వచ్చిన ఇద్దరిలో ఓ వ్యక్తి మంచం మీద కూర్చున్నాడు. మరో వ్యక్తి కుర్చీలో కూర్చున్నాడు.
దాదాపు వాళ్ళిద్దరూ ఓ పావుగంట సేపు పిచ్చాపాటి మాట్లాడుతూ తరువాత ఓ వ్యక్తి బయటకు వెళ్ళిపోయాడు.
మిత్రాకి ఇంకో పావుగంట వరకు వెయిట్ చేయటం తప్పదని అలాగే మంచం కింద పడుకున్నాడు.
ఈ పావుగంటలో రైన్ కోటు వ్యక్తి అటువైపుకి రాలేదు. మిగిలిన రెండో వ్యక్తి మొదటి వ్యక్తి వెళ్ళి పోయిన తరువాత ఓ పదినిముషాలపాటు రూమ్ బయటే గడిపి రూమ్ లోకి రాగానే తలుపులు మూసి మంచం మీదకు చేరాడు. మిత్రాకి పారిపోవటానికి ఇంతకన్నా మంచి అవకాశం రాదనిపించి మెల్లగా లేవబోయాడు. ఇంతలో ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ఆగిపోయాడు.
* * *
అలెక్స్ హోటల్ నుంచి ఆటోలో సరాసరి బైరాగి చెప్పిన ఎడ్రస్ ప్రకారం యూనివర్శిటికి వచ్చాడు. ఆటోని దూరంగా ఆపమని సైగచేసి దిగబోయాడు. ఆటోవ్యక్తి ఆటోతో పాటు అతను తిరిగి వచ్చేవరకు వెయిట్ చేయసాగాడు. బైరాగి చెప్పిన వివరాల్ని మరోసారి గుర్తు చేసుకున్నాడు. అతను చెప్పిన హాస్టల్ కనుక్కోవడం పెద్ద కష్టమనిపించలేదు. దానికి తోడు అంతకు ముందు బైరాగి ఒకసారి దూరంనించి చూపించాడు కూడా.
చుట్టూ ఓసారి పరికించి చూసాడు అలెక్స్. జనసంచారం లేదు. తన పనికి ఇదే మంచి సమయం అనిపించింది. మధ్యాహ్నం కావడం వల్ల ఎండ విపరీతంగా వుండి వుక్కపోస్తోంది. దూరంగా ఎక్కడో కాకి అరుస్తుంది.
జేబులో వున్న రివాల్వర్ ని తృప్తిగా ఓసారి తడుముకుని హాస్టల్ బ్లాక్ నెంబర్ రెండు ముందు ఆగి తననెవరైనా గమనిస్తున్నారేమో అన్న అనుమానంతో చూశాడు అలెక్స్. చుట్టుపక్కల ఎవరూ కనిపించలేదు. రూమ్ నెంబర్ నలభై ఒకటి తెలుసుకోవటానికి అతనికి రెండు నిముషాలకి మించి ఎక్కువ సమయం పట్టలేదు. దాదాపు మిగతా రూమ్స్ కూడా మూసే వున్నాయి. లోపల ఇంకెవరైనా వ్యక్తి వుంటే సమాధానం ఏం చెప్పాలనే నిర్ణయించుకొని తలుపు తట్టాడు.
అతను తలుపు తట్టిన రెండు నిముషాలకి తలుపులు తెరుచుకున్నాయి.
ఓ పాతిక సంవత్సరాల వయస్సున్న వ్యక్తి తలుపు తెరిచి సందేహంగా చూశాడు. అప్పుడే నిద్రలేచినట్లుగా కొద్దిగా కళ్ళు మూతలు పడివున్నాయి. అతనే ముందు ప్రశ్నించాడు.
"ఎవరూ...? మీకేం కావాలి...?"
"ఎక్స్యూజ్ మి, నా పేరు కస్యప్, నేనో జర్నలిస్టుని. నేను హాస్టల్స్ లో వున్న ప్రోబ్లమ్స్ మీద ఆర్టికల్స్ రాస్తున్నాను. సారి ఫర్ ది డిస్ట్రబెన్స్. మీరేమన్నా ఇన్ ఫర్ మేషన్ ఇస్తారేమో నని...." అనుమానంగా చూశాడావ్యక్తి. అతని మోహంలో కొంచెం చిరాకు కూడా కనిపించింది. నిద్రలేపినందుకు అనుకుంటా.
"మీరేం అనుకోకపోతే లోపలికి వచ్చి కూర్చుంటాను" లోపల ఇంకెవరూ లేరని నిర్ధారించుకొని తొంగి చూస్తూ అడిగాడు అలెక్స్.
"సారి! రండి లోపలకి" ముక్తసరిగా సమాధానం చెప్పాడు.
"కాస్త మంచినీళ్ళు ఇస్తారా?
ఇలా మొహమాటం లేకుండా అన్ని అడుగుతున్నందుకు ఏమీ అనుకోవద్దు. మా ఫీల్డ్ లో ఇలా వుంటేనే పనులు జరుగుతాయి. అందువల్ల..." అని కాస్త సిగ్గుపడుతున్నట్లు ప్రదర్శించి అతనిచ్చిన గ్లాస్ ని అందుకుని గటగట త్రాగేశాడు.
"మీ పేరు చంద్రశేఖర్? మీరు ఫైనలియర్ సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. కరెక్టేనా" తనకు తెలిసిన వివరాల్ని చెప్పాడు అలెక్స్.
సమాధానంగా చిరునవ్వు నవ్వి వూరుకున్నాడతను.
"ఇంతకు మీరొచ్చిన పని...!" ప్రశ్నార్ధకంగా చూస్తూ అడిగాడు చంద్రశేఖర్.
"ముందు మీరు మరోగ్లాసు మంచినీళ్ళు ఇవ్వగలిగితే? మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు."
అతను సమాధానం చెప్పకుండా అలెక్స్ అందించిన ఖాళీ గ్లాస్ అందుకొని మంచి నీళ్ళివ్వటానికి సిద్ధమయ్యాడు.
అలెక్స్ కి అంతకన్నా మంచి సమయం వుండదనిపించి వేగంగా కదిలి తలుపుకి గడియపెట్టి జేబులోనున్న రివాల్వర్ ని బయటికి తీశాడు.
తలుపులు వేసిన శబ్ధానికి వెనక్కితిరిగి చూసిన చంద్రశేఖర్తెల్లబోయాడు. అదీ క్షణకాలం మాత్రమే. అలెక్స్ వైపు కోపంగా చూస్తూ ప్రశ్నించాడు.
"ఎవర్నువ్వు...?"
"ఏం కావాలి నీకు..."
సమాధానంగా ఓ చిరునవ్వునవ్వి తన చేతిలోవున్న రివాల్వర్ వంక చూస్తూ,
"నేనెవరనేది నీకనవసరం అనుకుంటా. కాని నీ గురించి మాత్రం తెలుసుకోవాలని వచ్చాను. నేనడిగిన వాటికి తిన్నగా సమాధానం చెప్పితే నీ ప్రాణానికి ముప్పుండదు."