తను భయానకంగా రేప్ కు గురైన సంఘటన జ్ఞాపకం వచ్చినప్పుడల్లా కసితో రగిలిపోతోంది మోహిత మనసు.
* * *
రాత్రి పన్నెండు గంటల నలభై అయిదు నిమిషాలు. అకస్మాత్తుగా మెలుకువ వచ్చింది మహేంద్రకు. వంటికి ఐస్ దిమ్మల చల్లదనం జివ్వుమని తగలడంతో, ఒక్క వుదుటున లేవడానికి ప్రయత్నించాడు. నర నరంలో నిండిన మత్తు అతన్ని అశక్తుడ్ని చేస్తోంది. నిలవ వుంచిన శవాల అసహ్యపు వాసన.
కళ్ళను చిట్లించుకుని నలువేపులా చూశాడు.
ఐస్ ముక్కలమీద శవాలను చూసి కెవ్వుమని కేకవేశాడు.
నెమ్మదిగా లేచి నిలబడి, ఒక్కొక్క అడుగు ముందుకేసుకు వస్తున్న మహేంద్ర-
ఎదురుగా నుంచున్న మోహితను చూసి, షాక్ తిన్నాడు.
మనిషో, దెయ్యమో అర్థంకాలేదు. సరిగ్గా అదే సమయంలో మోహిత కుడికాలితో కసిదీరా అతని గుండెలమీద తన్నింది.
శవాలమీద వెల్లకిలా పడిపోయి బాధగా మూలిగాడు మహేంద్ర. ఏ మాత్రం ఆలస్యం చేయలేదు మోహిత. బాటిల్లోని ద్రవాన్ని అతని ముఖంమీద జల్లింది.
లేవడానికి ప్రయత్నిస్తూ, బాధగా అరుస్తూ వెనక్కి పడిపోయాడు మహేంద్ర.
స్పృహలేని స్థితిలో తన స్త్రీత్వాన్ని కాలరాసిన దృశ్యం ఆమెకు గుర్తు కొచ్చింది. మనసునిండా కసి.... పగ...
శక్తినంతా కూడదీసుకుని, మహేంద్ర మెడచుట్టూ చేతుల్ని బిగించి ఊపిరాడకుండా చేస్తోందామె.
నిస్సహాయతతో గింజుకుంటున్నాడు, అరుస్తున్నాడు. మరికొద్ది క్షణాలకు అతని శ్వాసనాళాలు చిట్లిపోయాయి.
మోహిత వంటినిండా చెమటలు పట్టేశాయి.
అతను చనిపోయాడని రుజువు చేసుకున్నాక, శవాన్ని యధావిధిగా ఐస్ క్యూబ్స్ మీద పడుకో బెట్టి, బయటి కొచ్చేసింది మోహిత.
అప్పటికే ఆమెకోసం కారులో వెయిట్ చేస్తున్నాడు డాక్టర్ మురళి.
"ఎవ్విరిథింగ్ ఓ.కె....." అన్నాడు మురళి.
"ఫర్ ఫెక్ట్ లీ ఓ.కె...." దీర్ఘంగా నిట్టూరుస్తూ చెప్పింది మోహిత.
"ఆల్ ద బెస్ట్ మోహిత..... బట్ బీకేర్ పుల్ ..... నాకు ఫోన్ చెయ్యండి, ఏమయినా యింపార్టెంట్ న్యూస్ వుంటే చెప్తాను" చెప్పి తన రెసిడెన్స్ ముందు దిగిపోయాడు డాక్టర్ మురళి.
ఆ కారు జగపతి ఇంటర్నేషనల్ హోటల్ ముందు ఆగింది.
అప్పుడు రాత్రి రెండు గంటలైంది.
* * *
హోటల్ రూమ్ లో ట్యూబ్ లైటు వెలుగు పున్నమి వెన్నెల్లా వుంది. నిస్త్రాణంగా బెడ్ మీద వాలిపోయి, ఫ్యాన్ వేపు చూస్తోంది మోహిత. స్టార్ టీ.వి.లో వస్తున్నా ఇంగ్లీషు కామెడీ సినిమాను చూస్తున్నాడు మైత్రేయ.
మార్చురీ రూమ్ లో మహేంద్రని, మోహిత నిజంగా చంపేసిందా? ఆడవాళ్ళ పగని మాటల్లో వినడం తప్ప, చేతల్లో అతనెప్పుడూ చూడలేదు.
"మహేంద్రని చంపేశావా?" నెమ్మదిగా అడిగాడతను.
"వెంటనే జవాబు చెప్పలేదు.
"భయపడుతున్నావా మైత్రేయ....?" మోహిత ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పలేకపోయాడతను.
బెడ్ మీద లేచి వళ్ళు విరుచుకుంది మోహిత. ఆ సమయంలో ఆమె బ్లూ కలర్ చీర పైట జారి కిందకు పడిపోయింది. ఆ పైటని సర్దుకోలేదామె.
సూట్ కేస్ లోంచి బ్లూ రిబండ్ డ్యూయట్ బాటిల్ తీసి, సగం డ్రింక్ ని గ్లాసులో పోసుకుని గడగడా తాగేసింది. ఒక్కక్షణం కళ్ళు మూసుకుంది.
ఆ సమయంలో జలపాతం దగ్గర తనకు దొరికిన గోల్డ్ చెయిన్ ను జేబులోంచి తీసి, చప్పుడు చేయకుండా ఆమె ముందుకెళ్ళి "మోహితా...." అని పిలిచాడు మైత్రేయ.
కళ్ళిప్పి, గోల్డ్ చెయిన్ ను ఆశ్చర్యంగా చూసి-
"ఇది నీకెక్కడిది?" అడిగింది.
"జలపాతం దగ్గర దొరికింది.... నీదేనా?" అంటూ ఆమె మెడకు తొడగబోయాడు.
"ఇది నువ్వు నా మెడలో వెయ్యడానికి చాలా టైముంది! తొందరపడకు" అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అందామె.
"ఆశపడడం తొందరపడడమా?" తెల్లగా మెరుస్తున్న ఆమె భుజాలమీద చేతులు వేస్తూ అన్నాడతను.
ఆ గోల్డ్ చెయిన్ ని తీసుకుని తన హేండ్ బ్యాగ్ లో పడేసి-
"ప్రస్తుతానికి ముద్దు చాల్లే....." అంటే అతని బుగ్గమీద చిన్నగా ముద్దు పెట్టి, బెడ్ మీదకు చేరింది.
అర్థంకాని పజిల్ ను సాల్వ్ చేస్తున్నవాడిలా మోహిత వేపు చూశాడతను.
"రేపుదయన్నే మనం రూమ్ వెకేట్ చేస్తున్నాం....." పడుకునేముందు చెప్పింది మోహిత.
* * *
ఉదయం ఆరుగంటలు.....
మోహిత స్నానం చేస్తోంది. బయట వరండాలో పచార్లు చేస్తున్నాడు మైత్రేయ.
"హలో....." అకస్మాత్తుగా విన్పించిన పిలుపుకి తల తిప్పాడతను.
ఎదురుగా శిల్ప....
"మీకోసం ఆఫీసంతా బెంగపెట్టుకుంటే, మీరిక్కడ యిలా..... అజ్ఞాత వాసమా?" పసుపుపచ్చని చుడీదార్- పైజామా, పెదవులకు ఎర్రని లిప్ స్టిక్. నవ్వుతూ వచ్చి ఎదురుగా నుంచుంది శిల్ప.
"మీరేంటి యిక్కడ...... ఆఫీస్ విశేషాలేమిటి?" గబగబా అడిగాడు మైత్రేయ.
"మాటలన్నీ నిలబడేనా..... కమాన్ రండీ.... క్యాంటీన్ లో కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం" అందామె.
ఇద్దరూ గ్రౌండ్ ఫ్లోర్ లో కొన్ని క్యాంటీన్ లోకి నడిచారు. ఎదురెదురుగా కూర్చున్నారు.
"మీరో మర్డర్ కేస్ లో ఇన్ వాల్వ్ అయ్యారని, పోలీసులు అరెస్ట్ చేశారని, ఆఫీసునిండా పుకార్లు.... అసలేం జరిగింది మహానుభావా?" అడిగింది శిల్ప.
"ఇన్ వాల్వ్ కాలేదు, యిరుక్కున్నాను...... ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం లేదు ఇవాళో, రేపో బాస్ కి ఫోన్ చెయ్యాలనుకుంటున్నాను."
"మీకో బ్యాడ్ న్యూస్ .... మీనుంచి అమ్యూనికేషన్ లేకపోవడంతో మీ ప్లేస్ లో ఇంకొకర్ని అపాయింట్ చేసేశారు. బైదిబై నేనుకూడా రిజైన్ చేసేసాను."
"కమ్యూనికేషన్ చెయ్యకపోవడం నాదే తప్పు. మీరెందుకు రిజైన్ చేశారు?"
బేరర్ రెండు కప్పులతో కాఫీ తెచ్చిమ్ టేబిల్ మీద పెట్టాడు.
"మీరు పెళ్ళి చేసుకోకపొతే, నన్నెవరూ చేసుకోరనుకున్నారా....." కాఫీని సిప్ చేస్తూ అంది శిల్ప.
"ఇప్పుడు కూడా జోకులేనా.....? సీరియస్ గా అడుగుతున్నాను చెప్పండి."
"పెళ్ళి సంబంధం కుదిరిందిలెండి...."
"కంగ్రాట్స్! పెళ్ళెప్పుడు..... మీ ఉబ్ బీ ఏం చేస్తుంటారు?"
"నెలరోజుల్లో పెళ్ళి..... ఆయన ఆమెరికాలో సాప్ట్ వేర్ ఇంజనీర్" చెప్పింది శిల్ప.
సరిగ్గా అదే సమయంలో వాళ్ళ టేబిల్ దగ్గరకు ఓ యువకుడు వచ్చాడు.
"బైదిబై.... మీట్ మిష్టర్ రవి..... మై ఉడ్ బీ!" పరిచయం చేసింది శిల్ప.
"మా కొలీగ్ మైత్రేయ...... చాలా డేరింగ్ అండ్ డాషింగ్ లెండి..... నేనంటే తెగప్రేమ! నన్ను పెళ్ళిచేసుకోవాలని తెగ తినేసాడీయన.... ఇంతలో మీరు దొరికారు. అవునా మైత్రేయగారూ!" గలగలా నవ్వుతూ అందామె.
"మిష్టర్ రవి..... అవన్నీ జోకులు. నమ్మకండి....." కంగారుపడుతూ అన్నాడు మైత్రేయ.
"ఆవిడ ప్రాక్టికల్ జోక్స్ నాకు తెల్సులెండి..... కంగారుపడకండి" తనూ నవ్వుతూ అన్నాడు రవి.
"ఎక్కడున్నా మీ పెళ్ళికొస్తాను" లేచి నిలబడుతూ అన్నాడు మైత్రేయ. సరిగ్గా అదే సమయంలో అక్కడికొచ్చింది మోహిత.
"సీయూ!" ఇద్దరికీ చెప్పేసి మోహితవేపు నడిచాడు మైత్రేయ.
మోహితవేపే కళ్ళార్పకుండా చూసింది శిల్ప.
'గురుడు ఉద్యోగం ఎందుకు మానేసాడో ఇప్పుడర్థమయింది' మనసులో అనుకుంది శిల్ప.
మైత్రేయ పక్కన మోహితను, ఆమె అందాన్ని చూసి అసూయపడిందామె.
* * *
మరో అరగంట తర్వాత-
సీరియస్ గా ఆలోచిస్తూ, కారు డ్రైవ్ చేస్తోంది మోహిత.
"ఇప్పుడు మనం ఎక్కడికి వెళుతున్నాం....." అడిగాడు మైత్రేయ.
"శ్రీశైలం....." బదులిచ్చింది మోహిత.
"లిస్ట్ లో రెండోవ్యక్తి ఫారెస్ట్ ఆఫీసర్ జయంతా?" ప్రశ్నించాడు మైత్రేయ. జావాబు చెప్పలేదామె.
* * *
మూడోనాడు, ఉదయం.....
విజయవాడ సిటీలో మహేంద్ర మరణవార్త సెన్సేషన్ సృష్టించింది జిల్లా ఎస్పీ ఆఫీస్ లో. ఎస్పీ ఎదురుగా నుంచున్నారు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు. అందులో ఒకరు మహేంద్ర అల్లుడు సాబ్ ఇన్ స్పెక్టర్ శ్రీధర్.
"నిన్న హోటల్ నీలకంఠలో, మీ మావయ్య మహేంద్ర ఒక యువకుడితో పాటు డ్రింక్ తీసుకున్నాడు. ఆ యువకుడిపాటు ఒక మహిళ కూడా వుందని హోటల్ మేనేజర్ చెప్పాడు. హోటల్ రూమ్ బుక్ చేసినా, డ్రింక్ పార్టీకి అరగంట ముందు మాత్రమే వాళ్ళిద్దరూ ఆ హోటల్ రూమ్ కి వచ్చార్ట. తర్వాత ఏమయ్యారో తెలీదు. ఎంట్రీ రిజిష్టర్లో మైసూర్ అడ్రస్ వుంది" చెప్పాడు శ్రీధర్.
"మైసూర్ పోలీసులకు మెసేజ్ ఇచ్చి, ఎంక్వైరీ చెయ్యమనండి. బైదిబై స్పృహ కోల్పోయిన మహేంద్రని ఫస్ట్ టెస్ట్ చేసిన డాక్టర్ ఎవరు? అతన్ని పిల్చిందెవరు?" ఎస్పీ అడిగాడు.
"ప్రైవేట్ డాక్టర్..... వివరాలు తెలియవు."
"ఆ డాక్టర్ ఎవరో కనుక్కోండి.....? అలాగే మహేంద్ర వుంచుకున్న అమ్మాయి ఇంతవరకూ మీకు గానీ, మీ భార్యకు గానీ, మీ అత్తగారిక్కూడా తెలీకపోవడం విచిత్రంగా వుంది."
"కనీసం మా అత్తగారిక్కూడా తెలీకపోవడం నాకాశ్చర్యంగా వుంది."
"ఆ అమ్మాయిని డిటైల్డ్ గా ఎంక్వైరీ చెయ్యండి....." లేచి నిలబడ్డాడు ఎస్పీ. ఇద్దరు ఇన్ స్పెక్టర్లూ బయటికి వచ్చేశారు.
* * *
మైసూర్ ఉదయం ఎనిమిది గంటలు.
ఆ రోజు పేపర్ని చూస్తున్న రాజేంద్రకుమార్ కి ఆ వార్త చూడగానే మతిపోయింది.
ఐ.పి.ఎస్. మాజీ అధికారి మహేంద్ర అనుమానాస్పద మృతి.
గబగబా ఆ వార్తను చదివాడు రాజేంద్రకుమార్. భయంతో కంపించి పోయాడు.
వెంటనే అతని ఆలోచనల్లో మోహిత మెదిలింది.
కంట్రాక్టరుగా తను చేస్తున్న అక్రమాల గురించి, ఆమెకు తను చేసిన అన్యాయం గురించి, సాక్ష్యాలతో సహా కోర్టుకెళతానని బెదిరించిన మోహిత నోరు మూయించడానికి పది లక్షల ఆస్తిని ఆమెకిచ్చాడు. డబ్బుతో ఆమెకు తోచిన విధంగా బతుకుతుందకున్నాడే గానీ, కొన్ని నెలల నిశ్శబ్దము తర్వాత.......