అర్చన వెళ్ళాక ప్రతిరోజూ ఉత్తరం కోసం ఎదురు చూస్తూ రక రకాల ఆలోచనలతో సతమత మయిపోయాడు రాజేష్ ఉత్తరంరాని ప్రతి రోజూ ఆశనిరాశల మధ్య అతని మనసు ఊగిసలాడిపోయేది. తనేమితి ఇంత పిచ్చివాడయి పోతున్నాడు. ఒక వివాహిత స్త్రీ, ఓ బిడ్డ తల్లికోసం ఇంత ఆరాటపడ్తున్నాడెందుకు? ఆమె కాపురం వదులు కోవాలన్న తన కోరిక సమంజసమేనా? తను ఆమెను పెళ్లిచేసుకుంటే తనవాళ్ళెటూ వప్పుకోరు. హర్షించరు. కనీసం సమాజమైనా హర్షిస్తుందా. తన కెవరి లెక్కాలేదు. అర్చన వప్పుకుంటే చాలు.
అరక్షణంలో వెయ్యి ఊహలు చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరిచేశాయి అతన్ని. అతని సంతోషం అరనిమిషం నిలవలేదు. అర్చన ఎడ్రసు ఇవ్వలేదన్నది తట్టాక ఉత్తరం తిరగేసి మరగేసి ఆరాటంగా చూశాడు. అరనిమిషంలో ఆకాశంలోంచి భూమ్మీదికి విసిరేసినట్లయిపోయింది అతని మనస్థితి ఓ గాడ్..... ఎంత స్టుపిడ్ ఉమన్ అడ్రసు ఇవ్వలేదు. తనెంత స్టుపిడ్. ఆమె తండ్రి పేరన్నా అడగలేదు. ఎడ్రసయినా తీసుకోలేదు. అతని గుండెలు మళ్ళీ దిగులుతో బరువెక్కాయి. తనుట్టి స్టుపిడ్ కనీసం ఆమె టిక్కెట్టు డబ్బు పంపిస్తానన్నపుడు ఊరుకున్నా డబ్బు పంపినపుడు ఫ్రం అడ్రసు మనియార్డరు ఫారమ్ చూసినా తెలిసేది. అర్చన ఎడ్రసు ఇవ్వడం మరిచి పోయిందా? కావాలని ఇవ్వలేదా? ఇవ్వదలచనపుడు తనని ఉత్తరానికి జవాబెందుకు రాయమంటుంది? హడావిడిలో రాయడం మర్చిపోయివుంటుంది. హతాశుడైపోయాడు రాజేష్ ఆమెని ఎలాకాంట్రాక్ట్ చేయడం ఎడ్రసు ఎలా సంపాదించడం? ఏలూరులాంటి వూర్లో ఆమె తండ్రి పేరన్నా తెలియకుండా ఎక్కడ ఆమెని వెతకడం?- గత రెండేళ్ళుగా ఆమె కోసం, ఆమె ఉనికి తెలుసుకోడంకోసం ఎన్ని రకాలప్రయత్నాలు చేశాడు..... ఈనాటికి ఇలా హఠాత్తుగా కనిపిస్తుందని ఎన్నడన్నా ఊహించాడా తను!
ఈ రెండేళ్ళుగా ఏదో వంకలు చెపుతూ పెళ్ళివాయిదావేస్తూ, తల్లి తండ్రుల వత్తిడిని తట్టుకుంటూ అర్చన కనిపిస్తుందన్న ఆశతో కాలం జరుపుకు వస్తున్నాడు ఆఖరికి తల్లి డిసెంబరులోగా పెళ్ళి చేసుకోకపోతే మరి జన్మలో నీ మొహం చూడను అని బెదిరించింది. డిసెంబరు వరకు తనకి తాను గడువు ఇచ్చుకున్నాడు. ఇప్పుడింక అర్చన కనిపించింది. ఒక్క రోజుకూడా ఆలస్యం చెయ్యడు తను! ఈ నిరీక్షణ అధికం అయిపోయి తన నెర్వ్స్ మీద దెబ్బతీస్తూంది, ఇటో అటో రేపు తేల్చేయాలి. అనుకున్నాడు రాజేష్.
* * *
"అర్చనా, నేనొకమాట సూటిగా అడుగుతాను. దానికి మీరూ అంత సూటిగానూ జవాబివ్వాలి ఉపోద్ఘాతం లేకుండా అడుగుతున్నాను. "నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అహ......అడ్డురాకండి నా మాటకి. నేను ఈ రెండేళ్ళుగా మీకోసమే పెళ్ళిచేసుకోకుండా వెయిట్ చేశాను. ఇప్పుడింక మీ జవాబు ఎస్. ఆర్, నో. ఒక్కమాట చెప్పండి దీనికోసమే ఈ మాట అడగడం కోసమే నేను వచ్చాను మీ దగ్గిరకి."
మర్నాడు ఊరినించి వచ్చీ రాగానే అర్చన అందించిన కాఫీ కప్పు అందుకుని సూటిగా అర్చన మొహం వంక చూస్తూ అడిగేశాడు రాజేష్. అర్చన ఒక నిమిషం తెల్లబోయింది. మరుక్షణంలో ఆమె మొఖం ఎర్రబడింది. "మీరు....మీరేమంటున్నారో తెలిసి అడుగుతున్నారా?" తడబడ్తూ అంది.
"అన్నీ తెలిసే, అంతా ఆలోచించే అడుగుతున్నాను అర్చనా, ఏది ఆలోచించకుండా వూరికే పిచ్చిగా అనడానికి నేనేం టీనేజ్ కుర్రాడిని కాను. నాకేం కావాలో తెలిసే అడుగుతున్నాను."
"కాని ఎలా...నాకో పాప కూడా వుందన్న మాట మర్చిపోయారా? పెళ్ళయినదాన్ని.....పిల్లతల్లిని. నన్ను చేసుకునే ఖర్మ మీకేమిటి -పెద్ద ఉద్యోగం, హోదా, అంతస్థు అన్నీ వున్న మీకేం ఖర్మ."
"ఖర్మ అనుకుని వుంటే అడిగేవాడిని కాను. నాకు ఇంకేపిల్లా దొరకదనీ అడగలేదు. అర్చనా నీవు నాకు కావాలన్పించింది అంతే. అలా ఎందుకనిపించింది అంటే దానికి జవాబు లేదు నా దగ్గిర."
"కాని......మీవాళ్ళు.....అందరూ....." బిడియంగా తలదించుకుంది.
"అదంతా నాకు వదిలేయి. ముందు ఒక్కమాట ఎస్ ఆర్ నో చెప్పు కమాన్."
"నాకేం తెలియడం లేదు రాజేష్ గారూ. ఏం చెప్పాలో అసలు తెలియడం లేదు. ఇంకా అసలు డైవోర్సు కూడా అవలేదు....ఇటు పాప."
"మీ పాప నా పాప అవుతుంది పెళ్ళయ్యాక. పాప బాధ్యత నాది. పాపకి కన్న తండ్రిని కాకపోయినా, కన్న తండ్రిలా ప్రేమించగలనని మాట ఇస్తున్నాను. డైవోర్స్ సంగతి చూద్దాం. మూచ్యువల్ అండర్ స్టాండింగ్ మీద తీసుకోవచ్చు. ఆయన మాత్రం పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళుంటారు. మీ అత్తగారు మామగారి ద్వారా ప్రయత్నించవచ్చు."
"కాని రాజేష్ గారూ....మీరేదో ఆవేశంలో ఏదో నిర్ణయం తీసుకుని.....తరువాత విచారిస్తారేమో.....ఇలా పెళ్ళయిన పిల్లతల్లిని చేసుకున్నా నని విచారిస్తారేమో....అప్పుడు నా సంగతి ఏమవుతుంది!....
"అబ్బబ్బ.....అర్చనా, నేను అన్ని వైపులా నించి ఆలోచించ కుండానే ఈ నిర్ణయానికి వచ్చాననా నీ ఉద్దేశం..... నేను అంత తెలివి తక్కువ వాడిని కాను. నా బతుకు పాడుచేసుకునే తెలివి తక్కువ తనం మాత్రం లేదు నాకు. నన్ను నమ్ము అర్చనా....భవిష్యత్తులో నీవు విచారించే రోజు రానీయకుండా చూసుకుంటానని చెప్తున్నాను. యింతకంటే నీకేం చెప్పి నమ్మించలేను.....నన్ను నమ్మగలిగితే, నా మాటల్లో విశ్వాసం వుంచగలిగితే నీ అంగీకారం చెప్పు.