలి అని చెప్పేవారు.

 

    మా ఇంట్లో మార్గళి - ధనుర్మాసం ఎంతో వైభవంగా చేసేవారు. ఆ నెలరోజులు తెల్లవారేవరకు వేడి వేడి చెక్కర పొంగలి - నేయి కారుతుండగా - వందల మందికి వినియోగం చేసేవారు. 'నాహి నాహి' వంటి విశేష దినాలలో రాసులకోద్ది పులిహోర శ్రీవైష్ణవుల పులిహోర అంటే అందరికీ నోరూరేది! మా అమ్మ చేతివంట రుచి మరింత! వేలమంది వచ్చేవారు.

 

    'కూడారై' నాడు పాయసం గుండీలతో చేసేవారు. గోతులు తీసి, వాటిని నీళ్ళతో నింపి గుండిగలు అందులోకి దింపేవారు. పాయసం చల్లారడానికి ఆ ఉపాయం. పాయసంలో ఏలకులు - కుంకుమ పూవు - జీడిపప్పు - ద్రాక్ష వగైరాలు వేసేవారు. పాయసం నోటిదాకా పోకముందే ఘుమ ఘుమ! చెంబులు, తప్పేలాతో ఎంతమంది వచ్చినా వినియోగం జరుగుతుంది.

 Previous Page Next Page