ఉదయశ్రీ మూడవ భాగము
సుమనోంజలి
ఇద మంధం తమఃకృత్స్నం జాయేత భువనత్రయమ్
యది శబ్దాహ్వయం జ్యోతి రాసంసారం న దీప్యతే.
అవును! "శబ్దమనే జ్యోతి విశ్వమంతా వెలుగులు వెదజల్లక పోతే ఈ ముల్లోకాలు అల్లకల్లోలమై కటికచీకట్లో అటమటిస్తూ ఉండేవి."అన్న ఆచార్యదండి అభిభాషణం సర్వదా సర్వధా యథార్ధం.
శబ్దం సత్యం. శబ్దం నిత్యం. శబ్దం సత్యసనాతనం. శబ్దం నిత్య నూతనం. శబ్దం లేనినాడు సృష్టిలేదు -జగత్తులేదు - సాహిత్యమేలేదు - కనుకనే క్రాంత దర్శనులైన కవులు శబ్దాన్ని సమాశ్రయించారు. ఆలంకారికులు "ఇష్టార్ద వ్యవచ్చిన్నమైన పదావళి" కావ్యమనీ, "రమణీయార్ధ ప్రతిపాదకమైన శబ్దమే" కావ్యమనీ వాక్రుచ్చారు. శబ్దార్దాలు పార్వతీపరమేశ్వర స్వరూపాలుగా భావించి సంభావించాడు కవికులగురువైన కాళిదాసు.
కొన్ని శబ్దాలు శిరీషకుసుమ సుకుమారాలు; కొన్ని శబ్దాలు వజ్ర కఠోరాలు. కొన్ని శబ్దాలు తరంగాలవలె పైకిలేస్తాయి. మరికొన్ని శబ్దాలు కరంగాలవలె ముందుకు దూకుతాయి. కిలకిల నవ్వే శబ్దాలు కొన్ని, తళతళ మెరిసే శబ్దాలు కొన్ని, మిసమిసలాడేవి కొన్ని, గుసగుసలాడేవి మరికొన్ని. అయితే సుకవి ఎక్కడ ఏ శబ్దం సంగతమో చూచి సరిచూచి ప్రయోగిస్తాడు. మాలాకారుడు పూలమాల గ్రుచ్చినట్లు సమర్దుడైన కవి సందర్భసముచితంగా శబ్ధాలు ఏర్చి కూర్చి తన కావ్యాన్ని తీర్చి దిద్దుకుంటాడు.
కవిత్వం ఒక కమ్మని అనుభూతి. మానవత్వంలో నవత్వం చూపించే అందాల ఆశాజ్యోతి. అది జీవిత విపంచి మేళవించి మ్రోగించిన కల్యాణ గాంధర్వగీతి.
కవిత్వం ఈ లోకానికి ఆ లోకాన్ని ఆహ్వానించుతుంది. ఆలోకంతో ఈలోకాన్ని నింపుతుంది. ఈ సమన్వయ స్వీకారమే కమనీయ కవితాశ్రీకి శ్రీకారం.
కవిత్వం ఎదలో మెదుల్తుంది - పదంలో కదుల్తుంది - హృదయాన్ని స్పృశిస్తుంది. ఉదయాన్ని సృజిస్తుంది. అభ్యుదయాన్ని అందిస్తుంది.
అందుకనే కవిత్వం సత్య సనాతనం. నిత్య నూతనం.
ఇది ఉదయశ్రీ తృతీయ భాగం. నా మానసంలో కదలిన ఒక ఆనందలహరి ఇది. అనేక రీతుల అనుభూతుల అమృతఝరి ఇది.
"శుభోదయం" తో మేల్కొంచి "అజ్ఞాత నేపథ్యం" అధిగమించి "ఆకాంక్ష"తో "జయోస్తు" పలికి "ఆనందలహరి"లో స్పందించి "భువనవిజయం" అందించగలిగినప్పుడే కరుణశ్రీ "కల్యాణవాణి" చరితార్ధం అవుతుంది.
ప్రసన్న హృదయులైన రసజ్ఞ పాఠకుల కరకంజాలలో ఈ మంజుల సుమనోంజలిని సానురాగంగా సమర్పించుతున్నాను. సావధానంగా చిత్తగించమని పదే పదే మనవి చేసుకుంటున్నాను.
- కరుణశ్రీ
శుభోదయము
ఆంధ్రరత్నమ ! మంగళాక్షతల్ పై చల్ల
వయ్య! నీకలలు సత్యమ్ము లయ్యె
దేశభక్తా! వచ్చి దీవింపవయ్య! నీ
కోరికల్ రూపు చేకూర్చుకొనియె
విశ్వదాతా! ఇదే వీక్షింపవయ్య! నీ
పడినకష్టములు సాఫల్యమందె
మాతండ్రి! శ్రీరాములూ! తిన్నగా లేచి
రా! నీ తపస్సు సార్ధకతఁగాంచె
తాత గాంధీజి! కస్తూరిమాతతోడ
పుచ్చుకొనవయ్య! అగ్రతాంబూల మీవు!
ఆంధ్రజనయిత్రి నూత్న గృహప్రవేశ
మిందురండు !! మా స్వాగతం బందుకొండు !!
విచ్చేసినారు! కవిత్రయ మ్మల్లదే
రమణీయసౌవర్ణ రథముమీఁద
అరుదెంచినారు! రాయలవారు ముందువె
న్కల అష్టదిగ్గజమ్ములు చెలంగ
దయచేసినారు! విద్యారణ్య నాగార్జు
నులు శిష్యసందోహములు భజింప
అలరుచున్నారు! నాగమ్మ రుద్రమ్మలు
వీరాంగనలు చుట్టుచేరి కొలువ
ఆంధ్రజననీ స్వతంత్ర రాష్ట్రావతరణ
జయమహోదయ మంగళోత్సవము చూడ
తుంగభద్రాతరంగిణీ ప్రాంగణముల
ఇసుకవేసిన రాల దేమీ జనంబు !!
"ఆరంభోత్సవ మాంధ్ర రాష్ట్రమున కక్కా! గౌతమీ! కృష్ణ! కా
వేరీ! పెన్న! సరస్వతీ! యమున! రావే గంగ! మాయింటిలో
పేరంటం"బని తుంగభద్ర కబురంపింపంగ వా రందఱున్
జేరన్ వచ్చువిధాన నల్గడ విరాజిల్లున్ ప్రజావాహినుల్.
ఆ విద్యానగరాంధ్రవైభవము నీ యంకమ్మునన్ మోసికొ
న్నా వెన్నాళ్ళొ! మఱిన్నినాళ్ళ కుపపన్నంబయ్యె నూత్నాంధ్రరా
ష్ట్రావిర్భావము నీతటంబుననె; అమ్మా! తుంగభద్రా! యికన్
ద్యావాపృథ్వుల నీ మహోజ్జ్వలభవిష్యత్తుల్ ప్రపంచింపవే!
సాగిలి మ్రొక్కరా! తెలుఁగుజాతికి భాగ్యవిధాతయౌ మహా
త్యాగికి; "అర్ధనూటపదహారులు" జీవితసుప్రభాతముల్
యాగ హవిస్సుగా సలిపె! ఆయన సత్యతపస్సులోన "శ్రీ
బాగు" ఫలించెరా! తెలుఁగుబాగుకు మూలము పొట్టిబాబురా!
వైషమ్యాలకు స్వస్తిచెప్పి, పెడత్రోవల్ పూడ్చి, అన్యోన్యవి
ద్వేషమ్ముల్ హతమార్చి, స్వార్ధములకున్ వీడ్కోలు గావించి, ఈ
భాషారాష్ట్రశుభోదయమ్మున సుహృద్భావమ్ముతోడన్ విశే
షాశీస్సుల్ గొని దీక్ష గైకొనుఁ డశేషాంధ్రుల్ "విశాలాంధ్ర"కై!
ఆఱుకోట్ల కనుల ఆనందబాష్పాలు
తుంగభద్ర యగుచు పొంగి వచ్చె;
ఆంధ్రరాష్ట్రపీఠ మధిరోహణము సేయ
కన్నతల్లి! కాళ్ళు కడుగుకొనవె!