Previous Page Next Page 
కిడ్నాప్ పేజి 20

    "రాలేదా....ఫ్యాక్టరీలో బిజీగా ఉండుంటాడు!" ఆవలిస్తూ అన్నాడతను.

    "ఎంత బిజీ అయినా, ఒక్క పది నిమిషాలసేపు రావడానికేం....చిన్నాన్న కొడుకని, తండ్రిలేని వాడని, మీరు పెంచి పెద్దచేసి, పెళ్లదీ చేసి నా తమ్ముడూ- నా తమ్ముడూ అని మీరంటారు తప్ప, వాళ్ళకు ఆ అభిమానాలు లేవండీ!"

    "సత్తిపండు అమాయకుడే...ఆ పిల్ల కొంచెం గయ్యాళిదనుకో-"

    "వాడేం అమాయకుడు కాదు- మీరే అమాయకులు! ఈ మధ్య సత్తిపండు నాతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నాడు....బాబు పుట్టినప్పటినుంచీ వాళ్ళు మారిపోయారండీ!"

    "అది సహజమే కదా- మనకు పిల్లలు కలగకపోతే, వాళ్ళ పిల్లల్లో ఒకళ్ళని పెంచుకుందామనుకున్నామా ....తేజ పుట్టాక, ఆ ఆలోచనకు స్వస్తి చెప్పేసాం కదా!"

    'అదొక్కటే కోపమని నేననుకోను. మొన్న బాబుకి సడన్ గా అంత జ్వరం ఎందుకొచ్చిందో తెలుసా?- మొదట్లో భయపడి ఆయా చెప్పలేదు. ఆ తర్వాత చెప్పింది."

    "ఎందుకొచ్చింది?"

    "ముందురోజు కోమలాంగి, నేను బాబుని ఆడిస్తానని తీసికెళ్ళింది. వాంటెడ్ గా గంటసేపు వర్షంలో ఆడించిందట."

    ఆ మాటకు ఒక్క ఉదుటున లేచి కూర్చున్నాడు కాళేశ్వరప్రసాద్.

    "నిజమా?"

    "నిజం!"

    రెండు క్షణాలు మౌనం.

    మళ్ళీ చెప్పసాగిందామె.

    "ఇవాళ తేజ కోట్లాది రూపాయలకు, ఐస్వర్యానికి వారసుడు. ఎవరికీ ఎప్పుడు కన్ను కుడుతుందో తెలీదు- మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది!"

    సీరియస్ గా ఆలోచించాడు కాళేశ్వరప్రసాద్.

    "బాబు ప్రొటెక్షన్ కోసం, స్పెషల్లీ ట్రెయన్డ్ సెక్యూరిటీ పెడితే బావుంటుందేమో?"

    "మంచి అయిడియా...వాళ్ళు బాబు సెక్యూరిటీ గార్డ్స్ అని తెలియకుండా, మఫ్టీలో ఉంచితే మరీ బాగుంటుంది..." చెప్పింది సుదేష్ణాదేవి.

    "ఇన్నాళ్ళకో మంచి అయిడియా ఇచ్చావోయ్!" నవ్వుతూ అంటూ ఇద్దరి మధ్యా పడుకున్న తేజ బుగ్గను మెల్లగా స్పృశించి, అటుతిరిగి పడుకున్నాడు.

    బెడ్ లైట్ స్విచ్ వేసి, తన చీర కొంగును బాబుమీద కప్పి, అతని మీద కుడిచేయి వేసి కళ్ళు మూసుకుంది సుదేష్ణాదేవి.

    బాబు ఊపిరి స్పర్శ ఆమె బుగ్గలకు వెచ్చగా తగులుతోంది.
   
                                                            ౦    ౦    ౦
   
    మామిడిచెట్టు పైనొకడు, మధ్యలో ఒకడు, కిందకొకడు-ముగ్గురూ అక్కడే ఉన్నారు.

    రోజూ వాళ్ళు అలా ఉదయం, సాయంత్రం చెట్టెక్కడం, రెండు మూడు గంటలు జైలు క్వార్టర్స్ వేపు చూడటం, ఉసూరుమంటూ దిగిపోవడం జరుగుతోంది.

    "నా జగద ఏమైపోయిందిరా?" బెంగగా అడిగాడు వీర్రాజు.

    "మన కొండముచ్చు మొహంవాడు- ఇంట్లోపెట్టి తాళం వేసేసి, జైలుకి వస్తున్నాడేమో!" డౌటుని, ఎక్స్ ప్రెస్ చేశాడు సేతురాజు.

    "ఏవిఁటీ మీ కత? మన జైలర్ రెండోపెళ్ళాం కోసమేనా మీ కలవరింతలు?" వాళ్ళని రెండ్రోజులుగా గమనిస్తున్న ఓ బారెడు గెడ్డం ఖైదీ అన్నాడు.

    "నీకు తెలుసా?" గట్టిగా అడిగాడు వీర్రాజు.

    "నువ్వు కిందకు దిగిరా- చెపుతాను" అని బారెడు గెడ్డంఖైదీ అనగానే, కోతిలా కిందకు దిగిపోయాడు రెండంగల్లో.

    "నువ్వేనా వీరూవి? నువ్వేనా ఆ జగదాంబా ఫస్టాఫ్ లో లవర్ వి?"

    "అయ్యబాబోయ్....మీకెన్ని విషయాలు తెల్సిపోయాయండీ! నేనే దైవసాక్షి ప్రమాణికంగా వీరూనండి."

    "అయితే చెప్తాను విను. నువ్వు మళ్ళీ జైలుకొస్తున్నావని తెలియగానే ముషిరాబాద్ లో ఓ యిల్లు అద్దెకు తీసుకుని అక్కడ పెట్టాడు ఆవిడ్ని". అంచేత ఆందోళనరావు జైల్లో అంతతాపీగా తిరుగుతున్నాడు"

    "ద్రోహీ- మోసకారి- పత్తిత్తుకారన్- పైత్యకారి"

    "అంటే?"

    "తమిళ భాష- మనకూ తెలియదు."

    "ఆ జగదాంబ కోసమే నువ్వు మళ్ళీ జైలుకొచ్చావ్- అవునా."

    "అవున్సార్."

    "నువ్వూ జగదంబ రెగ్యులర్ గా కల్సుకోవాలంటే చిన్న ఉపాయం చెప్తాను- చెప్పమంటావా"

    "చెప్పండి సార్!

    "గుడ్...మన జైలర్ కి సన్మానాలంటే చాలా పిచ్చి. స్వాతంత్రోద్యమంలో జైల్లో పుట్టాడుగదా! అందుకే దండనుచూస్తే గంజాయి తాగిన వాడిలా అయిపోతాడు. పొ....జైల్లో మీరందరూ కలిసి ఓ సన్మానసభ ఏర్పాటు చేయండి. ఇష్టమొచ్చినట్లు పొగిడేయ్యండి. అప్పుడు మీ మీద అతనికి సదభిప్రాయం ఏర్పడుతుంది. ఆ జగదంబను మళ్ళీ క్వార్టర్సు లోకి తీసుకొచ్చేస్తాడు."

    ఆ సలహా ఉపన్యాసం వినగానే వీర్రాజు మనసు ఆనందంతో పెద్ద గొడుగులా విప్పుకొంది.

    వెంటనే ఆ ముగ్గురూ ఆఫీసు రూమ్ వేపు పరుగెత్తారు.
   
                                                                       ౦    ౦    ౦

    సాయంత్రం అయిదు గంటలు దాటింది.

    పంజాగుట్ట ఏరియాకి ఇరవై గజాల దూరంలో ఒక గల్లీలో ఉంది ఆ కారు షెడ్డు.

    ఫియట్ కారుకింద పడుకుని, తలకింద ఎడమచెయ్యి పెట్టుకుని, రాడ్లవేపు చూస్తూ సీరియస్ గా ఆలోచిస్తున్నాడు గాలిబాబు.

    దూరంగా చెట్టుకింద గాడ్రేజ్ కుర్చీమీద కూర్చుని, గొడుగు కొక్కేనికి ముఖం ఆన్చుకుని గాలిబాబు వేపు చూస్తున్నాడు ఓ వృద్దుడు.

 Previous Page Next Page