రాజమహేంద్ర వరంలో ప్రకాశం పంతులుగారి పడవ వెళ్ళిపోయి ఉంటే ఆయన ఏమయ్యేవాడో?
మా అన్నయ్య ఖమ్మం రికాబ్ బజార్ తహతాన్యాలో నాలుగవ తరగతిలో చేరినట్లు గుర్తు. ఇంట్లో సంప్రదాయ విద్య నేర్పేవారు.
నా చదువు విషయం కుటుంబంలో మళ్ళీ ఒక సమస్య అయింది.
1. మా వంశంలో తెలిసినంతవరకు - ఒక్కడే మగ పిల్లవాడు. మేమే ఇద్దరం. మాలో ఒకరు ఉండరు - అంటే బ్రతకరు అని నిశ్చయించుకున్నారు. ఆ బతకనివాణ్ణి నేనే అని వారికి తెలిసిన శాస్త్రం ప్రకారం నిశ్చయించుకున్నారు. నన్ను చదివించి ప్రయోజనం లేదని నిశ్చయించుకున్నారు.
2. నేను బతుకుతానే అనుకున్నా ఉన్న శిష్య సంపద సంప్రదాయం నాకు అప్పగించడం మంచిది అనుకున్నారు . కలకాలంగా వస్తున్న వృత్తిని వదులు కోవడం ఇష్టం లేదు.
3. మా అన్నయ్య చదువుకుని తహసీల్దారు అవుతాడు. అప్పటికి అదే పెద్ద ఉద్యోగం. కనుక గ్రామంలో ఉండి వ్యవసాయం చూసేవాడు కూడా కావాలి. అది నాకు అప్పగించదలిచారు. వార్ధక్యంలో మా మాతాపితరులు నా దగ్గర ఉండి "రామా కృష్ణ" అనుకుంటారు.
ఇంత ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిందేమంటే - నాకు సంప్రదాయ విద్య చెప్పించాలి. అయిదు రోజులు వైభవంగా నా ఉపయనం చేశారు. వందల బండ్లలో బంధువులు వచ్చారు. వారాల తరబడి ఉన్నారు. అదొక వైభవం. అది బంధు ప్రేమకు నిదర్శనం! మా అన్నయ్య ఉపనయనం అంతకుముందే జరిగింది.
రామ శబ్దంతో నా విద్య ప్రారంభం అయింది.
అది సంధియుగం. అప్పుడు ప్రతిదాన్ని గురించీ అంత ఆలోచన. ఇప్పుడు ఆలోచన లేదు. అంతా స్థిరపడింది. అందరికీ అంగ్రేజు నేర్పడమే! కాన్వెంటు స్కూల్లో చేర్చడమే!
నన్ను ఉమామహేశ్వరరావు బళ్లో చేర్పించారు. ఉమామహేశ్వరరావు గారు బ్రాహ్మణులే కాని విద్యావంతులు కారు. శతకాలు, పెద్ద బాల శిక్ష చదివాడు. బ్రాహ్మణులు ఎవరూ పిల్ల నివ్వలేదు. ఒక స్త్రీని చేరదీశాడు. వారికి ఒక కూతురు. అందమైంది. వయసులో ఉంది. చిలిపి పనులు చేస్తుండేది. అప్పుడప్పుడు చదువుకూడా చెప్పేది. ఆ పిల్ల వారికి కలిగింది కాదు అనుకునేవారు.
నా చదువుకు నెలకు పావలా ఇచ్చేవారు
గడియారాలు - సమయం ఇంకా స్థిరపడలేదు. బడి తెల్లవారు జామునుంచి సాయంకాలం దాకా ఉంటుంది. ముందు వచ్చి వసారాలో కూర్చున్నవాడు "శ్రీ" తరువాత వచ్చినవాడు "చుక్క" ఆ తరువాత ఒక దెబ్బ - రెండు దెబ్బలు. అట్లా చివరికి వచ్చినవాడికి అందరికంటే ఎక్కువ దెబ్బలు!
పంతులుగారు లేవరు. బయటికి రారు. పంతులుగారు బయటికి వచ్చింతరువాత "శ్రీ" పంతులు ముందుకు వెళ్తాడు. అతని చేతిలో సరస్వతి చుడ్తారు. శ్రీ చెప్పిన వాని చేతులో బెత్తంతో కుచ్చి చుక్కను చేస్తారు. తరువాత వాడిని చుక్క చెపుతాడు. వాడికి ఒక దెబ్బ. అలా చివరివాడిదాకా సాగుతుంది.
పంతులు వచ్చేదాకా బడిపెద్ద గుణింతాలు - ఎక్కాలు - ఎరుసులు చదివిస్తాడు. ఒకడు చెపుతాడు. అంతా కలిసి చదువుతారు.
పంతులుగారు లేచి వచ్చి కొత్తపాఠం చెపుతారు. అది కూడా కంఠోపాఠమే - నోటికి రావలసిందే. ఎక్కువగా చదివేది ఉండదు. గుణింతాలు, ఎక్కాలు బాగా వస్తాయి. కాబట్టి సాధారణంగా తప్పులు ఉండవు. ఎరుసులు అంటే సుమారు ఎక్కాల లాంటివి. కాసులు ఎరుసు. అణాల ఎరుసుల - గిద్దెల ఎరుసు ఇలా ఎన్నో చెప్పుతారు. ఇన్ని కాసులు ఎంత? ఇన్ని అణాలు ఎంత? ఇన్ని గిద్దెలు ఎంత? ఇత్యాదయః. అన్నీ నోటికి ఉంటాయి. కాబట్టి టక్కున చెప్పుతారు. సుమారు కంప్యూటర్ లాగే. కాగితం కలం అక్కరలేదు. అంతా నోటికే!
తిథులు - నక్షత్రాలు - వారాలు - మాసాలు - రుతువులు - సంవత్సరాలు - నదులు - పర్వతాలు మున్నగు చరిత్ర, భూగోళం, సామాజిక శాస్త్రం, నీటి శాస్త్రం వగైరా నిత్య జీవితానికి అవసరం అయినవి అన్నీ చెప్పుతారు.
సుమారు ఎనిమిదింటికి పళ్లు తోముకొని ముఖం కడుక్కోవడానికి వదులుతారు. అప్పుడు పిల్లలు ఇండ్లకు వెళ్తారు. ముఖాలు కడుక్కుంటారు. చద్దన్నం - మామిడి ఊరగాయ తింటారు. అప్పటికి టీలు - కాఫీలు లేవు. తిరిగి బడికి చేరుకుంటారు. మళ్ళీ మధ్యాహ్నం అలాగే భోజనాలకు వెళ్ళివస్తారు. సాయంకాలం నీతి శతకాలు చదివించి 'దీపం జ్యోతి' చదివించి బడి వదులుతారు.
పిల్లలు ఇంటివద్ద చేసేపని - అంటే హోంవర్క్ ఉండదు. బడి వదులుతే ఆటలే! తొక్కుడు బిళ్ల - బిళ్ళంగోడు - ఉప్పు బెర - చెడుగుడు - కోతి కొమ్మలని వగైరా.
ఈ మధ్య ఆనాటి పధ్ధతి ఆరోగ్యానికి అనుకూలం అయింది అంటున్నారు.
1. ఒక్క పలక - ఒక పుస్తకం - కూర్చునే గోనెసంచి లేదా చిరుచాప తప్ప పిల్లలు మోసుకొని పోవలసింది లేదు. పలక అంటే రాశిపలక కాదు. చెక్క పలక. దానికి ఒక రకం ఆకు బొగ్గు దంచి పట్టించాలి. అది నల్లనవుతుంది. మధ్య మధ్య అలా చేస్తుండాలి. అదికూడా లేకుండా ఇసుకకుప్పమీద అక్షరాలు వ్రాసే పధ్ధతి ఉంది.
పుస్తకాల బరువు కరీదు తండ్రికి లేదు. మోసే భారం పిల్లలకు లేదు.
2. చదువు మొత్తంలో కంటిమీద భారం లేదు. చదివేది తక్కువ. జ్ఞాపకం చేసేది ఎక్కువ. కాబట్టి బాల్యంలోనే దృష్టిలోపాలు రావు.
3. బడి వదులుతే పిల్లలకు నిశ్చింత. HOME WORK బెడద లేదు. తల్లిదండ్రులకూ, పిల్లలకూ మానసిక విశ్రాంతి. ఇది పిల్లలు ఆరోగ్యంగా ఎదగడానికి ఉపకరిస్తుంది.
4. సమయం ప్రకారం; నిర్దిష్ట విరామం - తరువాత భుజించడం ఆరోగ్యకరం అని డాక్టర్లు అంటున్నారు. నిర్విరామంగా వేళా పాళా లేకుండా తినడమే అనేక రోగాలకు కారణం అంటున్నారు.
5. ఎవరి వృత్తులు వారికి సిద్ధంగా ఉండేవి. ఉద్యోగాన్వేషణలు, మానసిక వత్తిడులు లేవు. జీవితంలో పరుగు పందాలు లేవు. కాళ్ళు కూలటం లేదు.
6. చదివిన చదువు నిత్య జీవితానికి అక్కరకు వస్తుంది సరిపోతుంది.
7. అన్నింటినీ మించి ఆనాటి విద్యా విధానం దురాశలకు పోనీయదు. యాంత్రిక యుగపు దుఃఖాలన్నింటికి కారణం దురాశయే!
వారాంతపు శలవులు ఉండేవికావు. అనధ్యయనత్రయం - అంటే త్రయోదశి - చతుర్దశి - పౌర్ణమి లేక అమావాస్య. ఆ విధంగా 15 రోజులకు మూడు రోజులు శలవు. శలవు అనే పదం వీధి బడులకు తెలియదు. శలవును ఆటవిడుపు అనేవారు.
అది భయం, విధేయత మీద ఆధారపడిన సమాజం. "భీషాషూర్యో ఉడేతి". భయంతోనే సూర్యుడు ఉదయిస్తాడు, గాలి వీస్తుంది అంటుంది వేదం. పిల్లలం తండ్రి ఎదుటకు పోవడానికి జంకేవాళ్ళం. తండ్రి చెప్పింది అక్షరాల వినాలి. లేకుంటే శిక్ష . దెబ్బలు కొట్టడం - కళ్లల్లో శొంఠిగంధం వేయడం - గదిలో వేసి తలుపు వేయడం ఇలాంటివి. తల్లి చూస్తూ ఉండాల్సిందే - అడ్డురావడానికి వీల్లేదు . పిల్లలు తల్లితండ్రులకు విధేయులు.
పంతులుకు సైతం పిల్లల మీద సకల హక్కులూ ఉండేవి. బడికి పిల్లవాడు రాకుంటే పంతులుగారు నలుగురు పిల్లలను పంపించి పట్టి తెప్పించేవాడు. పాఠాలు చదవకున్నా, చెప్పిన మాట వినకున్నా వివిధ శిక్షలు ఉండేవి. 1. దెబ్బలు , 2. గోడ కుర్చీ, 3. తొడపాశం, 4. కోళ్లగుది, 5. కోదండం, 6. ఎండలో నిలబెట్టడం లాంటివి.
పంతులుగారి ఇంటి పనులు కూడా పిల్లలు చేయాలి. శ్రీకృష్ణుడు - సుదాముడు తమ గురువయిన సాందీపని కోసం అడవికి పోయి కట్టెలు తెచ్చారు. మేము బట్టలు ఉతకడం - అంట్లు తోమడం - బజారు నుంచి సరుకులు తేవడం లాంటి పనులు చేసేవాళ్లం.
పంతులుగారికి - అయ్యవారికి - నశ్యం తెచ్చి ఇవ్వాలి. పరిగెత్తి వెళ్లి, పరిగెత్తి రావాలి. గడియారం లేదు. ఇన్ని నిముషాల్లో రమ్మని చెప్పడానికి వీల్లేదు. అందువల్ల ఎండలో ఉమ్మేసి పోవాలి. అది ఆరేవరకు పరిగెత్తుకు రావాలి. ఉమ్మి ఎండిపోయిన తరువాత వస్తే దెబ్బలు!
భయం మీద ఆధారపడిన సమాజం నాకు నచ్చదు. సమాజం ప్రేమాభిమానాల మీద ఆధారపడాలని నా ఉద్దేశం. అందరినీ ప్రేమించడం సాధ్యం అవుతే, ఎవరికీ ఎవరూ హాని చేయరు. ఒకరి కోసం ఒకరు త్యాగం చేస్తారు. త్యాగం తెలిసిన సమాజంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.
వాల్మీకి త్యాగం మీద ఆధారపడిన సమాజాన్ని దర్శిస్తాడు. రాముడు తండ్రి కోసం రాజ్యం వదులుకుంటాడు. సీతాలక్ష్మణులు రాముని కోసం రాజ్యభోగాలు వదులుకుంటారు. భరతుడు అన్న కోసం రాజ్యం వదులుకుంటాడు. "నా ఇహం అర్ధసరో దేవీ" అంటాడు రాముడు. నేను అర్థపరుణ్ణి కాదు, ధర్మపరుణ్ణి అంటాడు. అతడు ధర్మంకోసం అర్థాన్ని త్యజించాడు.