Previous Page Next Page 
జనపదం పేజి 21

 

    "కౌలుకు చేసుకునే సన్నకారు రైతులను యజమానులు - భూస్వాములు - తొలగించడానికి వీలుండదు."
    "ఏందో విచిత్రంగున్నదుండి . కౌలుకు యాడిదుండి భూమి నా బొంద. భూములన్నీ పంచుకుంటిమి. దొర భూములన్నీ గుంజుకునే మళ్ళీ అందర్నీ కూలోళ్ళను చేసే. పట్వారి జమీన్ల రామయ్య గుంజుకునె. దొరలు కోకుండే. మల్ల మీ ఖానునేం పనికొస్తది? పట్నం పోతే ప్రజల్ను మరిచిపోతారుండి?"
    చివరి ప్రశ్న గునపంలా గుచ్చుకుంది వీరభద్రం గుండెలో. వాస్తవానికి తనకీ ప్రశ్నలు తెలియనివి కావు. తానివన్నీ శాసనసభలో లేవదీశాడు. కాని తన మాట విన్నారా? మెజారిటీ ఉంది నెగ్గించుకున్నారు. ఆ మాటలే విడమర్చి చెప్పాడు అక్కడి వారితో . కాని అవి ఎవరికీ అర్ధం గాలేదు. సంతృప్తి కలిగించలేదు.
    "దొరల్ను ఎల్లకోడ్తమంటిరి . భూములు పంచూతమంటిరి. ఒటిస్తిమి, గెలిపిస్తిమి. ఇప్పుడేమో భూములు దొరలు గుంజుకునిరి. కూళ్ళకు కూడ రానియ్యమనేటట్లుండిరి. రామయ్య కూడ దొరాయే. రాచి రంపాన పెడుతుండే. మల్ల దొరల కాళ్ళే పట్టుకోవాల్సొచ్చేటట్లున్నది" ఒకడు అడిగాడు.
    వీరభద్రం తల తిరిగిపోయింది. శాసనసభ అక్కడి ప్రశ్నలు, మంత్రుల చిరునవ్వులు , మొండి జవాబులు , వాకౌటులు గుర్తుకు వచ్చాయి. ఇక్కడి ప్రజల వీరి సమస్యలు ప్రశ్నలు ఎదురైనాయి. ఎలా చెయ్యాలో అర్ధం కాలేదు.  తికమకపడ్డాడు. సతమతం అయినాడు. నిలదీసి అడుగుతే ఏం చెబుతాడు.
    "ఓపిక పట్టాలి . ఒక్కాసారే అన్ని సమస్యలు పరిష్కారం కావు. కౌల్దారు జాబితా నాకివ్వండి. ప్రయత్నిస్తాను. దొర కూళ్ళకు రానియ్యకుంటే పోరాటం జరపాలి."
    "శాన పోరాటం జరిపినాముండి. జరపంగ జరపంగ ఈడికొచ్చినం" ఒకడు విసుకున్నాడు , లేచిపోయాడు.
    మల్లయ్యకు ఏమీ తోచలేదు. లేచి గబగబా వెళ్ళి అతన్ని తీసుకొచ్చాడు. "తొందరవోద్దన్నా! అన్ని జరుగుతాయి. వీరభద్రం గారి సంగతి నీకేరిక లేదు గనకనా! మనకోసమే తుపాకి పట్టే, మనకోసమే ఎమ్మెల్యే ఆయె" అని తెచ్చి కూర్చోబెట్టాడు.
    "అవ్, అవ్ "అంటూ కూర్చున్నాడతను.
    ఆ రాత్రి వీరభద్రానికి నిద్ర పట్టలేదు. అంతులేని ఆలోచనలు. ఏదీ చివరిదాకా కొనసాగటం లేదు. ప్రజలు నిజాం నవాబును గడగడలాడించారు. భారతీయ సైన్యాలు వచ్చాయి. నైజాం లొంగిపోయాడు. ప్రజలు గెల్చారు. ప్రజాస్వామ్యాన్ని వరించారు. తనకూ ప్రజలమీదా ప్రజాసామ్యం మీద గాడ విశ్వాసం ఉంది. ప్రజలు తన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. డబ్బుకూ తాగుడుకూ లొంగలేదు. తననే ఎన్నుకున్నారు. అది ప్రజా విజయంగా బావించాడు తాను. ఏదో సాధించగలననుకున్నాడు. పెదల్ను సుఖపెట్టే మార్గాలు వెతకగలననుకున్నాడు. దొరల రాజ్యం అంతరించిందనుకున్నాడు. కాని అన్నీ తలక్రిందులు ఆవుతున్నట్లు కనిపిస్తున్నాయి. ప్రజలనిపించుకునేవారు శాసనాల్లో కనిపించడం లేదు. దొరలు మరొక వేషం ధరించి శాసనసభలో ప్రవేశించారు. మంత్రులైనారు. ప్రభుత్వం చేస్తున్నారు. మరొక రూపంలో పెత్తనం చెలాయిస్తున్నారు. తానెం చేయలేక పోతున్నాడు. ప్రజలు తననే అడుగుతున్నారు. ఏమిటీ వింత? ఏమిటీ విచిత్రం? ఏం చేయాలి? ఎలా చేయాలి? అవే ప్రశ్నలు సూదులై , బల్లెములై, గునపాలై అతని మెదడును  చీల్చ సాగేయి. ప్రశ్నలు చీకట్ల గుంపులై అతన్ని తరుముతున్నాయి. సమాధానమనే వెలుగురేఖ ఎక్కడా కనిపించడం లేదు. సతమతం అవుతున్నాడు. అంతా అయోమయంగా కనిపించసాగింది. వీరభద్రం లేచాడు. సిగరెట్టు ముట్టించాడు. మంచంలో కూర్చుని గట్టిగా దమ్ము లాగి వదిలాడు. పక్క గదిలో పడుకున్న మంగమ్మ కూడా నిద్ర పోయినట్లు లేదు. అలికిడి వినిపించిందతనికి. మంగమ్మకు నిద్రరాక పోవడానికి కారణం కనిపించలేదు. పిలుద్దామనుకున్నాడు. అది అర్ధరాత్రి. తాను వంటరి. మంగమ్మ ఒక్కతే. పిలవడం మంచిది కాదనుకున్నాడు. కాని మంగమ్మలో ఏదో విచిత్రం అయిన మార్పు కనిపిస్తుంది. ఏదో విచారంలో మునిగి ఉంటుంది. ఎందుకో తనకు ఆర్షం కాలేదు. అడుగుదామనుకున్నాడు. అడగలేదు. అడగాలి కాని ఇప్పుడెం? ఈ అర్ధరాత్రా? మంగమ్మ - జగ్గయ్య భార్య. ఆవిడ విషయంలో తనకు బాధ్యతలున్నాయి. ఊరికే బాధ్యత ఉంది. ఏమైంది మంగమ్మకు? ఎందుకిలా ఉంది? అదొక ప్రశ్న అందుకు సమాధానం రాదు. మనసు తెలుసుకోవడం మహా కష్టం.
    గదిలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లున్నది. గాలి ఆడుతున్నట్లు లేదు. ఉక్కపోస్తుంది. తలుపు తీసుకొని బయటికి వచ్చాడు. చంద్రుడు లేడు. వెన్నెల లేదు. కాని అంతగా చీకటి లేదు. ఆకాశంలోకి చూశాడు. చుక్కల గుంపుల మిలమిలలాడుతున్నాయి. గాలి చల్లగా వీస్తుంది. మనసు కొంతతెలిక అయింది. బయటికి నడిచాడు. ఊళ్ళోకి సాగాడు. వీధులు నిర్మానుష్యంగా ఉన్నాయి. ఊరకుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. అంతరాత్రి తాను ఎందుకు వచ్చాడో తెలీదు. అయినా సాగిపోతున్నాడు. నేలమట్టం అయిన చావిడి కనిపించింది. క్షణం సేపు అక్కడ నుంచున్నాడు వీరభద్రం. ఆ క్షణంలో అతనిలో ఎన్ని పూర్వ స్మృతులు మసలాయో చెప్పలేం. అది కూలడానికి కారకుడు తాను. అధికార చిహ్నమని, దోపిడీ నిలయమనీ దాన్ని కూల్చాడు. అది కూలింది. కాని అధికారం కూలలేదు. ఇంకా అక్కడ నిలబడలేకపోయాడు. చకచక ముందుకు సాగిపోయాడు. సగం కూలిన పోలీసు నాకాలో వెలుగు కనిపించింది. గబగబా సాగాడు. అక్కడ నుంచున్నాడు. గోడలు కూలిన చోట  తడకలు కట్టారు. లోపల లాంతరు వెలుగుతుంది. సిగరెట్లు, బీడీల పొగ పైకి లేస్తుంది. లోన జనం ఉన్నారు. ఏదో కొట్లాడు కుంటున్నారు. శేషయ్య గొంతు వినిపించింది. గ్రహించాడు. చీట్లాడుకుంటున్నారు. కూలిన పోలీసు నాకా చీట్లాటకు నిలయం అయింది. ఎంత మార్పు అనుకున్నాడు. చీట్లాట పేరు తెలియని జనం, ఎంత చెలరేగారు. ఊళ్ళో సారాయి దుకాణం వెలసింది. ఇది నాగరికత పెరగదమా? అనాగరికత పడగ విప్పడమా ? ఆ పడగ ఎంత పెద్దదో, పడగ నీడన దాగేవారెందరో? పాము కాటుకు చచ్చేవారెందరో? ఎటు పయినిస్తున్నాం మనం? అని ప్రశ్నించుకున్నాడు. ఇక ముందుకు అడుగు వేయలేకపోయాడు. వెనక్కు మెల్లగా నడవలేకపోయాడు. పెద్ద పెద్ద అంగలు వేస్తూ సాగిపోయాడు. వేగంగా సాగిపోతున్నాడు. ఎవరో తరుముతున్నట్లు ఉరుకుతున్నాడు - సుమారు ఆతని అడుగుల చప్పుడు వినిపించసాగింది. ఎందుకలా పారిపోతున్నాడు తాను? ఎంత దూరం పోతాడు? ఎందుకూ భయం? ఏమిటీ భయం? భయపడి ఎక్కడికి పోతాడు? ఆలోచించుకున్నాడు . ఈ నాగరికత రంగుల వల. ఇందులో చిక్కుకోవడం తేలిక. చేధించడం కష్టం. వలను చించాలి. చీల్చాలి. చేధించాలి. పారిపోవడం వల్ల ప్రయోజనం లేదనుకున్నాడు. ఆలోచనలతో వేగం తగ్గింది. అడుగులు మెల్లమెల్లగా పడుతున్నాయి. వెనుక ఏదో కుక్క ఏడుస్తుంది. ఎడుపునిపిస్తుంది. మందమందంగా నడుస్తున్నాడు వీరభద్రం. ఇంటికి త్వారగా వచ్చేశాడు. ఇంట్లోంచి ఏడ్పు వినిపిస్తుంది. చెవులను నమ్మలేకపోయాడు. నాలుగడుగులు ముందుకు వేశాడు. వెక్కెక్కి ఎడుస్తున్నారు - ఎవరు? ఎందుకు? ముందుకు సాగుతుంటే స్పష్టంగా వినిపిస్తుంది. తలుపు తెరిచి ఉంది. దీపం వెలుగుతుంది. తాను తలుపు తీసే వెళ్ళిపోయాననే విషయం అప్పుడు గుర్తుకు వచ్చింది. అక్కడే నుంచున్నాడు విన్నాడు. కుమిలి కుమిలి ఏడ్పు , ధ్వని గుర్తించాలని ప్రయత్నించాడు. గుర్తించలేకపోయాడు. ఇంట్లో ముంగిలిలో అడుగు పెట్టాడు. బావి దగ్గర వింత దృశ్యం! జుట్టు విరబోసుకొని తెల్లని చీర కట్టుకొని బావిలోకి దూకడానికి సిద్దంగా ఉంది ఒక ఆకారం. వీరభద్రానికి క్షణం భయం అయింది. తరువాత మతి స్తబ్దం అయింది. ఉరికాడు. ఆకారాన్ని పట్టి లాగేశాడు. అరక్షణం ఆలస్యం అయితే బావిలో పడిపోయేదే! చేయిపట్టి లాగేవరకు గిరుక్కున వెనక్కు తిరిగింది ఆకారం.

 Previous Page Next Page