Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం-1 పేజి 20

   
                                         దివ్యమూర్తి
    
    విచ్చేయుచున్నాఁడు! విశ్వసౌభ్రాత్రమ్ము
        సాధించుకొన్న 'దీక్షాతపస్వి'
    దయచేయుచున్నాడు! ధర్మమే జయ మన్న
        కర్తవ్యమును దెల్పు 'కర్మయోగి'
    వేంచేయుచున్నాఁడు! వీర భారతశక్తి
        చాటిచూపిన 'బోసినోటిబాబు'
    వచ్చుచున్నాఁడు! నల్వదికోట్ల ప్రజలకు
        మేలుకో లిడిన 'వైతాళికుండు'
    
    దర్శనమొసంగుచున్నాఁడు! స్పర్శమాత్ర
    పతితపావనుఁడగు 'విశ్వబాంధవుండు'
    "రండు రం" డంచు పువ్వులదండ లూని
    దేవతలు మింట బారులు తీర్చినారు.
    
                                       స్వర్గీయ బాపు
    
    వీఁడటే! దక్షిణాఫ్రిక దొరతనమును
        మూడూపు లూపిన 'ముసలితాత'
    ఇతఁడేనటే ! జగత్త్రితయమ్మునకు సత్య
        సందేశ మందించు 'శాంతిదూత'
    ఈతండటే ! ప్రజాస్వాతంత్ర్య రథమును
        కదలించు 'విశ్వమంగళవిధాత'
    ఈయనేనటె! యూరపీయుల తబ్బిబ్బు
        సలుపు 'సత్యాగ్రహసమరనేత'
    
    అంచు నీ దివ్యమూర్తి దర్శించు కాంక్ష
    పూలదోసిళ్ళతో వేల్పు పూవుబోండ్లు
    గుములుగూడిరి స్వర్ణ సౌధములమీఁద -
    స్వర్గవీథుల నీ తేరు సాగువేళ.
    
                                         బాష్పాంజలి
    
    ఎత్తిన కత్తి కాత్మ బలియిచ్చెడు మేకల పాలు ద్రావు నీ
    మెత్తని చిత్త మందు కుసుమించిన కమ్మని సన్నజాజి పూ
    గుత్తి పరీమళమ్ము లనుకొందురు సత్య-మహింస - నేఁడు నీ
    వొత్తిగిలన్ మహాత్మ! భరతోర్విని వానికి దిక్కుగల్గునే !!
    
    ఒక్కఁ డదృష్టవంతుఁడయయో! భరతావని లేకపోయెనే
    లెక్కకు - ఈ భయంకర మలీమస కర్మ, జగచ్చరిత్రలో
    నెక్కకపోదు - ఇందు జనియించిన ముందుతరాలవారు మా
    రక్కసి చర్యకున్ తమ శిరమ్ములు వంపకపోరు సిగ్గునన్.
    
    ఏమయ్యా! మిహికాచలేశ్వరుఁడ! నీ వెన్నాళ్ళనోయుండి ఈ
    సీమాంతమ్మున నిల్చిచూతువుగదా శీర్షంబు పైకెత్తి -క్షో
    ణీమధ్యమ్మున నెచ్చటేని ఎపుడేనిన్ 'బాపూజీ' వంటి ని
    ష్కామ ప్రేమతపస్వి పుట్టెనె - అహింసా బ్రహ్మతేజస్వియై -
    
                                     పురోగమనము
    
    నీ చరిత మ్ముదాత్తరమణీయము -మాకు స్వతంత్ర భావనా
    రోచిరహర్ముఖంబుల పురోగమనమ్ములు నేర్పి శృంఖలా
    మోచన మాచరించిన యమోఘతపస్వివి! నీకుఁ గల్గె వీ
    రోచితమైన మృత్యువు - మహోజ్జ్వలముల్ భవదీయ సాధనల్ !!
    
    నలుబదికోట్ల తమ్ముల మనమ్ముల నల్వదికోట్ల జ్యోతు లు
    జ్జ్వలిత మొనర్చి చీకటులు వాపితి వీవొక పెద్దజ్యోతివై -
    వెలుఁగులు జిమ్ము అభ్యుదయవీథుల ముందుకు సాగుచున్న మ
    మ్ముల విడనాడి స్వర్గపథముల్ వెలిఁగింపఁగ నేగితే ప్రభూ !!
    
    ఏ లోకమ్ముల నెందు నుండినను గానీ చల్లనైనట్టి నీ
    యాలోకంబుల మాపయిం బరపుమన్నా! అన్నదమ్ముల్ వలెన్
    మాలో మేము విభేదముల్ మఱచి ప్రేమస్నిగ్ధ జాతీయ "పం
    ధా"లో ముందుకు సాగిపోయెద మహింసాజ్యోతి రోచిస్సులన్.
    
                                     స్వచ్చంద జాతి
    
    మన జాతీయత మంటఁగల్పుకొని నిర్మర్యాద నీచ ప్రవ
    ర్తనకున్ లోఁబడి, పారతంత్ర్యమునకున్ దాసుండవై, నీ పురా
    తన విజ్ఞాన విశేష శేముషి నసత్యం బంచు శంకింపఁగా
    జనునే? నీ ప్రియ భారతావని ప్రపంచఖ్యాతి నార్జింపదే !!!
    
    అచ్చపు చీకటిండ్లఁ బొరలాడుచునుండ ప్రపంచమెల్ల; నీ
    పచ్చనితల్లి గుమ్మములపై వెలిగెన్ మఱిదీపికల్ !! కనన్
    వచ్చిన ఖండఖండములవారికి కోరిక దీరునట్లుగా
    బిచ్చముపెట్టె 'భారతసవిత్రి' ప్రియంబున రెండుచేతులన్ !!!
    
    చచ్చినజాతి కాదు; మఱిచావదు వేయియుగాలకైన, వె
    న్నిచ్చినజాతి కాదు; పరువెత్తు విరోధిని బిల్చి కౌఁగిటన్
    గ్రుచ్చినజాతిరా యిది! మరుత్తరుశాఖలతోడ హాయిగా
    "అచ్చనకాయ" లాడుకొనెరా! మనకీర్తి లతామతల్లికల్ !!
    
                                        లుముంబా
    
    జిత్తులమారి బెల్జియము జింకలు గుండెలు దద్దరిల్లి ప
    ర్వెత్తెను వీరవిప్లవ మృగేంద్రమ! నీ పెను గర్జ; కాఫ్రికా
    మొత్తము లేచి సాగినది ముందునకున్; భవదీయధైర్య సం
    పత్తి మహత్తరం బని ప్రపంచము నీకు జోహారు చేసెరా !
    
    'మెబుటూ' కళ్ళు బయర్లు కమ్మినవి; 'షోంబే' గారికిన్ కాళ్ళు చ
    ల్లబడెన్;గుండెలు జారి కూలబడె గల్లంతై 'కలోంజీ', 'కసా
    పుబు'పై ప్రాణము పైనపోయె; తలనొవ్వుల్ బెల్జియం మూకకున్
    ప్రబలంబయ్యె; ప్రధానమంత్రిగ "లుముంబా" పేరు మ్రార్మోగఁగన్.
    
    కటికి రాకాసి చిమ్మచీకటుల తోడ
    నిండి నిద్రించు ఆఫ్రికా ఖండమునకు
    వెలుఁగు చూపించి ప్రజల మేల్కొలిపినట్టి
    ప్రథమ వైతాళికుఁడు "లుముంబా" ప్రధాని.
    
    భగభగమండు విప్లవమహాగ్నిజ్వాల
        పరవళ్ళు త్రొక్కు జాగరణశక్తి
    కుప్పించి దుముకు కాంగో మృగేంద్రస్వామి
        తెల్లకప్పల మ్రింగు నల్లత్రాచు
    పగిలి మిన్నంటి పై బడెడు జ్వాలాముఖి
        తళతళ వెలుఁగు చైతన్యలహరి
    నిండు గుండియల మండిన అఖండజ్యోతి
        తహతహలాడు స్వాతంత్ర్యకాంక్ష
    
    ఆఫ్రికాఖండ ఘోర గాడాంధకార
    వీథి వెలిగించు వేఱొక్క వేగుచుక్క
    త్యాగమయమూర్తి జాతి వైతాళికుండు
    మంచి అభిమాని మన "లుముంబా" ప్రధాని.

   

                                 ధ్రువతారలు 


    ఎవ్వారి రణగాథ లింతవర్ణింప స
        త్కవుల కలాలు సార్ధకత నందు
    ఎవ్వారి జయగీతు లించుకపాడ గా
        యకుల కంఠములు ధన్యత గడించు
    ఎవ్వారి రూపు లొక్కింత రూపింప శి
        ల్పుల కళాకృతి మహోజ్జ్వలత గాంచు
    ఎవ్వారి పదధూళి రవ్వంతసోకిన    
        భూదేవి నిలువెల్ల పులకరించు
    
    నభము మార్మ్రోగు వీరదుందుభులు వారు
    త్యాగధనులైన సత్యవర్తనులు వారు    
    జాతిరత్నాలు వారు శాశ్వతులు వారు
    పావనులు వారు ధన్యజీవనులు వారు!
    
    వారల వీరకంఠములు వార్ధితరంగములందు నేఁటికిన్
    హోరున మ్రోగు; నిత్య మరుణోదయవేళ తదీయ రక్తపుం
    ధారలు పొంగులెత్తు; తదుధారాకథల్ నవకుంకుమాంకముల్
    తీరిచిదిద్దు భారత సతీమణి చక్కదనాల మోముపై.
    
    జవసత్వంబులు చచ్చి, రిచ్చవడి, నిశ్చైతన్యమై యున్న మా
    నవజాతిన్ దగురీతి మేల్కొలిపి దైన్యంబూడ్చి భావంబులన్
    నవజీవంబులు నింపు త్యాగమయు లన్నా మీరు; మీరూపముల్
    'ధ్రువతారల్' వెలుఁగొందు మామనములన్దున్ కల్పకల్పాంతముల్ !!
    
    మండెడు స్వరాజ్య సమరాగ్ని కుండమందు
    భస్మమైన గులాబిపుష్పములు మీరు;
    ఎన్ని కల్పాంతములకేని యింకిపోని
    భరతమాత ఆనందబాష్పములు మీరు!

 Previous Page Next Page