Previous Page Next Page 
గోడచాటు ముద్దు పేజి 22

  

     "మా ఆవిడ్ని నేను గోడచాటున రహస్యంగా ముద్దుపెట్టుకోవడం మీకు థ్రిల్ ను కలిగించి వుండొచ్చు. అలాంటి దృశ్యాలను చూడాలని ఈ వయసులో అన్పించడం సహజం"
   
    శివాజీ మాటల్ని వింటూ అతనిలోని విభిన్నమైన వ్యక్తిత్వాన్ని చూస్తోంది మయూష.
   
    "ఒకరకంగా నేను మిమ్మల్ని ఇలాంటిచోట ఎందుకు కలుసుకోవాలనుకున్నానంటే ఒక ఇరవైరోజుల్లో మీ పెళ్ళనుకుంటాను కదూ" ఆ మాట వినగానే ఏదో తప్పుచేసినదానిలా అతనివేపు చూస్తూ ఉందిపోయిందామె.
   
    "పెద్ద కుటుంబంలోకి ఒక పెద్ద ఇండస్ట్రియిలిస్ట్ కి భార్యగా వెళుతున్నారని మా ఆవిడ చెప్పగా విని చాలా ఆనందించాను. ఎందుకో మీకు పెళ్ళి అని వినగానే ఒక్కక్షణం నేను దిగాలుపడిపోయాను. ఎనీ హౌ ఇన్ని విషయాలు మీకెందుకు ఇంత ఫ్రాంక్ గా చెపుతున్నానో తెలుసా?
   
    ఐ లవ్ యూ గాయత్రిని నేను పెళ్ళిచేసుకోకముందు నేను గనక మిమ్మల్ని చూసుంటే ఈ భూప్రపంచాన్ని అటునుంచి ఇటు తిప్పయినా మిమ్మల్నే పెళ్ళి చేసుకునేవాణ్ని. అపురూపమైన అందం మీది.
   
    ఈ విషయం చెప్పడానికి మరి నాకెప్పుడూ అవకాశం కలగదని నాకు తెలుసు. మీరేమనుకున్నా సరే. అందుకే చెపుతున్నాను. మీకభ్యంతరం లేకపోతే నన్నొక ఫ్రెండ్ గా గుర్తుంచుకోండి చాలు" లేచి నిలబడ్డాడు శివాజీ.
   
    అయిదు నిమిషాల తర్వాత స్కూటర్ మీద వెళ్ళిపోయాడు.
   
    అలవోకగా స్తంభంమీద చెయ్యిపడితే కరెంట్ షాక్ కొట్టిన దానిలా అయిపోయింది మయూష పరస్థితి.
   
    ఎన్నెన్నో జీవన వాస్తవాల్ని బోధించిన పుస్తకంలా అనిపించాడు శివాజీ.
   
    ముందుకు కదిలింది. "మీ కభ్యంతరం లేకపోతే నన్నొక ఫ్రెండ్ గా గుర్తుంచుకోండి చాలు" ఆ మాట అంటున్నప్పుడు నిర్మల మైన అతని ముఖం గుర్తుకొస్తోంది మయూష.
   
    సిటీ బస్సులో కూర్చున్నాక ఆమెకో చిత్రమైన సందేహం వచ్చింది.
   
    వాళ్ళిద్దరి గోడచాటు ముద్దు వ్యవహారాన్ని తను చూస్తున్నట్టుగా ఒక్క శివాజీకి తెలుసా....లేక గాయత్రికి కూడా తెలుసా?
   
    శివాజీ గాయత్రికి చెప్పే వుంటాడు.
   
    రేపు గాయత్రిని తనేవిధంగా చూడగలుగుతుంది? ఆ ఆలోచనతో తనలో తాను సిగ్గుపడిపోయింది మయూష మనసు.
   
                                                   *    *    *    *
   

    నాలుగు రోజుల తర్వాత-
   
    తండ్రి పీతాంబరం తన చేతిలో పెట్టిన పెళ్ళి కార్డువేపు కన్నార్పకుండా ఒక్కక్షణం చూసి, సిగ్గుపడుతూ ఆ కార్డుతోసహా తన రూమ్ లోకి వెళ్ళిపోయింది మయూష.
   
    "అమ్మాయ్ నిన్ననే నవనీత్ అమెరికా వెళ్ళాడు. పెళ్ళికి టంచనుగా వచ్చేస్తానన్నాడు" కేకేసి చెప్పాడు పీతాంబరం.
   
    ఆ తర్వాత పనులు చకచకా జరిగిపోయాయి.
   
    పీతాబరం యింటికి పెళ్ళి కళ వచ్చేసింది. ఇరవై రోజులపాటు మయూష కాలేజీకి సెలవు పెట్టేసింది.
   
    పెళ్ళయినా ఫర్వాలేదు. వీలు చూసుకొని పరీక్షలు రాసేస్తే డిగ్రీ వస్తుంది. ఒకప్పుడయితే డిగ్రీ రాగానే బ్యాంక్ టెస్ట్ రాయాలనుకుంది. నాలుగురాళ్ళు సంపాదించి తండ్రి భారాన్ని పంచుకోవాలనుకుంది.
   
    ఇప్పుడా సమస్యలేవీ లేవు.
   
    అందరికీ బట్టలు, మయూషకు పెళ్ళి బట్టలు పెళ్ళిపీటలమీదకు, శోభనానికి ఖరీదయిన బెనారస్ జరీ చీరలు. అలాగే యింట్లో ఆడాళ్లకు చీరలు మరీ ముఖ్యంగా పెళ్ళికొచ్చేదగ్గరి బంధువులకు పెట్టడానికి చీరలు అన్నింటికి దాదాపు లక్షరూపాయలు అయిపోయాయి.
   
    పెళ్ళింకా అయిదు రోజులుందనగా ఓ రోజు రాత్రి కుటుంబసమావేశం జరిగింది. తన నిర్ణయాన్ని చెప్పాడు పీతాంబరం.
   
    "మయూష పెళ్ళయ్యాక మనకు సగం భారం తగ్గిపోయినట్టే దాని బతుకేదో అది బతుకుతుంది వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకుని శర్మచేత స్వంతంగా బిజినెస్ పెట్టించి వాడితోపాటు నేనూ చూసుకుంటున్నాను" ఆ నిర్ణయం అందరికీ నచ్చింది.
   
    "ఇంకా మూడేళ్ళేగదా మీ సర్వీస్ వున్నది" అన్నాడు కొడుకు శర్మ.
   
    "పనిలో పనిగా హయత్ నగర్ ఏరియాలో ఒక ఫ్లాట్ తీసుకోవాలనుకుంటున్నాను ఎల్.ఐ.సి లోన్ మీద నెమ్మదిగా మూడుగదుల ఇల్లు కట్టుకొంటే అద్దె ఇళ్ళ బెడద తప్పిపోతుంది."
   
    "ఎప్పట్నుంచో పోరు పెడుతున్నాను. ఇన్నాళ్ళకు మీకో మంచి ఆలోచన వచ్చింది. పదిహేనేళ్ళయింది ఈ యింటికొచ్చి ఇంకా ఎన్నాళ్ళు?" మామూలుగా అంది శారదాంబ.
   
    "పాతికేళ్ళయింది మన పెళ్ళయి నీతోకూడా నాకు బోర్ కొట్టేస్తుంది" అంటూ జోకేసి లేచాడు పీతాంబరం.
   
    ఆ మాటకు కోడలు మాలతి నవ్వడంతో శారదాంబ అలిగినట్లుగా భర్తవేపు చూసి వంటగదిలో కెళ్ళిపోయింది సిగ్గుపడుతూ.
   
    శాంతి ఎప్పుడు యుద్దానికి ముందు యుద్ధం తరువాత మాత్రమే నెలకొని వుంటుందట. అలాగే ఆనందం, సంతోషం అంటే దీని తరువాత_?
   
    మయూషకు ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో తెలీదు. ఆ ఆలోచన వస్తూనే ఒక్కక్షణం వణికిపోయింది.
   
    చిన్నప్పటినుంచీ తనతో కలిసిమెలిసి తిరిగిన ఫ్రెండ్స్ ఎడ్రెసుల్ని డైరీలో చూస్తూ పెళ్ళికార్డులమీద రాస్తోంది మయూష.
   
    కాలేజీ ఫ్రెండ్స్ లిస్టు దగ్గర భార్గవి పేరు అప్రయత్నంగా రాయబోయి ఆగిపోయింది.
   
    భార్గవి.
   
    క్షణకాలంపాటు మయూష మనసంతా దుఃఖభరితమైయింది.
   
    వెంటనే ఆమెకు జ్వాలాముఖిరావు జ్ఞాపకానికొచ్చాడు.
   
    "ఇడియట్" కసిగా అనుకుందామె. ప్రస్తుతం అతను యింకో అమ్మాయిని వలలో చేసుకోడానికి ప్లాన్స్ వేస్తుండొచ్చు.
   
    ఆ అమ్మాయి అతని ట్రాప్ లో ఇరుక్కుపోయి సాలెగూట్లో పురుగులా విలవిల్లాడుతుంటుందేమో?
   
    అలాంటి పరిస్థితిలో తనే వుంటే?
   
    నో.....నెవర్, అతన్ని నడిరోడ్డుమీద నిలబెట్టి షూట్ చేసేస్తుంది తను తనలోని ఆత్మవిశ్వాసం తనకు తెలుసు.
   
    తననెవరూ  మోసం చెయ్యలేరు. గర్వంగా అనుకుంది ఆమె. మిగతా కార్డులమీద పేర్లను రాయడం ప్రారంభించింది.
   
                                          *    *    *    *
   

    ఇంకా మూడు రోజులే పెళ్లుంది. ఇల్లంతా చుట్టాలితోనూ నిండిపోయింది.
   
    ఆమెను పెళ్ళికూతుర్ని చేసేసారు.
   
    మర్నాడే అందరూ తిరుపతికి బయలుదేరి వెళుతున్నారు.
   
    "పెళ్ళి కొడుకు తరపున ముత్తయిదువులు ఎవరయినా వస్తున్నారా లేదా?" ఒక సమయంలో అనుమానంగా అడిగింది శారదాంబ.
   
    "ఎందుకు రారు. అబ్బాయి వాళ్ళ కంపెనీలో పనిచేసే పతిగారున్నారు. వాళ్ళావిడ ఉంది. ఇంకా ఒకరిద్దరు మనకు తిరుపతిలో కలుస్తారు. తిరుపతిలో అయిదు గెస్ట్ హౌసుల్ని ఇప్పటికే మన కోసం బుక్ చేసారట" చెప్పాడు పీతాంబరం ఆనందంగా.
   
                                                                       *    *    *    *

 Previous Page Next Page