బలరామయ్యకు కొంత సంతోషం కలిగింది. మరికొంత నమ్మకం కలిగింది. ఆ నమ్మకంతోనే నామినేషన్ చేశాడు.
ఆనాడు పట్నంలో పెద్ద విందు చేశాడు. ఆ రాత్రి అతనికి ఏంతో హాయిగా ఉంది.
తెల్లవారి ఆ అనందం తెలతెలపోయింది. బలరామయ్య గుండెలో రాయి పడింది. వీరభద్రం నామినేషన్ వేశాడు జేలునుంచే. చట్టం మీద పళ్ళు కొరికాడు బలరామయ్య. జేలులో ఉన్నవాడు నామినేషన్ వేయడమేమిటో? అది అతనికి అర్ధం కాలేదు. శివరావును పిలిపించాడు. వీరభద్రానికి శిక్ష పడేటట్లు చూడలన్నాడు. సాక్ష్యుల కోసం డబ్బుకు వెనుకాడవద్దన్నాడు. అనేక పక్షాల నుంచి అనేక ప్రయత్నాలు ప్రారంభించాడు.
బలరామయ్య దాతృత్వం కూడా పెరిగింది. ఊళ్ళో ఎన్నికల కార్యక్రమం ప్రారంభోత్సవం ఘనంగా జరిపాడు. జండాలు రెపరెప లాడాయి. పచ్చని మామిడి తోరణాలు ఊరి నిండా వెలిశాయి. పెద్ద పెద్ద నాయకులూ వచ్చారు. మంచి మంచి ఉపన్యాసాలిచ్చారు. ఊరు బాగుపడాలంటే బలరామయ్యకే ఓట్లు ఇవ్వాలని సిఫార్సు చేశారు. బలరామయ్య మంత్రి అవుతాడనీ చెప్పారు. మంత్రులు చేయలేని పనులు లేవనీ చెప్పారు.
బలరామయ్య చాలా వినయంగా మాట్లాడాడు.
రాముడు చాలా మెచ్చుకున్నాడు.
ప్రజలు ఆశ్చర్యపోయారు.
బుర్ర కధ చెప్పించాడు బాలరామయ్య.
మరుసటి రోజు ఊరు మొత్తానికి భోజనాలు పెట్టించాడు బలరామయ్య. మేకలు తెగాయి. సారాయి పారింది. బలరామయ్య స్వయంగా వడ్డించాడు. భోజనాలు చేస్తున్నప్పుడు చేతులు జోడించి ప్రార్ధించాడు - తనకు ఓట్లు వేయవలసిందని. - అంతా భోజనాలు ముగించారు. నాటి నుండీ ఊళ్ళో చర్చలు ప్రారంభం అయినాయి. - దొర మారాడని కొందరు - దొంగవేషాలని కొందరు - . యాదగిరి , శేషయ్య దొరను గురించి రామాయణ భారతాలు చెపుతున్నారు. రాముడు వారందరికీ నాయకత్వం వహిస్తున్నాడు.
మల్లయ్య, మస్తాను విడుదలయి రావడంతో ఊరి ధోరణే మారిపోయింది. మల్లయ్య, మస్తాను వీరభద్రంతోనే అరెస్టయ్యారు. వారి మీద నేరాలు మోపారు. రుజువు కాలేదు. వదిలేశారు. వీరభద్రం గెలుస్తే ప్రజలకు పోలలోస్తాయి. ఇండ్లోస్తాయి పశువులోస్తాయి. అని ప్రచారం సాగించారు. సభలు ఏర్పాటు చేయించారు. బుర్రకధలు పెట్టించారు. వారి నాయకుల్ని పిలిపించారు. పోయిన దొరలు వేశాలీ మార్చుకొని వస్తున్నారని హెచ్చరించారు నాయకులు. వీరభద్రం పంచిన భూములను గురించి తేల్చుకోమన్నారు. "వీరభద్రం గెలవాలి, పేదలు గెలవాలి, ప్రజలు గెలవాలి" అని నినాదాలు చేశారు నాయకులు.
మల్లయ్య, మస్తాను విధి విరామం లేకుండా ప్రచారం సాగిస్తున్నారు. మంగమ్మ వారికి తోడైంది. ప్రచారం కంటే ఎక్కువ "వీరభద్రం విడుదల అయినాడు" అనే వార్త పనిచేసింది. వీరభద్రం మీద ఆరోపించిన నేరాలను రుజువు చేయలేకపోయింది సర్కారు. అంతేకాక ప్రభుత్వం పాలసీ కొంత మారింది. వీరభద్రం విడుదలైనాడు. వీరభద్రం ఊరికి వచ్చాడు. ప్రజ సహితం కదిలింది. పెద్ద ఊరేగింపు తీసింది. మంగమ్మ వీరభద్రం నొసట కుంకుమ పెట్టింది. మంగళ హారతి యిచ్చింది. మళ్ళీ అవే నినాదాలు. పాత నినాదాలు మారుమ్రోగాయి ఊళ్ళో.
"దున్నేవాడిదే భూమి"
"దొరలంతా దొంగలు"
వీరభద్రం మంగమ్మ ఇంట్లో విడిది చేశాడు. అతని ఇల్లు తగులబెట్టబడింది. జగ్గయ్యను గౌరవించాలని అక్కడ విడిది చేశాడు వీరభద్రం. ఆ రాత్రి అతనికి నిద్ర లేదు. ఊరి వాళ్ళెవరూ పడుకోనివ్వలేదు. ఎన్నో మాటలు, ఎన్నో ముచ్చట్లు, ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సమాధానాలు.
మంగమ్మ ఇంట్లో జాతర సాగింది.
జాతరలో చేరని ముగ్గురు రాముని ఇంట్లో సమావేశమైనారు. రాముడు వీరభద్రానికి ముఖం చూపించలేకున్నాడు. మసులో దొంగ మసలుతున్నాడు. వాడు బయటికి రాడు. వీరభద్రం తనను ఓర్వలేడని వెళ్ళబెట్టాడు. మైకంలో ఉన్నారు. యాదగిరి, శేషయ్య అతనికి తాళం వేసారు. ఊరంతా వీరభద్రం చుట్టూ చేరింది. వారికి తేళ్ళూ, జేర్రులూ పాకాయి. దొర ఏమంటాడోనని బెదరసాగారు. "దొరను గెలిపించాలే" అని నినాదం చేశారు రామయ్య ఇంట్లో, తరువాత తాగారు - అప్పుడు మరీ గట్టిగా నినాదాలు చేశారు. తప్పతాగారు ముగ్గురూ తందానాలాడారు. శేషయ్య, యాదగిరి ఇండ్లకు వెళ్ళడానికి బయటికి వచ్చారు. వారినేదో భయం ఆవహించింది. బయట అడుగు పెట్టలేక పోయారు.
రామయ్య ఇంట్లోనే పడుకున్నారు.
తెల్లవారి నుంచీ సారాయి వ్యాపారం సన్నగిల్లింది.
చీట్లాడ్డానికి జనం రావడం లేదు.
గ్రామంలో దొరలకు వ్యతిరేకమైన మాటలు బాహాటంగా సాగాయి.
ఎన్నికలు ముమ్మరం జోరుగా ఉంది. పోటీలు జరిగాయి. పోట్లాటలు జరిగాయి. తలలు పగిలాయి.
ఎన్నికలు జరిగాయి.
ఫలితాలు వచ్చాయి.
వీరభద్రం గెలిచాడు.
బలరామయ్య ధరావత్తు పోయింది.
2
వేసవి సూర్యుడు మండి పడుతున్నాడు. నిప్పులు చెరుగుతున్నాడు. మోదుగులు పూశాయి. మామిళ్ళు కాశాయి. ఎండ భరించరాకుండా ఉంది. వేడి గాడ్పులు, పిట్టలు సహితం చెట్లలో తలదాచుకుంటున్నాయి. చింతచెట్ల కింద బుడుతలు తప్ప మనుషులు కనిపించటం లేదు. అంత ఎండలోనూ పొలాలకు ఎరువులు తోలుకుంటూన్నారు రైతులు. రైతుకు విశ్రాంతి లేదు. అతడు నమ్ముకున్నది భూమిని. ఎండను, వానను. ఈ ఎండే రేపు వానగా కురుస్తుంది. అది వారికి పసిడి వాన. అతడు పకృతి బిడ్డ. అతనికి ఎండెం లెక్క!
వీరభద్రం సహితం లెక్కచేయలేదు ఎండను. మండే ఎండలో కాలి నడకన వచ్చాడు. మంగమ్మ ఇంటికి అతడు పట్నం నుంచి వస్తున్నాడు. శాసనసభా సమావేశాలు అయిపోయాయి. తరువాత అక్కడ ఉండదలచుకోలేదు. మంగమ్మ వీరభద్రాన్ని చూచింది. ముఖం నిండా వంటినిండా చెమట కారుతుంది. బట్టలన్నీ తడిసిపోయినాయి.
"ఇంత ఎండల ఎందుకొచ్చిన్రు. చల్లపడ్దేనక రాకపోయినారు! అన్నది మంగమ్మ వేదన నిండిన స్వరంతో.
"పని అయిపొయింది. పట్నంలో ఏం చెయ్యను? బండి చేరేవరకు ఈ వేళ అయింది. వచ్చేశాను. ఊళ్ళో ఎలా వుంది?"
"ఏం చెప్పమంటరు?' అని లోపలికి వెళ్ళి చెంబుతో నీళ్ళు తెచ్చి అందించింది. కాళ్ళు కడుక్కుని లోన అడుగుపెట్టి మంచంలో కూలబడ్డాడు వీరభద్రం. మంగమ్మ వంట ప్రారంభించింది. వడ్డించింది. భోజనం చేస్తూ మాట్లాడల్లేదు భద్రం. మంగమ్మా మౌనమే వహించింది ఇద్దరూ మౌనంగా ఉన్నారు. ఇద్దరూ గంబీరంగా ఉన్నారు. భోజనం చేసి చేయి కడుక్కుని నడుం వాల్చాడు భద్రం. కన్ను మలిగింది. గుర్రు కొట్టాడు.
సూర్యుడు వాలిపోయాడు. వాడిపోయాడు. సాయంకాలం అయింది. గాలిలో కొంత చల్లదనం ఏర్పడింది. పడుచులు కడవలతో నీలాటి రేవుకు వెళుతూన్నారు. కల్లు దుకాణాల్లో గిరాకి హెచ్చుగా ఉంది. అది రామయ్యకే లాభం. అతడే పట్టాడు ఈ వూరి కల్లు దుకాణాల్ను . మల్లయ్య తాటి ఆకుల్లో ముంజులూ తీసుకుని మంగమ్మ ఇంటికి వచ్చాడు. వీరభద్రం వచ్చిన విషయం తెలిసిందతనికి. వీరభద్రం ఇంకా నిద్ర లేవలేదు. మల్లయ్య లేపాడు. కాళ్ళూ ముఖము కడుక్కుని వీరభద్రం వచ్చి పందిట్లో కూర్చున్నాడు. ముంజులు వలుచుకొని తింటూ మట్లాడుకుంటున్నారు. ఒక్కొక్కరే పది పదిహేను మంది దాకా జనం కూడారు.
"పట్నం కబుర్లేమిటుండి?" అడిగాడు మల్లయ్య.
:ఏమున్నది అంతా మాములే, శాసనసభా సమావేశాలు జరిగాయి."
"ఆ సంగతులే చెప్పమంటున్న."
"కొందరు ఏవేవో ప్రశ్నలు అడిగారు. మంత్రులు వారికీ సమాధానాలు చెప్పారు. అవి వారికి అర్ధం కాలేదు. మాకూ అర్ధం కాలేదు. అదంతా ఒక ఆచారం అలా జరిగి'పోతుంటుంది. అయితే ఒక్క ముఖ్యమయిన శాసనం చేయబడింది. అది కౌల్దారి చట్టం. అది మనకు విజయం. ప్రజలకు పేదలకు విజయం."
"ఎందుకండి ఆ ఖానూను? ఎవడికి ఫాయిదైతది?"