Previous Page Next Page 
గోడచాటు ముద్దు పేజి 21

   

    తల దువ్వుకుంటూ కిచెన్ రూమ్ లో కొచ్చింది మయూష.
   
    అప్పుడు వినబడింది తండ్రి పిలుపు వెంటనే తండ్రి గదిలోకి పరుగు దీసింది.
   
    "కూర్చోమ్మా"
   
    పీతాంబరం ముఖం సీరియస్ గా వుంది. స్టూల్ మీద కూర్చుని తండ్రి ముఖంలోకి చూసింది.
   
    ఆయన చెప్పటం ప్రారంభించాడు.
   
    "నీ విషయంలోనూ, నా విషయంలోనూ అనుకొని పరిణామాలన్నీ జరిగాయి. ఇవి దైవ సంకల్పం కాదంటావా? అందుచేత మనకు తెల్సేది ఏమిటంటే మన చేతుల్లో ఏమీలేదని. ఇంతకీ నీకు నవనీత్ నచ్చాడా?"
   
    తండ్రి నోట్లోంచి ఆ ప్రశ్న రాగానే అంతవరకూ ఆయన వేపు చూస్తున్న మయూష తల దించుకుంది.
   
    "నీ మనసులో మాట నాకు కాకపోతే ఇంకెవరితో చెప్తావ్ తల్లి చెప్పు. నీకేమైనా సందేహాలుంటే నన్నడుగు"
   
    ఒక్క క్షణం తర్వాత చెప్పిందామె.
   
    నవనీత్ తనతో ఏం మాట్లాడాడో, తదితర విషయాలు అన్ని చెప్పింది.
   
    "ఆయన నాకు నచ్చారు డాడీ. నువ్వు కూడా ఆయనను చూస్తే...."
   
    "నేనెందుకు మధ్యవర్తుల ద్వారా నేనన్నీ ఎంక్వయిరీ చేసాను గదా. అతను ఏదో ఫంక్షన్ లో నిన్ను చూడడమే నీ అదృష్టం అంతే"
   
    నవనీత్ తనను ఏం ఫంక్షన్ లో మొదటిసారిగా చూసాడు. తను వెళ్ళిన ఫంక్షన్స్ అన్నిటినీ జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందామె.
   
    ఎక్కడా నవనీత్ లాంటి వ్యక్తిని తను చూసిన జ్ఞాపకం లేదు ఆమెకు.
   
    "మన కులదైవం వెంకటేశ్వరస్వామి. పెళ్ళి తిరుపతిలో పెట్టాలని నా అభిప్రాయం. మధ్యవర్తి ద్వారా కబురు చేసాననుకో. నువ్వు కూడా ఇవాళ అతనికి ఫోన్ చేసి చెప్పుఏవంటావ్?"
   
    "అలాగే" అంటూ తలూపింది మయూష.
   
    "నీకిలాంటి సంబంధం దొరుకుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఇవాళ పురోహితుడితో ముహూర్తం పెట్టించి పెళ్ళి కార్డులకు ఆర్డర్ ఇచ్చేస్తాను"
   
    ఆ మాటకు ఏం బదులు చెప్తుంది మయూష. ఆ రూమ్ లోంచి బయటకు వచ్చేసింది.
   
                                                                     *    *    *    *
   

    కాలేజీ నుంచి బయటకు రాగానే ఆటో ఎక్కి అబిడ్స్ లోని సూర్యాధియేటర్ దగ్గర ఆగింది మయూష.
   
    అప్పటికి సమయం మూడు నలభయ్ అయిదు నిముషాలు అయింది.
   
    నలువేపులా చూస్తూ లోనికి అడుగేసింది.
   
    గాయత్రి మొగుడు వస్తాడా?
   
    ఎందుకు రాడు?
   
    ప్రతి మగాడిలోనూ ఏ వయసులోనైనా రహస్య శృంగారం పట్ల ఆసక్తి వుంటుందని ఫ్రాయిడ్ చెప్పాడు. వివాహానికి, శృంగారపు కోరికకు, వివాహేతర సంబంధం లేదు. వయసుకీ, రహస్యపు కోరికకు సంబంధం లేదు.
   
    జీవితాంతం మనసులో మెదిలే ఒక ఆకర్షణే రహస్యపు కోరిక!
   
    సినిమాకు రమ్మని గాయత్రి మొగుడు అడగ్గానే తనెందుకు వప్పుకొంది?
   
    రహస్యప్రవర్తన మనిషిలో ఎలాంటి ఫీలింగ్ ని కలిగిస్తుందో తెల్సుకుందామని.
   
    రెండోది గాయత్రి మొగుడికి బుడ్డి చెబుదామని.
   
    గోడ మీద పోస్టర్స్ ని చూస్తున్న మయూష "హలో" అని పలకరింపు వినబడగానే తలెత్తి చూసింది.
   
    కొంచెం దూరంలో గాయత్రి మొగుడు.
   
    "అందగాడే...." మనసులో అనుకుందామె.
   
    "మీరు సినిమాకు రారనుకున్నాను. బై ది బై నా పేరు శివాజీ...." అని తనను తాను పరిచయం చేసుకున్నాడతను.
   
    "మనమిప్పుడు సినిమాకు వెళ్లడంలేదు. ఎందుకంటే ఆఫీసులో ఆఫ్ డే లీవ్ పెడదామనుకున్నాను. దొరకలేదు. మీరొచ్చి వెయిట్ చేస్తుంటారేమోనని ఆదరా బాదరాగా వచ్చాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ మనం హోటల్లో కూర్చుని కాఫీ తాగాక నే వెళ్ళిపోతాను"
   
    అతని మాటలకు మయూష విస్తుపోయింది.
   
    ఉదయం అతను తనను పలకరించినప్పటి చలాకీతనం అతని ముఖంలో కన్పించలేదు.
   
    తనతో సినిమాకి రావటానికి భయపడుతున్నాడా శివాజీ?
   
    పది నిమిషాల తర్వాత ఇద్దరూ హోటల్లో కూర్చున్నారు.
   
    కాఫీ తాగుతుండగా అన్నాడు శివాజీ.
   
    "నా మీద మీ అభిప్రాయం ఏవిటి?"
   
    సడన్ గా అలాంటి ప్రశ్న శివాజీ వేయడంతో గురుడు తీరుబడిగా మాట్లాడడానికి హోటల్ కు తీసుకొచ్చాడని అర్ధం అయిపోయింది మయూషకు.
   
    "ఏం వుంటుంది. కొత్తగా పెళ్ళయిన ఒక భర్త.... ఒక మగాడు"
   
    తను అలాంటి జవాబు చెప్పగలదని ఊహించలేదామె.
   
    "మగాడంటే?"
   
    "మరేమీ అనుకోకపోతే ఒక డెఫినేషన్ చెప్పనా?" అతని కళ్ళ లోకి చూస్తూ అన్నది మయూష.
   
    "చెప్పండి" అన్నాడతను.
   
    "ఇంట్లో భార్యను ప్రేమగానూ, పక్కింటి అమ్మాయిని యింకా ప్రేమగానూ ప్రేమించగలిగే వ్యక్తి..... పక్కింటి అమ్మాయే.... కాదు పక్కింట్లోనూ..... ఎదురింట్లోనో, ఆఫీసుల్లోనో, ఎవరో ఒక అమ్మాయి లేదా ఒక ఆడది...." మయూష మాటల ఎనక మగాళ్ళపై ఎంతో కసి వుంది.
   
    చిన్నగా నవ్వాడతను.
   
    "ఎవరు చెప్పారు ఈ నిర్వచనం?"
   
    "ఇలాంటి నిర్వచనాలు ఎవరూ చెప్పక్కర్లేదు"
   
    "యూ ఆర్ రాంగ్ మయూష. మీరేవీ అనుకోకపోతే రెండు విషయాలు చెపుతున్నాను. ప్రతీవ్యక్తిలోనూ రెండు స్వభావాలుంటాయి. మనిషి తన నెగిటివ్ స్వభావాన్ని దాచుకోవటానికి ప్రయత్నిస్తూ,  పాజిటివ్ స్వభావాన్ని బహిరంగపరచుకోడానికి ప్రయత్నిస్తాడు.
   
    ముఖ్యంగా సెక్స్ కోరికకు సంబంధించి చూస్తే ఎదుటి వ్యక్తుల శృంగార జీవితం పట్ల ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఎక్కువ. ఒక ఆడ, మగ ఏకాంత దృశ్యాన్ని రహస్యంగా చూడాలని నూటికి తొంబై మందికి వుంటుంది.
   
    గోడ మీంచి మీరు నన్ను మా ఆవిడ్ని చూడడం ఎప్పుడో గమనించాను మీక్కావల్సిన థ్రిల్లుని ఇవ్వడానికి నేను మరికొంచెం అల్లరిగా ప్రవర్తించేవాడిని.
   
    ఇక వ్యక్తిగత విషయానికొస్తే నేను మిమ్మల్ని సినిమాకి రమ్మని అడగ్గానే నా గురించి మీరేవనుకుంటారో నాకు తెల్సు ఏ మగాడి గురించయినా ఎవరయినా అలాగే అనుకొంటారు. అది సహజం కాఫీ. తాగడం పూర్తి చేసాక అతను సిగరెట్ వెలిగించాడు.

 Previous Page Next Page