Previous Page Next Page 
మోహిత పేజి 22


 

       మోహిత కక్షసాధింపు చర్యల్ని చేపడుతుందని ఊహించని రాజేంద్ర కుమార్ వెంటనే శ్రీశైలంలోని ఫారెస్ట్ ఆఫీసర్ జయంత్ కి ఫోన్ చేశాడు.

 

                                            *    *    *

 

    కొంతమందిని చూడగానే, వీళ్ళు జీవితంలో ఎప్పుడూ మంచిపనులు చెయ్యరని తెల్సిపోతుంది. ఫారెస్ట్ ఆఫీసర్ జయంత్ ఆ కోవలోకే వస్తాడు. అతనికి దుర్మార్గమంటే చాలా ఇష్టం. అతనిదంతా ఓ విచిత్రమైన ఫిలాసఫీ.

 

    "చూడు..... ఈ ప్రపంచంలో నువ్వు మంచిగా  వుంటే, మంచివాడంటారు. చెడుగా వుంటే చెడ్డవాడంటారు. మంచివాడికి ఎవడూ భయపడడు. పైగా 'వాడు చాలా మంచివాడురా' అని వెక్కిరిస్తారు. అదే చెడ్డవాడనుకో, అంటే నాలాంటి వాడన్నమాట. అందరూ భయపడతారు. ఆ చెడ్డవాడు బలవంతుడు, ధనవంతుడూ అయితే ఇంకా మంచిది. పొలిటీషియనే అయితే మరీ మంచిది. ఏమంటావ్?" సిగరెట్ కాలుస్తూ రేంజర్ వేపు చూసి చెప్పాడు జయంత్.

 

    "అయితే మీ యింట్లో రావణాసురుడు, నరకాసురుడు, హిరణ్యక శిపుడు ఇలాంటివాళ్ళ ఫోటోలుంటాయా సార్....." నవ్వుతూ అడిగాడు రేంజర్.

 

    "గుడ్ జోక్! ఇలాంటి జోకులంటే నా కిష్టం..... చూడు ఆనందం, పిట్టల్ని కాల్చుకు తిని చాలారోజులైందిరా... ఊళ్లోకి కొత్తపిట్టలేమైనా వచ్చాయా?"

 

    "రాలేద్సార్..... కనుక్కోమంటారా.....?" కొత్త కొత్త అమ్మాయిలు ఎక్కడికి వస్తారో రేంజర్ కి బాగా తెల్సు.

 

    "వెళ్లి అర్జంటుగా కనుక్కుని రా. మళ్ళీ మూడ్ మారిపోతుంది" చెప్తూ, అప్పుడే రింగవుతున్న ఫోన్ వేపు చూశాడు. రిసీవర్  అందుకున్నాడు.

 

    "నేనే...... రాజేంద్రకుమార్  ని...... కర్ణాటక నుంచి మాట్లాడుతున్నా. పేపర్ చూస్తూన్నావా.....?" మరేం పలకరింపులు లేకుండా డైరెక్టుగా  అడిగాడు రాజేంద్రకుమార్.

 

    "ఏం....క్లింటన్ మీద మళ్ళీ ఇంకో  అమ్మాయి కేసేసిందా....? మగాడంటే క్లింటనేనయ్యా..... ముగ్గురు ముదితలు, ముప్పయ్యారు ముద్దులు.... అలా వుండాలి లైఫంటే..... మనమూ వున్నాం..... ఎందుకూ? లైఫ్ ని అనుభవించలేని మగాడు సూసైడ్ చేసుకుని చావాలి. ఏమంటావ్?" తన ధోరణిలో చెప్పకుపోతున్నాడు జయంత్.

 

    "నీ గొడవ నీదేనా! నేను చెప్పేది వింటావా?" కోపంగా అన్నాడు రాజేంద్రకుమార్.

 

    "చెప్పండి."

 

    చెప్పాడు రాజేంద్రకుమార్.

 

    "ఎమ్మెల్యే రవీంద్రనాథ్ ని, ఎస్పీ మహేంద్రని మోహిత మర్డర్ చేసిందా? డోంట్ బిలీవ్ ఇట్..... మోహితకు ఇన్ని తెలివితేటలుంటాయని నేననుకోను. మోహితకు కక్ష వుంటే..... మొదట నిన్ను చంపాలి. నిన్నొదిలేసి..... మమ్మల్ని మర్డర్ చేయాలనుకోవడం వెనక...... ఏదో బలమైన కారణం వుండాలి. ఆ  కారణం నువ్వే ఎందుకు కాకూడదు?" సీరియస్గా ప్రశ్నించాడు జయంత్.

 

    "ఇప్పుడు మోహిత నాతో వుండడంలేదు" చెప్పాడు రాజేంద్రకుమార్?

 

    "నిన్నొదిలేసిందా! వెరీగుడ్..... ఈ  విషయం నేనెప్పుడో వూహించాను" గట్టిగా నవ్వాడు జయంత్.

 

    "నీదాకా వస్తేనేగాని నీకు తెలీదు" అన్నాడు రాజేంద్రకుమార్ కోపంగా.

 

    "ఎవర్నీ నేను నమ్మనని నీకు తెలుసు. వ్యక్తులకు గానీ, బిజినెస్ వ్యవహారంలోగానీ, నువ్వు చేసిన అక్రమాలు, అన్యాయాలూ, మర్డర్లు గురించి రవీంద్రనాథ్. మహేంద్ర, ఆదిత్యలతోపాటు నాకూ, అందరికంటే ఎక్కువ తెల్సు. మాతో ఎప్పటికైనా ప్రమాదమని నువ్వే ఈ హత్యలు చేయిస్తున్నావని, నేనెందుకు అనుమానించగూడదు?" సహజమైన ధోరణిలో అన్నాడు జయంత్.

 

    బిత్తరపోవడం రాజేంద్రకుమార్  వంతయింది.

 

    "నేనెందుకు మిమ్మల్ని మర్డర్ చేయిస్తాను? చూడు ఫ్రెండ్! తెలివితక్కువ ఎనలైజేషన్ల వల్ల ప్రాణాలకే ప్రమాదం. అజాగ్రత్తగా వుండొద్డని నీకు ఫోన్ చేస్తున్నాను..... తర్వాత నీ ఇష్టం" చికాగ్గా చెప్పాడు రాజేంద్రకుమార్.

 

    "నేను ఫారెస్ట్ ఆఫీసర్ని..... నా జోలికి ఎవరైనా వస్తే, అడవిలో నిలువునా కాల్చి, మాది మసి చేయించేస్తాను..... డోన్ట్ వర్రీ....." ఫోన్ పెట్టేశాడు జయంత్.

 

                                          *    *    *

 

      శ్రీశైలం....

 

    దూరంగా మల్లికార్జున భ్రమరాంబస్వామి దేవాలయ గోపురం.... ఎండలో తళతళమని మెరుస్తోంది.

 

    ఆహ్లాదకరమైన ప్రకృతి.... దట్టమైన అడవులు.....

 

    దేవాలయానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో కొండ మలుపుల్లో వున్న గెస్ట్ హౌస్ లో కూర్చున్నారు మోహిత, మైత్రేయ.

 

    డైలీ పేపర్ని తిరగేస్తోందామె.

 

     మహేంద్ర మృతికి సంబంధించిన ఐటమ్ ని చూపించిందతనికి.

 

    "డాక్టర్  మురళిని పోలీసులు ఇంటరాగేట్ చేస్తే....." అనుమానంగా అడిగాడతను.

 

    "అతను డాక్టర్..... ఎవరో ఫోన్ చేస్తే, హోటల్లో వెళ్ళి, మహేంద్రని టేస్ట్ చేశానని చెప్తాడు. మనం ఎవరన్నది తెలీదని చెప్తాడు. దట్సాల్..... అయినా  దేనికైనా సాక్ష్యాలుండాలి. పోలీసులు సాక్ష్యాలు సంపాదించే టైమ్ కి, మిగతా మర్డర్స్ కూడా జరిగిపోతాయి. డోన్ట్ వర్రీ!" ధీమాగా  చెప్పింది మోహిత.

 

    "ఫారెస్ట్  ఆఫీసర్ జయంత్ కి ఎప్పుడు 'ముహుర్తం' పెట్టావ్?" అడిగాడు మైత్రేయ.

 

    "నలభై ఎనిమిది గంటల తర్వాత."

 

    "అతని అడ్రస్..... వివరాలు తెలుసా?"

 

    "తెలుసు!"

 

    "మర్డర్ ప్లాన్...."

 

    "నలభై గంటల తర్వాత చెప్తాను. తొందరపడకు...." నవ్వుతూ అంది.

 

    ఒక మర్డర్ తర్వాత, మోహిత తనతో గడుపుతానన్న విషయం మైత్రేయకి గుర్తుకొచ్చింది.

 

    ఏదో అడుగబోతున్న సమయంలో-

 

     "కాసేపు డ్రింక్ తో కాలక్షేపం చేద్దాం. వెళ్ళి డ్రింక్ బాటిల్, మంచింగ్ తీసుకురా..... వాచ్ మెన్ ని పిల్చి మంచి డిన్నర్ ఆర్డరిస్తాను" అందామె.

 

    పదినిమిషాల తర్వాత ఊళ్ళోకి బయలుదేరాడు మైత్రేయ.

 

    స్నానం చెయ్యడానికి బాత్ రూమ్ లో కెళ్ళింది మోహిత.

 

                                           *    *    *

 

    నలభై నిమిషాలు గడిచాయి.

 

    కనకాంబరం రంగు చీర, జాకెట్టు, జడలో కనకాంబరం పూలు, వడ్డాది పాపయ్య గీసిన చిత్రంలా తయారై వరండాలోకొచ్చింది. వరండాలో మెట్లమీద వాచ్ మెన్ జోగుతూ కనిపించాడు.

 

    "మంచి బిర్యానీ తెచ్చిపెడతావా.....?" అని వంద రూపాయల్ని యిచ్చింది. మరో యాభైరూపాయలు అతనికి 'టిప్' యిచ్చింది. వాచ్ మెన్కు ముప్ఫై ఏళ్ళుంటాయి.

 

    "ఈ గెస్ట్ హౌస్ కు ఫారెస్ట్ ఆఫీసర్ జయంత్ ఎప్పుడైనా వస్తుంటాడా?" అడిగిందామె.

 

    "ఎవరమ్మా! ఆ తారుడబ్బా ఆఫీసరేనా? ఎందుకు రాడమ్మా..... నెలకోసారి ఎవర్నో తీసుకుని వస్తుంటాడు."

 

    "ఎవర్నో అంటే....?"

 

    "ఇంకెవర్ని..... అమ్మాయిల్ని."

 

    "ఒక్కడే వస్తాడా? ఇంకెవరైనా వస్తారా?"

 

    "ఒక్కొక్కప్పుడు కర్నూలు నుంచి ఎవరెవరో ఆఫీసర్లు వస్తుంటారు."

 

    "అతనికి అమ్మాయిల పిచ్చి చాలా ఎక్కువ కదూ?"

 

    "పిచ్చా! చీరకొంగు కనిపించిందంటే చాలు, అది దక్కేవరకూ నిద్రపోడు. అయిదారుసార్లు ఇక్కడికొచ్చి తాగాక అమ్మాయిల్ని తెమ్మని నన్ను తినేశాడు."

 

    "తెచ్చావా?"

 

    "కర్నూలు నుంచి....."

 

    'నీకు జయంత్ తో బాగా పరిచయం వుందన్నమాట.....' మనసులో అనుకుంది.

 

    "ఇక్కడ మొసళ్ళ పార్క్ వుండాలి. వుందా?" షడన్ గా టాపిక్ మార్చింది మోహిత.

 

    "ఉందమ్మా! మూడు కిలోమీటర్ల దూరంలో. ఒకప్పుడు పది మొసళ్ళుండేవి. ఇప్పుడు అయిదే వున్నాయి" చెప్పాడతను.

 

    "రేపు ఆ మొసళ్ళ పార్క్ చూస్తాను. తీసికెళతావా?" అడిగింది మోహిత.

 

    "అలాగే!" చెప్పి వెళ్ళిపోయాడు వాచ్ మెన్.

 

                                            *    *    *

 

`    అమ్మాయిల బలహీనత..... మొసళ్ళ పార్క్ ..... జయంత్ ని ఎలా ప్లాన్డ్ గా చంపాలో ఆలోచిస్తున్న సమయంలో చేతిలో క్యారీబ్యాగ్ తో వచ్చాడు మైత్రేయ.

 

     కనకాంబరం రంగు చీరలో దేవకన్యలా కన్పిస్తున్న మోహితను రెప్పవాల్చ కుండా, ఒక్కక్షణం చూస్తూ వుండిపోయాడతను.

 

    "మీరు చీరలో బావుంటారు......" పొగిడాడు.

 

    "చీర లేకపోయినా బావుంటాను..... అంటే నైటీలో...." చిన్నగా నవ్విందామె.

 

    గ్లాసుల్ని తెచ్చి టీపాయ్ మీద పెట్టిందామె.

 

    బాటిల్ ను, సోడాల్ని, గ్రీన్ సలాడ్, క్యాజువల్స్ ని క్యారీబ్యాగ్ లోంచి తీసి సర్దాడతను.

 

    బాటిల్ ని ఓపెన్ చేసి రెండు గ్లాసుల్లో డ్రింక్ ను పోసి సోడా కలిపింది మోహిత.

 

    మౌనంగా సిప్ చేస్తున్నాడు మైత్రేయ.

 

    'ఎంత తెలివైన నేరస్థుడైనా, ఎప్పటికయినా చట్టానికి లొంగిపోక తప్పదు' అకస్మాత్తుగా ఆ మాట ఎందుకో గుర్తుకొస్తే- ఆ విషయమై ఆలోచిస్తున్నాడతను.

 

    మొదటి పెగ్ గబగబా పూర్తిచేసి, రెండో పెగ్ లోకి వెళ్ళిపోయింది మోహిత.

 

    "నీకెప్పుడైనా రొమాంటిక్ కలలు వస్తుంటాయా? అకస్మాత్తుగా అడిగిందామె.

 

    "వస్తుంటాయి."

 

    "ఎలాంటివి?"

 

    "అందమైన అమ్మాయిలతో...... శృంగారం జరిపినట్లు."

 

    "ఏ మగాడికైనా అందమయిన అమ్మాయితోనే గడిపినట్టు ఎందుకు రావాలి? వికారమయిన అమ్మాయిలు, అమ్మాయిలు కారా? వారికి సెక్స్ పరమయిన కోరికలుండవా..... కలల్లో కూడా మీ మగవాళ్ళు అమ్మాయిల్ని విభజించి చూడటం మీ మగజాతికే చెల్లు.... కొంచెం కోపంగా అంది మోహిత.

 

    "పోనీ నీకెలాంటి కలలు వస్తాయి?" అడిగాడతను.

 

    "ఇప్పుడు కసి తప్ప, కలలు లేవు.... ఒకప్పుడు నాకు చిత్రమయిన కలలొచ్చేవి, రేర్ డ్రీమ్స్."

 

    "సరదాగా చెప్పు!"

 

    "మహా పట్టణానికి దూరంగా, ఈ కృత్రిమ వాతావరణానికి దూరంగా మారుమూల పల్లెటూరు. ఆ ఊళ్ళో ఒక దేవాలయం, పక్కనే ఇల్లు. ఆ వెనక చెరువు. కాళ్ళకు, చేతులకు, ముఖానికి పసుపు రాసుకుని స్నానం చేసి, బంగారుబిందెతో నీళ్ళు పట్టుకురావడం, దేవాలయంలొ అర్చన..... పూజలు..... పట్టుచీరలో నన్ను చూసి ణా భర్త ముచ్చట పడడం, దేవాలయం వెనక స్తంభాల మండపంలొ తన కోర్కె తీర్చమని ణా భర్త ముచ్చట పడటం, నేను కాదని తిరస్కరిస్తే, అతను బలవంతంగా నన్ను అనుభవించండం.... అది కలైనా, ఆ అనుభవం నాకెంతో ఇష్టం. చాలాసార్లు నన్ను వెంటాడే కల అది..... బావుంది కదూ" నవ్వుతూ అంది మోహిత.

 Previous Page Next Page