"రాజేష్ గారూ....మిమ్మల్ని నమ్మకపోవడం కాదు నా అదృష్టం మీద నాకే నమ్మకం లేదు-రెండోసారి జీవితం నన్ను మోసం చేస్తుందేమో నని భయం. రెండోసారీ దెబ్బ తట్టుకోగలనా అన్న అనుమానం. అర్చన కంఠం రుద్దమయింది. 'రాజేష్ గారూ మీ రెందుకు నామీద యింత దయ చూపిస్తున్నారు. ఇది జాలా!....నా కోసం త్యాగం చేస్తున్నారా" జాలికాదు, త్యాగం కాదు అర్చనా. ఇది నా స్వార్ధమే-నీ అందాన్ని నా స్వంతం చేసుకోవాలన్న ఆరాటమేనని ఎందుకు అర్ధం చేసుకోవు. అర్చనా ఏక్షణంలో నిన్ను చూశానో కాని ఆరోజునించి కంటినిండా నిద్రలేదంటే నమ్మాలి." 'రాజేష్ ఉద్వేగంతో అన్నాడు. అర్చన తలదించుకుంది. రాజేష్ ముందుకు వంగి ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు. 'ఈ చెయ్యి ఆసరా కావాలి నాకు అర్చనా.....కాదనకు ప్లీజ్...' అభ్యర్ధిస్తూ అన్నాడు.
"కాదనను రాజేష్. కాదని ఎందుకంటాను. నాకింత అదృష్టం పడ్తుందని కలలో కూడా ఊహించని నేను ఈ ఊహకే తబ్బిబ్బు అవుతున్నాను. జీవితంలో పాతికేళ్ళకే అన్ని అనుభవాలూ పూర్తయి మోడులా మిగిలిపోయానని అనుకుంటున్న తరుణంలో వాడిన లతని నీరు నారుపోసి చిగురింప చేస్తానంటే వద్దని ఎలా అనగలను." ఆమె గొంతు వణికింది.
"కవిత్వం వద్దు అర్చనా లత, మాను ఈ మాటలన్నీ వద్దు. నీకు నేను, నాకు నీవు తోడునీడ అయి నిలవాలని అనుకున్న ఈక్షణం శాశ్వతం కావాలి"- ఆమె చెయ్యి గట్టిగా నొక్కుతూ ఆనందంగా అన్నాడు.
"కాని రాజేష్ నాకింకా భయంగావుంది. ఇదంతా ఏమవుతుందోనని, ఆయన డైవోర్సు ఇస్తారా." బేలగా అంది.
"నీవు నాసంగతి ఆయనకి తెలియకుండా చూడాలి. మీ అత్తగారు నీ పక్షం అంటున్నావు గనుక వాళ్ళు కొడుక్కి మళ్ళీ పెళ్ళి చేయడానికి అన్నట్టు అతనిచేత కాగితాలు సంతకం పెట్టించేటట్టు చూడు. మనం పెళ్ళి చేసుకుంటాం అన్న సంగతి అతనికి తెలిస్తే పంతంకొద్దీ డైవోర్సు ఇవ్వక పోవచ్చు. నీవు వెంటనే నీ అత్తమామలతో కలిసి మాట్లాడు నేను నాల్గు రోజులలో ఢిల్లీ వెళ్ళిపోవాలి. ఏం జరిగింది ఉత్తరం రాయాలి నాకు చాలా ఆరాటంగా వుంటుంది"
"నాకు కొద్దిగా టైము ఇవ్వు రాజేష్-నన్ను కొంచెం ఆలోచించనీ, ఎలా మాట్లాడాలి, ఏం చెయ్యాలి అన్నదంతా ఆలోచించనీ, ముందుఅమ్మ అన్నయ్యతో మాట్లాడి...."
"ఎలా చేస్తావో, ఎం చేస్తావో నీకే వదులుతున్నాను. ఇంకో మూడు నాలుగు నెలల లోపల మనిద్దరం ఒకటవాలి. ఈ నిరీక్షణ నన్ను పిచ్చెక్కిస్తూంది." ఎమోషనల్ గా అన్నాడు.
"నన్ను కవిత్వం చెప్పవద్దని నీవు చేస్తూంది ఏమిటి" అర్చన కొంటెగా నవ్వింది.
"నిన్ను చూస్తే నీ సమక్షంలో కవిత్వం ఏమిటే, షాయిరీలు వచ్చేస్తాయి నోట్లోంచి."
"రాజేష్.....ఇదంతా కలకాదు నిజమేనా అనిపిస్తూంది నాకు-మన ఇద్దరం ఇలా కలవడానికే ఆయన నించి విడిపోయానుగాబోలు....ఈ గొడవలన్నీ ఇందుకే వచ్చాయేమో....చీకటి తరువాత వెలుగులా ఈ కష్టాల తరువాత సుఖం నా కోసం కాచుకుని వుంటుందన్నది మాత్రం ఊహించలేకపోయాను. ఈ దేశంలో పెళ్ళయిన ఆడదానికి, పిల్ల తల్లికి మళ్ళీ భర్త, సంసారం అన్నవి ఇప్పటికీ గగన కుసుమాలే రాజేష్. ఆ కుసుమాలని అందుకోడానికి చేయూతనిచ్చే నీలాంటి వారెందరున్నారో నాకు తెలియదు...."
"అబ్బ....చాలు....చాలు,..అలా పొగిడేశావంటే నిజంగా నేనేదో చాలా త్యాగం చేస్తున్నాననిపిస్తూంది. చాలా ఘనకార్యం చేస్తున్నానని గర్వంతో ఛాతి ఉబ్బిపోతూంది. అర్చనా ఇంకా మాటలు చాలు. చాతలు కావాలి. వెంటనే అతని దగ్గిరనించి డైవోర్సు సంపాదించే ఉపాయం చూడు. మరి నేను వెళ్ళాలి అర్చనా ట్రైను టైమవుతూంది. ఇది మిస్సయితే మళ్ళీ ఉదయం వరకు లేదు ట్రైను...." అయిష్టంగానే లేచి నిలబడ్డాడు.
* * *
"సరేనమ్మా.....సరే నీవు అన్నది బాగానే వుంది, నేను వాడి చేత కాగితాలు సంతకం చేయించడానికి ప్రయత్నిస్తాను. హు....ఇన్నాళ్ళూ ఏదో ఆశ వుండేది. కాలం నీ గాయాల్ని మాన్పితే నీవు వాడిని క్షమించి దగ్గిరవడానికీ ప్రయత్నిస్తావేమో, ఈలోగా వాడికీ ఇంట్లో ఇల్లాలు లేని ఇబ్బందులు తెలిసి దారికి వచ్చి రాజీకి వస్తాడన్న ఆశ వుండేది.." డాక్టరు వరలక్ష్మి నిట్టూర్చింది.
"అత్తయ్యా.....విరిగిన మనసుల్ని ఎంత అతుకుదామన్నా అతుకు అతుకులాగే కనిపిస్తుందత్తయయా, మేం కల్సిబతకడం అంటే మీ కోసమో, పాపకోసమో, ఏ ఇబ్బందులకి తల ఒగ్గో తప్ప ఒకరి కోసం ఒకరం కాదత్తయ్యా మనసులు కలవని కాపురం ఎంత నరకమో అనుభవించిన వారికే అర్ధం అవుతుంది. అంతకంటే ఎవరిదారిన వారు బతకడం నయం కదా! ఏమో ఈసారి ఆయనని అర్ధం చేసుకుని సహకరించే ఇల్లాలు వస్తే అది ఆయనకి మంచిదేగదా."
"నిజమేలే అమ్మా-బలవంతంగా మీ ఇద్దరిచేతా కాపురం చేయించలేం గదా! నీవు అనుక్షణం కుమిలిపోతూ బతికితే అది మాకు మాత్రం ఆనందమా, ఇంటి ఇల్లాలు ఉసురు ఆ ఇంటికి తగిలితే అది సర్వనాశనానికే దారి తీస్తుంది." డాక్టరు సదాశివంగారు అన్నారు.
"మగవాడికి పిల్ల దొరక్కపోదు ఎవతో ఒకతి కానీ, నీవదృష్టవంతురాలివి. నీ మిగతా జీవితం వాడి మోడయిపోకుండా నీకు చేయి అందించే వాడు దొరకడం అదృష్టం నీ అదృష్టాన్ని కాదనడానికి మేం ఎవరం. తప్పకుండా నా చాతనయినంత సహాయం చేసి వాడిని ఎలాగైనా విడాకులకి వప్పిస్తాం. నీ జీవితాన్ని చిందర వందర చేసే హక్కు వాడికి లేదు. వాడు నా కొడుకే అవచ్చు కాని, స్త్రీగా నీ జీవితంతో వాడు ఆటలాడటం నేను సహించను. నా సానుభూతి నీ పట్లవుంది. ఏం చెయ్యాలో నాకు తెలుసు..." అర్చన చటుక్కున లేచి వరలక్ష్మి కాళ్ళకి నమస్కారం పెట్టి కళ్ళనీరు తిరుగుతూండగా..' మీలాంటి అత్త మామల్ని పొందికూడా నిలుపుకోలేని దురదృష్టవంతురాలిని. నా తల్లి దండ్రుల కంటే కూడా మీరు నన్ను ఎక్కువగా అర్ధం చేసుకుని ఆదరిస్తున్నారు. మీ ఋణం నేను తీర్చుకోలేను." మనస్ఫూర్తిగా అంది.