జె.జె. సమాధానం ఇవ్వకుండా అక్కడే వున్న పర్సనల్ హోమ్ బార్ కౌంటర్ మీదున్న టేప్ రికార్డర్ ని తెమ్మన్నట్లు సైగ చేశాడు.
డిక్ చకచకా వెళ్ళి టేప్ రికార్డర్ ని తీసుకొచ్చాడు.
"నా జీవితంలో నీకు తెలీని రహస్యమేముంది డిక్? కమాన్ ఆన్ దట్ టేప్ రికార్డర్" అన్నాడు ఆప్యాయంగా జె.జె.
డిక్ టేప్ రికార్డర్ ప్లే బటన్ నొక్కి చెవులు రిక్కించి వినసాగాడు.
టేప్ రికార్డర్ స్మూత్ గా రన్ అవుతోంది.
"డెబ్బై ఏండ్లు అనవరతం శ్రమించి ఈ మెగా ఎంఫైర్ ని క్రియేట్ చేశాను.... సంపాదించడం, విస్తరించుకోవడం అనే అబ్సెషన్ లో మనీ మేకింగ్ యంత్రంగా మారిపోయాను. క్రమక్షీణ ఉపాంత ప్రయోజన సిద్దాంతం ఏ ఇండస్ట్రియలిస్ట్ కి వర్తించదని నాకనిపిస్తుంది. కోరిక పరిమితమయినప్పుడు అభివృద్ధి మందగించిపోతుంది. టాటాలు, బిర్లాలు, అంబానీలు, నాలాంటి జె.జె.లు మరెంతమందో ఏ ఒక్కచోటైనా ఆగి తృప్తికి మించింది లేదు.....అందులోనే గొప్ప ఆనందం వుందని భావిస్తే దేశంలో, ప్రపంచంలో యింత సంపద క్రియేట్ కాదు. ప్రతి ఒక్కరూ ఎంటర్ ప్రెన్యూర్ కాలేరు. అయినప్పుడు మా గొప్పేం లేదని మేమే అంగీకరిస్తాం.
కోరిక.. కోరిక వేరు, ఆశ వేరు, దురాశ వేరు. రిక్షావాలా రిక్షా నుంచి ఆటోకి మారాలనుకోవడం కోరిక కాకపోతే ఆశ అవుతుంది. అదే ఏ.సి. మారుతీలో తిరగాలను కోవడం దురాశ అవుతుంది.
నాకు దురాశ లేదు. కేవలం కోరిక వుంది. అర్ధం పర్ధం లేకుండా విలువైన కాలాన్ని అభిమాన హీరోకి ప్రచారం చేసిపెట్టడం కూడా అబ్సెషనే. అది మానసిక రుగ్మత. నా అబ్సెషన్ రుగ్మత కాదు. పారిశ్రామికవేత్త అబ్సెషన్ ఎప్పుడూ దేశానికి మేలే చేస్తుంది. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే నా పోరాట విధానంలో తప్పులేదని, తప్పు కాదని చెప్పడానికే సో... నీవు ఆవేపు ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చెయ్యవద్దు.
ఉన్నది చాలు, దానితోనే తృప్తిపడాలి. తృప్తికి మించిన ఆనందం లేదు కోర్కెలు లేనివాడు మహా భోగి. దిసీజ్ ఆల్ బ్లడీ ట్రాష్ మనిషి అభివృద్దికి అడ్డువేసే పనికిరాని మెట్టవేదాంతం, చాదస్తంగా నేను వాటిని భావిస్తాను. జపాన్ నాలాగా భావించబట్టే యింకా పైకి వెళుతోంది. వెళ్ళాలి... వెళుతుంది.
గుండుసూది కావాలన్నా జపాన్ మీద ఆధారపడడం మన దేశానికి, ప్రభుత్వాలకీ, పరిశ్రమాధికారులకి సిగ్గుగా అనిపించకపోయినా, కేవలం గుండుసూదికి కూడా ఎన్నో దేశాలు తమమీద ఆధారపడడం జపాన్ గర్వంగా భావిస్తోంది.
చివరికి రష్యా, చైనాలలో కూడా మోడరైజేషన్ ఆఫ్ ధి నేషన్.... లేటెస్ట్ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్... పెరిస్త్రోయికా... ఏమిటివన్నీ...? అభివృద్ధి చెందాలనే కదా...? ఇతర అభివృద్ధి చెందిన దేశాల సరసన పీట వేసుక్కూర్చోవాలనే గదా?
ఏది ఏమైనా నేనో జెయింట్ ఇండస్ట్రియలిస్ట్ మెగాలిత్ ని స్థాపించాను.
ఆడి, ఆడి ఈ ఆటలో అలసిపోయాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటూంటే లక్షలమంది నా మెగాలిత్ గొడుగు క్రింద సేదతీరుతూ కనిపిస్తున్నారు. కొన్ని లక్షల కుటుంబాలు నా ఎంఫైర్ కి సేవ చేస్తూ బ్రతుకుతున్నారు.
నేను పోతే వారి భవిష్యత్ ఏమిటి?
వాళ్ళ ఆలనా పాలనా చూసేదెవరు?
ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే.... ఇంతకాలం మనుష్యులు దాచుకోవడానికి, వారి జీవితాలు సుఖంగా వుండడానికి ఎన్నో వస్తువులు తయారుచేసాను... నాణ్యతే మారుపేరుగా తయారుచేశాను. ఆ విధంగా సొసైటీకి, దేశానికి, దేశాలకీ మేలు చేస్తున్నానన్న విశ్వాసం, తృప్తి నాకుండేధి. ఇప్పుడు అంతకంటే తృప్తిని కలిగించే మరో విషయం ఏమిటంటే ఎందరికి జీవనోభ్రుతి కలిగించానో గదా... ఎందరి తెలివితేటలుకో విలువ కట్టాను కదా అని అనిపిస్తోంది.
అదలాగే మిగిలిపోవాలంటే నా వారసులు సమర్ధులు కావాలి. ఇప్పటివరకు నిన్నే నా వారసురాలిగా భావిస్తున్నాను. భవిష్యత్తులో నె౩ఎ సామర్ధ్యం రుజువైతే నువ్వే వారసురాలివవుతావు. లేదంటే నిర్దాక్షిణ్యంగా నిన్ను తప్పిస్తాను తల్లీ నీవు మేనేజ్ చేసుకోగలంత ఆస్థి మాత్రమే నీకు రాస్తాను. లక్షల మందిని నిరాశ్రయుల్ని చేయలేను. వాళ్ళందర్నీ పాపర్స్ ని చేసి రోడ్దెక్కించలేను. నా మనుమరాలివన్న ఒకే ఒక్క హక్కుతో లక్షలమంది జీవితాలతో ఆడుకోవడం పాశవికమవుతుంది.
సమర్ధులు కానప్పుడు ఇది నా తప్పనిసరి నిర్ణయం. రక్తసంబంధం, ప్రేమపాశం, అభిమానం అంటే ఆరాధించేవారికి నేను పరమ కిరాతకుడిగా అనిపించవచ్చు. బట్ ఐ కేర్ ఏ పిన్...
రికార్డర్ తిరుగుతూనే వుంది. మాటలేం రావడంలేదు.
చల్లని ఈదురుగాలి మొదలైంది క్ల్రమంగా డిక్ జె.జె. కేసి ఆరాధనా పూర్వకంగా చూశాడు.
జె.జె. కూడా టేప్ లో వస్తున్న మాటల్ని ఒక ప్రక్క వింటూ, మరోప్రక్క ఏదో ఆలోచిస్తున్నాడు.
"ప్రపంచ కార్ల పరిశ్రమను శాసించే హెన్రీఫోర్డ్ ఓసారి వరల్డ్ డీలర్స్ కాన్ఫరెన్స్ కి ఫిలడెల్ఫియా వెళ్ళాడట. మార్గమధ్యంలో తాను ప్రయాణిస్తున్న కారులో పెట్రోలు అయిపోవడంతో డ్రైవర్ తన కారుని ఒక బంక్ లోకి తీసుకెళ్ళి టాంక్ ఫిల్ చేయమని తాళపు చేతులు ఆ బంక్ లో పనిచేసే ఓ యువకుడి కిచ్చాడట. అతను టాంక్ ఫిల్ చేసి కీస్ డ్రైవర్ కిచ్చేసి వెనుక సీటులో వున్న ఫోర్డ్ ని చూసి "బావున్నారా తాతగారు?" అని అడిగాడట.
దాంతో ఆ డ్రైవర్ ఆ యువకుడ్ని తేరిపార చూసి షాక్ తిన్నాడట. అతను స్వయాన హెన్రీఫోర్డ్ కి మనుమడు... హెన్రీఫోర్డ్-2 అట.
ఆ తాతగారు పరమానందభరితుడై "యూ ఆర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్... ఐయామ్ వెరీ హేపీ. శ్రమ విలువ తెలుసుకుంటున్న నువ్వు రేపు మన ఫోర్డ్ ఆటోమొబైల్ ఎంఫైర్ ని ఈజీగా రన్ చేయగలవు. నేనెంత శ్రమపడి మన ఆటోమొబైల్ ఎంఫైర్ ని సృష్టించానన్నది నీకు అర్ధమయి పోతుంది. బట్ ఎడ్యుకేషన్ జాగ్రత్త. వెళ్ళిరానా?" అని అడిగాడట మనవడ్ని. ఆ మనుమడు తాతగారి చేతిని ముద్దాడి వెళ్ళి రమ్మన్నట్లుగా సైగ చేసాడట. ఇప్పుడు ఆ యువకుడే ఫోర్డ్ ఎంఫైర్ కి బిగ్ బాస్... హెన్రీ ఫోర్డ్-2.
అప్పట్లో ఆ యువకుడు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదువుతూ, మరో ప్రక్క పెట్రోల్ బంక్ లో పనిచేస్తూ తన ప్యాకెట్ ఎక్స్ పెన్సెడ్ థానే సంపాదించుకునే వాడట.
ఆ హెన్రీఫోర్డ్-2 నాకుమంచి ఫ్రెండ్. అతన్ని ఎక్కడున్నా పార్టీలో కల్సినప్పుడల్లా నాకలాంటి వారసులుంటే ఎంత బావుందని అనుకుంటున్నాను.
అంతలో హాట్ లైట్ సిగ్నల్ ఇవ్వడంతో డిక్ టేప్ ని ఆఫ్ చేశాడు.
` "హలో... జె.జె. దిస్ సైడ్..." జె.జె. గొంతు గంభీరంగా వుంది.
ఎంతో ముఖ్యమైన మెసేజ్ వుంటే తప్ప దాన్ని జె.జె. కి పాస్ చేయరు.
చాలావరకు క్రింద లెవెల్లోనే ఫిల్టర్ అయిపోతుంటాయి.
రొటీన్ అండ్ ఇంపార్టెంట్ బిజినెస్ మేటర్ మాట్లాడుతున్నాడు జె.జె. లైన్ కట్ అవగానే టేప్ ఆఫ్ చేయాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు డిక్ వాషర్ మన్.
* * * * *
"సాధారణంగా హీరోయిన్ ని ఇంప్రెస్ చేయడానికో, హీరోయిన్ తో పరిచయం పెంచుకోవడానికో హీరో హీరోయిన్ ని రక్షిస్తాడు. లేదా తనే పదిమంది కిరాయి గూండాలను పెట్టి హీరోయిన్ ని అల్లరి చేయమని, సరిగ్గా వాళ్ళు అల్లరి చేసే టైమ్ కి హీరో వెళ్ళి వాళ్ళని చితగ్గొట్టి హీరోయిన్ ముందు హీరోలా ఫోజ్ కొడతాడు."
మౌనిక ఫక్కున నవ్వేసింది.
"ఇదేంటంకుల్ సిల్లీగా వుంది. హీరో కావాలంటే రౌడీల్లా కొట్టాలా...? అంటే మీ ఉద్దేశంలో కుస్తీపట్టేవాళ్ళు, కండలు పెంచిన వాళ్ళంతా హీరోలేనా? హీరోకి అర్ధం అదా?" ఆమె నవ్వుతూనే అడిగింది.
రమణయ్య బుర్ర గోక్కున్నాడు.
"ఏమోనమ్మా..... మన సినిమాల్లో అలాగే చూపిస్తారు. అయినా ఇప్పుడది రివర్సయిందిగా? హీరోయినే హీరోకి పరిచయం కావాలి. నలుగురు రౌడీల్ని మాధుర్ మీదకి ఉసిగొల్పుతాను. నువ్వెళ్ళి రక్షిస్తావా?"
మౌనిక ఇంకా పెద్దగా నవ్వింది.
రమణయ్యకు అదంతా అయోమయంగా అనిపించింది.
"అప్పుడు నేను హీరోయిన్ ని కాదు....హీరోనవుతాగా? ఒక ఆడపిల్ల అదీ ఫిజికల్ గా పోరాడి తనను రక్షించడం చిన్నతనంగా భావిస్తే సిగ్గుపడిపోడూ?"
"నిజమేనమ్మా..."
"అయినా పదిమంది రౌడీల్ని ఒక మనిషి కొట్టడం చాలా కష్టం అంకుల్! అది నేనయితే మరీ ఘోరం" ఆమె కదంతా ఫన్నీగా వుంది.
"ఇంకెలా....?" రమణయ్యకేం బోధపడక ఆమెకేసి పిచ్చిచూపులు చూసాడు.