"ఋణాలు, వడ్డీలు సంగతికేంగాని, ఒక్క విషయం నాకు కాస్త అనుమానంగా వుంది. నీవు పూజ సంగతి బాగా ఆలోచించావా లేదా అని, అతను నీకు మంచి భర్త కాగలడేమోగాని, పూజకి తండ్రి కాగలడంటావా. పూజని అంగీకరించగలడా అతను. మీ మధ్య అది అడ్డు అనుకుంటే. అలాంటి సంఘటనలు ఎన్నో విన్నాం ఇదివరకు."
"లేదత్తయ్యా...ఆ విషయం అతనే ముందుగా చెప్పాడు. 'నీ బిడ్డకి తండ్రిలేని లోటు రానివ్వను. నీకు భర్తనయినపుడు, నీ బిడ్డకి తండ్రిని అవుతాను, అని అతనే అన్నాడు నేనేం అడగక ముందే."
"అనడం వేరు, ఆచరించడం వేరమ్మా ఏ మగవాడు కాని, ఆడది కానీ, తనది కాని బిడ్డని అంగీకరించడం అంత సుళువు కాదమ్మా" సదాశివం అన్నారు.
"రేపు మీకు బిడ్డలు పుట్టాక దీన్ని వాళ్ళతో సమంగా చూడగలడా..." వరలక్ష్మీ అపనమ్మకంగా అంది.
"అత్తయ్యా....రాజేష్ అలాంటివాడు కాదని నా నమ్మకం. ఒకవేళ అతను మారితే పాపకి తల్లిని నేనుండగా తండ్రి అభిమానం కొరవడినా ఆ కొరత కనపడనీయకుండా చూడగలను అత్తయ్యా."
"ఏమో.....పూజ మా ప్రాణం. దానికి ఏమయినా కష్టం కలిగితే మేం భరించలేం అర్చనా. పాపని మా దగ్గిరే వుంచేయి. అలా అయితే ఏ ప్రాబ్లమ్స్ వుండవు. రాజేష్ కి నీకు మధ్య ఏ గొడవలకీ ఆస్కారం వుండదు. మాకూ పూజ బాగా చేరిక అయింది. మేం వున్నన్ని రోజులు దానికి ఏ లోటూరాదు. ఈలోగా పెద్దదవుతుంది." ఆశగా చూసింది డాక్టరు వరలక్ష్మి. ఆమె కళ్ళల్లో పెంచిన అభిమానం కొట్టొచ్చినట్టు కనపడుతూంది.
అర్చన జవాబుకి తడుముతుంది. ఏం చెప్పాలో అర్ధం కాక. నేను మాత్రం పాపని వదిలి ఎన్నాళ్ళుండగలను. ఇప్పుడే అసలు ప్రాణం కొట్టుకుంటున్నా...చదువు కుంటున్నానని తప్పక....చూద్దాం...తరువాత చూద్దాం...ముందు మిగతా విషయాలన్నీ తేలనీయండి. పాపని మీరు నా కంటే బాగా చూసుకుంటున్నారు. కానీ, నేను వదిలి వుండగలనా అని.
"సరేలే, ఆ విషయం తరువాత ఆలోచిద్దాం. నీవన్నట్టు మిగతా వన్నీ పూర్తికానీ."
"మీదే భారం ఏం చేస్తారో, ఎలా చేస్తారో అత్తయ్యా ఏ సంగతి నాకు తెలియచెయ్యండి."
"వెళ్ళిరామ్మా...అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం." నమస్కరించిన అర్చన తలమీద చెయ్యివుంచి ఆశీర్వదించారు సదాశివంగారు.
* * *
"రాజేష్....నీకేమన్నా మతిపోయిందా. నీకేం ఖర్మ అని, పిల్ల తల్లిని పెళ్ళాడాలనుకుంటున్నావు?" అరుంధతి, కొడుకు చెప్పిన మాటకి నిర్ఘాంతపోయి నిమిషం మాట్లాడలేకపోయింది. కొడుకు చెప్పింది అర్ధం అయ్యాక కోపంతో ఆమె మొహం జేవురించింది.
"రాజేష్, ఆలోచించే చేస్తున్నావా ఈ పని. ఆవేశంతో, తొందర పాటు నిర్ణయం తీసుకుంటే ఆ బాధ ఒక రోజులో పోయేది కాదు జీవితాంతం అనుభవించాలి. పెళ్లి అనేది ఎన్నిరకాలుగానో ఆలోచించి తీసుకోవల్సిన నిర్ణయం ఏదో గొప్ప ఘనకార్యం చేస్తున్నా ననుకునో, త్యాగం చేస్తున్నాననో అనుకుని తప్పటడుగు వేస్తున్నావని." రంగనాథంగారు అరక్షణం ఆవేశపడ్డా త్వరగా సర్దుకుని గంభీరంగా అన్నారు. చెట్టంత కొడుకుతో అంతకంటే తీవ్రంగా ఆయన మాట్లాడలేకపోయారు.
"ఇందుకేనా రెండేళ్ళనించి పెళ్ళివద్దని ఏదో వంకలు పెడుతూ గడుపుకొచ్చావు. ఈ పాటి పిల్ల నీకు దొరకదనా ఈమె కంటే అందమైన దాన్ని తీసుకొచ్చే పూచినాది." అరుంధతి ఏదో చెప్పబోయింది.
"అమ్మా, ఇదంతా నేను అనాలోచితంగానూ చేయడంలేదు. నాకు ఇంతకంటే మంచిపిల్ల దొరకదనీ గాదూ ఒకరిని చూస్తే ఎందుకిష్టం కలుగుతుందో నేనెలా చెప్పగలనమ్మా - ఇంతకీ ఆ అమ్మాయి గురించిన మీ అభ్యంతరం అల్లా పెళ్ళయిన ఆవిడనేనా! ఆమె కులం, గోత్రం, చదువు, సంప్రదాయం, అందం దేని గురించీ మీకు అభ్యంతరంలేదుగా. ఒక్క ద్వితీయం అని."
"ఆ అభ్యంతరం అన్నింటిని మించినదిరా అందులో పిల్ల తల్లి కూడా ఇంకా ఏం కారణం కావాలంటావు మా అభ్యంతరానికి." అరుంధతి ఆవేశంగా అడిగింది.
"అమ్మా - స్త్రీకి స్త్రీయే శత్రువన్నది ఎంత నిజం అమ్మా నీవు స్త్రీ అయివుండి తోటిస్త్రీ గురించి సానుభూతిగా ఆలోచించలేకపోతున్నావు మీలో మీకు ఒకరిపట్ల ఒకరికి సానుభూతిలేదు. పురుషులేదో చేశారని వాపోతారు. ఒక్కమాట చెప్పు. అర్చన ఉన్నస్థితిలో నీ కూతురువుంటే ఆమెకి మరో వివాహానికి అవకాశంవస్తే సంతోషంగా అంగీకరించవా."
"రాజీ.....మనదాకా రానంతవరకు అందరూ ఆదర్శాలు వల్లిస్తారు నేను తల్లిని నీ తల్లిని. నా కొడుకు ఇలా..."
"ఏం అయ్యాడు నీ కొడుకు. నీ కొడుక్కి ఏమయిందని యింత బాధపడ్తున్నావు అమ్మా. అర్చనని పెళ్ళాడిది నేనే పాపం చెయ్యడంలేదు నేను ఏదో కోల్పోయినట్టూ భావించడంలేదు."
"హు.....నీ కళ్ళకేదో పొరలు కమ్మాయి సరే. ఇంక మేం చెప్పినా విషంలాగే వుంటుంది. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. మేమేం చెప్పవలసిన పనిలేదు. మా అంగీకారాలు ఆశీర్వాదాలు నీకెందుకు వెళ్ళు. నీ ఇష్టం వచ్చిన దాన్ని కట్టుకో." అరుంధతి కోపంగా మొహం తిప్పుకుంది.